Liquidity
-
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్
న్యూఢిల్లీ: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ నిలిపివేసిన ఆరు మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి ఇన్వెస్టర్లకు రూ.27,000 కోట్లను చెల్లించింది. 2020 ఆరంభంలో కరోనా వైరస్ రాకతో మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు పెరిగిపోవడం తెలిసిందే. దీంతో 2020 ఏప్రిల్ 23న ఆరు డెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్ పథకాలను నిలిపివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకుంది. ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొనగా, అదే సమయంలో మార్కెట్లో డెట్ సెక్యూరిటీల అమ్మకాలకు కావాల్సినంత లిక్విడిటీ (కొనుగోలుదారులు) లేనట్టు అప్పుడు సంస్థ ప్రకటించింది. ఆరు పథకాలను నిలిపివేసే నాటికి వాటి పరిధిలోని పెట్టుబడుల విలువ రూ.25,125 కోట్ల మేర ఉండగా, దీంతో పోలిస్తే తాము ఇన్వెస్టర్లకు 107 శాతం మేర చెల్లించినట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తాజాగా తెలిపింది. ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కమ్ అపార్చునిటీస్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూయల్ ఫండ్ నిలిపివేసిన వాటిల్లో ఉన్నాయి. మరోవైపు ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్ తన ఫిక్స్డ్ ఇన్కమ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ వ్యాపారాలకు కొత్త నియామకాలను ప్రకటించింది. రాహుల్ గోస్వామి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగానికి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, ఎండీగా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా ఉన్న సంతోష్ కామత్ ఇకపై ఫ్రాంక్లిన్ ఇండియా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా పనిచేయనున్నారు. -
ఉద్యోగులకు స్విగ్గీ మరో విడత ఎసాప్ల లిక్విడిటీ ప్రోగ్రాం
న్యూఢిల్లీ: ఆన్–డిమాండ్ కనీ్వనియెన్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ అర్హులైన ఉద్యోగుల కోసం 50 మిలియన్ డాలర్లతో (దాదాపు రూ. 410 కోట్లు) ఎసాప్ లిక్విడిటీ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. గతంలో ఉద్యోగులకు ప్రోత్సాహకాల కింద ఇచి్చన షేర్లను కంపెనీ ఈ ప్రోగ్రాం ద్వారా బైబ్యాక్ చేయనుంది. తమ ఎసాప్స్‌ను సంస్థకు విక్రయించి నగదు పొందేందుకు అర్హులైన ఉద్యోగులకు ఈ రూపంలో ఒక ఆప్షన్ ఉంటుందని స్విగ్గీ తెలిపింది. గతేడాది కొనుగోలు చేసిన డైన్అవుట్కి చెందిన సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని వివరించింది. ఉద్యోగులకు సంపదను సమకూర్చే ఉద్దేశంతో దీన్ని చేపట్టినట్లు స్విగ్గీ హెడ్ (హెచ్ఆర్ విభాగం) గిరీష్ మీనన్ తెలిపారు. సుమారు 2,000 మంది ఈ ప్రోగ్రాంకు అర్హత కలిగి ఉంటారని అంచనా. రెండేళ్ల ఎసాప్ లిక్విడిటీ ప్రోగ్రాం కింద.. స్విగ్గీ గతేడాది కూడా 23 మిలియన్ డాలర్లతో (సుమారు రూ. 180 కోట్లు) ఇదే తరహా ప్రక్రియ నిర్వహించింది. -
చిన్న పెట్టుబడి.. పెద్ద నిధిగా మారాలంటే?
వివేక్, బలరామ్ ఇద్దరూ మంచి స్నేహితులు. కానీ, ఈక్విటీ పెట్టుబడుల విషయానికొచ్చే సరికి ఇద్దరిదీ చెరోదారి. 2002లో ఇద్దరూ ఓ చెరో నాలుగైదు స్మాల్‌క్యాప్ కంపెనీల్లో రూ. 50 వేల చొప్పున ఇన్వెస్ట్ చేశారు. 2023 జనవరి నాటికి వివేక్ ఇన్వెస్ట్ చేసిన ఐదు కంపెనీల్లో రెండు మలీ్టబ్యాగర్లు అయ్యాయి. రెండు నష్టాలను ఇవ్వగా, ఒక్కటి మంచి రాబడులను ఇచి్చంది. మొత్తంగా అతడి రూ. 50వేల పెట్టుబడి 20 ఏళ్లలో రూ.18 లక్షలు అయింది. బలరామ్ నాలుగు కంపెనీల్లో మొత్తంగా రూ. 50 వేలు పెట్టుబడి పెట్టాడు. కానీ, 2023 జనవరిలో అతడి మొత్తం పెట్టుబడి రాబడితో కలసి రూ.6 లక్షలుగా మారింది. ఇద్దరి రాబడుల్లో అంత వ్యత్యాసం ఎందుకు ఉందంటే? వారు ఎంపిక చేసుకున్న కంపెనీల వల్లే. ఇక్కడ బలరామ్‌తో పోలిస్తే వివేక్ అంత భారీ రాబడులు పోగేసుకోవడం వెనుక అతడు నేర్చుకుని, తెలుసుకుని, తగినంత అధ్యయనం తర్వాత పెట్టుబడి పెట్టడం వల్లేనని చెప్పుకోవాలి. అందుకే స్మాల్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి ఓ కళగా నిపుణులు చెబుతారు. అన్నీ తెలుసుకుని, అవగాహనతోనే ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తుంటారు. స్మాల్‌క్యాప్ కంపెనీలు అంటే చాలా చౌకగా లభిస్తున్నాయనే అపోహ మనలో చాలా మందికి ఉంటుంది. కానీ, ఇది సరికాదు. రూ.16,472 కోట్ల మార్కెట్ విలువ వరకు ఇప్పుడు స్మాల్‌క్యాప్ కంపెనీలుగానే పరిగణిస్తున్నారు. లోగడ రూ.8,579 కోట్ల మార్కెట్ విలువ వరకు ఇలా పరిగణించేవారు. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో చాలా వరకు దశాబ్దాలుగా అదే స్థాయిలో ఉండిపోతాయి. కేవలం కొన్ని మాత్రం ఆయా రంగాల్లో లీడర్లుగా, పెద్ద స్థాయి కంపెనీలుగా అవతరిస్తాయి. వ్యాపారంలో వృద్ధి లేక అక్కడే ఉండిపోయే కంపెనీలు కూడా బోలెడు. కంపెనీ యాజమాన్యంలో సత్తా లేకపోవచ్చు. లేదా ఆ కంపెనీ చేస్తున్న వ్యాపారానికి పరిమిత అవకాశాలు ఉండొచ్చు. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, మూలధన నిధుల నిర్వహణ మెరుగ్గా లేకపోవచ్చు. సాధారణంగా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువ ఇలాంటివే కనిపిస్తుంటాయి. కానీ, కొన్ని మార్కెట్ గుర్తింపు లేకపోవడం వల్ల కూడా తక్కువ వేల్యూషన్ల వద్ద లభిస్తుంటాయి. లేదంటే అప్పటి వ్యాపార స్థాయి ఆధారంగా చిన్న కంపెనీలుగా ఉండి ఉండొచ్చు. ఇలాంటి నాణ్యమైన కొన్ని ఆణిముత్యాలను ఎంపిక చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మల్టీబ్యాగర్ రాబడులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్లలో ఒక ధోరణి కనిపిస్తుంది. స్టాక్ ధర రూ.100 లోపు లేదా రూ.10–50 లోపు ఉంటే చౌక అని భావిస్తుంటారు. రేటు తక్కువలో ఉంటే ఎక్కువ స్టాక్స్ వస్తాయని, వేగంగా రెండు మూడు రెట్లు పెరుగుతాయనే అపోహ ఉంటుంది. స్మాల్‌క్యాప్ కంపెనీయే అయినా ఒక్కో షేరు రూ.5,000 ఉండొచ్చు. మరో కంపెనీ షేరు ధర రూ.10 ఉండొచ్చు. షేరు ధర కంపెనీ ఆర్థిక మూలాలనే ప్రతిఫలిస్తుందన్నది మర్చిపోవద్దు. షేరు ధర తక్కువ, ఎక్కువలో ఉండడం అన్నది చౌక, ఖరీదైన దానికి నిదర్శనం కాదు. ఉదాహరణకు.. ‘ఏ’ అనే కంపెనీ మూలధనం రూ.10కోట్లు. షేరు ముఖ విలువ రూ.10 అప్పుడు కోటి షేర్లు ఉంటాయి. ‘బీ’ అనే కంపెనీ మూలధనం కూడా రూ.10 కోట్లు. కానీ షేరు ముఖ విలువ ఒక్కరూపాయే. కనుక 10 కోట్ల షేర్లు ఉంటాయని తెలుసుకోవాలి. కేవలం పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్ రేషియో/ఆర్జనకు షేరు ఎన్ని రెట్లు ఉంది) చూసి, తక్కువలో ఉందని కొనుగోలు చేయడం కూడా అన్ని సందర్భాల్లో సరైన ఫలితం ఇవ్వదని నిపుణులు చెబుతున్నారు. స్మాల్‌క్యాప్ అనేది పెద్ద ప్రపంచం. టాప్ 250 కాకుండా మార్కెట్లో ఉన్న మిగిలినవన్నీ కూడా స్మాల్‌క్యాప్ విభాగంలోకే వస్తాయి. అన్ని వందలు, వేల కంపెనీల నుంచి మాణిక్యాలను (చెత్త నుంచి మణి) వెలికితీయాలంటే లోతైన పరిశోధ న అవసరం. మెరుగైన అవకాశాలు రూ.16,472 కోట్ల వరకు స్మాల్‌క్యాప్ కంపెనీల కిందకే వస్తున్నాయి కనుక ఈ విభాగంలో ఇప్పుడు పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. నిర్వచనం మార్చడం వల్ల స్మాల్‌క్యాప్ పప్రంచం ఇప్పుడు మరింత విస్తృతం అయింది. మన మార్కెట్ విస్తృతి పెరిగింది. వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా, మరి కొన్ని దశాబ్దాల్లో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించొచ్చు. కనుక దీర్ఘదృష్టితో ఆలోచించి, ఇప్పుడు స్మాల్‌క్యాప్ ప్రపంచంలో కొంచెం పెద్ద కంపెనీలను ఎంపిక చేసుకున్నా.. అవి జెయింట్ క్యాప్ కంపెనీలుగా మారే అవకాశాలు లేకపోలేదు. 2012 జనవరి 10 నుంచి 2022 జనవరి 10 వరకు గణాంకాలను పరిశీలించి చూస్తే.. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీ నుంచి మూడు కంపెనీలు లార్జ్‌క్యాప్ కంపెనీలుగా అవతరించాయి. అవి చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, ఎస్ఆర్ఎఫ్, పీఐ ఇండస్ట్రీస్. ఇక స్మాల్‌క్యాప్ నుంచి మరో 21 కంపెనీలు మిడ్‌క్యాప్ కంపెనీలుగా అవతరించాయి. 72 కంపెనీలు అదే స్థాయిలో ఉంటే, 64 కంపెనీలు మైక్రోక్యాప్ (మరీ చిన్నవి)గా కరిగిపోయాయి. ఎంపిక ఎలా..? ‘‘చిన్న కంపెనీలు అధిక వృద్ధి సామర్థ్యాలతో ఉంటాయి. దాదాపు ఇవి అనలిస్టుల సెల్ కాల్ పరిధిలో ఉండవు. కనుక స్మాల్ క్యాప్ కంపెనీలను అధ్యయనం చేసేందుకు ప్రాథమిక పరిశోధన అవసరం. అన్ని మార్కెట్ సైకిల్స్‌లోనూ ఇవి అధిక రాబడులను ఇవ్వగలవు’’ అని ఓపీసీ అస్సెట్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అజయ్ బగ్గా పేర్కొన్నారు. ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ అంబరీశ్ బలిగ అభిప్రాయంలో.. ‘‘స్మాల్‌క్యాప్ స్టాక్ ఎంపికకు ఏ ఒక్క విధానం అంటూ లేదు. కాకపోతే నేను అనుసరించే మార్గదర్శకాలు ఏమిటంటే.. ఎంపిక చేసుకోబోయే స్టాక్ మంచి పనితీరు చూపిస్తున్న రంగానికి చెందినదై ఉండాలి. లేదా మంచి పనితీరు చూపించేందుకు అవకాశం ఉన్న రంగంలో పనిచేస్తూ ఉండాలి. ఆయా కంపెనీ ఏదైనా ఉప విభాగంలో లీడర్‌గా ఉందా అని చూస్తాను. లేదంటే లీడర్‌గా ఎదిగే అవకాశాలున్నాయా అని పరిశీలిస్తాను. ఆయా రంగం వృద్ధికి మించి పనితీరు చూపిస్తూ ఉండాలి’’అని వివరించారు. ఇక స్మాల్‌క్యాప్ కంపెనీల విషయంలో లిక్విడిటీ (షేర్ల లభ్యత) కూడా కీలకమేనని అంబరీశ్ తెలిపారు. ‘‘బ్యాలన్స్ షీటులో రుణ భారం ఎక్కువగా ఉండకూడదు. రుణ భారం ఉంటే, భవిష్యత్తులో పెరిగే నగదు ప్రవాహాల పట్ల స్పష్టత ఉండాలి. అప్పుడే ఈక్విటీ–రుణభారం నిష్పత్తి దిగొస్తుంది’’అని వివరించారు. లిక్విడిటీ తక్కువగా ఉన్నప్పుడు ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడితే అది షేరు ధర పతనానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాణ్యతపై దృష్టి కీలకం ‘‘స్మాల్‌క్యాప్ కంపెనీలు ఎప్పుడూ కూడా లిక్విడిటీ పరంగా సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాయి. లిక్విడిటీ తక్కువగా ఉంటే ర్యాలీ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే, షేరు ధర వేగంగా పడిపోయే అవకాశాలు సైతం ఉంటాయి. స్మాల్‌క్యాప్ పరంగా ఉండే కీలకమైన అంశం ఇదే. అందుకే మార్కెట్లో వాటి ధరలు మానిప్యులేషన్‌కు లోనవుతుంటాయి’’అని కేఆర్ చోక్సే ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ దేవేన్ చోక్సే వివరించారు. ఇక యాజమాన్యం సమర్థత, నిజాయితీ తదితర అంశాలు కూడా ఈ విభాగంలో కీలకంగా పనిచేస్తాయని అంబరీష్ బలిగ వివరించారు. యాజమాన్యం విషయంలో కనిపించని విషయాలను వెలికితీసే ప్రయత్నం చేయాలని సూచించారు. షేరు ధర చౌకగా ఉందా లేక స్మాల్‌క్యాప్ అని కాకుండా, నాణ్యతకు సంబంధించిన అంశాలు చూడాలని నిపుణుల సూచన. యాజమాన్యానికి తగిన సామర్థ్యాలు ఉన్నాయా? కంపెనీ భిన్నంగా ఏదైనా చేయగలదా? పోటీ తత్వం లేదా టైఅప్‌ల ద్వారా భిన్నంగా ప్రయతి్నంచగలదా? పరిమిత మూలధన నిధులతోనే వృద్ధి చెందగలదా? భారీ వృద్దికి అవకాశం ఉన్న రంగంలోనే పనిచేస్తుందా? అన్న అంశాలను చూడాలి. ఎంపిక చేసుకునే కంపెనీకి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు మధ్యలో తాత్కాలికంగా ఏవైనా ఆటుపోట్లతో దారి తప్పినా.. తిరిగి మళ్లీ గాడిలో పడి దూసుకుపోయే అవకాశాలుంటాయి. యాజమాన్యం సామార్థ్యాలు, బలాలకు తోడు ఆ వ్యాపారం విస్తరణకు అవకాశం ఉందా? అప్పటికే ఆ కంపెనీలో ఇనిస్టిట్యూషన్స్ లేదా హెచ్ఎన్ఐలకు (బడా ఇన్వెస్టర్లు) వాటాలున్నాయా అనే అంశాలను కూడా పరిశీలించాలి. ఆయా కంపెనీ కస్టమర్లు, వెండర్లు, పోటీ కంపెనీలను కలసి మాట్లాడడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని అంబరీష్ బలిగ సూచించారు. పైగా అన్ని సానుకూలతలు ఉండి, కంపెనీని ఎంపిక చేసుకున్న తర్వాత ఫలితం వచ్చే వరకు వేచి చూసే ఓపిక కూడా దండిగా ఉండాలన్నది మార్కెట్ పండితుల స్వీయ అనుభవం. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే అన్న చందంగా ప్రతీ నాణ్యమైన కంపెనీకి అనుకూల తరుణం వచ్చే వరకు ఆగాల్సిందే. పైగా ఒక్కసారి పెట్టుబడి పెట్టి రిలాక్స్ అయ్యే ధోరణి స్మాల్‌క్యాప్ కంపెనీలకు అస్సలే పనికిరాదు. ఎలాంటి సానుకూలతలు చూసి, సంబంధిత కంపెనీలో పెట్టుబడి పెట్టారో.. వాటిల్లో మార్పు లేనంత వరకు పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. తేడా వస్తే బయటకు వచ్చేందుకు సిద్ధంగానూ ఉండాలి. కంపెనీ వృద్ధి పథంలో సాగుతున్నంత కాలం ర్యాలీ చేస్తున్నప్పటికీ ఆ పెట్టుబడితో కొనసాగొచ్చు. అలాంటప్పుడే అవి మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌గా అవతరించగలవు. అలా మంచి పనితీరును క్రమం తప్పకుండా కొనసాగిస్తున్న సమయంలో మరింత మంది ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల్లో పెట్టుబడులకు ముందుకు వస్తారు. దీంతో విస్తృతి పెరుగుతుంది. -
ద్రవరూప డీఏపీ, యూరియా వాడండి
న్యూఢిల్లీ: రైతులు సాగులో ద్రవరూప నానో డీఏపీ, యూరియాను వినియోగించాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా సూచించారు. ఈ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించడం ద్వారా ఎరువుల తయారీలో దేశాన్ని స్వావలంబన భారత్‌గా మార్చాలని రైతులకు పిలుపునిచ్చారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. ఇఫ్కో నానో (ద్రవరూప) డీఏపీ వాణిజ్య విక్రయాలను మంత్రి బుధవారం ఢిల్లీలో ప్రారంభించి, మాట్లాడారు. ఇఫ్కో ద్రవరూప నానో డీఏపీ 500 ఎంఎల్ బాటిల్‌ను రూ.600కు విక్రయించనున్నారు. అదే సంప్రదాయ 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350గా ఉంది. సాగులో ద్రవరూప ఉత్పత్తులను వినియోగించడం వల్ల నాణ్యతతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని మంత్రి అమిత్‌షా అన్నారు. భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. ద్రవరూప డీఏపీతో సాగు ఖర్చులు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గుతాయని చెప్పారు. అలాగే ద్రవరూప ఎరువుల రవాణా, నిల్వ కూడా సులభం. ద్రవరూప ఎరువులు భారత్‌ను స్వావలంబన దిశగా నడిపిస్తాయన్నారు. 2021–22లో 91.36 లక్షల టన్నుల యూరియా, 54.62 లక్షల టన్నుల డీఏపీ, 24.60 లక్షల టన్నుల ఎంవోపీ, 11.70 లక్షల టన్నుల ఎన్పీకే ఎరువులను దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇఫ్కో తయారు చేసిన నానో డీఏపీకి 20 ఏళ్ల కాలానికి పేటెంట్ వచ్చినట్టు మంత్రి అమిత్‌షా తెలిపారు. -
కల్లోలంలో కుదురుగా ఉంటేనే..!
పుష్కలమైన లిక్విడిటీతో మంచి రాబడులను ఇచ్చే మెరుగైన సాధనం ఏదైనా ఉందంటే అది ఈక్విటీయే. కానీ, ఈక్విటీలన్నవి అస్థిరతల నడుమ తిరుగుతుంటాయి. సానుకూల పరిణామాలకు పొంగిపోయినట్టే.. ప్రతికూలతల్లో పతనాలను చూస్తుంటాయి. ఇవన్నీ సర్వసాధారణం. ఈ పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటున్నాం..? అన్నదే రాబడులను నిర్ణయిస్తుంటుంది. మార్కెట్లో మన స్థానాన్ని పరీక్షిస్తుంది. జనవరి 17న సెన్సెక్స్ 61,475. మే 9న 54,470కు దిగొచ్చింది. మార్చి 8న 52,261 కనిష్ట స్థాయి వరకూ వెళ్లిన సెన్సెక్స్, అక్కడి నుంచి మార్చి 31 నాటికి 58,891కు చేరింది. మళ్లీ ఇప్పుడు వెనుక చూపులు చూస్తోంది. ఈ అస్థిరతలకు ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తున్నారన్నది ఈక్విటీ పెట్టుబడులకు కీలకం అవుతుంది. ఈ తరహా అశాంతి, ఆందోళనకు గురిచేసే ఈక్విటీ కల్లోల పరిణామాల్లో సాధారణ ఇన్వెస్టర్లు ఏం చేస్తే మెరుగ్గా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయాల ఆధారంగా తెలియజేసే కథనమే ఇది. 2020 మార్చిలో సెన్సెక్స్ 29,468 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఒక్క నెలలోనే 9,442 పాయింట్లు కోల్పోయింది. ఇది 24 శాతానికి సమానం. మార్కెట్లు పడినప్పుడే ఇన్వెస్ట్ చేద్దామని ఎదురు చూసే ఇన్వెస్టర్లు కొందరు ఉంటారు. వీరికి 2020 మార్చి–ఏప్రిల్ కరోనా క్రాష్ మంచి అవకాశం. తమ దగ్గరున్న మిగులు నిల్వలను పెట్టుబడిగా పెట్టుకున్నారు. అయితే, ప్రతీ మార్కెట్ పతనాన్ని పెట్టుబడులకు చక్కని అవకాశంగా తీసుకోవడం సాధ్యపడదు. అలాగే, మార్కెట్ గరిష్టాలను సరిగ్గా అంచనా వేసి అక్కడ విక్రయించడం కూడా ఎక్కువ సందర్భాల్లో అసాధ్యమే. మంచి అవకాశం తలుపుతట్టినా ఆ సమయంలో ఇన్వెస్టర్ ఎలా స్పందించాడన్నది కీలకం అవుతుంది. 2020 మార్కెట్ పతనం సమయంలో మెజారిటీ ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. మార్కెట్లు ఇంకా పడిపోతాయని అనుకున్నారు. మెజారిటీ విశ్లేషకులు కూడా ఇదే అంచనా వేశారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఒక దశ నుంచి మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. అదే ఏడాది చివరికి దాదాపు నష్టాలన్నింటినీ భర్తీ చేసుకున్నాయి. మార్కెట్లు అంచనాలకు భిన్నంగా అలా పెరిగేసరికి అక్కడి నుంచి మళ్లీ పడిపోతాయన్న అంచనాలు వినిపించాయి. దీంతో సెన్సెక్స్ 40వేల స్థాయికి చేరగానే కొందరు పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. కానీ, ఏమైంది..? మార్కెట్లు అక్కడి నుంచి పడిపోలేదు. మరో 50 శాతం పెరిగి 60,000కు చేరింది సెన్సెక్స్. ‘‘మార్కెట్లు ఎగిసిపడడం సర్వసాధారణం. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా వాటిని చూసి అనవసరంగా మన పెట్టుబడులను విక్రయించడం లేదా కొనుగోలు చేస్తే గాయాలపాలు కావాల్సి వస్తుంది’’అన్నది నిపుణుల సూచన. మార్కెట్ల గరిష్ట స్థాయి ఇది, కనిష్ట స్థాయి ఇది.. మార్కెట్లు ఇక్కడి నుంచి పెరుగుతాయి.. ఇక్కడి నుంచి పడిపోతాయి.. ఈ తరహా అంచనాలు (మార్కెట్ టైమింగ్) వేసుకోవడం సరైన విధానం కానే కాదు. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లకు ఇది అనుసరణీయం కాదు. ఎక్కువ సందర్భాల్లో అంచనాలు తప్పి, ర్యాలీలు మిస్ అయిపోవచ్చు. ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను చేజార్చుకుని, ఖరీదైన వ్యాల్యూషన్ల వద్ద అడుగు పెట్టొచ్చు. అందుకని రిటైల్ ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఇన్వెస్ట్ చేసి కొనసాగడమే సరైన విధానం అవుతుంది. తరచూ పెట్టుబడులను మార్చే విధానం వారికి పెద్దగా కలసి రాదు. క్రమం తప్పకుండా ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి సారించాలి. ‘‘మార్కెట్లలో పతనాల కోసం వేచి చూస్తూ, ప్రస్తుతం మార్కెట్ పతనంలో పెట్టుబడి పెట్టాలని చూసే వారికి మేమిచ్చే సలహా ఒక్కటే. ఒకే విడత పెట్టుబడి పెట్టకుండా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి చేసుకోవడమే మెరుగైన మార్గం. మీరు నిర్ణయించుకున్న అస్సెట్ అలోకేషన్ విధానానికి అనుగుణంగా నడుచుకోవాలి’’ అని ‘క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్’ ఈక్విటీ ఫండ్ మేనేజర్ సార్బ్ గుప్తా సూచించారు. అస్థిరతలు.. అవకాశాలు మార్కెట్లలో అస్థిరతలు నిజానికి ఇన్వెస్టర్లకు రాబడి తెచ్చి పెట్టే అవకాశాలుగా అర్థం చేసుకోవాలి. అందరూ ఎగబడి కొంటుంటే విక్రయించడం.. అందరూ ఆందోళనతో విక్రయిస్తుంటే కొనుగోలు చేయడం అన్న వారెన్ బఫెట్ సూత్రాన్ని గుర్తు చేసుకోవాలి. అస్సెట్ అలోకేషన్ కూడా ఇదే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. మార్కెట్లు పడిపోతుంటే స్టాక్స్ చౌక ధరలకే లభిస్తాయి. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు కూడా ఎక్కువ సొంతం చేసుకోవచ్చు. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఉదాహరణకు రూ.1,000ను ఒక పథకంలో రూ.11 ఎన్ఏవీ వద్ద ఇన్వెస్ట్ చేశారనుకుంటే.. అప్పుడు 90.90 యూనిట్లు వస్తాయి. ఏడాది చివరికి అదే ఎన్ఏవీ రూ.13కు వెళితే 18.18 శాతం రాబడి వచ్చినట్టు అవుతుంది. ఒకవేళ ఎన్ఏవీ రూ.9కు దిగిపోతే అప్పుడు మరో రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే 111.11 యూనిట్లు వస్తాయి. మొత్తం రూ.2,000 పెట్టుబడికి వచ్చిన యూనిట్లు 202. అప్పుడు ఎన్ఏవీ రూ.13కు చేరిందనుకోండి రాబడి రేటు 31.30 శాతంగా ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ కానీ, సిప్ విధానంలో కానీ ఈ విధమైన ప్రయోజనాన్ని పొందొచ్చు. సమాచారం విషయంలో జాగ్రత్త ఈక్విటీలకు సంబంధించి ఎంతో సమాచారం డిజిటల్ వేదికలపై ప్రసారమవుతుంటుంది. ఒకప్పటితో పోలిస్తే నేడు అధిక సమాచార వ్యాప్తి ఇన్వెస్టర్లను కుదురుగా ఉండనీయడం లేదు. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌లో సమస్త సమాచారం తెలుసుకునే అవకాశం తప్పటడుగులకు దారితీయకుండా చూసుకోవాలి. అవసరమైన సమాచారానికే పరిమితం కావాలి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిందన్న సమాచారం వెలుగు చూడగానే కంగారుగా ఈక్విటీ పెట్టుబడులను విక్రయించేసిన ఇన్వెస్టర్లు ఉన్నారు. విక్రయించడం సులభమే. కానీ, ఈ పెట్టుబడిని మళ్లీ ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తామన్నది కూడా రాబడులను నిర్ణయిస్తుంటుంది. యుద్ధం వల్ల మొత్తం మార్కెట్ కంటే కూడా విడిగా కొన్ని కంపెనీలపై ప్రభావం భిన్నంగా ఉంటుంది. ‘‘ఒక కంపెనీ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నప్పటికీ స్వల్ప కాలంలో ఆ కంపెనీ షేరు ధర పడిపోవచ్చు. కానీ, అది తాత్కాలికమే. దీర్ఘకాలంలో అదే తీరు కొనసాగదు. మార్కెట్లో ఉన్న సెంటిమెంట్, పరిశ్రమ భవిష్యత్తు అంచనాలు, యాజమాన్యం నాణ్యత, ప్రమోటర్, కార్పొరేట్ చర్యలు ఇలా ఎన్నో అంశాలు షేర్ల ధరలను, మార్కెట్ విలువను ప్రభావితం చేస్తుంటాయి’’అని స్మాల్‌కేస్ సీఈవో వసంత్కామత్ పేర్కొన్నారు. ఒక కంపెనీ షేరు ధర ఎప్పటికైనా దాని వ్యాపార, ఆర్థిక మూలాలకు తగ్గట్టు నడుచుకోవాల్సిందేనన్నారు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారు కంపెనీ ఆర్థిక, వ్యాపార బలాలు, ఇతర అంశాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలి తప్పించి, తాత్కాలికంగా వినిపించే వార్తలు, సమాచారంతో అయోమయానికి గురి కాకూడదు. పెట్టుబడి కాల వ్యవధి కూడా ఈ తరహా సమాచారంపై ఆధారపడాలా? లేదా అన్నది నిర్ణయించుకోవడానికి మార్గదర్శి అవుతుంది. ‘‘ఉదాహరణకు మూడేళ్లు, అంతకుమించిన కాలానికి ఇన్వెస్ట్ చేశారనుకోండి. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించి వార్తలు రణగొణధ్వనే అవుతుంది. ఒకవేళ మూడు నెలల కోసం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, అప్పుడు ప్రస్తుత యద్ధం సంక్షోభ పరిణామాలకు స్పందించాల్సి ఉంటుంది’’అని మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ పీఎంఎస్ ఫండ్ మేనేజర్ శ్రేయి లూంకర్ వివరించారు. యుద్ధం కంపెనీ వ్యాపార నమూనానే దెబ్బతీస్తుందా? లేక తాత్కాలిక ప్రభావం చూపిస్తుందా? అన్నది తేల్చుకున్న తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలి. కాల వ్యవధి కీలకం.. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈక్విటీలు మంచి పనితీరు చూపించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే స్వల్పకాలంలో ఆటుపోట్ల కారణంగా పెట్టుబడికి నష్టం ఏర్పడవచ్చు. స్వల్పకాలంలో అస్థిరతలను ఎదుర్కొన్నా.. సుదీర్ఘ బాటసారిగా మార్కెట్లు ముందుకే ప్రయాణం చేస్తాయని చరిత్ర చెబుతోంది. ఉదాహరణకు 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2020 కరోనా సంక్షోభ సమయాల్లో ఈక్విటీ మార్కెట్లు సగం మేర వాటి విలువను కోల్పోయాయి. కానీ, ఈ రెండు సందర్భాల తర్వాతి కాలంలో మార్కెట్లు మళ్లీ లేచి నిలబడ్డాయి. స్వల్పకాలంలో గణాంకాలు నిరాశకు గురి చేయవచ్చు. దీర్ఘకాలంలో పనితీరు ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. ఈక్విటీల తీరు అలా ఉంటుంది. గడిచిన మూడు నెలల కాలంలో నిఫ్టీ 100, బీఎస్ఈ 500 సూచీల రాబడి 0.75 శాతం, 1.23 శాతం కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటుగానే ఉంది. కానీ, గత ఐదేళ్ల కాలంలో చూస్తే వీటి కాంపౌండెడ్ వార్షిక వృద్ధి 15 శాతంగా ఉంది. ఈక్విటీ పెట్టుబడి అంటే.. ఏదో ఒక స్టాక్‌లో ఒక ధర వద్ద ఇన్వెస్ట్ చేసి, నిర్ణీత శాతం పెరిగిన తర్వాత విక్రయించడం అని కాదు. ఒక వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నట్టు. ఆ వ్యాపారానికి దీర్ఘకాలంలో ఉన్న వృద్ధి అవకాశాలను చూడాలి. వాటి ఆధారంగా ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు ఆ వ్యాపారం వృద్ధి సాధిస్తున్న కొద్దీ అది షేరు ధరపై ప్రతిఫలిస్తుంది. అంతిమంగా పెట్టుబడి మంచి వృద్ధిని చూస్తుంది. కనుక ఈక్విటీలను ఎప్పుడూ దీర్ఘకాల పెట్టుబడి సాధనంగానే చూడాల్సి ఉంటుంది. స్వల్పకాల దృష్టితో చూసే వారికి డెట్ సాధనాలే మార్గం. రీబ్యాలెన్సింగ్ కీలకం... అస్సెట్ అలోకేషన్ ప్రణాళికను మార్కెట్ల అస్థిరతల సమయాల్లో లేదా ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. దీన్నే రీబ్యాలెన్సింగ్ అంటారు. ఉదాహరణకు ఈక్విటీ వ్యాల్యూయేషన్ మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 50 శాతం ఉండాలని నిర్ణయించుకున్నారని అనుకుందాం. మార్కెట్ల అస్థిరతల్లో ఈక్విటీ పెట్టుబడుల విలువ మొత్తం పెట్టుబడుల విలువలో 40 శాతానికి పడిపోయిందనుకోండి. అప్పుడు ఈక్విటీ పెట్టుబడుల విలువ 50 శాతానికి వచ్చే విధంగా ఇతర విభాగాల నుంచి పెట్టుబడులను తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ పట్ల క్రమశిక్షణగా నడుచుకుంటే దీర్ఘకాలంలో ఆ ప్రయోజనం ఏంటో స్వయంగా కళ్లజూస్తారు. అంతేకాదు, మార్కెట్లు బాగా ర్యాలీ చేసిన సందర్భాల్లో ఈక్విటీల వ్యాల్యుయేషన్ మొత్తం పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 70 శాతానికి చేరిందనుకుంటే.. అప్పుడు ఈక్విటీ పెట్టుబడుల విలువ 50 శాతానికి దిగి వచ్చే విధంగా కొంత పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలి. వాటిని ఇతర సాధనాలకు కేటాయించుకోవాలి. దీన్నే రీబ్యాలెన్స్ అంటారు. దీనివల్ల ఒక విభాగంలో వచ్చే ఆటుపోట్లను అవకాశంగా తీసుకుని అదనపు పెట్టుబడులు పెట్టడం.. ఒక విభాగంలో అధిక వృద్ధి నుంచి లబ్ధి పొందడం ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. అస్సెట్ అలోకేషన్ అంటే వైవిధ్యం అని కూడా అర్థం చేసుకోవాలి. ఒకే చోట పెట్టుబడులు అన్నింటినీ పెట్టకుండా వైవిధ్యం పాటించడం. అలాగే, విడిగా ఆయా విభాగాల్లోనూ వైవిధ్యాన్ని పాటించడం మంచిది. ఉదాహరణకు ఈక్విటీల్లో ఒకే రంగంలో, ఒకే విభాగంలో (లార్జ్/మిడ్/స్మాల్‌క్యాప్) కాకుండా వర్గీకరించుకోవాలి. ఈక్విటీ మార్కెట్ల సహజ తీరును అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంలో కోరుకుంటున్న రాబడి రేటు, కావాల్సిన నిధి, ఏ మేరకు పెట్టుబడులు పెట్టగలరు వీటన్నింటినీ విశ్లే షించుకుని చక్కని అస్సెట్ అలోకేషన్ ప్రణాళిక వేసుకుంటే.. ఇక మార్కెట్లు ఎలా స్పందించినా.. అది చూసి ఇన్వెస్టర్‌గా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. పోర్ట్‌ఫోలియో మీరు ఆశించిన మేర ఫలితాలను ఇచ్చే విధంగా రక్షణ కల్పించుకున్నట్టు అవుతుంది. అస్సెట్ అలోకేషన్.. మార్కెట్లు ఏ స్థాయిలో ఉంటే మనకు ఎందుకు..? అస్సెట్ అలోకేషన్ ప్రణాళికకు అనుగుణంగా పెట్టుబడుల క్రమం కొనసాగాలన్నది నిపుణుల సూచన. అస్సెట్ అలోకేషన్ అన్నది వివిధ సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఎంత కాలం పాటు పెట్టుబడులు పెట్టగలరు, కొనసాగించగలరు, ద్రవ్యోల్బణం, అస్థిరతలు ఇత్యాది అంశాల ఆధారంగా ఎవరికి వారే తమకు అనుకూలమైన అస్సెట్ అలోకేషన్‌ను నిర్ణయించుకోవాలి. సాధారణంగా ఈక్విటీ పెట్టుబడులకు.. డెట్, బంగారంలోని పెట్టుబడులు అస్థితరలకు రక్షణగా నిలుస్తాయి. ఈక్విటీ మార్కెట్లు కుదేలైన సందర్భాల్లో పోర్ట్‌ఫోలియోలో వాటి విలువ సహజంగానే పడిపోతుంది. అదే సమయంలో బంగారం, డెట్ ఫండ్స్‌లోని పెట్టుబడుల రూపంలో కొంత రక్షణ ఉంటుంది. ఈక్విటీల షాక్‌లను తట్టుకునేందుకు ఇలా భిన్న సాధానాలతో అస్సెట్ అలోకేషన్ ఉండాలి. గుడ్లు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే పెట్టెలో పెట్టకూడదన్నదే అస్సెట్ అలోకేషన్‌కు మూలం. ఈక్విటీ, డెట్, ఇతర సాధనాల మధ్య సమతూకం పాటించాలి. ఎక్కువ రాబడులను ఇస్తుంది కదా అని ఈక్విటీలపైనే పూర్తిగా ఆధారపడకూడదు. డెట్ ఫండ్స్‌లో రాబడులు చాలా తక్కువగా ఉన్నా సరే పెట్టుబడి కాపాడుకునే వ్యూహంలో భాగంగా కొంత మొత్తాన్ని డెట్ సాధనాలకూ కేటాయించుకోవాల్సిందే. ఈ విధమైన సమతూకం లేకపోతే మార్కెట్ల పతనాల్లో ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందన్న నిపుణుల హెచ్చరిక. -
ఏ సవాలునైనా తట్టుకోగలం
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ ఏ సవాలునైనా తట్టుకోగల స్థితిలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలూ రాకుండా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పరిణామాలతో క్రూడ్ ఆయిల్ ఇతర కీలక కమోడిటీ ధరలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ వ్యవస్థకు ఈ భరోసాను కల్పించడం గమనార్హం. భారత పరిశ్రమల సమాఖ్య– సీఐఐ నిర్వహించిన ఒక పారిశ్రామిక సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు... ► మార్చి 2020లో మహమ్మారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినప్పటి నుండి సెంట్రల్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థలోకి రూ. 17 లక్షల కోట్లను పంప్ చేసింది. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ సవాళ్లు తలెత్తకుండా తగిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటుంది. ► అవసరమైన పరిస్థితుల్లో ఆర్బీఐ లిక్విడిటీ చర్యల ఉపసంహరణ ప్రక్రియను చాలా సజావుగా నిర్వహిస్తుంది. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక రంగాల అవసరాలను తీర్చే విషయంలో తగినంత ద్రవ్య లభ్యత కొనసాగుతుంది. ► బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు గణనీయంగా మెరుగుపడింది. మూలధన నిష్పత్తి 16 శాతంగా ఉంది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏ) రికార్డు స్థాయిలో 6.5 శాతానికి పడిపోయాయి. ► యుద్ధంతో తీవ్ర సవాళ్లు తలెత్తినప్పటికీ అధిక ఫారెక్స్ నిల్వలు, తక్కువ కరెంట్ అకౌంట్ లోటు ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా స్థితిలో ఉంచుతోంది. ► దేశంలోకి వచ్చీ–పోయే నిధుల మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించే క్యాడ్ (కరెంట్ అకౌంట్ లోటు)ను నిర్వహించగలిగిన సత్తా దేశానికి ఉంది. ఇందుకు సంబంధించి ఎటుంటి సవాళ్లు ఎదురైనా భారత్ తగిన విధంగా ఎదుర్కొనగలుగుతుంది. ► భారతదేశం ఆంక్షలను ఎదుర్కొంటుందని భయపడాల్సిన పనిలేదు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనే విధంగా ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలు (దాదాపు 630 బిలియన్ డాలర్లపైన) తగిన విధంగా చక్కని వైవిధ్యభరిత స్థాయిలో ఉన్నాయి. ► ఆర్బీఐ విదేశీ కరెన్సీ అసెట్స్‌లో అమెరికా డాలర్లు మెజారిటీని కలిగి ఉండగా, ఆరు నెలల క్రితం ఇతర కరెన్సీలలో తన అసెట్స్‌ను విస్తరించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ► భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఆర్బీఐ ట్రాక్ చేసే దాదాపు 60 హై–ఫ్రీక్వెన్సీ సూచికలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. స్టాగ్ఫ్లేషన్ భయాలు అక్కర్లేదు.. సరళతర ద్రవ్య విధానానికి తిలోదకాలిచ్చే అంచనాలను ఆర్బీఐ వ్యతిరేకిస్తుంది. వృద్ధికి తోడ్పాటు కోసం తగిన అన్ని చర్యలనూ ఆర్బీఐ తీసుకుంటుంది. వరుసగా రెండు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం నిర్ధేశిత ఆర శాతం స్థాయిని దాటినప్పటికీ ఇది తగ్గుముఖం పడుతుందని మేము విశ్వసిస్తున్నాము. ధరల స్థిరత్వం, దానిని అదుపులో ఉంచడం సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కర్తవ్యం. దీనిని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. ఇక భారతదేశానికి స్టాగ్ఫ్లేషన్ అవకాశం లేదు. ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)కు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం (జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం) ఆరు స్థాయిలోనే కొనసాగుతుందని భావించవద్దు. ఇది దిగివస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో విశ్లేషకులు, నిపుణులు రేట్ల పెంపు, సరళతర ద్రవ్య విధానం నుంచి సెంట్రల్ బ్యాంక్ వైదొలడం వంటి అంచనాల నేపథ్యంలో దాస్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత కొనసాగితే, దేశంలో స్టాగ్ఫ్లేషన్ (ఎకానమీలో స్తబ్దతతో కూడిన పరిస్థితి. ధరల తీవ్రత వల్ల వృద్ధి మందగమనం, తీవ్ర నిరుద్యోగం వంటి సవాళ్లు తలెత్తడం) సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని బహుళజాతి బ్యాంకింగ్ సేవల దిగ్గజ సంస్థ– మోర్టాన్ స్టాన్లీ ఇటీవలే అంచనావేసిన సంగతి తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో సగటున 5.7 శాతంగా ఉంటుందని, ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ ఫిబ్రవరి మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని పరపతి విధాన కమిటీ మెజారిటీ అభిప్రాయపడింది. రెపో యథాతథ కొనసాగింపునకు ఆరుగురు సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దాటిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. -
బ్యాంకింగ్ లిక్విడిటీలో తీవ్ర ఒడిదుడుకులు!
ముంబై: బ్యాంకింగ్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)లో గత నెల నవంబర్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్యాంక్ డిపాజిట్లు 2021 నవంబర్ 5తో ముగిసిన 15 రోజుల్లో భారీగా రూ.3.3 లక్షల కోట్లు పెరిగాయి. పక్షం రోజుల్లో ఇంత స్థాయిలో డిపాజిట్ల పెరుగుదల 24 సంవత్సరాల్లో (1997 తరువాత) ఇది ఐదవసారి. అయితే నవంబర్ 5 నుంచి మరో పక్షం రోజులు గడిచేసరికి అంటే 2021 నవంబర్ 19వ తేదీ నాటికి బ్యాంక్ డిపాజిట్లు భారీగా రూ.2.7 లక్షల కోట్లు క్షీణించాయి. ఒక్కసారిగా ఇలా బ్యాంక్ డిపాజిట్ల పెరుగుదల– క్షీణతలకు కారణమేమిటన్న అంశంపై ఎస్బీఐ రిసెర్చ్ దృష్టి సారించింది. నిజానికి దీపావళి వారంలో కరెన్సీ డిపాజిట్ల ఒడిదుడుకులకు కారణం ఏమిటన్నది నివేదిక దృష్టి సారించిన అంశం. స్టాక్ మార్కెట్ ర్యాలీ అంచనాలుసహా పలు అంశాలను నివేదిక ప్రస్తావించింది. స్టేట్ బ్యాంక్ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ ఈ నివేదికాంశాలను వెల్లడించారు. ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ►భారీ డిపాజిట్లు కేవలం కొన్ని సందర్భాల్లోనే చోటుచేసుకున్నాయి. 1997లో ఈ తరహా భారీ డిపాజిట్ల పరిణామం చోటుచేసుకుంది. అటు తర్వాత 2016 నవంబర్ 25 వరకు అంటే పెద్ద నోట్ బ్యాన్ తర్వాత పక్షం రోజులలో రూ. 4.16 లక్షల కోట్ల డిపాజిట్లు జరిగాయి. అంతక్రితం 26 సెప్టెంబర్ 2016 వరకు జరిగిన పక్షం రోజుల్లో రూ. 3.55 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. 29 మార్చి 2019 నాటికి పక్షం రోజుల్లో రూ. 3.46 లక్షల కోట్లు డిపాజిట్లు జరిగాయి.అంతక్రితం ఏప్రిల్ 1, 2016తో ముగిసిన పక్షం రోజుల్లో రూ. 3.41 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. మళ్లీ అంత స్థాయిలో 2021 నవంబర్ 5తో ముగిసిన 15 రోజుల్లో భారీగా రూ.3.3 లక్షల కోట్ల డిపాజిట్లు జరిగాయి. ►2016 నవంబర్ 25తో ముగిసిన పక్షం రోజుల్లో జరిగిన భారీ డిపాజిట్లు (రూ.4.16 లక్షల కోట్లు) పెద్ద నోట్ల రద్దు ప్రభావమన్నది సుస్పష్టం. అదే ఏడాది ఏప్రిల్ 1తో ముగిసిన పక్షం రోజుల్లో జరిగిన డిపాజిట్లు (రూ.3.41 లక్షల కోట్లు) సీజనల్ సంవత్సరాంత అధిక డిపాజిట్లుగా భావించవచ్చు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మూడు నెలల ముందు (26 సెప్టెంబర్ 2016 వరకు జరిగిన పక్షం రోజుల్లో రూ. 3.55 లక్షల కోట్ల డిపాజిట్లు) భారీ డిపాజిట్లు జరగడం గమనార్హం. ►డిపాజిట్లు, ఉపసంహరణల్లో భారీ ఒడిదుడుకుల పరిస్థితులు లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) నిర్వహణ, ఆర్థిక స్థిరత్వం లేదా డిజిటలైజేషన్ ద్వారా కస్టమర్ చెల్లింపు అలవాట్లలో ప్రవర్తనా ధోరణిలో మార్పు వంటి అంశాలను నిశితంగా గమనించాల్సిన అవసరాన్ని ప్రతిబింబిస్తోంది. ►కంపెనీల ఐపీఓలు, స్టాక్ మార్కెట్లు భారీగా పెరగవచ్చన్న అంచనాలు నవంబర్ 5తో ముగి సన పక్షం రోజుల్లో డిపాజిట్లు భారీగా పెరగడానికి కారణం కావచ్చు. అటువంటి ర్యాలీ కార్యరూపం దాల్చకపోవడంతో డిపాజిట్లు భారీగా వెనక్కు మళ్లి ఉండచచ్చు. ►ఎన్ఎస్ఈ డేటా ప్రకారం, 2021 సెప్టెంబర్‌లో నెలవారీ ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 15.6 లక్షలకు చేరింది. 2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య దాదాపు 50 లక్షల మం ది అదనపు కొత్త ఇన్వెస్టర్లు రిజిస్టర్ అయ్యారు. ►బ్యాంకుల్లో భారీ డిపాజిట్ల నేపథ్యంలో స్థిర రివర్స్ రెపో విండో (బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయడానికి ఉద్దేశించింది. దీనిపై వడ్డీరేటు ప్రస్తుతం 3.35 శాతం) మొత్తాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 19న రివర్స్ రెపో పరిమాణం 0.45 లక్షల కోట్లయితే, నవంబర్ 19 నాటికి ఈ పరిమాణం రూ.2.4 లక్షల కోట్లకు ఎగసింది. 2021 డిసెంబర్ 1 వరకూ ఈ పరిమాణం దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ►2021 నవంబర్ 19 నుంచి 2022 మార్చి 25 వరకూ బ్యాంకుల్లో డిపాజిట్లు, రుణ వృద్ధి రూ. 5 లక్షల కోట్లమేర నమోదయితే, 2021–22 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల వృద్ధి దాదాపు 12 శాతంగా, రుణ వృద్ధి 8.5 శాతంగా ఉంటుంది. -
బంగారం ఎలా ఉన్నా మెరుస్తుంది..!
ఏటా పండుగల సమయంలో బంగారం ఆభరణాలను కొనే సంప్రదాయాన్ని కొందరు అనుసరిస్తుంటారు. మరికొందరు కష్టార్జితం నుంచి ఆదా చేసుకున్న మొత్తంతో బంగారం ఆభరణాలను కొని పెట్టుకుంటారు. కొందరు అవసరం లేకపోయినా కానీ, క్లిష్ట సమయాల్లో ఆదుకుంటుందనో.. భవిష్యత్తులో తమ వారసులకు ఆస్తి రూపంలో వెళుతుందన్న ఉద్దేశంతో బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు కూడా చూడాలి. అవసరమైన మేర బంగారం ఆభరణాలను కలిగి ఉండడం తప్పుకాదు. కానీ, పరిమితికి మించి, పెట్టుబడుల కోసమని బంగారాన్ని పోగు చేసుకుంటుంటే.. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన రిస్క్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, పెట్టిన ప్రతీ రూపాయికి తగిన విలువను ఆభరణం రూపంలో పొందుతున్నామా? అని కూడా ప్రశ్నించుకోవాల్సిందే. పెట్టుబడుల కోసం, అత్యవసర సందర్భాల్లో ఆదుకుంటుందన్న భరోసా కోసం బంగారం కొనే వారికి.. భౌతిక బంగారం కాకుండా మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి గురించి సమగ్రంగా తెలియజేసే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ బంగారం ఈటీఎఫ్‌లు అన్నవి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అందిస్తున్నవి. ఇవి ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో స్టాక్స్ మాదిరే రోజువారీగా ట్రేడ్ అవుతుంటాయి. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా.. అందుబాటులోని డిజిటల్ మార్గాల్లో ఎస్జీబీ తర్వాత అత్యంత మెరుగైన సాధనం ఇది. ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. కానీ, గోల్డ్ ఈటీఎఫ్‌లకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఎందుకంటే షేర్ల మాదిరే గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లు ఇన్వెస్టర్ల ఖాతాలోకి వచ్చి చేరతాయి. డీమ్యాట్ ఖాతా కోసం కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే డీమ్యాట్ ఖాతా ఉన్న వారికి ఇది సులభమైన మార్గం అవుతుంది. ఎస్‌జీబీలో మాదిరే ఇక్కడ కూడా ఒక యూనిట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఒక యూనిట్ ఒక గ్రాముకు సమానం. గరిష్ట పెట్టుబడుల పరిమితి లేదు. వ్యయాలు: స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడవుతాయి కనుక కొనుగోలుపై బ్రోకరేజీ, ఎక్సేంజ్ చార్జీలు ఉంటాయి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవు. అలాగే, గోల్డ్ ఈటీఎఫ్‌లను మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తుంటాయి కనుక ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. పెట్టుబడుల విలువపై దీన్ని ఫండ్స్ వసూలు చేస్తుంటాయి. ఉదాహరణకు ఎస్బీఐ ఈటీఎఫ్ గోల్డ్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.51 శాతంగా ఉంది. ఏ ట్రేడింగ్ రోజైనా గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేసుకోవచ్చు, విక్రయించుకోవచ్చు. ఎస్‌జీబీలో మాదిరే లాభాలపై పన్ను అమలవుతుంది. రిస్క్: ఇన్వెస్టర్ కొనుగోలు చేసే ప్రతీ గోల్డ్ ఈటీఎఫ్‌కు సరిపడా బంగారాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కొనుగోలు చేస్తాయి. వాటిని వాల్ట్‌ల్లో నిల్వ చేస్తాయి. సెబీ నమోదిత కస్టోడియన్లు.. ఇలా గోల్డ్ ఈటీఎఫ్‌లకు సరిపడా బంగారాన్ని ఫండ్స్ సంస్థలు కొనుగోలు చేస్తుందీ, లేనిదీ పర్యవేక్షిస్తాయి. ఆడిటింగ్ కూడా ఉంటుంది. ఈ వివరాలను స్టాక్ ఎక్సేంజ్‌లు, సెబీకి కూడా సమర్పించాల్సి ఉంటుంది. కనుక ఇందులో రిస్క్ దాదాపుగా ఉండదు. కానీ, ఒక అంశాన్ని ఇన్వెస్టర్లు తప్పకుండా గుర్తు ంచుకోవాలి. స్టాక్స్ మాదిరే బంగారం ఈటీఎఫ్ ధరలు కూడా రోజువారీగా అంతర్జాతీయ ధరలను అనుసరించి హెచ్చు, తగ్గులకు గురవుతుంటాయి. కొనుగోలు చేసిన తర్వాత నష్టం కనిపిస్తే విక్రయిం చడం వంటి చర్యలు ఇందులో అనుకూలించవు. లిక్విడిటీ: సుమారు 13 గోల్డ్ ఈటీఎఫ్‌లు ఎన్ఎస్ఈలో లిస్ట్ అయి ఉండగా.. 11 గోల్డ్ ఈటీఎఫ్‌లు బీఎస్ఈలో అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వీటి అన్నింటిలోనూ చురుకైన ట్రేడింగ్ ఉండడం లేదు. కనుక ఎంపిక చేసుకునే ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ పరిమాణం ఆరోగ్యకర స్థాయిలో ఉన్నదీ, లేనిదీ ఇన్వెస్టర్లు ముందుగానే పరిశీలించుకోవాలి. లిక్విడిటీ ఎక్కువగా ఉన్న ఈటీఎఫ్‌ను ఎంపిక చేసుకుంటే విక్రయించుకోవడం సులభం అవుతుంది. నిప్పన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్, హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్‌లను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంది. అదే సమయంలో ట్రేడింగ్ కూడా ఎక్కువ పరిమాణంలో నమోదవుతుంటుంది. సార్వభౌమ బంగారం బాండ్ పసిడిని పోగు చేసుకోవాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఎన్నో మార్గాల్లో సౌర్వభౌమ బంగారం బాండ్ (ఎస్జీబీ) అత్యంత మెరుగైనది. ఇందులో పెట్టే ప్రతీ రూపాయికి భారత సర్కారు హామీ ఉంటుంది. ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను ఏటా పలు పర్యాయాలు ఇష్యూ చేస్తుంటుంది. ఈ బాండ్ గ్రాముల రూపంలో లభిస్తుంది. కనీసం ఒక గ్రాము నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. 2015 నవంబర్ నుంచి ఎస్జీబీలను ఆర్బీఐ విడుదల చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు, జనవరి 10 నుంచి 14వరకు, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4వ తేదీ మధ్య తదుపరి ఇష్యూలు అందుబాటులోకి రానున్నాయి. ఇష్యూ సమయంలో మార్కెట్ రేటు ఆధారంగా ఒక్కో గ్రాము రేటును ఆర్బీఐ ప్రకటిస్తుంది. ఎనిమిదేళ్ల కాల వ్యవధి తర్వాత అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా ఇన్వెస్టర్‌కు చెల్లింపులు చేస్తారు. అంతేకాదు. బంగారం పెట్టుబడి పెట్టేనాటి విలువపై 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ ఆదాయం కూడా ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేసిన వారు అందుకోవచ్చు. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం చెల్లిస్తారు. కొనుగోలు మార్గాలు: ఆర్బీఐ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టల్ కార్యాలయాలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌సీఐఎల్) శాఖలు, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టాక్ ఎక్సేంజ్‌లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నుంచి నేరుగా, స్టాక్ ఎక్సేంజ్‌ల సభ్యులైన బ్రోకర్ల రూపంలోనూ కొనుగోలు చేసుకోవచ్చు. ఆర్బీఐ తాజా ఇష్యూల సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే క్రితం ఇష్యూలకు సంబంధించిన ఎస్‌జీబీలు స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడ్ అవుతుంటాయి. వీటిల్లో ఏ ట్రేడింగ్ రోజైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆర్బీఐ ఇష్యూలో పాల్గొనే వారు.. ఎస్‌జీబీల కొనుగోలుకు పాన్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఎస్జీబీలను డిమ్యాట్ ఖాతాలో ఉంచుకోవాలని భావిస్తే.. అప్పుడు డీపీ ఐడీ, క్లయింట్ ఐడీని కూడా దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. చెక్కు, డీడీ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపుల సాధనాల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. నగదుతోనూ కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, రూ.20,000కే ఈ పరిమితి ఉంది. ఇంతకుమించి కొనుగోలు చేయాలనుకుంటే డిజిటల్ మార్గంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 4 కిలోల వరకు బంగారం బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. వ్యయాలు: బంగారాన్ని డెరివేటివ్ మార్గంలో కలిగి ఉండే సాధనమే ఎస్జీబీ. భౌతిక రూపానికి బదులు డాక్యుమెంట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దీనివల్ల పెద్దగా వ్యయాలు ఏవీ ఉండవు. అదే బంగారం ఆభరణాలు అయితే తయారీ చార్జీలు, వెస్టేజీ చార్జీల రూపంలో కొంత నష్టపోవాలి. పైగా తిరిగి అవసరమైనప్పుడు ఆ బంగారాన్ని మార్పిడి చేసుకోవాలన్నా, విక్రయించుకోవాలన్నా మళ్లీ తరుగు తీసేస్తారు. ఈ విధంగా కొంత నష్టం. కొనుగోలు సమయంలో జీఎస్టీ చార్జీలు చెల్లించాలి. ఇటువంటివన్నీ ఎస్‌జీబీలు, ఇతర డిజిటల్ గోల్డ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆదా చేసుకోవచ్చు. పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలంటే: ఎస్జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ముందుగానే పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలనుకుంటే ఐదేళ్లు పూర్తయిన తర్వాత సాధ్యపడుతుంది. ఐదో ఏట ముగిసినప్పటి నుంచి ఏడాదికోసారి ఆర్బీఐ ప్రత్యేక విండో ద్వారా ఇందుకు అవకాశం కల్పిస్తుంది. విండో ప్రారంభానికి ముందు మూడు రోజుల సగటు బంగారం మార్కెట్ ధర ఆధారంగా కొనుగోలు ధరను ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఆలోపే వైదొగాలని అనుకుంటే స్టాక్ ఎక్సేంజ్‌ల్లో విక్రయించుకోవచ్చు. కాకపోతే స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ఒక్కోరోజు ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. పన్ను: ఎస్‌జీబీపై ఏటా లభించే 2.5 శాతం ఆదాయం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి పన్ను రిటర్నుల్లో చూపించాలి. ఇన్వెస్టర్ ఆదాయం ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎనిమిదేళ్ల కాల వ్యవధి ముగిసిన తర్వాత లభించే మూలధన లాభం (పెట్టుబడిపై సమకూరిన లాభం)పై పన్ను ఉండదు. ఒకవేళ ఎనిమిదేళ్లలోపే ఎస్జీబీని విక్రయిస్తే కనుక అప్పుడు పన్ను బాధ్యత వేర్వేరుగా ఉంటుంది. పెట్టబడి తేదీ నుంచి మూడేళ్లు నిండక ముందే విక్రయించితే.. లాభం స్వల్పకాలిక మూలధన లాభం అవుతుంది. ఇది ఇన్వెస్టర్ వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. మూడేళ్లు నిండిన తర్వాత విక్రయించిన సమయంలో వచ్చిన లాభం దీర్ఘకాలిక మూలధన లాభం అవుతుంది. అప్పుడు లాభంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్ బంగారాన్ని డిజిటల్ రూపంలో ఫిన్‌టెక్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. బంగారంలో పెట్టుబడులకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాధనం ఇది. ఎంఎంటీసీ పీఏఎంపీ, సేఫ్గోల్డ్, అగ్మాంట్ గోల్డ్ అనే మూడు సంస్థలు డిజిటల్ గోల్డ్‌ను నేరుగాను, ఫిన్‌టెక్ సంస్థల ద్వారా అందిస్తున్నాయి. కొనుగోలు చేసిన విలువకు సరిపడా డిజిటల్ గోల్డ్ ఇన్వెస్టర్ ఖాతాలో ఉంటుంది. దీనికి అంతే విలువైన భౌతిక బంగారాన్ని పైన చెప్పుకున్న మూడు సంస్థలు కొనుగోలు చేసి వాల్టుల్లో ఉంచుతాయి. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే.. ఇన్వెస్టర్ తనకు అవసరనుకుంటే బంగారాన్ని భౌతిక రూపంలోడెలివరీ తీసుకోవచ్చు. లేదంటా ఆభరణాలుగానూ మార్చుకోవచ్చు. రిస్క్: ఎస్‌జీబీలపై ఆర్బీఐ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. అలాగే, గోల్డ్ ఈటీఎఫ్‌లపై సెబీ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. కానీ, డిజిటల్ గోల్డ్‌పై ప్రస్తుతానికి నియంత్రణల్లేవు. ఇటీవలి వరకు స్టాక్‌బ్రోకర్లు, వెల్త్‌మేనేజ్‌మెంట్ సంస్థలు సైతం డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేశాయి. కానీ, దీనికి దూరంగా ఉండాలని సెబీ ఆదేశించింది. డిజిటల్ గోల్డ్‌లో క్రయ, విక్రయ లావాదేవీల సేవలు 2021 సెప్టెంబర్ 10 నుంచి అందించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎంఎంటీసీ పీఏఎంపీ, సేఫ్గోల్డ్, అగ్మాంట్ గోల్డ్ అన్నవి ట్రస్టీలు. భౌతిక బంగారాన్ని ఇవి కొనుగోలు చేసి, నిల్వ చేస్తున్నాయా అన్న దానిపై క్రమం తప్పకుండా ఆడిట్లు నడుస్తుంటాయి. ఎస్జీబీ, గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే వీటిల్లో రిస్క్ ఎక్కువ. కొనుగోళ్లు: రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకుంటే.. ఈ మూడు సంస్థల వెబ్సైట్ల నుంచి నేరుగాను, వీటితో భాగస్వామ్యం కలిగిన సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గూగుల్‌పే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, కాయిన్‌బజార్ తదితర భాగస్వామ్య సంస్థలు సైతం డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఆయా సంస్థలకు కేవైసీ వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సంస్థలు, ఆధార్, పాన్ తప్పనిసరిగా అడుగుతున్నాయి. ఎస్జీబీ, గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఒక గ్రాము నుంచే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, డిజిటల్ గోల్డ్ అయితే రూపాయితోనూ కొనుగోలు చేసుకోగల సౌలభ్యం ఉంది. సేఫ్గోల్డ్ కనీసం రూ.10 మొత్తంతో కొనుగోలుకు అనుమతిస్తోంది. వ్యయాలు: కొనుగోలు విలువపై 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు కొనుగోలు ధరలో కలసి ఉంటాయి. ఎంఎంటీసీ పీఏఎంపీ అయితే 2.9 శాతం పేమెంట్ గేట్‌వే చార్జీలను కూడా తీసుకుంటోంది. డిజిటల్ గోల్డ్‌కు మొదటి ఐదేళ్లు స్టోరేజీ చార్జీలు ఉండవు. ఐదేళ్ల తర్వాత నుంచి సేఫ్గోల్డ్ అప్పటి విలువపై 0.24 శాతం, ఎంఎంటీసీ పీఏఎంపీ 0.4 శాతం చొప్పున స్టోరేజీ చార్జీలను వార్షికంగా వసూలు చేస్తున్నాయి. భౌతిక రూపంలో బంగారాన్ని డెలివరీ తీసుకోవాలంటే అందుకు తయారీ చార్జీలు, డెలివరీ చార్జీలను భరించాలి. మరో అంశం.. కొనుగోలు ధర, అమ్మకం ధర మధ్య వ్యత్యాసం ఇక్కడ సాధారణంగా అమలవుతుంటుంది. ఈ రూపంలోనూ ఇన్వెస్టర్లు కొంత నష్టపోవాల్సి ఉంటుంది. కాలవ్యవధి: ఆగ్మంట్ ఐదేళ్లు, సేఫ్గోల్డ్ పదేళ్లను మెచ్యూరిటీ పీరియడ్‌గా అమలు చేస్తున్నాయి. ఎంఎంటీసీ పీఏఎంపీ ఇటువంటి నిబంధన అమలు చేయడం లేదు. కాల వ్యవధి తర్వాత విక్రయించుకోవవచ్చు. లేదంటే బంగారం బార్లు, కాయిన్లు, లేదా ఈ సంస్థలో ఒప్పందం కలిగిన జ్యుయలర్స్ నుంచి బంగారం ఆభరణాల రూపంలో డెలివరీ తీసుకోవచ్చు. టాటా గ్రూపులో భాగమైన తనిష్క్.. సేఫ్‌గోల్డ్‌తో ఒప్పందం చేసుకుంది. సేఫ్గోల్డ్ వద్ద డిజిటల్ గోల్డ్‌ను కలిగిన వారు.. తమకు కావాలనుకున్నప్పుడు సమీపంలోని తనిష్క్ స్టోర్‌కు వెళ్లి ఆభరణాలుగా మార్చుకోవచ్చు. ఇందుకు తయారీ, ఇతర చార్జీలు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్‌లోనూ పన్ను బాధ్యత ఎస్‌జీబీల్లో మాదిరే ఉంటుంది. గోల్డ్ ఫండ్స్ ఇవి ఒక రకం మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకని వీటిని ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పోర్టళ్ల నుంచి నేరుగా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మార్గంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు. అలాగే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా అయితే డిస్ట్రిబ్యూటర్ల కమీషన్ రూపంలో అదనపు చార్జీని భరించాల్సి వస్తుంది. ఇది విడిగా ఉండదు కానీ, ఎక్స్పెన్స్ రేషియోలోనే కలుస్తుంది. వీటి కొనుగోలుకు పాన్, ఆధార్ నంబర్, చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలను ఇవ్వాలి. ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి ఉంటే తాజాగా కేవైసీ వివరాలను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీ పాన్, ఆధార్ వివరాల ఆధారంగా సెంట్రల్ కేవైసీ డేటాబేస్ నుంచి ఫండ్ సంస్థే వివరాలు తీసుకుంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల కొనుగోలుకు తక్కువలో తక్కువ రూ.4,000కుపైనే పెట్టుబడి అవసరం. కానీ, గోల్డ్ ఫండ్స్ పథకాల్లో రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వ్యయాలు/పన్నులు: ఫండ్ ఆఫ్ ఫండ్ కనుక వ్యయాలు రెండింతలు ఉంటాయి. గోల్డ్ ఫండ్స్ తన నిర్వహణలోని పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక.. అక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఒకటి అమలవుతుంది. తిరిగి గోల్డ్ ఫండ్స్ కూడా ఎక్స్పెన్స్ రేషియో వసూలు చేస్తాయి. పెట్టుబడి పెట్టిన ఏడాదిలోపు విక్రయించితే ఎగ్జిట్ లోడ్ కూడా అమలవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పోర్టళ్ల నుంచే కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. విక్రయించిన తర్వాత మీ రిజిస్టర్డ్ బ్యాంకు ఖాతాకు ఆ మొత్తం జమ అవుతుంది. బంగారంలో పెట్టబడులు అన్నింటికీ పైన ఎస్‌జీబీలో చెప్పుకున్నట్టే పన్ను బాధ్యతలు వర్తిస్తాయి. గోల్డ్ ఫండ్స్‌లో ఉన్న ఒక అనుకూలత ఏమిటంటే.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనీస సిప్ రూ.100 నుంచి పెట్టుకోవచ్చు. పైగా డీమ్యాట్ ఖాతా కూడా అవసరం లేదు. గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడవుతాయి. కనుక విక్రయించుకునేందుకు సరిపడా వ్యాల్యూమ్ అవసరం. అదే గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఈ విధమైన లిక్విడిటీ రిస్క్ లేదు. మీరు ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. ఫండ్స్ సంస్థలు నిబంధనలకు అనుగుణంగా మీకు చెల్లింపులు చేస్తాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్, ఎస్బీఐ గోల్డ్ ఫండ్లను ఈ విభాగంలో ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో 0.50 శాతం వరకు ఉంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని పథకాలు కనుక సెబీ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటుంది. -
‘లక్ష కోట్ల’ కంపెనీలు జూమ్
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విడిచిపెట్టనప్పటికీ స్టాక్ మార్కెట్లు లెక్కచేయడం లేదు. ప్రధానంగా దేశీ స్టాక్ ఇండెక్సులు రేసు గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లకు జతగా రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు క్యూ కట్టడం లిస్టెడ్ కంపెనీలకు జోష్‌నిస్తోంది. ఫలితంగా బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 250 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది. దీంతో మార్కెట్ క్యాప్‌లో రూ. లక్ష కోట్ల విలువను అందుకుంటున్న కంపెనీలు పెరుగుతున్నాయ్! వివరాలు చూద్దాం.. ముంబై: గతేడాది మార్చిలో విరుచుకుపడిన కోవిడ్–19తో స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలినప్పటికీ తిరిగి వెనువెంటనే నిలదొక్కుకున్నాయి. ఆపై భారీ లిక్విడిటీ, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు మార్కెట్లకు హుషారునిచ్చాయి. ఇటీవల రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రికార్డులు స్థాయిలో పెట్టుబడులకు దిగుతుండటంతో సెంటిమెంటు మరింత బలపడింది. ఈ ప్రభావంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తాజాగా(ఆగస్ట్ 31కల్లా) 57,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. మరోపక్క ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 17,000 పాయింట్ల మార్క్‌ను సులభంగా దాటేసింది. ఈ ప్రభావంతో పలు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మెరుగుపడుతోంది. వెరసి తాజాగా రూ. లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన కంపెనీల జాబితా 47కు చేరింది. 2021లోనే కొత్తగా 19 కంపెనీలు జత కలవడం విశేషం! కొనసాగిన జాబితా మార్కెట్ విలువ రీత్యా గతేడాది(2020) రూ. లక్ష కోట్ల క్లబ్లో 28 సంస్థలు చోటు సాధించాయి. ఈ బాటలో కొత్తగా టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, డాబర్, గోద్రెజ్ కన్జూమర్ తదితరాలు చేరాయి. వీటితోపాటు గతేడాది ఈ జాబితాలో గల కంపెనీలు కూడా తమ పొజిషన్లను నిలుపుకోవడం గమనించదగ్గ అంశం! యూఎస్‌సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీ ప్యాకేజీలు అమలు చేయడంతో పెరిగిన లిక్విడిటీ, దేశీ ఆర్థిక వ్యవస్థపట్ల బలపడుతున్న అంచనాలు మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. పీఎస్‌యూలు సైతం ఏడాది కాలాన్ని పరిగణిస్తే సెన్సెక్స్ 20 శాతం పుంజుకోగా.. ప్రభుత్వ రంగ సంస్థల ఇండెక్స్ 32 శాతం ఎగసింది. దీంతో రూ. ట్రిలియన్ విలువైన పీఎస్‌యూ దిగ్గజాల జాబితాలో ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ జత కలిశాయి. ప్రభుత్వ బ్లూచిప్ కంపెనీలు స్టేట్‌బ్యాంక్, ఓఎన్జీసీ ఇప్పటికే జాబితాకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విదితమే. కాగా.. ఇటీవల మార్కెట్ విలువలో ఎస్బీఐ 49 శాతం, ఓఎన్జీసీ 24 శాతం చొప్పున జంప్ చేశాయి. ట్రిలియన్ క్లబ్లో చేరిన పీఎస్‌యూలు.. వేల్యూ స్టాక్స్‌కు లభిస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ వాటాల విక్రయం, ఆస్తుల మానిటైజేషన్, పునరుత్పాదక ఇంధనాలకు డిమాండ్ సైతం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. అదానీ, టాటాల స్పీడ్ రూ. ట్రిలియన్ మార్కెట్ క్యాప్ క్లబ్లో ఐదు కంపెనీల ద్వారా అదానీ గ్రూప్ అగ్రస్థానం వహిస్తోంది. ఈ బాటలో టాటా గ్రూప్ సైతం నాలుగు కంపెనీలతో రెండో ర్యాంకును ఆక్రమించింది. అయితే విడిగా విలువ రీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ. 14.32 లక్షల కోట్లు), టీసీఎస్(రూ. 14 లక్షల కోట్లు) తొలి రెండు ర్యాంకులలో నిలుస్తున్నాయి. ఈ ఏడాది మార్కెట్ విలువను భారీగా జమ చేసుకున్న కంపెనీలలో టీసీఎస్(రూ.2.8 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్(రూ. 2 ట్రిలియన్లు), రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ. 1.7 లక్షల కోట్లు), విప్రో(రూ. 1.2 లక్షల కోట్లు) ఆధిపత్యం వహిస్తున్నాయి. -
ఆర్బీఐ రుణ చికిత్స!
ముంబై: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలను ఆదుకునేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. వ్యక్తులు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎస్ఎంఈలు) తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు మరింత సమయం ఇచ్చింది. రుణాలను రెండేళ్ల కాలానికి పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది. టీకాల తయారీ సంస్థలు, ఆస్పత్రులు, ల్యాబొరేటరీలు, కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్య రంగం కింద రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతించింది. ఇందు కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా రూ.50,000 కోట్ల లిక్విడిటీని(నిధుల లభ్యత) అందించనుంది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద రాష్ట్ర ప్రభుత్వాలు నిధు లు పొందేందుకు ఉద్దేశించిన నిబంధనలను వచ్చే సెప్టెంబర్ 30వరకు సడలించింది. ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు కార్యక్రమం(జీ–సాప్) కింద 2 వారాల్లో రూ.35,000 కోట్లకు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఆర్బీఐ మధ్యంతర నిర్ణయాలను ఆయన బుధవారం ప్రకటించారు. మారటోరియం కాదు.. రుణ పునరుద్ధరణే వాస్తవానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలు ఒక్క విడత రుణ మారటోరియంను మూడు నెలలకు కల్పించాలని ఆర్బీఐని ఇటీవలే కోరాయి. కానీ, ఒక్క విడత రుణ పునరుద్ధరణకు.. అది కూడా రూ.25 కోట్ల వరకు రుణాలకే అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ నిర్ణయించింది. గతేడాది రుణ మారటోరియం ముగిసిన తర్వాత రుణాల పునరుద్ధరణ అవకాశాన్ని వినియోగించుకోని వాటికే ప్రస్తుతం ఈ సదుపాయం రెండేళ్ల కాలానికి లభిస్తుంది. 2021 మార్చి వరకు స్టాండర్డ్ ఖాతాలుగా (సక్రమంగా చెల్లింపులు చేస్తున్న) ఉన్న వాటికి ఈ వెసులుబాటు పరిమితం. 90 శాతం రుణ గ్రహీతలు ఇందుకు అర్హత సాధిస్తారని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంచనా. రూ.50,000 కోట్ల సాయం.. ఆరోగ్య సేవలు, సదుపాయాల రంగంలో ఉన్న కంపెనీలకు రూ.50,000 కోట్లతో ఆన్‌ట్యాప్ లిక్విడిటీ విండోను ఆర్బీఐ ప్రకటించింది. కంపెనీలు దరఖాస్తు చేసుకుంటే బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం దీనికింద లభిస్తుంది. రెపో రేటుపై, మూడేళ్ల కాల వ్యవధికి రుణాలు అందిస్తామని.. ఈ విండో 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని శక్తికాంతదాస్ చెప్పారు. బ్యాంకులు ఈ పథకం కింద టీకాల తయారీ కంపెనీలు, టీకాల దిగుమతి దారులు, సరఫరాదారులు, వైద్య పరికరాలు, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, పాథాలజీ ల్యాబ్‌లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల తయారీదారులు, సరఫరాదారులు, కరోనా సంబంధిత ఔషధ దిగుమతిదారులు, లాజిస్టిక్స్ సంస్థలకు తాజా రుణాలను మంజూరు చేయవచ్చు. వీటిని ప్రాధాన్య రంగ రుణాలుగా ఆర్బీఐ పరిగణిస్తుంది. ఈ పథకం కింద మంజూరు చేసే రుణాలతో ప్రత్యేక పుస్తకాన్ని బ్యాంకులు నిర్వహించొచ్చు. బ్యాంకులు తమ దగ్గర మిగులుగా ఉన్న నిధులను కరోనా రుణ పుస్తక పరిమాణం స్థాయిలో ఆర్బీఐ వద్ద ఉంచడం ద్వారా.. రెపో రేటు కంటే 0.25% తక్కువగా వడ్డీని పొందొచ్చు. రూ.35,000 కోట్లతో జీ–సెక్యూరిటీలు ఈ నెలలోనే రూ.35,000 కోట్లతో ప్రభుత్వ సెక్యూరిటీలను (జీ–సెక్‌లు) ఆర్బీఐ కొనుగోలు చేయనుంది. ఆర్బీఐ గత నెలలోనూ రూ.25,000 కోట్లకు జీ–సెక్లను కొనుగోలు చేయడం గమనార్హం. పదేళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్‌ను 6 శాతంలోపునకు తీసుకొచ్చే లక్ష్యంతో, ప్రభుత్వ వృద్ధి కార్యక్రమాలకు మద్దతునిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. జీ–సెక్ ఈల్డ్స్ తగ్గితే ప్రభుత్వానికి ఉపశమనం లభించినట్టే. కేవైసీ విషయంలో ఇబ్బంది పెట్టొద్దు బ్యాంకులు, నియంత్రిత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు 2020 డిసెంబర్ చివరికి కేవైసీ (కస్టమర్ గురించి తెలుసుకోవడం) వివరాలను అప్డేట్ చేయని కస్టమర్ల విషయంలో కఠిన చర్యలకు దిగొద్దని ఆర్బీఐ కోరింది. ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు ఈ అవకాశం కల్పించింది. అలాగే, వీడియో కేవైసీకి అనుమతించింది. 250 మందితో క్వారంటైన్ కేంద్రం కరోనా సంక్షోభంలో కీలక కార్యకలాపాలకు విఘాతం కలగకుండా ఆర్బీఐ ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 250 మంది సిబ్బంది ఈ కేంద్రంలోనే ఉంటూ కీలక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు శక్తికాంతదాస్ తెలిపారు. ఎస్‌ఎఫ్‌బీలకు 10వేల కోట్లు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు (ఎస్ఎఫ్బీలు) ప్రత్యేక దీర్ఘకాలిక రెపో ఆపరేషన్స్ విండో (ఎస్‌ఎల్‌టీఆర్‌వో)ను సైతం దాస్ ప్రకటించారు. ‘‘ప్రస్తుత కరోనా తీవ్రతతో ఎక్కువగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మరింత మద్దతు అందించేందుకు ప్రత్యేకంగా మూడేళ్ల కాల వ్యవధిపై రూ.10,000 కోట్లకు ఎస్‌ఎల్‌టీఆర్‌వో నిర్వహించాలని నిర్ణయించాం. రెపో రేటుకే ఎస్‌ఎఫ్‌బీలకు ఈ నిధులు అందిస్తాం’’ అని దాస్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే, రూ.500 కోట్ల వరకు ఆస్తులు కలిగిన సూక్ష్మ రుణ సంస్థలకు ఎస్ఎఫ్బీలు అందించే రుణాలను ప్రాధాన్యరంగ రుణాలుగా పరిగణిస్తామని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. భవిష్యత్తుపై ఎంతో అనిశ్చితి భవిష్యత్తు ఆర్థిక వృద్ధిపై ఎంతో అనిశ్చితి నెలకొందన్నారు దాస్. తాజా సంక్షోభాన్ని ఎదుర్కోగల బలమైన మూలాలపై భారత్ ఉందని అభిప్రాయపడ్డారు. వృద్ధి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు అంగీకరించారు. ‘‘భారత్ బలంగా కోలుకునే క్రమంలో సానుకూల వృద్ధిలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ కర్వ్ వంగిన కొన్ని వారాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా కారణంగా ఏర్పడే పరిస్థితులను ఆర్బీఐ అనుక్షణం పరిశీలిస్తూ అవసరం ఏర్పడితే అన్ని రకాల వనరులను, అసాధారణ సాధనాలను ఆచరణలోకి తీసుకొస్తుంది’’ అని శక్తికాంతదాస్ చెప్పారు. సాధారణ నైరుతి రుతుపవనాలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉపశమిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డిమాండ్ తగ్గుదల కొంతే... డిమాండ్‌పై లాక్డౌన్ల ప్రభావం గతేడాదితో పోలిస్తే మోస్తరుగానే ఉంటుందని శక్తికాంతదాస్ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తాత్కాలికంగా తగ్గిపోవచ్చని, ముఖ్యంగా రిటైల్, ఆతిథ్య రంగాల్లో ఈ పరిస్థితులు ఉంటాయని చెప్పారు. మొత్తం మీద కీలక గణాంకాలు మిశ్రమ సంకేతాలను ఇస్తున్నట్టు పేర్కొన్నారు. సకాలంలో సరైన నిర్ణయాలు ఆర్బీఐ ప్రకటించిన నిర్ణయాలను నిపుణులు, పరిశ్రమ వర్గాలు ఆహ్వానించాయి. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతున్న క్రమంలో సకాలంలో సరైన నిర్ణయాలను ప్రకటించినట్టు పేర్కొన్నాయి. ఆరోగ్యసంరక్షణ, అనుబంధ రంగాలు పెరిగిన డిమాండ్‌తో, సరఫరా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రూ.50వేల కోట్లతో ఆన్‌టాప్ లిక్విడిటీని ప్రకటించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చేదిగా సీఐఐ పేర్కొంది. ‘చిన్న వ్యాపార సంస్థలు, ఫైనాన్షియల్ సంస్థలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న భారాన్ని ఆర్బీఐ చాలా వరకు గుర్తించింది. వారికి మద్దతుగా చర్యలను ప్రకటించింది. లకి‡్ష్యత వర్గాలను ఉద్దేశించిన చర్యలు ప్రస్తుత తరుణంలో ఎంతో అనుకూలమైనవి’ అని అసోచామ్ వ్యాఖ్యానించింది. పలు రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను తగ్గించే లక్ష్యంతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అనూహ్యమైన నిర్ణయాలు ప్రకటించారు. ప్రకటించిన చర్యలు వినూత్నంగా ఉన్నాయి. కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు రూ.50,000 కోట్ల ప్రత్యేక నిధి ప్రకటించడం అన్నది ఆర్థిక ఆరోగ్యమే కాదు, ప్రజారోగ్యం ఎదుర్కొంటున్న సమస్యలపైనా దృష్టి పెట్టినట్టుంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ సరైన సమయంలో ప్రకటించిన లిక్విడిటీ చర్యలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న వర్గాలకు ఉపశమనం కల్పిస్తాయి. వ్యక్తులు, చిన్న పరిశ్రమలకు నిధులు లభించేలా చేస్తాయి. – శక్తి ఏకాంబరం, కోటక్ మహీంద్రా బ్యాంకు గ్రూపు ప్రెసిడెంట్ దిగజారుతున్న పరిస్థితులకు స్పందనగా ఆర్బీఐ.. వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు తీసుకున్న రూ.25 కోట్ల వరకు రుణాలను ఒక్కసారి పునరుద్ధరించుకునే అవకాశాన్నిచ్చింది. గతేడాది ఇచ్చిన మారటోరియంతో పోలిస్తే ఈ చర్య చిన్నదే. పునరుద్ధరించుకునే రుణాల పరిమాణం తక్కువగానే ఉంటుంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత దిగజారే అవకాశం ఉందని ఈ చర్యలు తెలియజేస్తున్నాయి. – మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ -
సరళతర విధానాలను వెనక్కుతీసుకోలేం!
ముంబై: కరోనా మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి గడచిన తొమ్మిది నెలలుగా తీసుకున్న లిక్విడిటీ (వ్యవస్థలో ద్రవ్య లభ్యత) తదితర సరళతర ద్రవ్య విధానాలను ఇప్పుడే వెనక్కు తీసుకోలేమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ స్పష్టం చేశారు. ఇటువంటి నిర్ణయాల వల్ల ఎటువంటి ఫలితం లభించకపోగా, ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న రికవరీ, వృద్ధి ధోరణులకు విఘాతం కలుగుతుందని ఆయన అన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీవరకూ మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కీలక సమావేశాల మినిట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. దీనిప్రకారం, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గించనప్పటికీ, వృద్ధికి దోహపడే అన్ని చర్యలనూ తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. క్యూ3, క్యూ4 కాలాల్లో ద్రవ్యోల్బణం వరుసగా 6.8 శాతం, 5.8 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. ఈ అంచనాల నేపథ్యంలో సరళతర వడ్డీరేట్ల విధానమే కొనసాగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. రెపో రేటు తగ్గించడం కష్టమే: నోమురా కాగా, కీలక రెపో రేటు 2021లోనూ తగ్గించడం కష్టమని జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా శుక్రవారంనాటి తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ తీవ్రంగా ఉందని పేర్కొన్న నోమురా, ఇదే తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. పైగా ద్రవ్యోల్బణం సమీప కాలంలో పెరిగే అవకాశాలూ లేకపోలేదని విశ్లేషించింది. ఇదే జరిగితే, 2022లో వడ్డీరేట్ల పెంపునకే ఆర్బీఐ పాలసీ కమిటీ మొగ్గుచూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అక్టోబర్‌లో 7.6 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 6.93 శాతానికి తగ్గింది. అయితే ఇది కూడా ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయి కన్నా అధికం కావడం గమనార్హం. దీనిప్రకారం ద్రవ్యోల్బణం 2–6 శాతం మధ్య ఉండాలి. పీఎమ్‌సీ బ్యాంకులో పెట్టుబడులకు నాలుగు ఆఫర్లు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎమ్‌సీ బ్యాంకు)లో పెట్టుబడులు పెట్టేందుకు నాలుగు సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్టు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. బ్యాంకుపై విధించిన ఆంక్షలను మార్చి 31 వరకు పొడిగించింది. బహుళ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎమ్‌సీ బ్యాంకులో 2019 సెప్టెంబర్‌లో స్కామ్ వెలుగులోకి రావడంతో ఆర్బీఐ పలు ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకు పునర్నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులను అందించేందుకు ఆసక్తి వ్యక్తీకరణలను గత నెలలో ఆహ్వానించగా.. నాలుగు ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నట్టు ఆర్బీఐకి పీఎమ్‌సీ బ్యాంకు సమాచారం ఇచ్చినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన ఆర్బీఐ బోర్డ్ ఆర్బీఐ 586వ సెంట్రల్ బోర్డ్ సమావేశం శుక్రవారం నాడు ముంబైలో జరిగింది. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు, భారత్‌పై దీని ప్రభావం, ఆర్థిక వ్యవస్థపై ఉద్దీపన, ద్రవ్య పరపతి విధాన చర్యల ఫలితాలపై గవర్నర్ నేతృత్వంలోని జరిగిన ఈ సమావేశం దృష్టి సారించింది. 2019–20లో భారత్ బ్యాంకింగ్ ధోరణి, పురోగతిపై ఒక ముసాయిదా నివేదికను కూడా చర్చించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక సేవల కార్యదర్శి దేబాషిస్ పాండా, డిప్యూటీ గవర్నర్లతోపాటు బోర్డ్ డైరెక్టర్లు, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
మార్కెట్లు కుమ్మేస్తున్నాయ్.. ఎన్నాళ్లీ జోరు?!
ఓవైపు ప్రపంచ దేశాలన్నిటినీ కరోనా వైరస్ కుదిపేస్తున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాలతో దూసుకెళుతున్నాయి. యూఎఎస్ ఇండెక్సులు చరిత్రాత్మక గరిష్టాలను అందుకోగా.. దేశీయంగానూ సెన్సెక్స్ 37,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఇక నిఫ్టీ 11,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. ఈ నేపథ్యంలో ఇకపై మార్కెట్ల దారెటు అన్న సందేహాలు ఇన్వెస్టర్లను మనసులను తొలుస్తున్నట్లు పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ), బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీవోఈ) తదితర కేంద్ర బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను నేలకు దించాయి. అంతేకాకుండా భారీ ప్యాకేజీల ద్వారా బిలియన్ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేస్తున్నాయి. తద్వారా కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌లతో నిలిచిపోయిన ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లకు ఆర్థిక రికవరీతోపాటు.. స్టాక్ మార్కెట్లపట్ల విశ్వాసం పెరుగుతున్నట్లు పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా జెఫరీస్ ఈక్విటీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ ఉడ్, ఫస్ట్ గ్లోబల్ విశ్లేషకులు శంకర్ శర్మ, ఎడిల్వీజ్ గ్రూప్ చైర్మన్ రాశేష్ షా వెల్లడించిన అభిప్రాయాలు, అంచనాల వివరాలు చూద్దాం.. క్రిస్ ఉడ్, జెఫరీస్ నిజానికి ఇండియాసహా వర్ధమాన దేశాలలోని ప్రజలకు కరోనా వైరస్ కంటే లాక్డవున్లే అత్యధికంగా చేటు చేస్తాయి. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లకు కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న విధానాలలో మార్పులే అతిపెద్ద రిస్క్‌గా చెప్పవచ్చు. సరళతర పాలసీల అమలు మార్కెట్లకు ప్రోత్సాహాన్నిస్తోంది. దేశీయంగా చూస్తే ఐటీ, ఫార్మా రంగాలను కీలకంగా పేర్కొనవచ్చు. వీటికి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు తక్కువే. అయితే ఆర్థిక మందగమనం, మొండి బకాయిలు దేశానికి సమస్యలు సృష్టించే వీలుంది. హౌసింగ్, నిర్మాణ రంగాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ లాక్‌డవున్ కారణంగా రియల్టీ మార్కెట్ దెబ్బతింటోంది. ఇతర పెట్టుబడి మార్గాలలో బంగారం మరింత మెరిసే వీలుంది. ఔన్స్ 1900 డాలర్లను అధిగమించవచ్చు. ఇటీవల వ్యాక్సిన్లపై పెరుగుతున్న అంచనాలు కృత్రిమతకు దారితీస్తున్నాయి. నిజానికి వ్యాక్సిన్ల అవసరం ఉన్నదని భావించడంలేదు. శంకర్ శర్మ, ఫస్ట్ గ్లోబల్ మార్కెట్ల ర్యాలీకి ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా సహకరిస్తోంది. ఇటీవల మార్కెట్ల మొత్తం ర్యాలీలో ఈ కౌంటర్ కీలకపాత్ర పోషించింది. ఒకే కౌంటర్‌పై ఆధారపడి మార్కెట్లు పరుగందుకుంటే ఆందోళనలు తలెత్తుతాయి. గత మూడు నెలల్లో చూస్తే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ, రియల్టీ కేటగిరీలో తొలుత ర్యాలీరాగా.. తదుపరి రిలయన్స్ వల్ల మార్కెట్ పురోగమించింది. ఇటీవల రిలయన్స్ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా మరింత బలపడటంతో ఈ షేరు చాలా వేగంగా దౌడు తీసింది. మూడు నెలల్లోనే రెట్టింపయ్యింది. దీంతో ఇకపై లాభాల స్వీకరణకు దారితీయవచ్చు. ఈ ఏడాది దేశీ మార్కెట్లు 24 శాతం క్షీణించాయి. ఇతర మార్కెట్లతో పోలిస్తే వెనుకబడ్డాయి. అయితే కొన్ని రంగాలలో అత్యంత ఆకర్షణీయమైన స్టాక్స్ ఉన్నాయి. అలాగని బుల్ మార్కెట్‌కు అవకాశంలేదు. కొన్ని స్టాక్స్ ఆధారంగా కదిలే మార్కెట్‌గా కనిపిస్తోంది. రాశేష్ షా, ఎడిల్వీజ్ గ్రూప్ స్వల్పకాలిక ఆర్థిక గణాంకాలను మార్కెట్లు పట్టించుకోవడం లేదు. మార్చి, ఏప్రిల్‌లో చూస్తే.. కరోనా వైరస్ కారణంగా అనూహ్య భయాలు నెలకొన్నాయి. ఇది ఎలా అంతమవుతుందన్న అంశాన్ని ఎవరూ ఊహించలేదు. అయితే లిక్విడిటీతో స్వల్పకాలిక ఒత్తిడి తొలగిపోయింది. స్వల్పకాలంలో లిక్విడిటీ ఆదుకోగా.. తదుపరి దశలో అంటే డిసెంబర్, జనవరికల్లా కోవిడ్-19కు తెరపడగలదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆర్థిక గణాంకాలు అంటే జీడీపీ, కంపెనీల ఫలితాలు వంటివి నిరాశపరుస్తాయన్నది తెలిసిన సంగతే. దీంతో ఆపై అంటే 2021 తదుపరి పరిస్థితులపట్ల ఇన్వెస్టర్లు ఆశావహంగా స్పందిస్తున్నారు. -
మార్కెట్ల ర్యాలీ- లిక్విడిటీ మాయ!
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిధులతోనే స్టాక్ మార్కెట్లకు జోష్వస్తున్నందటున్నారు మార్కెట్ల స్వతంత్ర విశ్లేషకులు ఆనంద్ టాండన్. దీంతో వాస్తవిక పరిస్థితులను విస్మరిస్తూ ఇండెక్సులు పరుగుతీస్తున్నట్లు చెబుతున్నారు. మార్కెట్ల తీరు, లిక్విడిటీ, కోవిడ్-19 ప్రభావం వంటి అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. చివరి దశ..? నిజానికి స్టాక్ మార్కెట్లు లిక్విడిటీ ప్రభావంతో పరుగుతీస్తున్నాయి. ఇందువల్లనే ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్స్సైతం ర్యాలీ చేస్తున్నాయి. కోవిడ్-19 ప్రభావాన్ని అడ్డుకునేందుకు పలుదేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న భారీ సహాయక ప్యాకేజీల కారణంగా చౌక నిధులు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రంగాల కంపెనీలు సైతం ఇటీవల జోరు చూపుతున్నాయి. ఉదాహరణకు టాటా గ్రూప్ దిగ్గజాలు ఇండియన్ హోటల్స్, టాటా మోటార్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. నిజానికి ఆతిథ్య రంగం, వాహన రంగాలు ఇంకా కోలుకోవలసి ఉంది. ఇక ట్రక్కుల విక్రయాలు ఊపందుకోనప్పటికీ అశోక్ లేలాండ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వీటిని పక్కనపెడితే.. పలు మిడ్, స్మాల్ క్యాప్స్ స్టాక్స్ భారీగా లాభపడుతున్నాయి. ఫండమెంటల్స్ లేదా కంపెనీల ఆర్జన మెరుగుపడే అంచనాలకంటే లిక్విడిటీ ప్రభావమే ఇందుకు సహకరిస్తోంది. ఆటో రంగాన్నే తీసుకుంటే.. వాణిజ్య వాహన విక్రయాలు వెనకడుగులో ఉన్నాయి. సీవీలు, కార్లతో పోలిస్తే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలకు డిమాండ్ కనిపించే వీలుంది. నిజానికి అండర్పెర్ఫార్మింగ్ కంపెనీల షేర్లు సైతం బలపడుతున్నాయంటేటే.. ర్యాలీ చివరి దశకు చేరినట్లు కొంతమంది విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే లిక్విడిటీ కారణంగా పరుగెడుతున్న మార్కెట్లలో ట్రెండ్‌కు అనుగుణంగా వ్యవహరించడమే మేలు. తద్వారా స్వల్పకాలంలో కొంతమేర లాభాలు ఆర్జించేందుకు వీలుంటుంది. అయితే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. దీర్ఘకాలంలోనూ నిజానికి మార్కెట్లను అధిక సమయాలలో లిక్విడిటీనే నడిపిస్తుంటుంది. గత ఐదు, ఆరేళ్లుగా చూస్తే దేశీయంగా కంపెనీల ఆర్జనలకు మించుతూ మార్కెట్లు లాభపడుతూ వచ్చాయి. ఇందుకు వడ్డీ రేట్లు వంటివి దోహదం చేశాయి. దీంతో ఫండమెంటల్స్కంటే వడ్డీ రేట్లే స్టాక్స్‌కు బలాన్నిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వాలు, కంపెనీలు రుణ భారాన్ని అధికంగా మోస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఎప్పటికి మార్పు వస్తుందో ఇప్పుడే అంచనా వేయలేము. చౌకగా లభిస్తున్న నిధులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ప్రపంచ దేశాలపై ఆధారపడకుండా దేశీయంగా కంపెనీలు నిలదొక్కుకోవాలనుకుంటే.. డిమాండ్ పెరిగి ధరలు పుంజుకోవలసి ఉంటుంది. ఇది జరిగితే.. ప్రస్తుత స్థాయిలో వడ్డీ రేట్లు కొనసాగకపోవచ్చు. గైడెన్స్ ఎలా వచ్చే ఏడాది లేదా ఒకటి రెండు త్రైమాసికాలకు ప్రస్తుతం ఏ కంపెనీ ఆదాయ అంచనాలను ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితులు దీనికి కారణంకాగా.. మార్కెట్లలో సాధారణంగా ఎప్పటికప్పుడు పలువురు నిపుణులు 25 శాతం ఆర్జనలు అంచనా వేస్తూ ఉంటారు. అయితే పలు కంపెనీలు నిరాశను మిగులుస్తుంటాయి. అయితే ప్రస్తుతం కోవిడ్-19 ప్రభావంతో ఎవరూ సరైన అంచనాలు వేసే పరిస్థితులు లేవు. నిజానికి ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అంశంలో కూడా సరైన ప్రణాళికలు లేవనే చెప్పాలి. ఇలాంటి స్థితిలో రెండేళ్ల కాలాన్ని అంచనా వేయాలంటే చీకట్లో గురిపెట్టవలసిందే. త్వరలో కోవిడ్-19 చికిత్సకు ఔషధం వెలువడుతుందని ఆశిద్దాం. ఇలాంటి పరిస్థితుల్లోనూ అంచనాలు అంత సులభంకాదు. ఎందుకంటే కోవిడ్-19కు ముందు సైతం ప్రపంచ దేశాలు మందగమన పరిస్థితులను ఎదర్కొంటూ వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దేశీయంగా జీడీపీ 4 శాతానికి పరిమితమైంది. ఇందుకు ప్రభుత్వ ప్యాకేజీసైతం ప్రోత్సాహాన్నివ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలను మించి భారత్ ఆర్థిక వ్యవస్థ పరుగుతీస్తుందని చెప్పాలంటే ఎంతో ఆశావహం ధృక్పథం కలిగి ఉండాలి. అయినప్పటికీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయంటే ఫండమెంటల్స్ లేదా వాస్తవిక పరిస్థితులకంటే లిక్విడిటీయే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు చెప్పవచ్చు. -
లిక్విడిటీ బూస్ట్: చిదంబరం ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయంపై సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం స్పందించారు. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు ద్రవ్య లభ్యత కోసం సోమవారం రిజర్వు బ్యాంకు రూ.50,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించటాన్ని ఆయన స్వాగతించారు. ఆర్బీఐ సత్వర చర్య మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో నెలకొన్న ఆందోళనలకు ఊరటనిస్తుందని ఆయన ప్రశంసించారు. ప్రముఖ పెట్టుబడి సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భారత్‌లోని ఆరు పథకాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో తన పెట్టుబడిని కొద్దిరోజుల క్రితం స్తంభింపజేసింది. అయితే పెట్టుడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సొమ్మును తిరిగి చెల్లిస్తామని స్పష్టత నిచ్చింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నిర్ణయంతో దేశీయ పెట్టుబడిదారులు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్బీఐ లిక్విడిటీ సదుపాయాన్ని ప్రకటించింది. (మ్యూచువల్ ఫండ్లకు ఆర్బీఐ భారీ ప్యాకేజీ) చదవండి: జియో మార్ట్ వాట్సాప్ నంబరు ఇదే! -
మేలోనూ కారు రివర్స్‌గేరు!
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం గతుకుల రోడ్డుపై ప్రయాణం కొనసాగిస్తోంది. అధిక ఫైనాన్స్ వ్యయం, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) తగ్గిపోవడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో మే నెలలో కూడా అమ్మకాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ రంగంలోని మార్కెట్ లీడర్లు విక్రయాలు సైతం 20 శాతానికి మించి దిగజారాయి. ఆయా కంపెనీలు తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గత నెలలో మారుతీ సుజుకీ ఇండియా మొత్తం అమ్మకాలు ఏకంగా 22 శాతం క్షీణించాయి. టాటా మోటార్స్ విక్రయాలు 26 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 3 శాతం తగ్గిపోయాయి. ఈ అంశంపై మాట్లాడిన మహీంద్రా ఆటోమోటివ్ విభాగ ప్రెసిడెంట్ రాజన్ వాదేరా.. ‘సాధారణంగా ఎన్నికలకు ముందు ఆటోమొబైల్ అమ్మకాలు తగ్గుతాయి. మరోవైపు హైబేస్ నంబర్, అధిక ఫైనాన్స్ వ్యయం ఉన్నందున గత నెలలో సేల్స్ భారీగానే తగ్గాయి’ అని వివరించారు. వాహనాలపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలి పరిశ్రమ డిమాండ్ న్యూఢిల్లీ: వాహన అమ్మకాల క్షీణతకు ముగింపు పలికేందుకు గాను అన్ని రకాల వాహనాలపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రస్తుతం వాహనాలపై 28 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ఈ సూచన చేయడం గమనార్హం. అలాగే, కాలుష్య నిరోధానికి గాను పాత వాహనాలను తుక్కుగా మార్చి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా కోరింది. బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక శాఖ అధికారులకు సియామ్ ఈ మేరకు తమ డిమాండ్లను వినిపించింది. జీఎస్టీ రేటును తగ్గించడం వల్ల వాహనాల ధరలు దిగొస్తాయని, దాంతో 11 నెలలుగా అమ్మకాలు మందగించిన పరిశ్రమలో డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొంది. దేశీయ తయారీని ప్రోత్సహించడంలో భాగంగా పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకునే వాణిజ్య వాహనాలపై కస్టమ్స్ డ్యూటీని ప్రస్తుత 25 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని కూడా సియామ్ కోరింది. -
వాహన విక్రయాలకు స్పీడు బ్రేకర్లు..
న్యూఢిల్లీ: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాల జోరుకు గతేడాదిలో గట్టిగానే స్పీడు బ్రేకర్లు తగిలాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాలు కేవలం 2.7 శాతం వృద్ధితోనే సరిపెట్టుకున్నాయి. గతేడాది విక్రయాలు 33,77,436 యూనిట్లు కాగా, 2017–18 అమ్మకాలు 32,88,581 యూనిట్లుగా నమోదయ్యాయి. నూతన వాహనాల విడుదల ఉన్నప్పటికీ.. గతేడాది ద్వితీయార్థంలో గణనీయంగా తగ్గిన అమ్మకాల కారణంగా కనీసం అంచనాలకు దగ్గరగా కూడా విక్రయాలు చేరుకోలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది ప్రారంభంలో 8 నుంచి 10 శాతం వరకు విక్రయాల్లో వృద్ధి ఉంచవచ్చని సియామ్ అంచనా వేయగా.. మారిన పరిస్థితుల రీత్యా ఈ అంచనాను 6 శాతానికి సవరించింది. అయితే, ఈకాలంలో ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) తగ్గడం, అధిక వాహన ధరలు, సాధారణ ఎన్నికల కారణంగా ఏర్పడిన అనిశ్చితి వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో పూర్తిఏడాది అమ్మకాలు 2.7 శాతం వృద్ధికే పరిమితమయ్యాయి. ఈ అంశంపై సియామ్ అధ్యక్షుడు రాజన్ వదేరా మాట్లాడుతూ.. ‘సానుకూల అంశం వైపు నుంచి చూస్తే.. వృద్ధిరేటు ఒక అంకెకే పరిమితం అయ్యిందా, లేదంటే రెండెంకల వృద్ధిరేటా అనే విషయాన్ని పక్కన పెడితే.. గతేడాదిలో కూడా వృద్ధి కొనసాగింది. అధిక ముడివస్తువుల ధరల కారణంగా పరిశ్రమ గతేడాదిలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇక బీఎస్ సిక్స్ పరివర్తన మరో కీలక అంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈఏడాది అమ్మకాలు 3 నుంచి 5 శాతం మధ్య ఉండవచ్చని అంచనావేస్తున్నాం. దేశ అర్థిక అభివృద్ధిపై పాజిటివ్‌గా ఉన్నాం. ప్రభుత్వం పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ ఇన్ఫ్రా అభివృద్ధి కొనసాగిస్తోంది. బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనల పరివర్తన ముందు కొనుగోళ్లు జరుగుతాయని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కార్ల విక్రయాల్లో స్వల్ప వృద్ధి! దేశీ కార్ల విక్రయాల్లో గతేడాది స్వల్ప వృద్ధిరేటు నమోదైంది. 2018–19లో 22,18,549 కార్లు అమ్ముడు కాగా, అంతక్రితం ఏడాదిలో 21,74,024 యూనిట్లు అమ్ముడయ్యాయి. యుటిలిటీ వాహనాలు (యూవీ) విక్రయాలు 2.08 శాతం వృద్ధితో 9,41,461 యూనిట్లుగా నిలిచాయి. మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో 9.64 శాతం క్షీణత నమోదైంది. -
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కష్టకాలం!
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ) రుణాల వృద్ధి అవకాశాలను లిక్విడిటీ సంక్షోభం దెబ్బతీసిందని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2019–20) కూడా ఈ పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా బలహీన మార్కెట్ పరిస్థితులు సైతం హెచ్ఎఫ్సీ ఆస్తుల నాణ్యతపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హెచ్ఎఫ్సీలు 13–15 శాతం మధ్య రుణాల వృద్ధిని నమోదు చేస్తాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం 2019–20లో ఇది 14–16 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొంది. బలహీన నిర్వహణ పరిస్థితుల కారణంగా ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి ఉంటుందని అంచనా వేసింది. ఇళ్ల రుణాల విభాగంలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) ప్రస్తుతమున్న 1 శాతం నుంచి మధ్య కాలానికి 1.3 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. ప్రాజెక్టు రుణాలను కూడా కలిపి చూస్తే మొత్తం మీద హెచ్ఎఫ్సీల ఎన్పీఏలు 1.4 శాతం నుంచి 1.8 శాతానికి పెరగొచ్చని అంచనా వేసింది. ఈ పరిస్థితుల కారణంగా గతేడాది 18 శాతంగా ఉన్న మార్జిన్లు 14 శాతానికి పరిమితమవుతాయని అభిప్రాయపడింది. 2020 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలోనే ఉండొచ్చని పేర్కొంది. గత కొన్నేళ్లుగా మోర్ట్గేజ్ ఫైనాన్స్‌ను ఎన్బీఎఫ్సీలు సురక్షితంగా భావించడం జరిగిందని, ప్రధానంగా ఈ విభాగం నిద్రాణంగా ఉండడం వల్లేనని గుర్తు చేసింది. 2018 సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ దివాలా తీయడం ఫలితంగా ఈ రంగంలో నిధుల సంక్షోభానికి దారితీసిన విషయం తెలిసిందే. హెచ్ఎఫ్సీల రుణాల వృద్ధి తగ్గుముఖం పట్టడంతో బ్యాంకులు ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయని ఇక్రా వివరించింది. ఇళ్ల రుణాల పోర్ట్‌ఫోలియో హెచ్ఎఫ్సీలకు, ఇతర రుణదాతులకు 18 శాతం నుంచి 13 శాతానికి దిగొచ్చినట్టు తెలిపింది. ఊహించని మార్కెట్ సంక్షోభాలను ఎదురైతే ఎదుర్కొనేందుకు హెచ్ఎఫ్సీలు నిధుల నిల్వలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాయని తన నివేదికలో పేర్కొంది. -
ఒడిదుడుకుల వారం..!
ముంబై: మార్చి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ ముగింపు, స్థూల ఆర్థిక అంశాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్ఐఐ) నిర్ణయాలు ప్రధానంగా ఈవారంలో దేశీ స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించనున్నట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఆర్థిక సంవత్సరం ముగింపు నెల అయినందున రుణ మార్కెట్ల నుండి ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) తగ్గేందుకు అవకాశం ఉంది. ఇదే సమయంలో రిడెంప్షన్ ఒత్తిడికి ఆస్కారం ఉండడం వల్ల దేశీ సంస్థలు (డీఐఐ)లు కూడా భారీ స్థాయిలో అమ్మకాలకు పాల్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో ఈవారంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉంది’ అని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ‘కొంత దిద్దుబాటు జరిగిన తరువాత నిఫ్టీ కన్సాలిడేట్ అయ్యేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం. ప్రస్తుతం అంతర్జాతీయ సంకేతాలు కూడా పురోగతికి ప్రతిబంధకంగా మారాయి. మరోవైపు స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు లార్జ్‌క్యాప్ ఇండీసెస్ను అవుట్పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎంపికచేసిన షేర్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచన’ అని ఎడిల్వీస్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ విశ్లేషించారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి.. ద్రవ్య లోటు, మౌలిక సదుపాయాల ఉత్పత్తి డేటా శుక్రవారం (29న) విడుదల కానుండగా.. విదేశీ రుణ గణాంకాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఇవి ఏమాత్రం ప్రతికూలంగా ఉన్నా నిఫ్టీ 11,380 వరకు వెళ్లే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. ఇక్కడ కీలక మద్దతు లభించకపోతే మరింత దిద్దుబాటుకు ఆస్కారం ఉందన్నారు. మార్కెట్ పెరిగితే 11,572 కీలక నిరోధంగా పనిచేయనుందని విశ్లేషించారు. అమెరికా–చైనాలు బీజింగ్‌లో భేటీ: వాణిజ్య యుద్ధ అంశంపై అమెరికా–చైనాల మధ్య గురువారం బీజింగ్‌లో ఇరుదేశాల ఉన్నతస్థాయి అధికారుల మధ్య చర్చలు పునర్ప్రారంభంకానున్నాయి. ఇక్కడ నుంచి వెలువడే కీలక అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఆలస్యం అవుతున్న ఈ అంశం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూలత చూపుతుందన్నారు. ఈసారి ఏమైనా పురోగతి ఉంటే మాత్రం సూచీలకు సానుకూలం అవుతుందన్నారాయన. మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ మరింత జాప్యం కానుందని రాయిటర్స్ భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ తిరస్కరణకు గురైన బ్రెగ్జిట్ ఒప్పందంపై త్వరలోనే మరోసారి ఓటింగ్ ఉండే అవకాశాలున్నాయని అంచనా వేసింది. బ్రెగ్జిట్ అంశంపై కొత్త ప్రజాభిప్రాయ సేకరణను డిమాండ్ చేస్తూ శనివారం లండన్‌లో దాదాపు 10లక్షల మంది పౌరులు మార్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై సైతం ఇన్వెస్టర్లు దృష్టిసారించారు. ఇక బ్యాంక్ ఆఫ్ జపాన్ ఈనెల 14–15న జరిగిన పాలసీ మీటింగ్‌కు సంబంధించిన తన బోర్డ్ సభ్యుల అభిప్రాయ సారాంశాన్ని సోమవారం ప్రకటించనుంది. రూపాయికి 68.30 వద్ద మద్దతు.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ శుక్రవారం ఒక్కసారిగా 2 శాతం పతనమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందనే ఆందోళనలు, తగ్గిన డిమాండ్ నేపథ్యంలో ముడిచమురు ధరలు దిగివచ్చి డాలరుతో రూపాయి మారకం విలువకు బలాన్నిచేకూర్చాయి. వరుసగా ఆరోవారంలోనూ బలపడిన రూపాయి.. గతవారంలో 15 పైసలు బలపడి 68.95 వద్ద ముగిసింది. రూపాయికి కీలక నిరోధం 69.50 వద్ద ఉండగా, సమీపకాల మద్దతు 68.30 వద్ద ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు అమిత్ గుప్తా అన్నారు. విదేశీ నిధుల వెల్లువ.. విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. ఎఫ్ఐఐలు భారత స్టాక్ మార్కెట్లలో రెట్టించిన ఉత్సాహంతో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. మార్చి 1–22 కాలంలో వీరు ఏకంగా రూ.38,211 కోట్ల పెట్టుబడులను పెట్టారు. రూ.27,424 కోట్లను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన వీరు.. రూ.10,787 కోట్లను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. సాధారణ ఎన్నికల్లో సానుకూలత ఉండవచ్చనే ప్రధాన అంశం కారణంగా వీరి పెట్టుబడి గణనీయంగా పెరిగిందని వినోద్ నాయర్ అన్నారు. ఇక నుంచి నిధుల ప్రవాహం ఏవిధంగా ఉండనుంది.. రూపాయి కదలికల ఆధారంగా మార్కెట్ గమనం ఉండనుందని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్, ఎండీ డీకే అగర్వాల్ విశ్లేషించారు. -
సెన్సెక్స్ రికార్డుస్థాయికి చేరేముందు...
ప్రపంచ స్టాక్ మార్కెట్లను లిక్విడిటీ ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత్‌కు సైతం హఠాత్తుగా విదేశీ నిధుల ప్రవాహం పెరిగింది. ఈ కారణంగా గతవారం పెద్ద ర్యాలీ జరిపిన భారత్ స్టాక్‌సూచీలు ఆల్‌టైమ్ రికార్డుస్థాయికి కేవలం 3 శాతం దూరంలో ఉన్నాయి. మరోవైపు అటు విదేశీ, ఇటు స్వదేశీ ఫండ్స్ ఫెవరేట్ రంగమైన బ్యాంకింగ్ సూచి గతేడాది నెలకొల్పిన రికార్డుస్థాయిని అవలీలగా అధిగమించేసి, ఏ రోజుకారోజు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతోంది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తిరిగి కఠిన వైఖరిలోకి మారకపోతే...ఇక్కడి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు–అంచనాలతో సంబంధం లేకుండా ర్యాలీ కొనసాగే అవకాశాలున్నాయని అత్యధికశాతం బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు... మార్చి 15తో ముగిసిన వారంలో అనూహ్యంగా ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ 38,250 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంకంటే 1,353 పాయింట్ల భారీ లాభాన్ని ఆర్జించి, 38,024 పాయింట్ల వద్ద ముగిసింది. గతేడాది ఆగస్టు 29 నాటి రికార్డు గరిష్టస్థాయి 38,989 పాయింట్ల స్థాయివరకూ ర్యాలీ చేయడానికి అవసరమైన కీలక అవరోధాల్ని అన్నింటినీ సెన్సెక్స్ గతవారం అధిగమించినట్లే. అయితే లాభాల స్వీకరణ కారణంగా రికార్డుస్థాయిని చేరేముందు చిన్న విరామాలు వుండవచ్చు. ఈ కోణంలో.... ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగితే తొలుత 38,250–38,420 పాయింట్ల శ్రేణి వద్ద ఆగవచ్చు. అటుపైన ముగిస్తే 38,580 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన 38,730–38,989 పాయింట్ల శ్రేణి వరకూ పరుగు కొనసాగవచ్చు. ఈ వారం తొలి స్టాప్ వద్ద బ్రేక్పడితే 37,700 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ లోపున ముగిస్తే 37,480 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 37,230 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 10,345 గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,487 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 392 పాయింట్ల భారీ లాభంతో 11,427 పాయింట్ల వద్ద ముగిసింది. గతేడాది ఆగస్టు 28 నాటి రికార్డు గరిష్టస్థాయి అయిన 11,760 పాయింట్ల వద్దకు చేరేందుకు సాంకేతికంగా కీలక అవరోధమైన 11,345 పాయింట్ల స్థాయిని గతవారం అవలీలగా నిఫ్టీ అధిగమించింది. ఈ కారణంగా రానున్న రోజుల్లో కొత్త రికార్డుల సాధనకు మార్గం సుగమమయ్యింది. ఈ క్రమంలో ఈ వారం నిఫ్టీ అప్‌ట్రెండ్ కొనసాగితే వెనువెంటనే 11,490–11,525 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే 11,605 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ 11,700–11,760 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం 11,490–11, 525 పాయింట్ల శ్రేణిని దాటలేకపోతే 11,345 పాయింట్ల వద్ద తక్షణ మద్దతును పొందవచ్చు. ఈ లోపున ముగిస్తే 11,275 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన 11,225 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. -
బ్యాంకుల చేతికి రూ.37,000 కోట్లు!
ముంబై: దేశంలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితులను చక్కదిద్దడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ (సీసీబీ) నియమామళిని ఏడాదిపాటు వాయిదా వేస్తున్నట్లు ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. దీనితో బ్యాంకులకు దాదాపు రూ.37,000 కోట్ల మూలధనం అందుబాటులోకి వస్తాయని అంచనా. ప్రస్తుతం బ్యాంకుల సీసీబీ ప్రధాన క్యాపిటల్‌లో 1.875 శాతం. ఈ కనీస క్యాపిటల్ కన్షర్వేషన్ రేషియోను 2019 మార్చి నుంచి 2.5 శాతానికి పెంచాలి. తాజా నిర్ణయంతో ఈ నిర్ణయం 2020 మార్చి 31 నుంచీ అమల్లోకి వస్తుంది. సీసీబీ అనేది ఒక మూలధన నిల్వ. సాధారణ సమయంలో దీనిని బ్యాంకులు పెంచుకుంటాయి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అవసరాలకు వినియోగించుకుంటాయి. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇబ్బందికర సమయంలో ఆదుకునే మరో సాధనం క్యాపిటల్ అడిక్వసీ రేషియో (సీఏఆర్) ప్రస్తుతం 9 శాతంగా ఉంది. విప్రో ఏరోస్పేస్ ఎగుమతులు ఆరంభం బెంగళూరు: విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ (విన్) కంపెనీ విమాన విడిభాగాల ఎగుమతులు ఆరంభమయ్యాయి. విమాన విడిభాగాలను బోయింగ్ కంపెనీకి ఎగుమతి చేయడం ప్రారంభించినట్లు విన్ కంపెనీ వెల్లడించింది. ఇక్కడకు సమీపంలోని దేవనహళ్లి ప్లాంట్‌లో ఈ విమాన విఢిభాగాలను తయారు చేస్తున్నామని విన్ సీఈఓ ప్రతీక్ కుమార్ చెప్పారు. బోయింగ్ 737 మ్యాజ్, నెక్స్ట్ జనరేషన్ 737 విమానాలకు అవసరమైన విడిభాగాలను తయారు చేసి, సరఫరా చేయడానికి బోయింగ్ కంపెనీతో తమ విప్రో ఏరోస్పేస్ ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారాయన. విస్తరణ ప్రణాళికలో కర్లాన్ హైదరాబాద్: నూతన ఆవిష్కరణలు, సాంకేతికతపై వచ్చే రెండేళ్లలో రూ.200 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రముఖ పరుపుల ఉత్పత్తి సంస్థ కర్లాన్ ప్రకటించింది. ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను రెట్టింపు చేయడంలో భాగంగా ఈమేరకు పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ సీఎండీ టీ సుధాకర్ పాయ్ తెలిపారు. గతేడాది అమ్మకాల్లో 25 శాతం వృద్ధి సాధించగా.. వచ్చే మూడేళ్లలో రూ.2000 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు వెల్లడించారు. డబ్ల్యూఈఎఫ్‌లో ఏటీటీ సదస్సుకు సింగ్ సారథ్యం ముంబై: ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సీఈవో అజయ్ సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 22 నుంచి 25 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో భాగంగా ఏవియేషన్, ట్రావెల్, టూరిజం (ఏటీటీ) గవర్నర్స్ సదస్సుకు ఆయన సారథ్యం వహించనున్నారు. 24న జరిగే ఈ సదస్సులో ఏటీటీ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, అమలు చేయతగిన సంస్కరణలు తదితర అంశాలపై చర్చిస్తారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు చైర్‌గా వ్యవహరించే అవకాశం ఒక భారతీయుడికి దక్కడం ఇదే ప్రథమం. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్‌తో పాటు లుఫ్తాన్సా చైర్మన్ కార్స్టెన్ స్పోర్, మారియట్ ఇంటర్నేషనల్ అర్నె సోరెన్సన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొంటారు. -
నగదు లభ్యత పెంచుతాం : ఆర్బీఐ గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత క్షీణిస్తే లిక్విడిటీ పెంపునకు చర్యలు చేపడతామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. రుణాల పునర్వ్యవస్థీకరణ కోరుతూ తనను కలిసిన చిన్న, మధ్యతరహా వ్యాపారుల ప్రతినిధులతో ఆర్బీఐ గవర్నర్ సంప్రదింపులు జరిపారు. చిన్న మధ్యతరహా వాణిజ్య సంస్థల రుణాల పునర్వ్యస్ధీకరణపై ప్రతిపాదనలను బ్యాంకులు బేరీజు వేయాలని సూచించారు. నగదు లభ్యతపై మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నగదు లభ్యత అవసరాలను కేంద్ర బ్యాంక్ పూర్తిస్ధాయిలో పరిష్కరించిందని చెప్పుకొచ్చారు. అవసరమైతే మరింత లిక్విడిటీని మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతుందని చెప్పారు. ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య పలు అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నా కేంద్ర బ్యాంక్ పరిధిలోని అంశాలపై తుది నిర్ణయం ఆర్బీఐదేనని తెలిపారు. -
పెట్టుబడికి రేటింగ్ చూస్తారా?
సినిమా చూసేముందు ఆ సినిమాకు రేటింగ్ ఎంతనేది చూస్తారు కొందరు! కొందరైతే రెస్టారెంట్లకు వెళ్లేటపుడు కూడా దాని రేటింగ్, దానిపై ఇతరుల రివ్యూలు చూస్తారు! ఇలాంటి చిన్న చిన్న విషయాలకే రేటింగ్‌లు, రివ్యూలు చూసినపుడు... మరి మనం కష్టపడి సంపాదించిన సొమ్మును ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటపుడు ఇలాంటివి చూడొద్దా..? అసలు ఆ పెట్టుబడిలో రిస్కు ఎంత? రాబడి ఎంత? దాని గురించి, దాన్ని జారీ చేస్తున్నవారు చెప్పే మాటల్లో నిజమెంత? ఇవన్నీ చెప్పేది రేటింగ్ ఏజెన్సీలే. అన్ని అంశాలూ చూసి... వాటిలో పెట్టుబడి పెట్టవచ్చో, లేదో అవే చెబుతాయి. అంటే... అవి ఇచ్చే రేటింగ్‌ను బట్టి పెట్టుబడి పెట్టాలో, పెట్టకూడదో మనమే నిర్ణయం తీసుకోవచ్చు. నిజానికి అందరూ కాకున్నా చాలా మంది మాత్రం పెట్టుబడులు పెట్టే ముందు సదరు ఆర్థిక సాధనానికి ఏ రేటింగ్ ఉందన్నది చూస్తారు. కాకపోతే, వీరిలో కూడా అత్యధికులు ఏ అంశాల ఆధారంగా రేటింగ్ సంస్థలు ఓ సాధనానికి రేటింగ్ ఇస్తాయనేది పట్టించుకోరు. ఫైనాన్షియల్ కంపెనీల ఉత్పత్తులకు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు పలు రకాల రేటింగ్‌లు ఇస్తుంటాయి. ఆయా కంపెనీల రిస్క్ అంశాలను మదింపు చేసిన అనంతరం ఆయా కంపెనీల బాండ్లు, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలు లేదా డెట్ ఇనుస్ట్రుమెంట్ల రేటింగ్‌తో పాటు వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తెస్తాయి. దీంతో ఇవి తమకు నప్పుతాయా, లేదా అన్నది ఇన్వెస్టర్లు సులభంగా అర్థం చేసుకోవచ్చు. రేటింగ్ అంశాల్లోకి సెబీ ఇటీవలే లిక్విడిటీని కూడా జోడించింది. దీంతో కంపెనీ నగదు బ్యాలన్స్, లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ (సత్వరం నగదుగా మార్చుకునే పెట్టుబడులు), లిక్విడిటీ కవరేజీ రేషియో, గడువు తీరే రుణాలకు చేయాల్సిన చెల్లింపులకు సరిపడా నగదు ప్రవాహాల వివరాలను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇన్వెస్టర్లు తాము ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకునేందుకు ఉపకరించేవే. ఓ కంపెనీ ప్రొఫైల్‌ను విశ్లేషించే విషయంలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఫైనాన్షియల్ రిస్క్ ఓ కంపెనీ నగదు ప్రవాహాల అందుబాటు, నిలకడ, రుణాలను సమయానుకూలంగా చెల్లించేయడం వంటి అంశాలు ఫైనాన్షియల్ రిస్క్‌లో భాగం. ఇందులో భాగంగా కంపెనీ వ్యాపార బలా, బలాలను అంచనా వేయడం జరుగుతుంది. ఈ బలాల ఆధారంగా ప్రస్తుత, భవిష్యత్తు ఆర్థిక పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేస్తాయి. ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యంగా ఉంటే, నిధుల లభ్యత ఉంటే, సంబంధిత కంపెనీ ఆర్థిక సాధనంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చన్నది సంకేతం. వ్యాపార రిస్క్ నగదుకు కొరత ఏర్పడిన సందర్భాల్లో... ఓ కంపెనీ బలాన్ని అర్థం చేసుకునేందుకు ఆ కంపెనీ నగదు ప్రవాహాల నిలకడ, స్థిరత్వం అన్న అంశాలు చాలా కీలకంగా ఉపయోగపడతాయి. ‘‘కంపెనీ వ్యాపార మూలాలను విశ్లేషించడం, నిర్వహణ సామర్థ్యాలు, ఆ రంగంలో కంపెనీ స్థానం, సంబంధిత రంగానికి ఉన్న సానుకూలతలను విశ్లేషించడం జరుగుతుంది. ఆ రంగం తీవ్రమైన పతనంలో ఉంటే లేదా కంపెనీ ఫండమెంటల్స్‌లో లేదా మార్కెట్ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటే రేటింగ్‌పై ప్రతిఫలిస్తాయి’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి తెలిపారు. యాజమాన్య రిస్క్ యాజమాన్య పరంగా రిస్క్ అంశాలను కూడా రేటింగ్ ఏజెన్సీలు పరిగణనలోకి తీసుకుంటాయి. యాజమాన్యం అనుసరించే విధానాలు, వ్యాపారంలో తీసుకునే రిస్క్, వ్యూహాలను పరిశీలిస్తాయి. అలాగే, కంపెనీని నడిపించే యాజమాన్యానికి ఉన్న అనుభవం, ట్రాక్‌రికార్డ్ (గత చరిత్ర)ను కూడా చూస్తాయి. యాజమాన్యం అధిక రిస్క్ తీసుకునే తరహా అయితే... రుణాలు ఎక్కువగా తీసుకోవడం లేదా ప్రస్తుత కార్యకలాపాలను మించి ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతుంది. దీంతో రేటింగ్ ఏజెన్సీలు వీటిని సానుకూలంగా చూడవు. అందుకే కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్ సెక్యూరిటీలు, డిబెంచర్లు, డెట్ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడి పెట్టే ముందు యాజమాన్య రిస్క్‌ను తప్పకుండా చూడాలి. ప్రాజెక్టు రిస్క్ ఓ కంపెనీ కొత్త ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నవారు, ఆ ప్రాజెక్టు తుది రూపం, అందులో ఉన్న లాభాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ (ఐడీఎఫ్)లో ఇన్వెస్ట్ చేయడం ఇటువంటిదే. ఈ తరహా వాటిల్లో పెట్టుబడికి రిస్క్ చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. ఓ కంపెనీ కొత్త ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు నిధులు సమీకరించడం సాధారణమే అవుతుంది. అందుకే, ఓ కంపెనీ నూతన ప్రాజెక్టులకు సంబంధించిన రిస్క్‌ను కూడా రేటింగ్ సంస్థలు చూసి రేటింగ్ ఇస్తుంటాయి. ఎగవేత అవకాశాలు అన్నింటికంటే ముఖ్యమైనది ఓ కంపెనీ డిఫాల్ట్ రిస్క్. ఎందుకంటే ఇది కంపెనీ ప్రొఫైల్‌పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఈ విభాగంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. రుణదాతలు, ఆర్థిక సంస్థలు, ఇన్వెస్టర్లకు ఈ డిఫాల్ట్ రిస్క్ ఎప్పుడూ పొంచి ఉంటుంది. అందుకే ఓ కంపెనీ ఆర్థిక సాధనంలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీకి అప్పటికే ఉన్న రుణ భారం, ఆ కంపెనీ పెట్టుబడులు వంటివి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సలహాలు అవసరం. ఏ రేటింగ్ అయితే బెటర్? క్రెడిట్ రేటింగ్ తగ్గితే...? క్రెడిట్ రేటింగ్ అన్నది ఓ ఆర్థిక సాధనానికి ఉన్న క్రెడిట్ రిస్క్‌ను తెలియజేస్తుంది. కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేసే వారికి క్రెడిట్ రేటింగ్ చాలా ముఖ్యమైన పారామీటర్. కంపెనీల ఐపీవోలకు కూడా ఈ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వారంలోనే ఇక్రా, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీ), దీర్ఘకాలిక రుణాల రేటింగ్లను తగ్గించిన విషయం తెలిసిందే. చాలా వరకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎన్సీడీలు, డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. కనుక ఇన్వెస్టర్ల రాబడులను ఈ పరిణామం దెబ్బతీసే అంశమే. అయితే, ఓ కంపెనీ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. 2015లో ఆమ్టెక్ ఆటో రేటింగ్‌ను కూడా ఇదే విధంగా రేటింగ్ ఏజెన్సీలు తగ్గించడం జరిగింది. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన జేపీ మోర్గాన్ మ్యూచువల్ ఫండ్ చేదు ఫలితాలను చవిచూసింది. 2017లో ఐడీబీఐ బ్యాంకు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రేటింగ్లను కూడా తగ్గించడంతో ఆ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. క్రెడిట్ రేటింగ్ అంటే...? ఓ కంపెనీ వ్యాపారాన్ని పూర్తిగా అధ్యయనం చేసి, వ్యాపార పరమైన రిస్క్, ఫైనాన్షియల్ రిస్క్, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో యాజమాన్యం క్వాలిటీ, సామర్థ్యాన్ని రేటింగ్ ఏజెన్సీలు మదింపు వేసి దాన్ని తెలియజేస్తూ ఇచ్చేదే క్రెడిట్ రేటింగ్. కేర్ రేటింగ్స్, క్రిసిల్, ఇక్రా, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్, బ్రిక్‌వర్క్ రేటింగ్స్ ఏజెన్సీలు ఈ సేవలు అందిస్తుంటాయి. రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం అంటే అర్థం... డిపాజిట్లు, ఎన్సీడీల రూపంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం సంబంధిత కంపెనీకి సన్నగిల్లినట్టు. ఇదే జరిగితే రుణదాతలు తాజాగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవచ్చు. అలాగే, ప్రస్తుత రుణాల రీఫైనాన్స్‌కు కూడా ఒప్పుకోని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఏ రేటింగ్ కూడా స్థిరంగా ఉంటుందని చెప్పలేం. నెగటివ్ నుంచి పాజిటివ్‌కు, పాజిటివ్ నుంచి నెగటివ్‌కు కూడా మారిపోవచ్చు. సాధారణంగా ఏఏఏ లేదా ఏఏ రేటింగ్ అనేవి అధిక రేటింగ్ సూచికలు. ఈ రేటింగ్ ఉన్న వాటికే పరిమితం కావడం కాస్తంత భద్రతతో కూడినది. ఇంతకంటే తక్కువ రేటింగ్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటే కచ్చితంగా మరింత రిస్క్‌ను స్వీకరిస్తున్నట్టుగానే భావించాలి. మీరు పెట్టుబడి పెట్టిన డిపాజిట్ రేటింగ్ తగ్గించడం జరిగితే, పెనాల్టీ చెల్లించి అయినా ముందుగానే వైదొలగడం సురక్షితం. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినవారు రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేస్తే ఆయా ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఎన్ఏవీలు క్షీణించే పరిస్థితి ఏర్పడుతుంది. ఓ పథకం ఎంత మేర పెట్టుబడులను కలిగి ఉందన్న దానిపై ఈ ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఎక్స్పోజర్ కలిగి ఉంటే ఈ నష్టం మరింత అధికంగా ఉంటుంది. ఆగస్ట్ చివరి నాటి గణాంకాల ప్రకారం 40 డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు బాండ్లలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. వీటి పెట్టుబడులు 0.2–10 శాతం మధ్య ఉన్నాయి. ఈ గ్రూపు బాండ్ల రేటింగ్‌ను తగ్గించడంతో డెట్ ఫండ్స్ ఎన్ఏవీల విలువలు 0.05 నుంచి 2 శాతం వరకు ప్రభావితం అవుతాయని అంచనా. అసలు ఈ రేటింగ్ ఏం చెబుతుంది? ఏ రేటింగ్ ఉంటే మన పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది? ఏ రేటింగ్ ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది? ఇందులో డెట్ సాధనాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈక్విటీ సాధనాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒకసారి చూద్దాం... దీర్ఘకాలిక డెట్ సాధనాలకైతే... ► ఏఏఏ చెల్లింపు బాధ్యతలను సకాలంలో నిర్వహించడంలో అత్యధిక భద్రతను ఈ రేటింగ్ తెలియజేస్తుంది. దీన్లో పెట్టుబడులకు అతి తక్కువ రిస్క్ ఉన్నట్లు లెక్క. ► ఏఏ ఈ రేటింగ్ కలిగిన సాధనాలు కూడా అధిక భధ్రతకు చిహ్నమే. ఇది కూడా తక్కువ రిస్క్‌నే సూచిస్తుంది. ► ఏ సకాలంలో చెల్లింపులు చేసే విషయంలో తగినంత భద్రత ఉందని ఈ రేటింగ్ తెలియజేస్తుంది. మిగిలిన రెండు సాధనాల కంటే ఇందులో భద్రత కొంచెం తక్కువ. ► బీబీబీ తీసుకున్న డిపాజిట్లు, రుణాల తిరిగి చెల్లింపుల విషయంలో మోస్తరు భద్రతే ఉన్నట్టు ఈ రేటింగ్ అర్థం. మోస్తరు రిస్క్ ఉంటుంది. ► బీబీ తీసుకున్న వాటిని తిరిగి చెల్లించే విషయంలో మోస్తరు డిఫాల్ట్ రిస్క్ ఉంటుందని ఈ రేటింగ్ తెలియజేస్తుంది. ► బీ ఇది అధిక రిస్క్‌కు సూచిక. డిఫాల్ట్ రిస్క్ అధికంగా ఉంటుంది. ► సీ ఈ రేటింగ్ ఉన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే డిఫాల్ట్‌కు అత్యధిక అవకాశాలుంటాయి. అంటే రిస్క్ చాలా ఎక్కువ. ► డీ డిఫాల్ట్ అయ్యేందుకు, త్వరలోనే డిఫాల్ట్ అవనున్నట్టు ఈ రేటింగ్ తెలియజేస్తుంది. షార్ట్ టర్మ్ డెట్ సాధనాలకు రేటింగ్ ► ఏ1 క్రెడిట్ రిస్క్ చాలా తక్కువగా ఉందని తెలియజేస్తుంది. అంటే పెట్టుబడులకు అధిక భద్రతకు చిహ్నం. సకాలంలో చెల్లింపులు చేసేందుకు అధిక సామర్థ్యం ఉందని తెలియజేసేది. ► ఏ2 తక్కువ క్రెడిట్ రిస్క్‌కు సూచిక. ఇందులో పెట్టుబడులకూ అధిక భద్రత ఉంటుందని భావించొచ్చు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ► ఏ3 మోస్తరు స్థాయి భద్రతే ఉంటుంది. మిగిలిన రెండింటితో పోలిస్తే ఈ రేటింగ్ ఉన్న సాధనాల్లో పెట్టుబడులకు రిస్క్ కాస్త ఎక్కువ ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. ► ఏ4 భద్రత నామమాత్రంగా ఉంటుందన్న దానికి ఈ రేటింగ్ నిదర్శనం. సకాలంలో చేసే చెల్లింపులకు గ్యారంటీ ఉండదు. అధిక రిస్క్ ఉన్న గ్రేడ్‌గానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ► డీ ఈ రేటింగ్ కలిగిన సాధనంలో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే డిఫాల్ట్ లేదా డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే ఈ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. -
రూ.12,000 కోట్లను పంప్ చేయనున్న ఆర్బీఐ
ముంబై: ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా వ్యవస్థలోకి రూ.12,000 కోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. ‘‘లిక్విడిటీ పరిస్థితులను అంచనా వేసిన అనంతరం నవంబర్ 15న రూ.12,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీలను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కింద కొనుగోలు చేయాలని నిర్ణయించాం’’ అని ఆర్బీఐ ప్రకటన జారీ చేసింది. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం అనంతరం మార్కెట్లో ఏర్పడిన ద్రవ్య లభ్యత ఇబ్బందులను తాజా ఆర్బీఐ నిర్ణయం తేలిక పరచగలదని అంచనా. ఆసక్తి కలిగిన వారు ఆర్బీఐ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ–కుబర్) వ్యవస్థ ద్వారా తమ ఆఫర్లను సమర్పించొచ్చని కేంద్ర బ్యాంకు తన ప్రకటనలో సూచించింది. -
1న వ్యవస్థలోకి రూ.12,000 కోట్లు!
ముంబై: దీపావళి నేపథ్యంలో వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నవంబర్1వ తేదీన ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.12,000 కోట్లు విడుదల చేయనుంది. పండుగల సీజన్ ఫండ్స్ డిమాండ్స్‌ను ఎదుర్కొనడానికి నవంబర్ నెలలో మొత్తం రూ.40,000 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు గత వారం ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
లిక్విడిటీ బూస్ట్ : మార్కెట్ల హై జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు దూకుడు పదర్శిస్తున్నాయి.తొలుత కొన్నినిముషాలపాటు ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ తరువాత జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు అన్ని రంగాల కౌంటర్లలోనూ కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రస్తుతం సెన్సెక్స్550 పాయింట్లు జంప్‌చేసి 33,922వద్ద నిఫ్టీ 150 పాయింట్ల ఎగసి 10,180 వద్ద ట్రేడవుతోంది. ఆర్బీఐ ఇచ్చిన లిక్వడిటీ బూస్టప్తోపీఎస్యూ బ్యాంక్స్ జోరుగా ఉన్నాయి. ఓపెన్‌మార్కెట్ ద్వారా రూ. 40వేల కోట్ల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నామన్న ఆర్బీఐ ప్రకటన రుపీ, బాండ్, ఈక్విటీ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. ముఖ్యంగా ఎస్‌యూ బ్యాంక్స్ ఇండెక్స్ 6.6 శాతం దూసుకెళ్లింది. అలాగే ఫార్మా 4.5 శాతం జంప్‌చేసింది. రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో, ఐటీ షేర్లు సహా ఇమిగతా అన్ని రంగాలూ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐసీఐసీఐ 10శాతం ఎగిసి బ్యాంకింగ్ సెక్టార్లో టాప్ విన్నర్‌గా ఉంది. ఓబీసీ,యూనియన్, కెనరా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్, పీఎన్బీ, బీవోబీ, ఎస్బీఐ, విజయా, సెంట్రల్ బ్యాంక్ భారీలా లాభపడుతున్నాయి. ఇక ఫార్మా కౌంటర్లలోనూ దివీస్ 14 శాతం దూసుకెళ్లగా.. అరబిందో, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సిప్లా, సన్ ఫార్మా, కేడిలా హెల్త్‌కేర్, బయోకాన్, గ్లెన్‌మార్క్ కూడా ఇదే బాటలో ఉన్నాయి. అలాగే రియల్టీ షేర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, సన్‌టెక్, ఇండియాబుల్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి. మరోవైపు జెట్ ఎయిర్వేస్, హెక్సావేర్, ఇన్ఫీబీమ్, భారత్ ఫైనాన్స్, ఈక్విటాస్, దాల్మియా భారత్, భారత్ ఎలక్ట్రానిక్స్ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. అటు రూపీ కూడా డాలరు మారకంలో లాభాలతో కొనసాగుతోంది.