Buy shares
-
ఏబీ ఫ్యాషన్ చేతికి టీసీఎన్ఎస్
న్యూఢిల్లీ: గ్లోబల్ బ్రాండ్ల దిగ్గజం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్) మహిళా దుస్తుల సంస్థ టీసీఎన్ఎస్ క్లాతింగ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. విస్తరించిన టీసీఎన్ఎస్ వాటా మూలధనంలో 51 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు వెల్లడించింది. దీంతో టీసీఎన్ఎస్ అనుబంధ సంస్థగా ఆవిర్భవించినట్లు ఏబీ ఫ్యాషన్ పేర్కొంది. సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం మెటీరియల్ సబ్సిడయరీగా సైతం నిలవనున్నట్లు తెలియజేసింది. టీసీఎన్ఎస్ క్లాతింగ్‌లో రూ. 1,650 కోట్లు వెచి్చంచి ప్రధాన వాటా కొనుగోలు చేయనున్నట్లు మే 5న ఏబీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. షేర్ల కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ)లో భాగంగా ప్రమోటర్ల వాటాతోపాటు.. ఓపెన్ ఆఫర్‌ను చేపట్టింది. ఎస్పీఏకింద విస్తారిత మూలధనంలో 22 శాతం వాటాకు సమానమైన 1.41 కోట్ల షేర్లను సొంతం చేసుకుంది. వెరసి షరతులతోకూడిన ఓపెన్ ఆఫర్ తదుపరి 51 శాతం వాటాకు సమానమైన 3.29 కోట్ల షేర్లను చేజిక్కించుకుంది. గతేడాది టీసీఎన్ఎస్ రూ. 1,202 కోట్ల ఆదాయం పొందింది. లూయిస్ ఫిలిప్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లండ్ బ్రాండ్ల కంపెనీ ఏబీఎఫ్ఆర్ఎల్ రూ. 12,418 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. -
ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌కు మరిన్ని వాటాలు
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తమ వాటాలను మరింతగా పెంచుకుంది. ఇందులో భాగంగా నియంత్రణాధికారాలు లేని వాటాదారుల నుంచి షేర్ల కొనుగోలు కోసం జూలై 31తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో 3.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 28,953 కోట్లు) చెల్లించింది. 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 77 శాతం వాటాను దక్కించుకోగా తాజాగా దాన్ని 80.5 శాతానికి పెంచుకుంది. ఇందుకోసం హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్, యాక్సెల్ పార్ట్నర్స్, ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ నుంచి వాటాలు కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ను లిస్టింగ్ చేసే యోచనలో కూడా ఉంది. -
ఏషియన్ పెయింట్స్ కొనుగోళ్ల జోరు
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న హోమ్ ఇంప్రూవ్మెంట్, డెకరేటివ్ విభాగాలలో మరింత పట్టు సాధించేందుకు వీలుగా దేశీ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ పావులు కదుపుతోంది. తాజాగా వైట్ టీక్, వెదర్‌సీల్ ఫెనస్ట్రేషన్ కంపెనీలలో వాటాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. వైట్ టీక్ బ్రాండ్ కంపెనీ ఆబ్జెనిక్స్ సాఫ్ట్‌వేర్‌లో 100 శాతం వాటాను దశలవారీగా మూడేళ్లలో సొంతం చేసుకోనున్నట్లు ఏషియన్ పెయింట్స్ వెల్లడించింది. దీనిలో భాగంగా 49 శాతం వాటా కొనుగోలుకి ప్రమోటర్లతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఇందుకు సుమారు రూ. 180 కోట్లు చెల్లించనున్నట్లు తెలియజేసింది. అయితే ఇందుకు ఇరువైపులా అంగీకరించిన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవలసి ఉంటుందని వివరించింది. ఇదే పద్ధతిలో మరో 11 శాతం వాటాను రూ. 66 కోట్లకు చేజిక్కించుకోనుంది. ఇక 2025–26కల్లా మిగిలిన 40 శాతం వాటా కోసం ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా రూ. 360 కోట్లవరకూ చెల్లించనుంది. 2016లో ఏర్పాటైన వైట్ టీక్ 2020–21లో రూ. 37.7 కోట్ల టర్నోవర్ సాధించింది. రూ. 19 కోట్లకు ఇంటీరియర్ డెకరేషన్, పీవీసీ కిటికీలు, ఫర్నీషింగ్ తదితరాల తయారీ కంపెనీ వెదర్‌సీల్ ఫెనస్ట్రేషన్లో 51 శాతం వాటాను రూ. 19 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఏషియన్ పెయింట్స్ పేర్కొంది. ఇందుకు కంపెనీ ప్రమోటర్లతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కాగా.. మూడేళ్ల కాలంలో దశలవారీగా మరో 23.9 శాతం వాటాను సైతం సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 3,112 వద్ద ముగిసింది. -
ఎయిర్‌టెల్‌లో గూగుల్‌కు చోటు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా దేశీ టెలికం భారతి ఎయిర్‌టెల్‌లో దాదాపు 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులో భాగంగా సుమారు 700 మిలియన్ డాలర్లతో 1.28 శాతం వాటాలు కొనుగోలు చేయనుండగా, మిగతా 300 మిలియన్ డాలర్ల మొత్తాన్ని రాబోయే సంవత్సరాల్లో సర్వీసుల విస్తరణపై వెచ్చించనుంది. షేరు ఒక్కింటికి రూ. 734 రేటు చొప్పున గూగుల్ తమ సంస్థలో వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 5,224.3 కోట్ల (సుమారు 700 మిలియన్ డాలర్లు) విలువ చేసే 7,11,76,839 ఈక్విటీ షేర్లను గూగుల్‌కు కేటాయించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. కొత్త ఉత్పత్తులతో భారత్ డిజిటల్ లక్ష్యాల సాకారానికి రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు సిద్ధంగా ఉన్న తమ నెట్వర్క్, డిజిటల్ ప్లాట్‌ఫాంలు, చెల్లింపుల వ్యవస్థ మొదలైనవి ఇందుకు తోడ్పడగలవని ఆయన వివరించారు. కంపెనీలు డిజిటల్ బాట పట్టడంలో తోడ్పడేందుకు, స్మార్ట్ఫోన్లు.. కనెక్టివిటీని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు ఎయిర్‌టెల్‌తో ఒప్పందం దోహదపడగలదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. వ్యూహాత్మక లక్ష్యాల్లో భాగంగా ఇరు సంస్థలు భారత్ కోసం ప్రత్యేకమైన 5జీ సొల్యూషన్స్‌ను కనుగొనడంపై కృషి చేయనున్నాయి. ఎయిర్టెల్ తన 5జీ ప్రణాళికలను మరింత దూకుడుగా అమలు చేసేందుకు, మార్కెట్ దిగ్గజం జియోకి దీటుగా పోటీనిచ్చేందుకు గూగుల్ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయి. 1.28 శాతం వాటాల కోసం గూగుల్ చేస్తున్న 700 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రకారం ఎయిర్టెల్ విలువ సుమారు రూ. 4.1 లక్షల కోట్లుగా (54.7 బిలియన్ డాలర్లు) ఉండనుంది. ఇప్పటికే జియోలో గూగుల్... దేశీయంగా డిజిటలీకరణ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న గూగుల్ .. రాబోయే 5–7 ఏళ్లలో భారత్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. 2020 జూలైలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 4.5 బిలియన్ డాలర్లు వెచ్చించి 7.73 శాతం వాటాలు కూడా కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడుల ప్రకారం అప్పట్లో జియో ప్లాట్‌ఫామ్స్ విలువను రూ. 4.36 లక్షల కోట్లుగా (దాదాపు 58.1 బిలియన్ డాలర్లు) లెక్కగట్టారు. శుక్రవారం బీఎస్‌లో భారతి ఎయిర్టెల్ షేరు 1 శాతం పైగా పెరిగి రూ. 716 వద్ద క్లోజయ్యింది. -
టీసీఎస్ షేర్ల బైబ్యాక్!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించింది. ఈ నెల 12న(బుధవారం) నిర్వహించనున్న వాటాదారుల సమావేశంలో కంపెనీ బోర్డు ఈ అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. ఇదే రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి అక్టోబర్– డిసెంబర్(క్యూ3) పనితీరును ప్రకటించనుంది. 2021 సెప్టెంబర్ చివరికల్లా కంపెనీ వద్ద రూ. 51,950 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో.. ఇంతక్రితం టీసీఎస్ 2020 డిసెంబర్ 18న రూ. 16,000 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టింది. షేరుకి రూ. 3000 ధరలో 5.33 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. అంతక్రితం 2018లోనూ షేరుకి రూ. 2,100 ధరలో 7.61 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 16,000 కోట్లను వెచ్చించింది. గతంలో అంటే 2017లో సైతం ఇదే స్థాయిలో బైబ్యాక్‌ను పూర్తి చేయడం గమనార్హం! ఈ బాటలో ఇతర ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో తదితరాలు మిగులు నిధులను వాటాదారులకు షేర్ల బైబ్యాక్‌ల ద్వారా పంచుతున్నాయి. 2021 సెప్టెంబర్‌లో ఇన్ఫోసిస్ రూ. 9,200 కోట్లు వెచ్చించి 5.58 కోట్ల సొంత షేర్లను కొనుగోలు చేసింది. ఒక్కో షేరును రూ. 1,538–1,750 మధ్య ధరలో బైబ్యాక్ చేసింది. గత జనవరిలో విప్రో 9,500 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలుని పూర్తి చేసింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో టీసీఎస్ షేరు బీఎస్ఈలో 1.3 శాతం బలపడి రూ. 3,855 వద్ద ముగిసింది. చేజిక్కిన పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్ పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్(పీఎస్పీ) రెండో దశ ప్రాజెక్టును టీసీఎస్ చేజిక్కించుకుంది. తొలి దశ ప్రాజెక్టును చేపట్టి దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న కంపెనీ పౌరులకు పాస్ట్‌పోర్ట్ సేవలను అందించడంలో భారీగా ముందడుగు వేసింది. ఈ బాటలో తాజాగా రెం డో దశ ప్రాజెక్టును సైతం అందుకున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. రెండో దశలో ఇప్పటికే ప్రా రంభమైన కీలక అతిపెద్ద ఈగవర్నెన్స్ ప్రోగ్రామ్‌కు కంపెనీ మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. గత దశాబ్ద కాలంగా సులభతర సర్వీసులకుగాను ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలియజేసింది. త్వరలో ఈపాస్పోర్ట్.. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఈపాస్పోర్ట్కు అవసరమైన టెక్నాలజీని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ అధికారి తేజ్ భట్ల వెల్లడించారు. అయితే పాస్‌పోర్ట్‌కు అనుమతి, ప్రింటింగ్, జారీ తదితర అధికారిక సేవలను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్న విషయాన్ని ప్రభుత్వ రంగ బిజినెస్ యూనిట్ హెడ్‌గా పనిచేస్తున్న తేజ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈపాస్పోర్ట్ పూర్తిస్థాయి పేపర్ఫ్రీ డాక్యుమెంట్కాదని.. స్టాంపింగ్ తదితరాలు కొనసాగుతాయని తెలియజేశారు. వీలైనంత వరకూ ఆటోమేషన్ చేయడం ద్వారా అవకాశమున్నచోట పేపర్(డాక్యుమెంట్) అవసరాలను తగ్గిస్తుందన్నారు. కొద్ది నెలల్లో ఈపాస్ట్పోర్ట్కు వీలున్నట్లు అంచనా వేశారు. గత దశాబ్ద కాలంలో 8.6 కోట్ల పాస్‌పోర్ట్‌ల జారీలో సేవలు అందించినట్లు పేర్కొంది. కాగా.. తాజా పీఎస్పీ ప్రాజెక్టు డీల్ విలువను కంపెనీ వెల్లడించలేదు. -
అమెరికన్ కంపెనీను కైవసం చేసుకున్న టెక్ మహీంద్రా..!
అమెరికాకు చెందిన గ్రీన్ ఇన్వెస్ట్మెంట్, అల్లీస్ గ్రూప్ ఇండియా సంస్థలను భారత ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా పూర్తిగా కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తివాటాలు టెక్ మహీంద్రా సొంతం..! అల్లీస్ ఇండియా, గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పూర్తిగా 100 శాతం వాటాలను కొనుగోలు చేసినట్లు టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ డీల్ మొత్తం విలువ 125 మిలియన్ డాలర్లు. ఈ మొత్తాన్ని కంపెనీ పూర్తిగా నగదు రూపంలోనే చెల్లించనుంది. అమెరికాలోని సీటెల్ వేదికగా అల్లీస్ ఇండియా, గ్రీన్ ఇన్వెస్టమెంట్స్ పనిచేస్తున్నాయి. సుమారు 660 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ సంస్థల ఆదాయం 39.6 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంస్థల కొనుగోలుతో టెఖ మహీంద్రాకు డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్ సోల్యుషన్స్, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, మార్కెటింగ్, క్లౌడ్ అండ్ ఆటోమేషన్, బీఐ అండ్ అనలిటిక్స్, టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్స్ వంటి రంగాల్లో కంపెనీ మరింత వృద్ధిని నమోదుచేస్తోందని ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం..! వాటిని వదిలించుకునేందుకే.. -
ఎంఎం స్టయిల్స్‌లో రిలయన్స్‌కు 40% వాటాలు
న్యూఢిల్లీ: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టయిల్స్‌లో రిలయన్స్ బ్రాండ్స్ (ఆర్బీఎల్) 40 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇరు సంస్థ లు ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపాయి. ‘ఎంఎం స్టయిల్స్‌లో 40 శాతం మైనారిటీ వాటా కోసం బ్రాండ్ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డైరెక్టర్ మనీష్ మల్హోత్రాతో ఆర్బీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది’ అని పేర్కొన్నాయి. అయితే, డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఇప్పటిదాకా మనీష్ మల్హోత్రా ప్రైవేట్‌గా నిర్వహిస్తున్న ఈ బ్రాండ్‌లో బైటి ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. భారతీయ కళలు, సంస్కృతిపై అపార గౌరవమే మల్హోత్రాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవడానికి కారణమని పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ పేర్కొంది. అంతర్జాతీయంగా విస్తరించే క్రమంలో రిలయన్స్‌తో భాగస్వా మ్యం గణనీయంగా తోడ్పడగలదని మల్హోత్రా తెలిపారు. 2005లో ప్రారంభమైన ఎంఎం స్టయిల్స్ బ్రాండ్‌కు హైదరాబాద్ సహా ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో 4 పెద్ద స్టోర్స్ ఉన్నాయి. -
‘గ్రీన్ ఎనర్జీ’లో రిలయన్స్ జోరు
న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా పర్యావరణహిత విద్యుత్ (గ్రీన్ ఎనర్జీ) వ్యాపార విభాగంలో దూకుడు మరింతగా పెంచింది. రెండు కంపెనీలతో జట్టు కట్టింది. జర్మనీకి చెందిన ఫొటోవోల్టెయిక్ సోలార్ వేఫర్ల తయారీ సంస్థ నెక్స్‌వేఫ్ జీఎంబీహెచ్‌లో తమ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ (ఆర్ఎన్ఈఎస్ఎల్) వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఆర్ఐఎల్ తెలిపింది. ఇందులో భాగంగా 25 మిలియన్ యూరోలు (సుమారు రూ. 218 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. అటు, డెన్మార్క్‌కు చెందిన స్టీస్డాల్ సంస్థ నుంచి హైడ్రోలైజర్ల తయారీ టెక్నాలజీకి లైసెన్స్ తీసుకుంటున్నట్లు వివరించింది. ‘ఫొటోవోల్టెయిక్ తయారీలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టే దిశగా నెక్స్వేఫ్లో పెట్టుబడులు తోడ్పడగలవు. ఇక స్టీస్‌డాల్‌తో భాగస్వామ్యం.. వచ్చే 1 దశాబ్దకాలంలో 1 కేజీ గ్రీన్ హైడ్రోజన్‌ను 1 డాలర్‌కు అందించాలన్న మా లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఉపయోగపడగలదు‘ అని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ పెట్టుబడులతో ఉత్పత్తి, టెక్నాలజీల అభివృద్ధికి మరింత ఊతం లభించగలదని నెక్స్‌వేఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. రిలయన్స్ ఇటీవలే వరుసగా రెండు సంస్థల్లో కీలక వాటాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో తాజా డీల్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నార్వేకు చెందిన సోలార్ ప్యానెల్ తయారీ సంస్థ ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్‌ను 771 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఆర్ఐఎల్ మరోవైపు షాపూర్జీ పల్లోంజి గ్రూప్‌లో భాగమైన స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌లో 40 శాతం వాటాలను దక్కించుకుంది. రిలయన్స్ .. రాబోయే రోజుల్లో నాలుగు గిగా ఫ్యాక్టరీలు నెలకొల్పేందుకు అవసరమైన టెక్నాలజీ, నైపుణ్యాలకు తాజా డీల్స్ అన్నీ గణనీయంగా తోడ్పడనున్నాయి. తగ్గనున్న ఉత్పత్తి వ్యయం.. స్టీస్‌డాల్‌తో భాగస్వామ్యం ద్వారా భారత్‌లో హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ తయారీకి అవసరమైన టెక్నాలజీ రిలయన్స్‌కు అందుబాటులోకి వస్తుంది. ఫ్యుయల్ సెల్స్ తయారీకి కావాల్సిన టెక్నాలజీ కోసం కూడా ఈ ఒప్పందాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్యావరణహిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎలక్ట్రోలైజర్లు ఉపయోగపడతాయి. ప్రస్తుత టెక్నాలజీలతో పోలిస్తే స్టీస్డాల్ సాంకేతికతతో ఉత్పత్తి వ్యయాలు భారీగా తగ్గుతాయని రిలయన్స్ పేర్కొంది. ప్రస్తుతం 1 కేజీ గ్రీన్ హైడ్రోజన్ రేటు 5 డాలర్లుగా ఉండగా.. రానున్న దశాబ్దకాలంలో దీన్ని 1 డాలర్ స్థాయికి తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
అదానీ చేతికి ముంబై ఎయిర్పోర్ట్
న్యూఢిల్లీ: ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. ప్రస్తుత ప్రమోటరు జీవీకే సంస్థకు ఇందులో ఉన్న రుణభారాన్ని కొనుగోలు చేసి, ఈక్విటీ కింద మార్చుకోవడంతో పాటు ఇతర మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా దక్కించుకోనున్నట్లు వెల్లడించింది. అదానీ గ్రూప్, జీవీకే గ్రూప్ ఈ మేరకు స్టాక్ ఎక్సే్ఛంజీలకు వేర్వేరుగా తెలియజేశాయి. దీని ప్రకారం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ సంస్థ అయిన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ (జీవీకే ఏడీఎల్) రుణాన్ని అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ (ఏఏహెచ్) బ్యాంకర్ల నుంచి కొనుగోలు చేయనుంది. అయితే, అదానీ గ్రూప్‌నకు ఎంత రుణం బదిలీ కానుంది, ఈక్విటీ కింద మార్చుకోవడానికి సంబంధించిన షరతులు మొదలైన వివరాలు వెల్లడి కాలేదు. ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఏడీఎల్‌కు ఉన్న 50.50% వాటాతో పాటు ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ ఆఫ్ సౌతాఫ్రికా(ఏసీఎస్ఏ), బిడ్వెస్ట్ గ్రూప్ సంస్థలకు ఉన్న 23.5% వాటాలనూ (మొత్తం 74%) అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. తద్వారా దేశీయంగా విమానాశ్రయాల నిర్వహణలో అతి పెద్ద ప్రైవేట్ సంస్థగా ఆవిర్భవించనుంది. అదానీ గ్రూప్ ఇటీవలే ఆరు నాన్–మెట్రో ఎయిర్‌పోర్టుల నిర్వహణ కాంట్రాక్టులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం .. ఓవైపు కరోనా వైరస్ దెబ్బతో ఏవియేషన్ రంగం కుదేలవడం, మరోవైపు నిధుల మళ్లింపు ఆరోపణలపై జీవీకే గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు చేయడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘విమానయాన రంగంపై కరోనా వైరస్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అనేక సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయినట్లయింది. ఎంఐఏఎల్ ఆర్థిక పరిస్థితిపైనా ప్రతికూల ప్రభావం పడింది. కాబట్టి సాధ్యమైనంత తక్కువ సమయంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఇన్వెస్టరును తీసుకురావడం తప్పనిసరైంది‘ అని జీవీకే చైర్మన్ జీవీకే రెడ్డి తెలిపారు. మరోవైపు, ‘ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన మెట్రోపోలిస్‌లలో ఒకటైన ముంబై విమానాశ్రయం ద్వారా విమాన ప్రయాణికులకు సేవలు అందించే అవకాశం లభించడం అదృష్టం‘ అని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. అదానీ స్టాక్స్ డౌన్..: సోమవారం అదానీ గ్రూప్ స్టాక్స్ దాదాపు 5.3% దాకా నష్టాల్లో ముగిశాయి. జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా షేరు 4.89% పెరిగి రూ.3.35 అప్పర్ సర్క్యూట్ తాకింది. ఏడీఐఏతో ఒప్పందం రద్దు.. తాజా డీల్ నేపథ్యంలో గతంలో అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, ప్రభుత్వ రంగ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు జీవీకే తెలిపింది. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 79 శాతం వాటాలను విక్రయించేందుకు గతేడాది అక్టోబర్‌లో ఈ సంస్థలతో జీవీకే గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 7,614 కోట్లు. -
అదన్నమాట ఈక్విటీ... బ్యూటీ!
మారుతీ సుజుకీ సంస్థ 2003, జూలై 9న స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సురేష్ అని నా స్నేహితుడు అప్పట్లో మారుతీ 800 కారు కొందామనుకుని మళ్లీ ఆ ఆలోచన విరమించుకున్నాడు. కారుకు వెచ్చిద్దామనుకున్న రూ.2 లక్షలతో ఆ కంపెనీ షేర్లు కొన్నాడు. షేరుకు రూ.160 చొప్పున 1250 షేర్లు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం కంపెనీ షేర్ ధర దాదాపు రూ.4,000 వద్ద ఉంది. గడచిన 12 సంవత్సరాల్లో కంపెనీ ఆదాయం 3.5 రెట్లు పెరిగింది. అమ్మకాలు 5.5 రెట్లు ఎగశాయి. షేర్ ధర మాత్రం 23 రెట్లు పెరిగింది. 2003 లిస్టింగ్‌లో మారుతీ 800 కొందామనుకున్న వ్యక్తి... ఇప్పుడు అంతకన్నా మంచి కారును కొనుగోలు చేసే స్థితికి చేరుకున్నాడు. అదీ ఈక్విటీ మార్కెట్లో ఉన్న గొప్పతనం. దీర్ఘకాలంలో అత్యుత్తమం... ఒక వ్యక్తి చేతిలో డబ్బులుంటే... అతనికి రెండు అవకాశాలుంటాయి. డబ్బును తక్షణం అవసరాలకు ఖర్చుపెట్టుకోవడం. లేదా ఆ అవసరాలను వాయిదా వేసుకొని డబ్బును సాధ్యమైనంత వరకూ దాచుకోవడం. రెండవ తరహా వ్యక్తి తన దగ్గరున్న డబ్బును జాగ్రత్తగా మంచి పెట్టుబడుల్లోకి మళ్లిస్తే... నేడు తాను కొనాలనుకున్న వస్తువుకు బదులుగా... రేపు మరింత నాణ్యతతో కూడిన వస్తువును కొనుగోలు చేసే వీలుంటుంది. ఏ పెట్టుబడి సాధనంలోనో డబ్బు దాచుకుందామని ఆలోచించే వ్యక్తికి... దీర్ఘకాలంలో చూస్తే- ఈక్విటీలు అత్యుత్తమం. అన్నింటిలోకీ బెటర్... గడచిన 20 సంవత్సరాల కాలాన్ని తీసుకుందాం. ఈక్విటీల్లో పెట్టుబడులు సగటున 13.3 శాతం వార్షిక రాబడి అందించాయి. ఇదే కాలంలో బంగారంలో వార్షిక రాబడి 9.4 శాతం ఉండగా, బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లలో 7.9 శాతందాకా ఉంది. 1995లో ఈక్విటీల్లో ఒక లక్ష పెట్టుబడి పెడితే అది ప్రస్తుతం రూ.12 లక్షలయింది. బంగారంలో రూ.6 లక్షలయ్యింది. స్థిర డిపాజిట్లలో 4.6 లక్షలయింది. మ్యూచువల్ ఫండ్స్ కూడా... దీర్ఘకాలానికి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు కూడా అత్యుత్తమమైనవే. టాప్ 15 లార్జ్‌క్యాప్ డైవర్సిఫైడ్ ఫండ్స్ గడచిన 10 ఏళ్లలో 19.9 శాతం రిటర్న్స్ అందించాయి. సెన్సెక్స్ అందించిన 17.4 శాతం రిటర్న్స్ కన్నా ఇది అధికం కావడం గమనార్హం. కొనుగోళ్లకు అవకాశం... ప్రస్తుతం మార్కెట్లో ఒడిదుడుకుల ధోరణి కనబడుతోంది. అయితే భారతదేశ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే... దేశ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు ఇప్పటికీ లాభదాయకమే. దేశ మౌలిక రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం వంటి అంశాలు దీర్ఘకాలంలో మార్కెట్లో పెట్టుబడులకు భరోసా ఇస్తున్నాయి.