అదన్నమాట ఈక్విటీ... బ్యూటీ!
మారుతీ సుజుకీ సంస్థ 2003, జూలై 9న స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. సురేష్ అని నా స్నేహితుడు అప్పట్లో మారుతీ 800 కారు కొందామనుకుని మళ్లీ ఆ ఆలోచన విరమించుకున్నాడు. కారుకు వెచ్చిద్దామనుకున్న రూ.2 లక్షలతో ఆ కంపెనీ షేర్లు కొన్నాడు. షేరుకు రూ.160 చొప్పున 1250 షేర్లు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం కంపెనీ షేర్ ధర దాదాపు రూ.4,000 వద్ద ఉంది. గడచిన 12 సంవత్సరాల్లో కంపెనీ ఆదాయం 3.5 రెట్లు పెరిగింది. అమ్మకాలు 5.5 రెట్లు ఎగశాయి. షేర్ ధర మాత్రం 23 రెట్లు పెరిగింది. 2003 లిస్టింగ్‌లో మారుతీ 800 కొందామనుకున్న వ్యక్తి... ఇప్పుడు అంతకన్నా మంచి కారును కొనుగోలు చేసే స్థితికి చేరుకున్నాడు. అదీ ఈక్విటీ మార్కెట్‌లో ఉన్న గొప్పతనం.
దీర్ఘకాలంలో అత్యుత్తమం...
ఒక వ్యక్తి చేతిలో డబ్బులుంటే... అతనికి రెండు అవకాశాలుంటాయి. డబ్బును తక్షణం అవసరాలకు ఖర్చుపెట్టుకోవడం. లేదా ఆ అవసరాలను వాయిదా వేసుకొని డబ్బును సాధ్యమైనంత వరకూ దాచుకోవడం. రెండవ తరహా వ్యక్తి తన దగ్గరున్న డబ్బును జాగ్రత్తగా మంచి పెట్టుబడుల్లోకి మళ్లిస్తే... నేడు తాను కొనాలనుకున్న వస్తువుకు బదులుగా... రేపు మరింత నాణ్యతతో కూడిన వస్తువును కొనుగోలు చేసే వీలుంటుంది. ఏ పెట్టుబడి సాధనంలోనో డబ్బు దాచుకుందామని ఆలోచించే వ్యక్తికి... దీర్ఘకాలంలో చూస్తే- ఈక్విటీలు అత్యుత్తమం.
అన్నింటిలోకీ బెటర్...
గడచిన 20 సంవత్సరాల కాలాన్ని తీసుకుందాం. ఈక్విటీల్లో పెట్టుబడులు సగటున 13.3 శాతం వార్షిక రాబడి అందించాయి. ఇదే కాలంలో బంగారంలో వార్షిక రాబడి 9.4 శాతం ఉండగా, బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లలో 7.9 శాతందాకా ఉంది. 1995లో ఈక్విటీల్లో ఒక లక్ష పెట్టుబడి పెడితే అది ప్రస్తుతం రూ.12 లక్షలయింది. బంగారంలో రూ.6 లక్షలయ్యింది. స్థిర డిపాజిట్లలో 4.6 లక్షలయింది.
మ్యూచువల్ ఫండ్స్ కూడా...
దీర్ఘకాలానికి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు కూడా అత్యుత్తమమైనవే. టాప్ 15 లార్జ్‌క్యాప్ డైవర్సిఫైడ్ ఫండ్స్ గడచిన 10 ఏళ్లలో 19.9 శాతం రిటర్న్స్ అందించాయి. సెన్సెక్స్ అందించిన 17.4 శాతం రిటర్న్స్ కన్నా ఇది అధికం కావడం గమనార్హం.
కొనుగోళ్లకు అవకాశం...
ప్రస్తుతం మార్కెట్‌లో ఒడిదుడుకుల ధోరణి కనబడుతోంది. అయితే భారతదేశ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే... దేశ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు ఇప్పటికీ లాభదాయకమే. దేశ మౌలిక రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం వంటి అంశాలు దీర్ఘకాలంలో మార్కెట్‌లో పెట్టుబడులకు భరోసా ఇస్తున్నాయి.