ఏటా పండుగల సమయంలో బంగారం ఆభరణాలను కొనే సంప్రదాయాన్ని కొందరు అనుసరిస్తుంటారు. మరికొందరు కష్టార్జితం నుంచి ఆదా చేసుకున్న మొత్తంతో బంగారం ఆభరణాలను కొని పెట్టుకుంటారు. కొందరు అవసరం లేకపోయినా కానీ, క్లిష్ట సమయాల్లో ఆదుకుంటుందనో.. భవిష్యత్తులో తమ వారసులకు ఆస్తి రూపంలో వెళుతుందన్న ఉద్దేశంతో బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు కూడా చూడాలి. అవసరమైన మేర బంగారం ఆభరణాలను కలిగి ఉండడం తప్పుకాదు.
కానీ, పరిమితికి మించి, పెట్టుబడుల కోసమని బంగారాన్ని పోగు చేసుకుంటుంటే.. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన రిస్క్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, పెట్టిన ప్రతీ రూపాయికి తగిన విలువను ఆభరణం రూపంలో పొందుతున్నామా? అని కూడా ప్రశ్నించుకోవాల్సిందే. పెట్టుబడుల కోసం, అత్యవసర సందర్భాల్లో ఆదుకుంటుందన్న భరోసా కోసం బంగారం కొనే వారికి.. భౌతిక బంగారం కాకుండా మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి గురించి సమగ్రంగా తెలియజేసే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది.
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్
బంగారం ఈటీఎఫ్‌లు అన్నవి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అందిస్తున్నవి. ఇవి ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో స్టాక్స్ మాదిరే రోజువారీగా ట్రేడ్ అవుతుంటాయి. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా.. అందుబాటులోని డిజిటల్ మార్గాల్లో ఎస్‌జీబీ తర్వాత అత్యంత మెరుగైన సాధనం ఇది. ఎస్‌జీబీలను కొనుగోలు చేసుకోవాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. కానీ, గోల్డ్ ఈటీఎఫ్‌లకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఎందుకంటే షేర్ల మాదిరే గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లు ఇన్వెస్టర్ల ఖాతాలోకి వచ్చి చేరతాయి. డీమ్యాట్ ఖాతా కోసం కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే డీమ్యాట్ ఖాతా ఉన్న వారికి ఇది సులభమైన మార్గం అవుతుంది. ఎస్‌జీబీలో మాదిరే ఇక్కడ కూడా ఒక యూనిట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఒక యూనిట్ ఒక గ్రాముకు సమానం. గరిష్ట పెట్టుబడుల పరిమితి లేదు.
వ్యయాలు: స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడవుతాయి కనుక కొనుగోలుపై బ్రోకరేజీ, ఎక్సేంజ్ చార్జీలు ఉంటాయి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవు. అలాగే, గోల్డ్ ఈటీఎఫ్‌లను మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తుంటాయి కనుక ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుంది. పెట్టుబడుల విలువపై దీన్ని ఫండ్స్ వసూలు చేస్తుంటాయి. ఉదాహరణకు ఎస్‌బీఐ ఈటీఎఫ్ గోల్డ్‌లో ఎక్స్‌పెన్స్ రేషియో 0.51 శాతంగా ఉంది. ఏ ట్రేడింగ్ రోజైనా గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేసుకోవచ్చు, విక్రయించుకోవచ్చు. ఎస్‌జీబీలో మాదిరే లాభాలపై పన్ను అమలవుతుంది.
రిస్క్: ఇన్వెస్టర్ కొనుగోలు చేసే ప్రతీ గోల్డ్ ఈటీఎఫ్‌కు సరిపడా బంగారాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కొనుగోలు చేస్తాయి. వాటిని వాల్ట్‌ల్లో నిల్వ చేస్తాయి. సెబీ నమోదిత కస్టోడియన్లు.. ఇలా గోల్డ్ ఈటీఎఫ్‌లకు సరిపడా బంగారాన్ని ఫండ్స్ సంస్థలు కొనుగోలు చేస్తుందీ, లేనిదీ పర్యవేక్షిస్తాయి. ఆడిటింగ్ కూడా ఉంటుంది. ఈ వివరాలను స్టాక్ ఎక్సేంజ్‌లు, సెబీకి కూడా సమర్పించాల్సి ఉంటుంది. కనుక ఇందులో రిస్క్ దాదాపుగా ఉండదు. కానీ, ఒక అంశాన్ని ఇన్వెస్టర్లు తప్పకుండా గుర్తు ంచుకోవాలి. స్టాక్స్ మాదిరే బంగారం ఈటీఎఫ్ ధరలు కూడా రోజువారీగా అంతర్జాతీయ ధరలను అనుసరించి హెచ్చు, తగ్గులకు గురవుతుంటాయి. కొనుగోలు చేసిన తర్వాత నష్టం కనిపిస్తే విక్రయిం చడం వంటి చర్యలు ఇందులో అనుకూలించవు.
లిక్విడిటీ: సుమారు 13 గోల్డ్ ఈటీఎఫ్‌లు ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ అయి ఉండగా.. 11 గోల్డ్ ఈటీఎఫ్‌లు బీఎస్‌ఈలో అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వీటి అన్నింటిలోనూ చురుకైన ట్రేడింగ్ ఉండడం లేదు. కనుక ఎంపిక చేసుకునే ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ పరిమాణం ఆరోగ్యకర స్థాయిలో ఉన్నదీ, లేనిదీ ఇన్వెస్టర్లు ముందుగానే పరిశీలించుకోవాలి. లిక్విడిటీ ఎక్కువగా ఉన్న ఈటీఎఫ్‌ను ఎంపిక చేసుకుంటే విక్రయించుకోవడం సులభం అవుతుంది. నిప్పన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్, హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్‌లను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. వీటిల్లో ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉంది. అదే సమయంలో ట్రేడింగ్ కూడా ఎక్కువ పరిమాణంలో నమోదవుతుంటుంది.
సార్వభౌమ బంగారం బాండ్
పసిడిని పోగు చేసుకోవాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఎన్నో మార్గాల్లో సౌర్వభౌమ బంగారం బాండ్ (ఎస్‌జీబీ) అత్యంత మెరుగైనది. ఇందులో పెట్టే ప్రతీ రూపాయికి భారత సర్కారు హామీ ఉంటుంది. ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్లను ఏటా పలు పర్యాయాలు ఇష్యూ చేస్తుంటుంది. ఈ బాండ్ గ్రాముల రూపంలో లభిస్తుంది. కనీసం ఒక గ్రాము నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. 2015 నవంబర్ నుంచి ఎస్‌జీబీలను ఆర్‌బీఐ విడుదల చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు, జనవరి 10 నుంచి 14వరకు, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4వ తేదీ మధ్య తదుపరి ఇష్యూలు అందుబాటులోకి రానున్నాయి. ఇష్యూ సమయంలో మార్కెట్ రేటు ఆధారంగా ఒక్కో గ్రాము రేటును ఆర్‌బీఐ ప్రకటిస్తుంది. ఎనిమిదేళ్ల కాల వ్యవధి తర్వాత అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా ఇన్వెస్టర్‌కు చెల్లింపులు చేస్తారు. అంతేకాదు. బంగారం పెట్టుబడి పెట్టేనాటి విలువపై 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ ఆదాయం కూడా ఈ బాండ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు అందుకోవచ్చు. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం చెల్లిస్తారు.
కొనుగోలు మార్గాలు: ఆర్‌బీఐ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టల్ కార్యాలయాలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌సీఐఎల్) శాఖలు, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టాక్ ఎక్సేంజ్‌లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల నుంచి నేరుగా, స్టాక్ ఎక్సేంజ్‌ల సభ్యులైన బ్రోకర్ల రూపంలోనూ కొనుగోలు చేసుకోవచ్చు. ఆర్‌బీఐ తాజా ఇష్యూల సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే క్రితం ఇష్యూలకు సంబంధించిన ఎస్‌జీబీలు స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడ్ అవుతుంటాయి. వీటిల్లో ఏ ట్రేడింగ్ రోజైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆర్‌బీఐ ఇష్యూలో పాల్గొనే వారు.. ఎస్‌జీబీల కొనుగోలుకు పాన్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఎస్‌జీబీలను డిమ్యాట్ ఖాతాలో ఉంచుకోవాలని భావిస్తే.. అప్పుడు డీపీ ఐడీ, క్లయింట్ ఐడీని కూడా దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. చెక్కు, డీడీ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపుల సాధనాల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. నగదుతోనూ కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, రూ.20,000కే ఈ పరిమితి ఉంది. ఇంతకుమించి కొనుగోలు చేయాలనుకుంటే డిజిటల్ మార్గంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 4 కిలోల వరకు బంగారం బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు.
వ్యయాలు: బంగారాన్ని డెరివేటివ్ మార్గంలో కలిగి ఉండే సాధనమే ఎస్‌జీబీ. భౌతిక రూపానికి బదులు డాక్యుమెంట్ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. దీనివల్ల పెద్దగా వ్యయాలు ఏవీ ఉండవు. అదే బంగారం ఆభరణాలు అయితే తయారీ చార్జీలు, వెస్టేజీ చార్జీల రూపంలో కొంత నష్టపోవాలి. పైగా తిరిగి అవసరమైనప్పుడు ఆ బంగారాన్ని మార్పిడి చేసుకోవాలన్నా, విక్రయించుకోవాలన్నా మళ్లీ తరుగు తీసేస్తారు. ఈ విధంగా కొంత నష్టం. కొనుగోలు సమయంలో జీఎస్‌టీ చార్జీలు చెల్లించాలి. ఇటువంటివన్నీ ఎస్‌జీబీలు, ఇతర డిజిటల్ గోల్డ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆదా చేసుకోవచ్చు.
పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలంటే: ఎస్‌జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ముందుగానే పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలనుకుంటే ఐదేళ్లు పూర్తయిన తర్వాత సాధ్యపడుతుంది. ఐదో ఏట ముగిసినప్పటి నుంచి ఏడాదికోసారి ఆర్‌బీఐ ప్రత్యేక విండో ద్వారా ఇందుకు అవకాశం కల్పిస్తుంది. విండో ప్రారంభానికి ముందు మూడు రోజుల సగటు బంగారం మార్కెట్ ధర ఆధారంగా కొనుగోలు ధరను ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది. ఆలోపే వైదొగాలని అనుకుంటే స్టాక్ ఎక్సేంజ్‌ల్లో విక్రయించుకోవచ్చు. కాకపోతే స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ఒక్కోరోజు ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.
పన్ను: ఎస్‌జీబీపై ఏటా లభించే 2.5 శాతం ఆదాయం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి పన్ను రిటర్నుల్లో చూపించాలి. ఇన్వెస్టర్ ఆదాయం ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎనిమిదేళ్ల కాల వ్యవధి ముగిసిన తర్వాత లభించే మూలధన లాభం (పెట్టుబడిపై సమకూరిన లాభం)పై పన్ను ఉండదు. ఒకవేళ ఎనిమిదేళ్లలోపే ఎస్‌జీబీని విక్రయిస్తే కనుక అప్పుడు పన్ను బాధ్యత వేర్వేరుగా ఉంటుంది. పెట్టబడి తేదీ నుంచి మూడేళ్లు నిండక ముందే విక్రయించితే.. లాభం స్వల్పకాలిక మూలధన లాభం అవుతుంది. ఇది ఇన్వెస్టర్ వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. మూడేళ్లు నిండిన తర్వాత విక్రయించిన సమయంలో వచ్చిన లాభం దీర్ఘకాలిక మూలధన లాభం అవుతుంది. అప్పుడు లాభంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
డిజిటల్ గోల్డ్
బంగారాన్ని డిజిటల్ రూపంలో ఫిన్‌టెక్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. బంగారంలో పెట్టుబడులకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాధనం ఇది. ఎంఎంటీసీ పీఏఎంపీ, సేఫ్‌గోల్డ్, అగ్‌మాంట్ గోల్డ్ అనే మూడు సంస్థలు డిజిటల్ గోల్డ్‌ను నేరుగాను, ఫిన్‌టెక్ సంస్థల ద్వారా అందిస్తున్నాయి. కొనుగోలు చేసిన విలువకు సరిపడా డిజిటల్ గోల్డ్ ఇన్వెస్టర్ ఖాతాలో ఉంటుంది. దీనికి అంతే విలువైన భౌతిక బంగారాన్ని పైన చెప్పుకున్న మూడు సంస్థలు కొనుగోలు చేసి వాల్టుల్లో ఉంచుతాయి. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే.. ఇన్వెస్టర్ తనకు అవసరనుకుంటే బంగారాన్ని భౌతిక రూపంలోడెలివరీ తీసుకోవచ్చు. లేదంటా ఆభరణాలుగానూ మార్చుకోవచ్చు.
రిస్క్: ఎస్‌జీబీలపై ఆర్‌బీఐ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. అలాగే, గోల్డ్ ఈటీఎఫ్‌లపై సెబీ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. కానీ, డిజిటల్ గోల్డ్‌పై ప్రస్తుతానికి నియంత్రణల్లేవు. ఇటీవలి వరకు స్టాక్‌బ్రోకర్లు, వెల్త్‌మేనేజ్‌మెంట్ సంస్థలు సైతం డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేశాయి. కానీ, దీనికి దూరంగా ఉండాలని సెబీ ఆదేశించింది. డిజిటల్ గోల్డ్‌లో క్రయ, విక్రయ లావాదేవీల సేవలు 2021 సెప్టెంబర్ 10 నుంచి అందించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎంఎంటీసీ పీఏఎంపీ, సేఫ్‌గోల్డ్, అగ్‌మాంట్ గోల్డ్ అన్నవి ట్రస్టీలు. భౌతిక బంగారాన్ని ఇవి కొనుగోలు చేసి, నిల్వ చేస్తున్నాయా అన్న దానిపై క్రమం తప్పకుండా ఆడిట్‌లు నడుస్తుంటాయి. ఎస్‌జీబీ, గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే వీటిల్లో రిస్క్ ఎక్కువ.
కొనుగోళ్లు: రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకుంటే.. ఈ మూడు సంస్థల వెబ్‌సైట్‌ల నుంచి నేరుగాను, వీటితో భాగస్వామ్యం కలిగిన సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గూగుల్‌పే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, కాయిన్‌బజార్ తదితర భాగస్వామ్య సంస్థలు సైతం డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఆయా సంస్థలకు కేవైసీ వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సంస్థలు, ఆధార్, పాన్ తప్పనిసరిగా అడుగుతున్నాయి. ఎస్‌జీబీ, గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఒక గ్రాము నుంచే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, డిజిటల్ గోల్డ్ అయితే రూపాయితోనూ కొనుగోలు చేసుకోగల సౌలభ్యం ఉంది. సేఫ్‌గోల్డ్ కనీసం రూ.10 మొత్తంతో కొనుగోలుకు అనుమతిస్తోంది.
వ్యయాలు: కొనుగోలు విలువపై 3 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు కొనుగోలు ధరలో కలసి ఉంటాయి. ఎంఎంటీసీ పీఏఎంపీ అయితే 2.9 శాతం పేమెంట్ గేట్‌వే చార్జీలను కూడా తీసుకుంటోంది. డిజిటల్ గోల్డ్‌కు మొదటి ఐదేళ్లు స్టోరేజీ చార్జీలు ఉండవు. ఐదేళ్ల తర్వాత నుంచి సేఫ్‌గోల్డ్ అప్పటి విలువపై 0.24 శాతం, ఎంఎంటీసీ పీఏఎంపీ 0.4 శాతం చొప్పున స్టోరేజీ చార్జీలను వార్షికంగా వసూలు చేస్తున్నాయి. భౌతిక రూపంలో బంగారాన్ని డెలివరీ తీసుకోవాలంటే అందుకు తయారీ చార్జీలు, డెలివరీ చార్జీలను భరించాలి. మరో అంశం.. కొనుగోలు ధర, అమ్మకం ధర మధ్య వ్యత్యాసం ఇక్కడ సాధారణంగా అమలవుతుంటుంది. ఈ రూపంలోనూ ఇన్వెస్టర్లు కొంత నష్టపోవాల్సి ఉంటుంది.
కాలవ్యవధి: ఆగ్మంట్ ఐదేళ్లు, సేఫ్‌గోల్డ్ పదేళ్లను మెచ్యూరిటీ పీరియడ్‌గా అమలు చేస్తున్నాయి. ఎంఎంటీసీ పీఏఎంపీ ఇటువంటి నిబంధన అమలు చేయడం లేదు. కాల వ్యవధి తర్వాత విక్రయించుకోవవచ్చు. లేదంటే బంగారం బార్లు, కాయిన్లు, లేదా ఈ సంస్థలో ఒప్పందం కలిగిన జ్యుయలర్స్ నుంచి బంగారం ఆభరణాల రూపంలో డెలివరీ తీసుకోవచ్చు. టాటా గ్రూపులో భాగమైన తనిష్క్.. సేఫ్‌గోల్డ్‌తో ఒప్పందం చేసుకుంది. సేఫ్‌గోల్డ్ వద్ద డిజిటల్ గోల్డ్‌ను కలిగిన వారు.. తమకు కావాలనుకున్నప్పుడు సమీపంలోని తనిష్క్ స్టోర్‌కు వెళ్లి ఆభరణాలుగా మార్చుకోవచ్చు. ఇందుకు తయారీ, ఇతర చార్జీలు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్‌లోనూ పన్ను బాధ్యత ఎస్‌జీబీల్లో మాదిరే ఉంటుంది.
గోల్డ్ ఫండ్స్
ఇవి ఒక రకం మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకని వీటిని ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పోర్టళ్ల నుంచి నేరుగా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మార్గంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు. అలాగే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా అయితే డిస్ట్రిబ్యూటర్ల కమీషన్ రూపంలో అదనపు చార్జీని భరించాల్సి వస్తుంది. ఇది విడిగా ఉండదు కానీ, ఎక్స్‌పెన్స్ రేషియోలోనే కలుస్తుంది. వీటి కొనుగోలుకు పాన్, ఆధార్ నంబర్, చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలను ఇవ్వాలి. ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి ఉంటే తాజాగా కేవైసీ వివరాలను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీ పాన్, ఆధార్ వివరాల ఆధారంగా సెంట్రల్ కేవైసీ డేటాబేస్ నుంచి ఫండ్ సంస్థే వివరాలు తీసుకుంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల కొనుగోలుకు తక్కువలో తక్కువ రూ.4,000కుపైనే పెట్టుబడి అవసరం. కానీ, గోల్డ్ ఫండ్స్ పథకాల్లో రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
వ్యయాలు/పన్నులు: ఫండ్ ఆఫ్ ఫండ్ కనుక వ్యయాలు రెండింతలు ఉంటాయి. గోల్డ్ ఫండ్స్ తన నిర్వహణలోని పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక.. అక్కడ ఎక్స్‌పెన్స్ రేషియో ఒకటి అమలవుతుంది. తిరిగి గోల్డ్ ఫండ్స్ కూడా ఎక్స్‌పెన్స్ రేషియో వసూలు చేస్తాయి. పెట్టుబడి పెట్టిన ఏడాదిలోపు విక్రయించితే ఎగ్జిట్ లోడ్ కూడా అమలవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పోర్టళ్ల నుంచే కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. విక్రయించిన తర్వాత మీ రిజిస్టర్డ్ బ్యాంకు ఖాతాకు ఆ మొత్తం జమ అవుతుంది. బంగారంలో పెట్టబడులు అన్నింటికీ పైన ఎస్‌జీబీలో చెప్పుకున్నట్టే పన్ను బాధ్యతలు వర్తిస్తాయి.
గోల్డ్ ఫండ్స్‌లో ఉన్న ఒక అనుకూలత ఏమిటంటే.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనీస సిప్ రూ.100 నుంచి పెట్టుకోవచ్చు. పైగా డీమ్యాట్ ఖాతా కూడా అవసరం లేదు. గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడవుతాయి. కనుక విక్రయించుకునేందుకు సరిపడా వ్యాల్యూమ్ అవసరం. అదే గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఈ విధమైన లిక్విడిటీ రిస్క్ లేదు. మీరు ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. ఫండ్స్ సంస్థలు నిబంధనలకు అనుగుణంగా మీకు చెల్లింపులు చేస్తాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్, ఎస్‌బీఐ గోల్డ్ ఫండ్‌లను ఈ విభాగంలో ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. వీటిల్లో ఎక్స్‌పెన్స్ రేషియో 0.50 శాతం వరకు ఉంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని పథకాలు కనుక సెబీ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment