న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించింది. ఈ నెల 12న(బుధవారం) నిర్వహించనున్న వాటాదారుల సమావేశంలో కంపెనీ బోర్డు ఈ అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. ఇదే రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి అక్టోబర్– డిసెంబర్(క్యూ3) పనితీరును ప్రకటించనుంది. 2021 సెప్టెంబర్ చివరికల్లా కంపెనీ వద్ద రూ. 51,950 కోట్ల నగదు నిల్వలున్నాయి.
ఇన్ఫోసిస్, విప్రో..
ఇంతక్రితం టీసీఎస్ 2020 డిసెంబర్ 18న రూ. 16,000 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టింది. షేరుకి రూ. 3000 ధరలో 5.33 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. అంతక్రితం 2018లోనూ షేరుకి రూ. 2,100 ధరలో 7.61 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 16,000 కోట్లను వెచ్చించింది. గతంలో అంటే 2017లో సైతం ఇదే స్థాయిలో బైబ్యాక్‌ను పూర్తి చేయడం గమనార్హం! ఈ బాటలో ఇతర ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో తదితరాలు మిగులు నిధులను వాటాదారులకు షేర్ల బైబ్యాక్‌ల ద్వారా పంచుతున్నాయి. 2021 సెప్టెంబర్‌లో ఇన్ఫోసిస్ రూ. 9,200 కోట్లు వెచ్చించి 5.58 కోట్ల సొంత షేర్లను కొనుగోలు చేసింది. ఒక్కో షేరును రూ. 1,538–1,750 మధ్య ధరలో బైబ్యాక్ చేసింది. గత జనవరిలో విప్రో 9,500 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలుని పూర్తి చేసింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో టీసీఎస్ షేరు బీఎస్‌ఈలో 1.3 శాతం బలపడి రూ. 3,855 వద్ద ముగిసింది.
చేజిక్కిన పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్
పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్(పీఎస్‌పీ) రెండో దశ ప్రాజెక్టును టీసీఎస్ చేజిక్కించుకుంది. తొలి దశ ప్రాజెక్టును చేపట్టి దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న కంపెనీ పౌరులకు పాస్ట్‌పోర్ట్ సేవలను అందించడంలో భారీగా ముందడుగు వేసింది. ఈ బాటలో తాజాగా రెం డో దశ ప్రాజెక్టును సైతం అందుకున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. రెండో దశలో ఇప్పటికే ప్రా రంభమైన కీలక అతిపెద్ద ఈగవర్నెన్స్ ప్రోగ్రామ్‌కు కంపెనీ మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. గత దశాబ్ద కాలంగా సులభతర సర్వీసులకుగాను ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలియజేసింది.
త్వరలో ఈపాస్‌పోర్ట్..
కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఈపాస్‌పోర్ట్‌కు అవసరమైన టెక్నాలజీని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ అధికారి తేజ్ భట్ల వెల్లడించారు. అయితే పాస్‌పోర్ట్‌కు అనుమతి, ప్రింటింగ్, జారీ తదితర అధికారిక సేవలను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్న విషయాన్ని ప్రభుత్వ రంగ బిజినెస్ యూనిట్ హెడ్‌గా పనిచేస్తున్న తేజ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈపాస్‌పోర్ట్ పూర్తిస్థాయి పేపర్‌ఫ్రీ డాక్యుమెంట్‌కాదని.. స్టాంపింగ్ తదితరాలు కొనసాగుతాయని తెలియజేశారు. వీలైనంత వరకూ ఆటోమేషన్ చేయడం ద్వారా అవకాశమున్నచోట పేపర్(డాక్యుమెంట్) అవసరాలను తగ్గిస్తుందన్నారు. కొద్ది నెలల్లో ఈపాస్ట్‌పోర్ట్‌కు వీలున్నట్లు అంచనా వేశారు. గత దశాబ్ద కాలంలో 8.6 కోట్ల పాస్‌పోర్ట్‌ల జారీలో సేవలు అందించినట్లు పేర్కొంది. కాగా.. తాజా పీఎస్‌పీ ప్రాజెక్టు డీల్ విలువను కంపెనీ వెల్లడించలేదు.
టీసీఎస్ షేర్ల బైబ్యాక్!
Published Sat, Jan 8 2022 4:14 AM | Last Updated on Sat, Jan 8 2022 4:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment