ఎఫ్ అండ్ ఓ తగ్గింది.. | Sakshi Special Story About Futures and Options | Sakshi
Sakshi News home page

ఎఫ్ అండ్ ఓ తగ్గింది..

Published Tue, Jan 7 2025 5:52 AM | Last Updated on Tue, Jan 7 2025 8:02 AM

Sakshi Special Story About Futures and Options

ఫలితమిస్తున్న సెబీ నిబంధనలు

డిసెంబర్‌లో 37 శాతం తగ్గిన డెరివేటివ్స్‌ పరిమాణం

రోజువారీ రూ.442 లక్షల కోట్ల నుంచి  రూ.280 లక్షల కోట్లకు

ట్రేడింగ్‌ వదిలి ఇన్వెస్ట్‌మెంట్‌కు మళ్లుతున్న చిన్న మదుపరులు

ఫలితంగా డిసెంబర్లో 4.4 శాతం పెరిగిన క్యాష్‌ సెగ్మెంట్‌  

అన్నీ కలిసొస్తే ఒక్కరోజులోనే సొమ్ము రెట్టింపయిపోవచ్చు. ఇంకా ఎక్కువే కావచ్చు కూడా. మరి ఇంత లాభం ఇంకెక్కడైనా ఉంటుందా? ఇదిగో... ఇలాంటి ఆలోచనే చాలామంది చిన్న ఇన్వెస్టర్లను స్టాక్‌ మార్కెట్లలో డెరివేటివ్స్‌గా పేర్కొనే ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌వైపు మళ్లిస్తోంది. ఇక ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనమైన స్టాక్‌ మార్కెట్లను గ్యాంబ్లింగ్‌ డెన్‌గా మారుస్తోంది. నిజానికి ఇలాంటి ఆలోచనలతో డెరివేటివ్‌ సెగ్మెంట్లోకి అడుగుపెట్టిన వారెవరూ లాభాలు ఆర్జించిన దాఖలాల్లేవు.

 2023–24లో దాదాపు కోటి మంది ఇన్వెస్టర్లు సగటున రూ.2 లక్షల చొప్పున పోగొట్టుకున్నారన్నది సెబీ నివేదిక. అంటే దాదాపు 2 లక్షల కోట్లు. ఇవి స్టాక్‌ మార్కెట్లలో పోగొట్టుకున్నవే అయినా... వీళ్లేమీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసి నష్టపోలేదన్నది గమనార్హం. ఎప్పటికప్పుడు విపరీతమైన ఊగిసలాటతో ఉండే డెరివేటివ్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ)లో ట్రేడింగ్‌ చేసి నష్టపోయారన్నది నిజం.

 సత్వర లాభాలపై అత్యాశతో డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ చేసేవారిలో 95 శాతం మంది భారీగా నష్టపోతున్నారని, నిరంతరం నష్టాలొస్తూ... అప్పుల్లో కూరుకుపోతున్నప్పటికీ ఆశ వదలక ఏళ్ల తరబడి ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే చిన్న ఇన్వెస్టర్లు ఇందులోకి రాకుండా కట్టడి చేసేందుకు వారి ప్రయోజనాలను కాపాడేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటోంది. 

ఇటీవలి అధ్యయనాల్లో దారుణమైన వాస్తవాలు వెలుగు చూడటంతో... ఇటీవల మరీ తీవ్రమైన చర్యలు తీసుకుంది. ఎక్సే్ఛంజీలు పలు ఇండెక్సుల్లో వీక్లీ డెరివేటివ్స్‌ను ఆరంభించటంతో రిటైలర్లు వాటిని ఆశ్రయిస్తున్నారని గ్రహించి... వాటిని రద్దు చేసింది. ఒక ఎక్సే్ఛంజీ నుంచి ఒక ఇండెక్స్‌కే వీక్లీ డెరివేటివ్స్‌కు అనుమతినిచ్చింది. దీంతో బీఎస్‌ఈ నుంచి సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నుంచి నిఫ్టీ మాత్రమే వీక్లీ డెరివేటివ్స్‌ నిర్వహిస్తున్నాయి. 

గతంలో మాదిరి బ్యాంక్‌నిఫ్టీ, ఫిన్‌ నిఫ్టీ వంటి ఇండెక్సుల్లో వీక్లీ డెరివేటివ్స్‌ రద్దయ్యాయి. ఇవే కాదు. ఇటీవల కాంట్రాక్టుల సైజులు, మార్జిన్లను కూడా భారీగా పెంచింది. ఇవన్నీ నవంబర్‌ నుంచి అమల్లోకి రావటంతో ట్రేడింగ్‌కు కావాల్సిన పెట్టుబడి అమాంతంగా పెరిగింది. చాలామంది రిటైలర్లు వెనక్కి తగ్గారు. అందుకే డిసెంబర్‌లో డెరివేటివ్స్‌ వాల్యూమ్స్‌ గణనీయంగా తగ్గిపోయాయి. నెలవారీగా చూస్తే ట్రేడింగ్‌ పరిమాణం 37% పడిపోయింది. 

ప్రధాన ఎక్సే్చంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో డిసెంబర్‌లో డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌కి సంబంధించి సగటు రోజువారీ టర్నోవరు (ఏడీటీవీ) సుమారు రూ.280 లక్షల కోట్లకు తగ్గింది. ఇది నవంబర్లో రూ.442 లక్షలు. సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు గరిష్టాలను తాకిన సెపె్టంబర్‌లో అయితే ఏడీటీవీ ఏకంగా రూ. 537 లక్షల కోట్లుగా నమోదైంది. దానితో పోలిస్తే డిసెంబర్లో పరిమాణం సగానికి పడిపోయింది. ఇది 16 నెలల కనిష్ట స్థాయి కూడా. దీన్ని బట్టి.. సెబీ చర్యలు ఫలితమిచి్చనట్టేనని, రిటైలర్ల నష్టాలు తగ్గుతాయనేది మార్కెట్‌ వర్గాల మాటా!  

మరింతగా పడిపోయే అవకాశం... 
ఇంట్రాడేలో కూడా పొజిషన్లను నిశితంగా పర్యవేక్షించడంలాంటి మరిన్ని కఠిన నిబంధనలు వచ్చే కొద్ది నెలల్లో అమల్లోకి రాబోతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో డెరివేటివ్స్‌ వాల్యూమ్స్‌ ఇంకా పడిపోయే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎంతవరకూ పడిపోతాయన్నది ఇపుడే అంచనా వేయలేమని బీఎస్‌ఈ వర్గాలు చెబుతున్నాయి. కాంట్రాక్టుల సంఖ్య తగ్గినా ప్రీమియం మెరుగుపడితే, ఆదాయం కూడా పెరుగుతుందని, వ్యయాలూ తగ్గుతాయని... అలా జరిగితే ప్రయోజనకరమేనని వివరించాయి.

క్యాష్‌ విభాగం అప్‌..
డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ నిబంధనలను కఠినతరం చేస్తూనే మదుపరులు దీర్ఘకాలిక ఇన్వెస్టింగ్‌ వైపు మళ్లేలా కూడా సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే టాప్‌– 500 స్టాక్స్‌కి ట్రేడింగ్‌ రోజునే (సేమ్‌ డే) సెటిల్మెంట్‌ నిబంధనను కూడా అమల్లోకి తేనుంది. అంటే కొన్న రోజునే షేర్లు ఖాతాలోకి రావటం... అమ్మిన రోజునే నగదు ఖాతాలోకి రావటం వంటివన్న మాట. నిబంధనలు కఠినం చేయటం వల్ల డెరివేటివ్స్‌ వాల్యూమ్స్‌ క్షీణించినా.. ఇలాంటి సానుకూల పరిణామాలతో క్యాష్‌ సెగ్మెంట్‌ మాత్రం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. క్యాష్‌ మార్కెట్‌ టర్నోవరు వరుసగా అయిదు నెలల పాటు తగ్గినా.. డిసెంబర్‌లో మాత్రం 4.4 శాతం పెరగడం (నెలవారీగా చూస్తే) ఇందుకు నిదర్శనమని వివరించాయి. ఇటీవల ఐపీవోలతో మార్కెట్‌ సందడిగా ఉండటం, స్విగ్గీ.. హ్యుందాయ్‌లాంటి భారీ లిస్టింగ్‌లు మొదలైన వాటితో ఈ సెగ్మెంట్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడం దీనికి కారణమని పేర్కొన్నాయి.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement