కంపెనీల బాండ్‌ బాజా! | Effects of Government Bonds on Liquidity Risk and Bank Profitability | Sakshi
Sakshi News home page

కంపెనీల బాండ్‌ బాజా!

Published Tue, Mar 4 2025 4:22 AM | Last Updated on Tue, Mar 4 2025 4:22 AM

Effects of Government Bonds on Liquidity Risk and Bank Profitability

నిధుల కోసం లైను కడుతున్న కార్పొరేట్లు 

లిక్విడిటీ కట్టడితో మరిన్ని కంపెనీల ప్రవాహం 

ప్రభుత్వ సెక్యూరిటీల జారీ కూడా ఎక్కువే  

మరి బాండ్లలో పెట్టుబడి ఎంతవరకూ లాభం? 

ఏ బాండ్లలో రిస్కు ఎక్కువ? వేటిలో తక్కువ? 

ఇన్వెస్ట్‌ చేసే ముందు చూడాల్సిన అంశాలేంటి? 

విక్రయించేటపుడు ఉండే షరతులేంటి? 

ఇన్వెస్టర్ల కోసం ‘సాక్షి’ బిజినెస్‌ విశ్లేషణాత్మక కథనం

ఎఫ్‌ఐఐల అమ్మకాలు ఆగటం లేదు. మార్కెట్లు పడిపోతున్నాయి. దీంతో చాలా కంపెనీల షేర్లు ఏడాది కనిష్టానికి వచ్చేశాయి. మిగిలిన పెట్టుబడి సాధనాల్లో... బంగారం పెరుగుతున్నా... ధరల్లో ఊగిసలాట తప్పదు. రియల్‌ ఎస్టేట్‌ అంతంత మాత్రంగానే ఉంది. బ్యాంకు డిపాజిట్లు సురక్షితమే కానీ... వడ్డీ రేట్లు తక్కువ. 

మరి వీటికన్నా ఎక్కువ వచ్చే ప్రభుత్వ బాండ్లు బెటరా? లేకపోతే అంతకన్నా కాస్త ఎక్కువ గిట్టుబాటయ్యే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల బాండ్లు బెటరా? రాబోయే వారం పది రోజుల్లో పలు ప్రభుత్వ కంపెనీలు సైతం బాండ్లు జారీ చేయటానికి ముందుకొస్తున్న నేపథ్యంలో... వాటి లాభనష్టాలు, రిసు్కల గురించి తెలుసుకుందాం...

వడ్డీ రేట్లు పెంచుతూ లిక్విడిటీని రిజర్వు బ్యాంకు కట్టడి చేస్తోంది. దీంతో అప్పుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలు కంపెనీలు బాండ్ల జారీకి వస్తున్నాయి. ఈ తాకిడి ఎంతలా అంటే... ఈ ఒక్కవారంలోనే కంపెనీలు రూ.30 వేల కోట్ల విలువైన బాండ్లు జారీ చేస్తున్నాయి. వీటిలో ఇండియన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఇరెడా) 7.40 శాతం వడ్డీతో 11 ఏళ్ల కాలానికి రూ.820 కోట్లు సమీకరించగా... నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) ఏడేళ్ల కాలానికి 7.35 శాతం వడ్డీ రేటుతో రూ.4,800 కోట్లు సమీకరించింది. ఇక ఆర్‌ఈసీ 7.99 శాతం వడ్డీతో నిరవధిక బాండ్లను జారీ చేసింది. రూ.2,000 కోట్లు సమీకరించాలనుకున్నా రూ.1,995 కోట్లే చేయగలిగింది. ఇక రాబోయే రోజుల్లో నాబార్డ్‌ పదేళ్ల కాలానికి రూ.7,000 కోట్లు, సిడ్బి నాలుగేళ్ల కాలానికి రూ.6,000 కోట్లు, పీఎఫ్‌సీ నాలుగేళ్లకు రూ.4 వేల కోట్లు 
సమీకరించనున్నాయి.  

జనవరిలో ట్రంప్‌ టారిఫ్‌ల ప్రకటన, భౌగోళిక అనిశి్చతుల నేపథ్యంలో బాండ్‌ మార్కెట్‌ భయపడింది. వడ్డీ రేట్లు పెరిగాయి. ఆర్‌బీఐ సైతం వడ్డీ రేట్లు పెంచి లిక్విడిటీని కట్టడి చేసింది. దీంతో ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్‌లు (రాబడి) 0.5 శాతం వరకూ పెరిగాయి. దీంతో కార్పొరేట్లు మరింత ఎక్కువ వడ్డీని ఆఫర్‌ చేయాల్సి వచి్చంది. ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల ఈల్డ్‌ 7.1 శాతం నుంచి 7.3 శాతం మధ్య ఉండగా... ప్రైవేటు కంపెనీలు అంతకన్నా ఎక్కువ కూపన్‌ రేటును ఆఫర్‌ చేయాల్సి వస్తోంది.  

నిరవధిక బాండ్లు అంటే..
సాధారణంగా పెర్పెట్యువల్‌ బాండ్లుగా పిలిచే ఈ బాండ్లకు నిర్ణీత కాలమంటూ ఏదీ ఉండదు. ఒక కంపెనీ ఈ రకమైన బాండ్లను జారీ చేస్తే... కాలపరిమితి ఉండదు కనుక ఏడాదికోసారి చొప్పున నిరవధికంగా వడ్డీని చెల్లిస్తూ పోతాయి. ఒకవేళ వాటిని బైబ్యాక్‌ చెయ్యాలని భావిస్తే అప్పుడు ప్రకటన 
ఇచి్చ... తమ బాండ్ల ప్రిన్సిపల్‌ మొత్తాన్ని చెల్లించి వెనక్కి తీసుకుంటాయి. అప్పటిదాకా వడ్డీ మాత్రం చెల్లిస్తుంటాయి. ప్రిన్సిపల్‌ మొత్తాన్ని తిరిగి పొందటానికి కాలపరిమితి ఉండదు కనుక వీటికి వడ్డీ రేటు కూడా ఎక్కువే ఉంటుంది.  

గమనించాల్సింది ఏంటంటే...
బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసేవారు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే... ఆ బాండ్లకు బాగా రేటింగ్‌ ఉండి, చురుగ్గా ట్రేడయితేనే సెకండరీ బాండ్‌ మార్కెట్లో వెంటనే విక్రయించగలం. రేటింగ్‌ తక్కువగా ఉన్న బాండ్లయినా, నిరవధిక బాండ్లయినా విక్రయించటం అంత ఈజీ కాదు. పైపెచ్చు విక్రయించేటపుడు వాటి ధర అప్పటి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. మీరు కొన్నపుడు వడ్డీరేట్లు తక్కువ ఉండి ఆ తరవాత పెరిగాయనుకోండి. మీ బాండ్ల ధర కూడా తగ్గుతుంది. అదే రివర్స్‌లో మీరు కొన్నాక వడ్డీ రేట్లు తగ్గితే.. మీ బాండ్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది కనక వాటికి గిరాకీ ఉంటుంది. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే బాండ్లలోనూ ఇన్వెస్ట్‌ చేయొచ్చు.

ప్రభుత్వ సావరిన్‌ బాండ్లు
→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి కనుక చాలా తక్కువ రిస్కు ఉంటుంది. 
→ సురక్షితం కనుక... తక్కుక వడ్డీని ఆఫర్‌ చేస్తాయి. కానీ బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వడ్డీ కాస్తంత ఎక్కువ ఉంటుంది. 
→ డిపాజిట్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్‌ చేసుకోలేరు. కానీ బాండ్‌ మార్కెట్లో ట్రేడవుతాయి కనుక అప్పటి ధరకు విక్రయించుకోవచ్చు. 
→ ఏడాదికోసారి వడ్డీ మన ఖాతాలో ఠంచనుగా పడుతుంది.  

ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీల బాండ్లు
→  కంపెనీలు తమ సొంత పూచీకత్తుపై జారీ చేస్తాయి. వాటి పనితీరుపై ఆధారపడి ఉంటాయి కనుక రిస్కు కాస్తంత ఎక్కువ. 
→ రిస్కు ఎక్కువ కనుక ప్రభుత్వ బాండ్ల కన్నా వడ్డీ కాస్త ఎక్కువే.  
→ వీటిని కూడా ప్రభుత్వ బాండ్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాండ్‌ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది.  
→ వీటి రేటింగ్‌ను బట్టి వడ్డీ ఉంటుంది. ట్రిపుల్‌ ఏ బాండ్లకు కాస్త తక్కువగా... రేటింగ్‌ తగ్గుతున్న కొద్దీ వడ్డీ పెరిగేలా ఉంటాయి. 
→ కాకపోతే తక్కు రేటింగ్‌ ఉన్న బాండ్లకు రిస్కు కూడా ఎక్కువని గమనించాలి.  

– సాక్షి, బిజినెస్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement