Gold Exchange Traded Funds
-
గోల్డ్ ఈటీఎఫ్‌లు జిగేల్!
ఇన్వెస్టర్లు పుత్తడి పెట్టుబడుల వెంట పడుతున్నారు. భారీగా లాభాలందిస్తున్న సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) జారీ నిలిచిపోవడం... తాజా బడ్జెట్లో పన్ను ఊరట.. బంగారం రేట్లు అంతకంతకూ దూసుకుపోతుండటంతో మదుపరులు మళ్లీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా బంగారం కొనుగోళ్లకు సై అంటున్నారు. గత కొంతకాలంగా మెరుపు కోల్పోయిన గోల్డ్ ఈటీఎఫ్‌లు మళ్లీ తళుక్కుమంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 6,134 కోట్ల విలువైన పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి వచి్చనట్లు అంచనా. ఇందులో రూ.4,500 కోట్లు గత నాలుగు నెలల్లోనే మదుపరులు ఇన్వెస్ట్ చేయడం విశేషం. అంతేకాదు, ఒక్క ఆగస్ట్ నెలలోనే మునుపెన్నడూ లేనంత స్థాయిలో రూ.1,611 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం రేట్లు రూ. 3,000కు పైగా దిగొచి్చన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ప్రియులు పండుగ చేసుకున్నారు. ఆభరణాల కొనుగోళ్లు జోరందుకోవడంతో పాటు అటు డిజిటల్ రూపంలో కూడా ఇన్వెస్టర్లు పెట్టుబడుల స్పీడ్ పెంచారు. ఇదిలాఉంటే, అంతర్జాతీయంగా పుత్తడి సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో దూసుకెళ్తూనే ఉంది. తాజాగా ఔన్స్ రేటు 2,600 డాలర్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. దీంతో దేశీయంగానూ సుంకం కోతకు ముందు స్థాయికి, అంటే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.75,500కు చేరింది. గోల్డ్ బాండ్ల నిలిపివేత ఎఫెక్ట్... గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదరణ తగ్గేందుకు గోల్డ్ బాండ్లు ప్రధాన కారణం. దేశంలో బంగారం దిగుమతులకు అడ్డుకట్టవేయడం కోసం 2016లో ప్రవేశపెట్టిన ఎస్జీబీ స్కీమ్‌ను ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభం వరకు పక్కాగా అమలు చేసింది. క్రమంతప్పకుండా ఎస్జీబీలను జారీ చేస్తూ వచి్చంది. అటు బంగారం ధర భారీగా పెరగడంతో పాటు వార్షికంగా 2.5% వడ్డీ రేటు లభించడం.. 8 ఏళ్ల మెచ్యూరిటీ వరకు పెట్టుబడులను కొనసాగిస్తే మూలధన లాభాల పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డ్ బాండ్లపై బాగా ఆసక్తి చూపారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో గడువు తీరిన ఎస్‌జీబీలపై 120 శాతం పైగానే రాబడి లభించడం విశేషం. ప్రస్తుతం ఇంకా రూ.27,000 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లు ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. అయితే, బంగారం ధర భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రం కొత్త గోల్డ్ బాండ్ల జారీకి ముఖం చాటేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. దీంతో ఇక ఈ స్కీమ్‌కు ప్రభుత్వం నీళ్లొదిలినట్టేననేది పరిశీలకుల అభిప్రాయం. ఈటీఎఫ్‌ల వైపు చూపు... గడిచిన ఏడాది కాలంలో గోల్డ్ 20 శాతం మేర రాబడులు అందించింది. గోల్డ్ బాండ్ల జారీ నిలిచిపోవడంతో ఇన్వెస్టర్లకు ప్రధానంగా రెండే ఆప్షన్లున్నాయి. ఇప్పటికే ట్రేడవుతున్న గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడం, లేదంటే గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం. ‘బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై సానుకూల పన్ను విధానం, కస్టమ్స్ సుంకం తగ్గింపు, తాజా గోల్డ్ బాండ్ల జారీ లేకపోవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు మళ్లీ గోల్డ్ ఈటీఎఫ్‌ల బాట పడుతున్నారు’ అని మనీ మంత్ర ఫౌండర్ విరల్ భట్ పేర్కొన్నారు. గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ తర్వాత భారీగా లాభాలను కళ్లజూసిన ఇన్వెస్టర్లు సైతం మళ్లీ ఆ ఆప్షన్ లేకపోవడంతో గోల్డ్ ఈటీఎఫ్‌లకు తిరిగొస్తున్నారని ఫండ్ డి్రస్టిబ్యూటర్లు చెబుతున్నారు. తాజా బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను తగ్గింపు కూడా గోల్డ్ ఈటీఎఫ్‌లకు సానుకూలంగా మారింది. పెట్టుబడిని రెండేళ్లకు పైగా కొనసాగిస్తే 12.5% సుంకం చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ఇన్వెస్టర్ల ట్యాక్స్ శ్లాబ్‌ను బట్టి పన్ను విధింపు ఉండేది.రేటు రయ్ రయ్...భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత ఖాయంగా కనిపిస్తుండటంతో బంగారం రేట్లు మరింత ఎగబాకే అవకాశం ఉందనేది ఫండ్ మేనేజర్ల అంచనా. ‘మెరుగైన రాబడుల నేపథ్యంలో పసిడి పెట్టుబడుల ట్రెండ్ కొనసాగనుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన పుత్తడిలోకి పెట్టుబడులు పెరిగాయి. సెంట్రల్ బ్యాంకులు సైతం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. ఇవన్నీ గోల్డ్ రష్కు మరింత దన్నుగా నిలుస్తున్నాయి’ అని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా అభిప్రాయపడ్డారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌లలో అమ్మకాలు..
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లలో గత నెల (ఏప్రిల్) ఇన్వెస్టర్లు నికరంగా రూ. 396 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే, గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) మార్చి నెలాఖరున ఉన్న రూ. 31,224 కోట్ల నుంచి 5 శాతం పెరిగి రూ. 32,789 కోట్లకు చేరింది. రూపాయి మారకంలో చూస్తే పసిడి గత ఏడాది వ్యవధిలో మెరుగైన పనితీరే కనపర్చినప్పటికీ ఈక్విటీలతో పోలిస్తే తక్కువేనని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అనలిస్ట్ మెలి్వన్ శాంటారీటా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈటీఎఫ్‌లలో మదుపరులు కొంత లాభాలు స్వీకరించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. దీంతో ధర పెరిగినా ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులు నికరంగా తరలిపోయి ఉంటాయని వివరించారు. 2023 మార్చి తర్వాత గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం ఇదే ప్రథమం. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) డేటా ప్రకారం గతేడాది మార్చిలో నికరంగా రూ. 266 కోట్లు తరలిపోయాయి. తాజాగా మార్చిలో రూ. 373 కోట్లు వచ్చాయి. ఇక, గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోల సంఖ్య మార్చిలో 50.61 లక్షలుగా ఉండగా.. ఏప్రిల్‌లో సుమారు 1 లక్ష పెరిగి రూ. 51.94 లక్షలకు చేరింది. 2022లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ. 459 కోట్లు రాగా, 2023లో దానికి అనేక రెట్లు అధికంగా రూ. 2,920 కోట్లు వచ్చాయి. గతేడాది నెలకొన్న పరిస్థితుల కారణంగా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా, ద్రవ్యోల్బణానికి తగిన హెడ్జింగ్ సాధనంగా పసిడికి ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారడం తదితర అంశాల వల్ల ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు ఇన్వెస్టర్ల నుంచి చక్కని ఆదరణ లభించింది. 2023లో ఇన్వెస్టర్లు రూ.2,920 కోట్లను ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేశారు. 2022లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే గతేడాది ఆరు రెట్లు పెరుగుదల కనిపిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల పెరుగుదల, అనిశి్చతుల నేపథ్యంలో సురక్షిత సాధనమైన బంగారం వైపు ఎక్కువ మంది మొగ్గు చూపించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2022లో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రూ.459 కోట్లు రాగా, 2023లో రూ.2,920 కోట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా గతేడాది ఆగస్ట్ నెలలోనే రూ.1,028 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. 16 నెలల్లోనే ఇది గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ‘‘భౌతిక బంగారం పట్ల భారతీయుల్లో మక్కువ వందల సంవత్సరాల నుంచి ఉంది. దాంతో గోల్డ్ ఈటీఎఫ్‌లు మాదిరి పెట్టుబడి సాధనాలకు ఆమోదం తక్కువగా ఉండేది. కానీ, గడిచిన కొన్నేళ్లలో బంగారం డిజిటైజేషన్ పట్ల ఇన్వెస్టర్లు మళ్లుతున్నారు. సులభంగా ఇన్వెస్ట్ చేయడం, సౌకర్యంగా వెనక్కి తీసుకునే వెసులుబాటు గోల్డ్ ఈటీఎఫ్‌ను ఆమోదించడానికి కారణం. ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో బంగారం తప్పకుండా ఉండాలి’’అని జెరోదా ఫండ్ హౌస్ సీఈవో విషాల్ జైన్ పేర్కొన్నారు. నిర్వహణ ఆస్తులు పైపైకి బంగారం ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది 27 శాతం పెరిగి రూ.27,336 కోట్లకు చేరింది. 2022 డిసెంబర్ నాటికి ఈ మొత్తం రూ.21,445 కోట్లుగానే ఉండడం గమనించాలి. గత కొన్నేళ్లలో బంగారం అద్భుతమైన పనితీరు చూపించడాన్ని కూడా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాలి. ఇదే ఇన్వెస్టర్లు అధికంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రేరణగా నిలిచింది. గతేడాది గోల్డ్ ఈటీఎఫ్ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 2.73 లక్షలు అధికంగా ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం ఫోలియోలు 49.11 లక్షలకు చేరాయి. 2023 మాత్రమే కాకుండా, 2020, 2021లోనూ బంగారం ఈటీఎఫ్‌లు మంచి రాబడులను ఇచ్చాయి. 2021లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.4,814 కోట్లు, 2020లో రూ.6,657 కోట్ల చొప్పున పెట్టుబడులు వచి్చనట్టు యాంఫి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో బంగారం వ్యూహాత్మక సాధనంగా నిలుస్తుంది. చక్కని వైవిధ్యాన్ని ఇవ్వడంతోపాటు, ఆర్థిక పతనాలు, కఠిన మార్కెట్ పరిస్థితుల్లో నష్టాలను తగ్గిస్తుంది. అందుకే దీనికి సురక్షిత సాధనంగా గుర్తింపు ఉంది’’అని మారి్నంగ్‌స్టార్ ఇండియా రిసెర్చ్ విభాగం చీఫ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. గతేడాది ఈక్విటీ మార్కెట్ల దిద్దుబాటు, ఆకర్షణీయమైన అవకాశాల నేపథ్యంలో ఏకంగా రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులు స్టాక్స్‌ను వెతుక్కుంటూ వెళ్లాయి. అయినా కానీ, బంగారం ఈటీఎఫ్‌లు చెప్పుకోతగ్గ పెట్టుబడులను ఆకర్షించాయి. ఒక ఈటీఎఫ్ ఒక గ్రాము బంగారానికి సమానంగా స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవుతుంటుంది. షేర్ల మాదిరే సులభంగా కొనుగోలు చేసి విక్రయించుకోవచ్చు. -
కళ తప్పిన బంగారం ఈటీఎఫ్‌లు.. కారణమిదే!
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు గడిచిన ఆర్థిక సంవత్సరం (2022–23) పెద్దగా కలసి రాలేదు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.653 కోట్లకు పరిమితమయ్యాయి. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడం ఇందుకు కారణమని చెప్పుకోవాలి. పెట్టుబడులు తగ్గినప్పుటికీ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్టర్ల ఫోలియోలు (ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు నంబర్) మార్చి చివరికి 47 లక్షలకు పెరిగాయి. చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2022–23లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.2 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపించారు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీల దిద్దుబాటుకు లోను కాగా, డెట్ సాధనాలు ఆకర్షణీయంగా మారడం గమనించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ప్రకారం.. 2021–22లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.2,541 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ, 2022–23లో 75 శాతం తగ్గి రూ.653 కోట్లకు పరిమితయ్యాయి. 2019–20లో చూసినా కానీ రూ.1,614 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. అంతకుముందు సంవత్సరాల్లో గోల్డ్ ఈటీఎఫ్‌లు నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. గడిచిన నాలుగేళ్లలో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈక్విటీల్లోకి పెట్టుబడులు కుమ్మరించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మంచి రాబడులు వస్తుండడంతో ఈక్విటీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. బంగారం ప్రియం.. వార్షికంగా చూస్తే 2022–23లో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గడం అన్నది ఇన్వెస్టర్లు ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ పేర్కొన్నారు. ‘‘ఈక్విటీలకు ప్రాధాన్యం పెరిగినట్టు కనిపిస్తోంది. ఈక్విటీ విభాగాల్లోకి అదే పనిగా పెట్టుబడులు పెరగడం దీన్ని తెలియజేస్తోంది. రూపాయి బలహీన పడడం, యూఎస్ డాలర్ అప్ ట్రెండ్‌లో ఉండడం బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం చూపించాయి. మరింత ఖరీదుగా బంగారాన్ని మార్చేశాయి. ఇది మొత్తం మీద బంగారం ఈటీఎఫ్ పెట్టుబడులపై ప్రభావం చూపించింది’’అని కవిత కృష్ణన్ వివరించారు. మరోవైపు గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కారు సావరీన్ గోల్డ్ బాండ్లను నాలుగు విడతలుగా ఇష్యూ చేసింది. ఇది కూడా గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులపై ప్రభావం చూపించింది. మార్చి చివరి వారంలో బంగారం ధర 10 గ్రాములు రూ.59,400కు చేరడం తెలిసిందే. బంగారం ధరలు సానుకూలంగా ఉండడం, అదే సమయంలో ఇతర పెట్టుబడి సాధనాలు ప్రతికూల రాబడులు ఇవ్వడంతో, ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో రాబడులు స్వీకరించినట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవచ్చన్న అంచనాల నేపథ్యంలో 2023లో బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ సౌకర్యస్థాయికి ఎగువన కొనసాగుతుండడం, వడ్డీ రేట్లపై సెంట్రల్ బ్యాంకుల వైఖరి, ఆర్థిక వృద్ధి అవకాశాలు బలహీనపడిన నేపథ్యంలో బంగారం ధరలు మరో 10–15 శాతం మేర ప్రస్తుత సంవత్సరంలో పెరిగే అవకాశాలున్నాయని గోపాల్ కావలిరెడ్డి అంచనా వ్యక్తం చేశారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి 2021లో రూ.4,814 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ మార్కెట్ల విలువలు గరిష్టాలకు చేరి, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. 2020లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.6,657 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. దాంతో పోలిస్తే గతేడాది పెట్టుబడులు తగ్గినట్టు తెలుస్తోంది. అనిశ్చిత పరిస్థితుల్లో బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణిస్తుండడం తెలిసిందే. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు గతడాది కోలుకోవడం, అంతకుముందు ఏడాదితో పోలిస్తే బంగారం ఈటీఎఫ్‌లోకి పెట్టుబడులు తగ్గడానికి దారితీసినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. 2022లోనూ ఈ విభాగం పెట్టుబడులను ఆకర్షిస్తుందని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో జిమ్మీ పటేల్ పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించడంతో అది వృద్ధి, మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందన్నారు. ‘‘ఫెడ్ మానిటరీ పాలసీని కఠినతరం చేయడం డాలర్‌కు, యూఎస్ ఈల్డ్స్‌కు మద్దతునిస్తుంది. ఇది బంగారానికి ఎదురుగాలి అవుతుంది. ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు కొంతకాలం పాటు స్థిరీకరణను చూడొచ్చు. పెట్టుబడిదారులు బంగారాన్ని కూడబెట్టుకోవడానికి ఇది అనుకూల సమయం అవుతుంది’’అని జిమ్మీ పటేల్ వివరించారు. ఈ ఏడాది కూడా బంగారం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ సైతం అభిప్రాయపడ్డారు. -
బంగారం ఎలా ఉన్నా మెరుస్తుంది..!
ఏటా పండుగల సమయంలో బంగారం ఆభరణాలను కొనే సంప్రదాయాన్ని కొందరు అనుసరిస్తుంటారు. మరికొందరు కష్టార్జితం నుంచి ఆదా చేసుకున్న మొత్తంతో బంగారం ఆభరణాలను కొని పెట్టుకుంటారు. కొందరు అవసరం లేకపోయినా కానీ, క్లిష్ట సమయాల్లో ఆదుకుంటుందనో.. భవిష్యత్తులో తమ వారసులకు ఆస్తి రూపంలో వెళుతుందన్న ఉద్దేశంతో బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు కూడా చూడాలి. అవసరమైన మేర బంగారం ఆభరణాలను కలిగి ఉండడం తప్పుకాదు. కానీ, పరిమితికి మించి, పెట్టుబడుల కోసమని బంగారాన్ని పోగు చేసుకుంటుంటే.. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన రిస్క్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, పెట్టిన ప్రతీ రూపాయికి తగిన విలువను ఆభరణం రూపంలో పొందుతున్నామా? అని కూడా ప్రశ్నించుకోవాల్సిందే. పెట్టుబడుల కోసం, అత్యవసర సందర్భాల్లో ఆదుకుంటుందన్న భరోసా కోసం బంగారం కొనే వారికి.. భౌతిక బంగారం కాకుండా మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి గురించి సమగ్రంగా తెలియజేసే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ బంగారం ఈటీఎఫ్‌లు అన్నవి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అందిస్తున్నవి. ఇవి ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో స్టాక్స్ మాదిరే రోజువారీగా ట్రేడ్ అవుతుంటాయి. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా.. అందుబాటులోని డిజిటల్ మార్గాల్లో ఎస్జీబీ తర్వాత అత్యంత మెరుగైన సాధనం ఇది. ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. కానీ, గోల్డ్ ఈటీఎఫ్‌లకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఎందుకంటే షేర్ల మాదిరే గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లు ఇన్వెస్టర్ల ఖాతాలోకి వచ్చి చేరతాయి. డీమ్యాట్ ఖాతా కోసం కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే డీమ్యాట్ ఖాతా ఉన్న వారికి ఇది సులభమైన మార్గం అవుతుంది. ఎస్‌జీబీలో మాదిరే ఇక్కడ కూడా ఒక యూనిట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఒక యూనిట్ ఒక గ్రాముకు సమానం. గరిష్ట పెట్టుబడుల పరిమితి లేదు. వ్యయాలు: స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడవుతాయి కనుక కొనుగోలుపై బ్రోకరేజీ, ఎక్సేంజ్ చార్జీలు ఉంటాయి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవు. అలాగే, గోల్డ్ ఈటీఎఫ్‌లను మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తుంటాయి కనుక ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. పెట్టుబడుల విలువపై దీన్ని ఫండ్స్ వసూలు చేస్తుంటాయి. ఉదాహరణకు ఎస్బీఐ ఈటీఎఫ్ గోల్డ్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.51 శాతంగా ఉంది. ఏ ట్రేడింగ్ రోజైనా గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేసుకోవచ్చు, విక్రయించుకోవచ్చు. ఎస్‌జీబీలో మాదిరే లాభాలపై పన్ను అమలవుతుంది. రిస్క్: ఇన్వెస్టర్ కొనుగోలు చేసే ప్రతీ గోల్డ్ ఈటీఎఫ్‌కు సరిపడా బంగారాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కొనుగోలు చేస్తాయి. వాటిని వాల్ట్‌ల్లో నిల్వ చేస్తాయి. సెబీ నమోదిత కస్టోడియన్లు.. ఇలా గోల్డ్ ఈటీఎఫ్‌లకు సరిపడా బంగారాన్ని ఫండ్స్ సంస్థలు కొనుగోలు చేస్తుందీ, లేనిదీ పర్యవేక్షిస్తాయి. ఆడిటింగ్ కూడా ఉంటుంది. ఈ వివరాలను స్టాక్ ఎక్సేంజ్‌లు, సెబీకి కూడా సమర్పించాల్సి ఉంటుంది. కనుక ఇందులో రిస్క్ దాదాపుగా ఉండదు. కానీ, ఒక అంశాన్ని ఇన్వెస్టర్లు తప్పకుండా గుర్తు ంచుకోవాలి. స్టాక్స్ మాదిరే బంగారం ఈటీఎఫ్ ధరలు కూడా రోజువారీగా అంతర్జాతీయ ధరలను అనుసరించి హెచ్చు, తగ్గులకు గురవుతుంటాయి. కొనుగోలు చేసిన తర్వాత నష్టం కనిపిస్తే విక్రయిం చడం వంటి చర్యలు ఇందులో అనుకూలించవు. లిక్విడిటీ: సుమారు 13 గోల్డ్ ఈటీఎఫ్‌లు ఎన్ఎస్ఈలో లిస్ట్ అయి ఉండగా.. 11 గోల్డ్ ఈటీఎఫ్‌లు బీఎస్ఈలో అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వీటి అన్నింటిలోనూ చురుకైన ట్రేడింగ్ ఉండడం లేదు. కనుక ఎంపిక చేసుకునే ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ పరిమాణం ఆరోగ్యకర స్థాయిలో ఉన్నదీ, లేనిదీ ఇన్వెస్టర్లు ముందుగానే పరిశీలించుకోవాలి. లిక్విడిటీ ఎక్కువగా ఉన్న ఈటీఎఫ్‌ను ఎంపిక చేసుకుంటే విక్రయించుకోవడం సులభం అవుతుంది. నిప్పన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్, హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్‌లను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంది. అదే సమయంలో ట్రేడింగ్ కూడా ఎక్కువ పరిమాణంలో నమోదవుతుంటుంది. సార్వభౌమ బంగారం బాండ్ పసిడిని పోగు చేసుకోవాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఎన్నో మార్గాల్లో సౌర్వభౌమ బంగారం బాండ్ (ఎస్జీబీ) అత్యంత మెరుగైనది. ఇందులో పెట్టే ప్రతీ రూపాయికి భారత సర్కారు హామీ ఉంటుంది. ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను ఏటా పలు పర్యాయాలు ఇష్యూ చేస్తుంటుంది. ఈ బాండ్ గ్రాముల రూపంలో లభిస్తుంది. కనీసం ఒక గ్రాము నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. 2015 నవంబర్ నుంచి ఎస్జీబీలను ఆర్బీఐ విడుదల చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు, జనవరి 10 నుంచి 14వరకు, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4వ తేదీ మధ్య తదుపరి ఇష్యూలు అందుబాటులోకి రానున్నాయి. ఇష్యూ సమయంలో మార్కెట్ రేటు ఆధారంగా ఒక్కో గ్రాము రేటును ఆర్బీఐ ప్రకటిస్తుంది. ఎనిమిదేళ్ల కాల వ్యవధి తర్వాత అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా ఇన్వెస్టర్‌కు చెల్లింపులు చేస్తారు. అంతేకాదు. బంగారం పెట్టుబడి పెట్టేనాటి విలువపై 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ ఆదాయం కూడా ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేసిన వారు అందుకోవచ్చు. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం చెల్లిస్తారు. కొనుగోలు మార్గాలు: ఆర్బీఐ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టల్ కార్యాలయాలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌సీఐఎల్) శాఖలు, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టాక్ ఎక్సేంజ్‌లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నుంచి నేరుగా, స్టాక్ ఎక్సేంజ్‌ల సభ్యులైన బ్రోకర్ల రూపంలోనూ కొనుగోలు చేసుకోవచ్చు. ఆర్బీఐ తాజా ఇష్యూల సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే క్రితం ఇష్యూలకు సంబంధించిన ఎస్‌జీబీలు స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడ్ అవుతుంటాయి. వీటిల్లో ఏ ట్రేడింగ్ రోజైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆర్బీఐ ఇష్యూలో పాల్గొనే వారు.. ఎస్‌జీబీల కొనుగోలుకు పాన్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఎస్జీబీలను డిమ్యాట్ ఖాతాలో ఉంచుకోవాలని భావిస్తే.. అప్పుడు డీపీ ఐడీ, క్లయింట్ ఐడీని కూడా దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. చెక్కు, డీడీ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపుల సాధనాల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. నగదుతోనూ కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, రూ.20,000కే ఈ పరిమితి ఉంది. ఇంతకుమించి కొనుగోలు చేయాలనుకుంటే డిజిటల్ మార్గంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 4 కిలోల వరకు బంగారం బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. వ్యయాలు: బంగారాన్ని డెరివేటివ్ మార్గంలో కలిగి ఉండే సాధనమే ఎస్జీబీ. భౌతిక రూపానికి బదులు డాక్యుమెంట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దీనివల్ల పెద్దగా వ్యయాలు ఏవీ ఉండవు. అదే బంగారం ఆభరణాలు అయితే తయారీ చార్జీలు, వెస్టేజీ చార్జీల రూపంలో కొంత నష్టపోవాలి. పైగా తిరిగి అవసరమైనప్పుడు ఆ బంగారాన్ని మార్పిడి చేసుకోవాలన్నా, విక్రయించుకోవాలన్నా మళ్లీ తరుగు తీసేస్తారు. ఈ విధంగా కొంత నష్టం. కొనుగోలు సమయంలో జీఎస్టీ చార్జీలు చెల్లించాలి. ఇటువంటివన్నీ ఎస్‌జీబీలు, ఇతర డిజిటల్ గోల్డ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆదా చేసుకోవచ్చు. పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలంటే: ఎస్జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ముందుగానే పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలనుకుంటే ఐదేళ్లు పూర్తయిన తర్వాత సాధ్యపడుతుంది. ఐదో ఏట ముగిసినప్పటి నుంచి ఏడాదికోసారి ఆర్బీఐ ప్రత్యేక విండో ద్వారా ఇందుకు అవకాశం కల్పిస్తుంది. విండో ప్రారంభానికి ముందు మూడు రోజుల సగటు బంగారం మార్కెట్ ధర ఆధారంగా కొనుగోలు ధరను ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఆలోపే వైదొగాలని అనుకుంటే స్టాక్ ఎక్సేంజ్‌ల్లో విక్రయించుకోవచ్చు. కాకపోతే స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ఒక్కోరోజు ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. పన్ను: ఎస్‌జీబీపై ఏటా లభించే 2.5 శాతం ఆదాయం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి పన్ను రిటర్నుల్లో చూపించాలి. ఇన్వెస్టర్ ఆదాయం ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎనిమిదేళ్ల కాల వ్యవధి ముగిసిన తర్వాత లభించే మూలధన లాభం (పెట్టుబడిపై సమకూరిన లాభం)పై పన్ను ఉండదు. ఒకవేళ ఎనిమిదేళ్లలోపే ఎస్జీబీని విక్రయిస్తే కనుక అప్పుడు పన్ను బాధ్యత వేర్వేరుగా ఉంటుంది. పెట్టబడి తేదీ నుంచి మూడేళ్లు నిండక ముందే విక్రయించితే.. లాభం స్వల్పకాలిక మూలధన లాభం అవుతుంది. ఇది ఇన్వెస్టర్ వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. మూడేళ్లు నిండిన తర్వాత విక్రయించిన సమయంలో వచ్చిన లాభం దీర్ఘకాలిక మూలధన లాభం అవుతుంది. అప్పుడు లాభంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్ బంగారాన్ని డిజిటల్ రూపంలో ఫిన్‌టెక్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. బంగారంలో పెట్టుబడులకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాధనం ఇది. ఎంఎంటీసీ పీఏఎంపీ, సేఫ్గోల్డ్, అగ్మాంట్ గోల్డ్ అనే మూడు సంస్థలు డిజిటల్ గోల్డ్‌ను నేరుగాను, ఫిన్‌టెక్ సంస్థల ద్వారా అందిస్తున్నాయి. కొనుగోలు చేసిన విలువకు సరిపడా డిజిటల్ గోల్డ్ ఇన్వెస్టర్ ఖాతాలో ఉంటుంది. దీనికి అంతే విలువైన భౌతిక బంగారాన్ని పైన చెప్పుకున్న మూడు సంస్థలు కొనుగోలు చేసి వాల్టుల్లో ఉంచుతాయి. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే.. ఇన్వెస్టర్ తనకు అవసరనుకుంటే బంగారాన్ని భౌతిక రూపంలోడెలివరీ తీసుకోవచ్చు. లేదంటా ఆభరణాలుగానూ మార్చుకోవచ్చు. రిస్క్: ఎస్‌జీబీలపై ఆర్బీఐ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. అలాగే, గోల్డ్ ఈటీఎఫ్‌లపై సెబీ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. కానీ, డిజిటల్ గోల్డ్‌పై ప్రస్తుతానికి నియంత్రణల్లేవు. ఇటీవలి వరకు స్టాక్‌బ్రోకర్లు, వెల్త్‌మేనేజ్‌మెంట్ సంస్థలు సైతం డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేశాయి. కానీ, దీనికి దూరంగా ఉండాలని సెబీ ఆదేశించింది. డిజిటల్ గోల్డ్‌లో క్రయ, విక్రయ లావాదేవీల సేవలు 2021 సెప్టెంబర్ 10 నుంచి అందించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎంఎంటీసీ పీఏఎంపీ, సేఫ్గోల్డ్, అగ్మాంట్ గోల్డ్ అన్నవి ట్రస్టీలు. భౌతిక బంగారాన్ని ఇవి కొనుగోలు చేసి, నిల్వ చేస్తున్నాయా అన్న దానిపై క్రమం తప్పకుండా ఆడిట్లు నడుస్తుంటాయి. ఎస్జీబీ, గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే వీటిల్లో రిస్క్ ఎక్కువ. కొనుగోళ్లు: రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకుంటే.. ఈ మూడు సంస్థల వెబ్సైట్ల నుంచి నేరుగాను, వీటితో భాగస్వామ్యం కలిగిన సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గూగుల్‌పే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, కాయిన్‌బజార్ తదితర భాగస్వామ్య సంస్థలు సైతం డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఆయా సంస్థలకు కేవైసీ వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సంస్థలు, ఆధార్, పాన్ తప్పనిసరిగా అడుగుతున్నాయి. ఎస్జీబీ, గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఒక గ్రాము నుంచే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, డిజిటల్ గోల్డ్ అయితే రూపాయితోనూ కొనుగోలు చేసుకోగల సౌలభ్యం ఉంది. సేఫ్గోల్డ్ కనీసం రూ.10 మొత్తంతో కొనుగోలుకు అనుమతిస్తోంది. వ్యయాలు: కొనుగోలు విలువపై 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు కొనుగోలు ధరలో కలసి ఉంటాయి. ఎంఎంటీసీ పీఏఎంపీ అయితే 2.9 శాతం పేమెంట్ గేట్‌వే చార్జీలను కూడా తీసుకుంటోంది. డిజిటల్ గోల్డ్‌కు మొదటి ఐదేళ్లు స్టోరేజీ చార్జీలు ఉండవు. ఐదేళ్ల తర్వాత నుంచి సేఫ్గోల్డ్ అప్పటి విలువపై 0.24 శాతం, ఎంఎంటీసీ పీఏఎంపీ 0.4 శాతం చొప్పున స్టోరేజీ చార్జీలను వార్షికంగా వసూలు చేస్తున్నాయి. భౌతిక రూపంలో బంగారాన్ని డెలివరీ తీసుకోవాలంటే అందుకు తయారీ చార్జీలు, డెలివరీ చార్జీలను భరించాలి. మరో అంశం.. కొనుగోలు ధర, అమ్మకం ధర మధ్య వ్యత్యాసం ఇక్కడ సాధారణంగా అమలవుతుంటుంది. ఈ రూపంలోనూ ఇన్వెస్టర్లు కొంత నష్టపోవాల్సి ఉంటుంది. కాలవ్యవధి: ఆగ్మంట్ ఐదేళ్లు, సేఫ్గోల్డ్ పదేళ్లను మెచ్యూరిటీ పీరియడ్‌గా అమలు చేస్తున్నాయి. ఎంఎంటీసీ పీఏఎంపీ ఇటువంటి నిబంధన అమలు చేయడం లేదు. కాల వ్యవధి తర్వాత విక్రయించుకోవవచ్చు. లేదంటే బంగారం బార్లు, కాయిన్లు, లేదా ఈ సంస్థలో ఒప్పందం కలిగిన జ్యుయలర్స్ నుంచి బంగారం ఆభరణాల రూపంలో డెలివరీ తీసుకోవచ్చు. టాటా గ్రూపులో భాగమైన తనిష్క్.. సేఫ్‌గోల్డ్‌తో ఒప్పందం చేసుకుంది. సేఫ్గోల్డ్ వద్ద డిజిటల్ గోల్డ్‌ను కలిగిన వారు.. తమకు కావాలనుకున్నప్పుడు సమీపంలోని తనిష్క్ స్టోర్‌కు వెళ్లి ఆభరణాలుగా మార్చుకోవచ్చు. ఇందుకు తయారీ, ఇతర చార్జీలు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్‌లోనూ పన్ను బాధ్యత ఎస్‌జీబీల్లో మాదిరే ఉంటుంది. గోల్డ్ ఫండ్స్ ఇవి ఒక రకం మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకని వీటిని ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పోర్టళ్ల నుంచి నేరుగా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మార్గంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు. అలాగే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా అయితే డిస్ట్రిబ్యూటర్ల కమీషన్ రూపంలో అదనపు చార్జీని భరించాల్సి వస్తుంది. ఇది విడిగా ఉండదు కానీ, ఎక్స్పెన్స్ రేషియోలోనే కలుస్తుంది. వీటి కొనుగోలుకు పాన్, ఆధార్ నంబర్, చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలను ఇవ్వాలి. ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి ఉంటే తాజాగా కేవైసీ వివరాలను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీ పాన్, ఆధార్ వివరాల ఆధారంగా సెంట్రల్ కేవైసీ డేటాబేస్ నుంచి ఫండ్ సంస్థే వివరాలు తీసుకుంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల కొనుగోలుకు తక్కువలో తక్కువ రూ.4,000కుపైనే పెట్టుబడి అవసరం. కానీ, గోల్డ్ ఫండ్స్ పథకాల్లో రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వ్యయాలు/పన్నులు: ఫండ్ ఆఫ్ ఫండ్ కనుక వ్యయాలు రెండింతలు ఉంటాయి. గోల్డ్ ఫండ్స్ తన నిర్వహణలోని పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక.. అక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఒకటి అమలవుతుంది. తిరిగి గోల్డ్ ఫండ్స్ కూడా ఎక్స్పెన్స్ రేషియో వసూలు చేస్తాయి. పెట్టుబడి పెట్టిన ఏడాదిలోపు విక్రయించితే ఎగ్జిట్ లోడ్ కూడా అమలవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పోర్టళ్ల నుంచే కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. విక్రయించిన తర్వాత మీ రిజిస్టర్డ్ బ్యాంకు ఖాతాకు ఆ మొత్తం జమ అవుతుంది. బంగారంలో పెట్టబడులు అన్నింటికీ పైన ఎస్‌జీబీలో చెప్పుకున్నట్టే పన్ను బాధ్యతలు వర్తిస్తాయి. గోల్డ్ ఫండ్స్‌లో ఉన్న ఒక అనుకూలత ఏమిటంటే.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనీస సిప్ రూ.100 నుంచి పెట్టుకోవచ్చు. పైగా డీమ్యాట్ ఖాతా కూడా అవసరం లేదు. గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడవుతాయి. కనుక విక్రయించుకునేందుకు సరిపడా వ్యాల్యూమ్ అవసరం. అదే గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఈ విధమైన లిక్విడిటీ రిస్క్ లేదు. మీరు ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. ఫండ్స్ సంస్థలు నిబంధనలకు అనుగుణంగా మీకు చెల్లింపులు చేస్తాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్, ఎస్బీఐ గోల్డ్ ఫండ్లను ఈ విభాగంలో ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో 0.50 శాతం వరకు ఉంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని పథకాలు కనుక సెబీ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటుంది. -
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.1,328 కోట్లు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)లోకి జూన్ త్రైమాసికంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. నికరంగా రూ.1,328 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. కానీ, క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో వచ్చిన రూ.2,040 కోట్లతో పోలిస్తే తగ్గినట్టు.. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది భారీగా పెట్టుబడులు రావడం అన్నది అప్పటి అనిశ్చిత పరిస్థితుల వల్లేనని మార్కెట్ పల్స్ సీఈవో అర్షద్ ఫాహోమ్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలోకి కొంత పెట్టుబడులను మళ్లించడమే భారీ పెట్టుబడులకు కారణమని గ్రీన్‌పోర్ట్‌ఫోలియో సహ వ్యవస్థాపకుడు దివమ్ శర్మ తెలిపారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) బంగారం ఈటీఎఫ్‌ల్లోకి రూ. 1,779 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 5 -
పసిడి పెట్టుబడికి దారేదీ..?
బంగారం అంటే ఎవరికి మోజు ఉండదు చెప్పండి. ఆభరణాల రూపంలో మహిళలు, పెట్టుబడి రూపంలో ఇన్వెస్టర్లు గోల్డ్‌ను కొంటుంటారు. ఈమధ్య కాలంలో ఆన్లైన్లో గోల్డ్ కొనడమూ పెరిగింది. మరి, డిజిటల్ రూపంలో బంగారం కొనడం ఉత్తమమేనా? బంగారంలో పెట్టుబడి భద్రంగా ఉండాలంటే? రెట్టింపు రాబడి రావాలంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు, బంగారం.. ఇవీ భారతీయుల పెట్టుబడి సాధనాలు. గోల్డ్‌లో పెట్టుబడులు అత్యంత భద్రమైనవని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ వ్యాలెట్ ద్వారా బంగారాన్ని డిజిటల్‌గా కొనడం ఒక మార్గం. అయితే ఇలాంటి ఉత్పత్తుల కొనుగోళ్లు రెగ్యులేటరీ పరిధిలోకి రావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణకు సెబీ తరహాలో బంగారాన్ని విక్రయించే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లను పర్యవేక్షించడానికి ఎలాంటి నియంత్రణ సంస్థ లేదు. రెగ్యులేటరీ నిబంధనలు వర్తించే, సురక్షితమైన బంగారు పెట్టుబడులు ఏంటో ఓసారి చూద్దాం... సావరిన్ గోల్డ్ బాండ్స్ సావరిన్ గోల్డ్ బాండ్లను (ఎస్జీబీ)లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేస్తుంది. ఒక గ్రాము లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన బాండ్లను ఇస్తుంది. ఎస్జీబీ ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. బాండ్ ముఖ విలువపై సంవత్సరానికి 2.5 శాతం కూపన్‌తో సార్వభౌమ హామీని కలిగి ఉంటారు. ఇది బాండ్ మెచ్యూరిటీ విలువ, బంగారం ధరల మీద ఆధారపడి ఉంటుంది. బంగారం రాబడిలో సావరిన్ గోల్డ్ బాండ్స్ క్యాపిటల్ అప్రిసియేషన్గా గుర్తింపు పొందాయి. ఈ బాండ్ల మెచ్యూరిటీ వరకు గనక ఇన్వెస్టర్ వెయిట్ చేస్తే.. వ్యక్తిగత పెట్టుబడిదారులకు మూలధన లాభాల పన్ను మినహాయించబడుతుంది. అయితే మెచ్యూరిటీ సమయం ఎనిమిది సంవత్సరాలుగా ఉంది. ఈ బాండ్లను ఆర్బీఐ తిరిగి కొనుగోలు చేసినప్పుడు ఐదేళ్ల తర్వాత ప్రీ–మెచ్యూర్ ఎగ్జిట్‌కు అనుమతించబడుతుంది. ఒకవేళ మీరు ఈ బాండ్లను ఆర్బీఐకి కాకుండా సెకండరీ మార్కెట్లో విక్రయించినట్లయితే మూలధన లాభాలపై 20 శాతం (ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో కలిపి) పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సడెన్‌గా ప్రీ–మెచ్యుర్ కంటే ముందే ఎగ్జిట్ కావాలనుకుంటే మాత్రం.. కూపన్ చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు సంబంధిత బ్యాంక్ లేదా బ్రోకర్‌ను సంప్రదించాలి. ఐదేళ్లు పూర్తికాకముందే పెట్టుబడిదారులు ఎస్జీబీలను సెకండరీ మార్కెట్లో విక్రయించవచ్చు. కానీ, సంబంధిత ఇన్వెస్టర్ మూలధన లాభాల పన్నును చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. 36 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం ఉంచినట్లయితే స్లాబ్ రేట్, 36 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచినట్లయితే ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో కలిపి 20% క్యాపిటల్ ట్యాక్స్ భరించాల్సి ఉంటుంది. ఎస్‌జీబీలో ప్రధాన సమస్య ఏంటంటే.. ఎస్‌జీబీల విషయంలో ప్రధాన సమస్య ఏంటంటే.. సెకండరీ మార్కెట్లో కొనడం లేదా అమ్మడం అంత సులువైన అంశం కాదు. పెట్టుబడిదారుడు, బ్రోకర్‌కు ఒకే డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ)తో డిపాజిటరీ అకౌంట్ ఉంటే తప్ప ఎస్‌జీబీల బదిలీ కఠినం. ఎందుకంటే ఇంటర్ డిపాజిటరీ బదిలీని అనుమతించని ఎస్జీబీలను మాత్రమే ప్రభుత్వ సెక్యూరిటీలుగా పరిగణిస్తారు కాబట్టి! ఎస్జీబీలలో ఇంటర్ డిపాజిటరీ బదిలీకి ఆర్బీఐ అనుమతులు ఇచ్చినప్పటికీ.. డిపాజిటరీలు దీనికి సంబంధించిన సాంకేతిక సమస్యలను పూర్తిగా క్రమబద్ధీకరించలేదు. రిటైల్ పెట్టుబడిదారులకు స్నేహపూర్వక పన్ను విధానం ఉండగా.. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు మాత్రం ఎస్‌జీబీల ఎంట్రీ, ఎగ్జిట్‌లో ప్రతికూలతలున్నాయి.ఎస్జీబీలలో సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ పరిమితం. కొత్త ఆఫర్లు తెరిచినప్పుడు మాత్రమే ఈ బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్బీఐ బైబ్యాక్ విండోను తెరిచినప్పుడు ఆయా బాండ్లను విక్రయించాల్సి ఉంటుంది. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్లలోని గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. ఈటీఎఫ్‌లు ఎస్‌జీబీల కంటే కొంచెం తక్కువ రాబడిని ఇస్తాయి. కానీ, బంగారం మీద కాగితపు రహిత, దీర్ఘకాలిక పెట్టుబడులకు, స్నేహపూర్వక ఎంపికలకు మాత్రం ఈటీఎఫ్‌లు సరైనవి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) జారీ చేసిన ప్రతి యూనిట్ ఈటీఎఫ్.. భౌతికంగా కొనుగోలు చేసిన బంగారానికి సమానవైన విలువను కలిగి ఉంటుంది. ఏఎంసీలను సెబీ రిజిస్టర్డ్ కస్టోడియన్ ధ్రువీకరిస్తారు. బంగారాన్ని భద్రపరిచే బాధ్యత కస్టోడియన్దే. గోల్డ్ ఈటీఎఫ్‌లను స్వతంత్ర ఖజానా ప్రొవైడర్ నిల్వ చేస్తారు. ఈయన రోజువారీ రికార్డ్లను నిర్వహిస్తుంటాడు. బార్ నంబర్, స్వచ్ఛత ధ్రువీకరణ పత్రాలతో రోజువారీ బంగారం ధరల కదలికలను ట్రాక్ చేస్తుంటాడు కూడా. మొబైల్ వాలెట్స్ జారీ చేసినవి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ఇష్యూ చేసే గోల్డ్ ఈటీఎఫ్‌ల నెలవారీ వివరాలను సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి బహిర్గత పరచాల్సి ఉంటుంది. ఎంఎఫ్‌ల గోల్డ్ హోల్డింగ్స్‌లకు ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఆడిట్ కూడా జరుగుతుంది. ఈటీఎఫ్‌లలో టాస్క్ ఏంటంటే.. ఈటీఎఫ్‌ల ప్రధాన సమస్య ఏంటంటే.. ఎస్‌జీబీలతో పోల్చితే ఈటీఎఫ్‌ల ఖర్చు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎంఎఫ్‌లు ఫండ్ మేనేజ్మెంట్ ఫీజులను విధిస్తాయి. అన్ని బంగారు ఈటీఎఫ్‌లు సెకండరీ మార్కెట్లో చురుకుగా ట్రేడ్ కావు. అలాగే ధరలు అంతర్లీనంగా నికర ఆస్తి విలువల (ఎన్ఏవీ) కంటే దూరంగా ఉంటాయి. అందుకే పెట్టుబడిదారులు తమ ఎన్ఏవీలకు దగ్గరగా కోట్ చేసే ట్రేడింగ్ వాల్యూమ్స్‌తో గోల్డ్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవటం ఉత్తమం. అంతేకాకుండా ఎస్‌జీబీల మాదిరిగా కాకుండా గోల్డ్ ఈటీఎఫ్‌ల మీద మూలధన లాభాల పన్ను ఉంటుంది. అది భౌతిక బంగారంపై ఎంతైతే పన్ను విధించబడుతుందో అంతే ఉంటుంది. గోల్డ్ ఫ్యూచర్స్... ఇండియాలో అతిపెద్ద సెక్యూరిటీస్ అండ్ కమొడిటీస్ ఎక్స్ఛేంజ్ కంపెనీ మల్టి కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) తీసుకొచ్చిన గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే గోల్డ్ ఫ్యూచర్స్. ఎంసీఎక్స్‌లో ఒక గ్రాము విలువ నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఎంసీఎక్స్ సెబీ నియంత్రణలో ఉంటుంది. గోల్డ్ పెటల్ అనేది బాగా సక్సెస్ అయిన రిటైల్ గోల్డ్ ఇన్వెస్టర్ కాంట్రాక్ట్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్), లిక్విడ్ ఆర్డర్ బుక్ చేసే వీలుండటమే రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రధాన కారణాలని ఎంసీఎక్స్ హెడ్ శివాన్షు మెహతా చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో గోల్డ్ పెటల్ ప్రారంభమైంది. 2019–20లో గోల్డ్ పెటల్ కాంట్రాక్ట్‌లో సగటు రోజువారీ టర్నోవర్ రూ.10,163 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇది అత్యధికంగా రూ.54,415 కోట్లుగా ఉంది. ఇతర రకాల గోల్డ్ పెట్టుబడులతో పోలిస్తే.. గోల్డ్ ఫ్యూచర్స్ ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. పెట్టుబడిదారులు బంగారం విలువ పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్ విలువలో ఆరు శాతం మార్జిన్‌ను చెల్లించవచ్చు. లేదా పూర్తి విలువను చెల్లించవచ్చు. కాకపోతే మీరు బంగారాన్ని కూడబెట్టుకోవాలనుకున్నా లేదా డెలివరీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒప్పంద గడువు ముగిసే సమయానికి పూర్తి విలువను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్ట్ ధర, అస్థిరతను బట్టి అదనపు మార్జిన్లను వసూలు చేయవచ్చు. గోల్డ్ ఫ్యూచర్స్‌లో వచ్చే ఆదాయాన్ని కమొడిటీస్ ఇన్‌కమ్‌తో కలుపుతారు. దీనికి స్లాబ్ రేట్‌ను బట్టి పన్ను విధించబడుతుంది. బంగారం... భారతీయులకు బంగారమే భారతీయులకు బంగారం అంటే.. సాంప్రదాయం, సరదా, పెట్టుబడి.. అన్నీ కలిసిన సాధనం. ప్రస్తుతం కరోనా వైరస్‌పరమైన అనిశ్చితి కారణంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. పసిడిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు పలు మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లలో సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా రూ. 2,400 కోట్ల మేర పెట్టుబడులు రావడం ఫండ్స్‌కి ప్రాచుర్యం పెరుగుతోందనడానికి నిదర్శనం. ఫిజికల్‌గా కనీసం ఒక్క గ్రాము బంగారం నాణేన్ని కొనాలంటే రూ. 5,000 దాకా వెచ్చించాల్సి ఉంటోంది. అలా కాకుండా పసిడి ఈటీఎఫ్‌లలో అత్యంత తక్కువగా రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి కాకపోతే ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి వాటి ద్వారా నెలవారీ కొద్ది కొద్దిగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ. 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. – డీపీ సింగ్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ -
మెరవని గోల్డ్ ఈటీఎఫ్‌లు
► ఏప్రిల్–ఆగస్టు మధ్య రూ.300 కోట్లు బయటకు! ► నిధుల ఆకర్షణలో ఈఎల్ఎస్ఎస్ గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) తమ కాంతిని కోల్పోవడం కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఇన్వెస్టర్లు రూ.300 కోట్ల మేర గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి వెనక్కు తీసుకున్నారు. గోల్డ్ ఈటీఎఫ్లకన్నా ఈక్విటీల పనితీరు బాగుండటమే దీనికి కారణమన్నది విశ్లేషణ. తాజా గణాంకాల ప్రకారం ముఖ్యాంశాలను చూస్తే... ♦ గడచిన నాలుగు సంవత్సరాలుగా గోల్డ్ ఈటీఎఫ్‌లు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. 2013–14లో రూ.2,293 కోట్లు ఈటీఎఫ్‌ల నుంచి వెనక్కు మళ్లింది. 2014–15 సంవత్సరం లో ఈ మొత్తం రూ.1,475 కోట్లుగా ఉంది. 2015–16లో రూ.903 కోట్లుకాగా, 2016–17లో రూ.775 కోట్లు. అయితే బయటకు వెళుతున్న మొత్తం తగ్గుతుండటం కొంత ఊరట. ♦ గోల్డ్ ఈటీఎఫ్‌ల పరిస్థితి ఇలా ఉంటే, ఈక్విటీ, ఈక్విటీ అనుసంధాన పొదుపు స్కీమ్‌లలోకి (ఈఎల్ఎస్ఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో రూ.61,000 కోట్లు వచ్చాయి. ఒక్క చివరి నెల వాటా ఇందులో రూ.20,000 కోట్లు ♦ యాంఫి (అసోచామ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా) నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య 14 గోల్డ్ ఆధారిత ఈటీఎఫ్‌ల నుంచి దాదాపు రూ.300 కోట్ల నికర మొత్తం వెనక్కు మళ్లింది. మార్చి ముగిసే నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ కింద (ఏయూఎం) రూ.5,480 కోట్లు ఉంటే ఈ మొత్తం ఆగస్టు ముగిసే నాటికి రూ.5,189 కోట్లు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.462 కోట్లు. -
గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఆనాసక్తి
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లపై ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2016–17) ఈ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఇన్వెస్టర్లు రూ.775 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సోమవారం నాడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరగడం వరుసగా ఇది నాల్గవ ఏడాది. వరుసగా నాలుగు సంవత్సరాల్లో ఉపసంహరణల మొత్తం తగ్గుతుండటం గమనార్హం. అసెట్ క్లాస్‌గా ఈక్విటీల్లోకి ఇన్వెస్ట్మెంట్లు మళ్లించడమే ఈటీఎఫ్‌ల నుంచి ఉపసంహరణలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్క గడచిన ఏడాదిని పరిగణనలోకి తీసుకుంటే, ఒక్క అక్టోబర్ మినహా ప్రతి నెలలోనూ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్ట్మెంట్లు వెనక్కు మళ్లాయి. పండుగల సీజన్ వల్ల అక్టోబర్‌లో ఇన్‌ఫ్లోస్ జరిగినట్లు మ్యూచువల్ ఫండ్ రిసెర్చ్ సంస్థ– ఫండ్స్ ఇండియా. కామ్ హెడ్ విద్యా బాల అంచనావేశారు. గోల్డ్ ధరల ఆధారంగా రాబడులను అందించే ఇన్స్ట్రు మెంట్లే గోల్డ్ ఈటీఎఫ్‌లు. ప్రత్యక్షంగా పసిడి ధరతో ముడివడి ఉన్నందున, ఈ ప్రొడక్ట్‌లో పూర్తి పారదర్శకత ఉంటుంది. భారత్ మ్యూచువల్ ఫండ్ రంగంలో 2006–07 నుంచీ 14 గోల్డ్–ఆధారిత స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. -
బంగారం బాండ్లు వస్తున్నాయ్
♦ గోల్డ్ బాండ్ల జారీకి ప్రభుత్వం చర్చాపత్రం ♦ పోస్టాఫీసులు, ఏజెంట్ల ద్వారా విక్రయం ♦ పసిడి కడ్డీలు, నాణేల డిమాండ్ కట్టడికి చర్యలు న్యూఢిల్లీ : నాణేలు, కడ్డీలు తదితర రూపాల్లో బంగారానికి డిమాండ్‌ను కట్టడి చేసే దిశగా కేంద్రం తాజాగా సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్బీజీ) జారీ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. కమీషన్ ప్రాతిపదికన పోస్టాఫీసులు, ఇతరత్రా బ్రోకర్ల ద్వారా వీటిని జారీ చేయనుంది. ఏటా దాదాపు 300 టన్నుల మేర కడ్డీల రూపంలో జరుగుతున్న కొనుగోళ్లలో కొంత భాగాన్నైనా డీమ్యాట్ రూపంలోని బాండ్ల వైపు మళ్లించాలన్నది దీని వెనుక ఉద్దేశం. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు 50 టన్నుల పసిడికి సరిసమానమైన బాండ్ల జారీ ద్వారా రూ. 13,500 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తలపెట్టిన నిధుల సమీకరణ లక్ష్యంలో దీన్ని కూడా భాగం చేయాలని భావిస్తోంది. కడ్డీల రూపంలో ఉండే బంగారంపై ప్రస్తుతం ఉన్న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ దీనికి కూడా వర్తింపచేసే అవకాశాలున్నట్లు ఈ స్కీముకు సంబంధించి శుక్రవారం విడుదల చేసిన చర్చాపత్రంలో కేంద్రం పేర్కొంది. దీనిపై సంబంధిత వర్గాలు జూలై 2లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. మరోవైపు, సావరీన్ గోల్డ్ బాండ్ల ప్రతిపాదనను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్వాగతించింది. దీనితో పసిడి కొనుగోలుదారులకు మరో పెట్టుబడి సాధనం అందుబాటులోకి వచ్చినట్లవుతుందని పేర్కొంది. భారత్ దిగుమతుల్లో ముడి చమురు తర్వాత అత్యధిక భాగం బంగారమే ఉంటోంది. దేశం ఏటా సుమారు 800-900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. 2014లో దిగుమతి చేసుకున్న దాంట్లో దాదాపు 180 టన్నుల పసిడి కేవలం పెట్టుబడి అవసరాలకే పరిమితమయ్యింది. దీని వల్ల విదేశీ మారక నిల్వలు గణనీయంగా కరుగుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకే దేశీయంగా ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని చలామణీలోకి తెచ్చేందుకు, ప్రత్యామ్నాయ పసిడి ఇన్వెస్ట్మెంట్ సాధనాలను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే, పసిడి కొనుగోళ్లను తగ్గించేందుకు సావరీన్ గోల్డ్ బాండ్ తరహా ప్రత్యామ్నాయ ఆర్థిక సాధనాన్ని అందుబాటులోకి తేనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. దిగుమతి సమస్యలు తగ్గుతాయ్:ఇండియా రేటింగ్స్ ప్రతిపాదిత గోల్డ్ బాండ్ల ప్రతిపాదన వల్ల .. ప్రత్యేకంగా పెట్టుబడి కోసమే కొనుక్కునే బంగారానికి డిమాండ్ తగ్గగలదని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) పేర్కొంది. ఫలితంగా పసిడి దిగుమతులు, కరెంటు ఖాతా లోటు కూడా తగ్గొచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, బంగారం కడ్డీలు తదితర సాధనాలతో పోలిస్తే సావరీన్ గోల్డ్ బాండ్లకు మంచి ఆదరణే ఉండగలదని ఇండ్-రా తెలిపింది. దీనితో ఆభరణాల తయారీ వంటి అవసరాల కోసమే పసిడి దిగుమతులు పరిమితమయ్యే అవకాశముందని వివరించింది. పేపర్ రూపంలో ఉంటుంది కనుక పసిడి నాణ్యతను పరీక్షించుకోవడం లాంటి సమస్యలు ఉండవని, ఒకవేళ తన ఖా పెట్టాల్సి వచ్చినా ప్రక్రియ సులభతరంగానే ఉంటుందని పేర్కొంది. మరోవైపు, ప్రతిపాదిత స్కీమును బట్టి చూస్తే.. 2014లో మొత్తం ఇన్వెస్ట్మెంట్ డిమాండ్‌లో దాదాపు 27 శాతానికి సరిసమానంగా ఎస్బీజీల జారీ ఉంటుందని కన్సల్టెన్సీ సంస్థ నొమురా పేర్కొంది. దీంతో, తొలి ఏడాదే పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ అయిన పక్షంలో పసిడి ప్రస్తుత ధరల ప్రకారం బంగారం దిగుమతులపై దాదాపు 2 బిలియన్ డాలర్లను ఆదా చేసినట్లవుతుందని అంచనా వేసింది. స్కీము ఇలా.. ప్రతిపాదన ప్రకారం 2,5,10 గ్రాములు తదితర పరిమాణాల్లో పసిడికి సరిసమానంగా విలువ చేసే బాండ్లను ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. పసిడి ధరలు మధ్యకాలికంగా హెచ్చుతగ్గులకు లోనైనా ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు భంగం కలగకుండా దీర్ఘకాలిక ప్రాతిపదికన 5-7 సంవత్సరాల కాల వ్యవధితో ఈ బాండ్లు ఉండనున్నాయి. వీటిపై రాబడికి సంబంధించి నామమాత్ర వడ్డీ రేటు (బంగారంపై రుణాలకు అంతర్జాతీయంగా ఉన్న రేటుకు అనుసంధానమై) ఉంటుంది. కనిష్టంగా 2 శాతం లేదా 3శాతంగా వడ్డీ రేటు ఉండగదని అంచనా. మెచ్యూరిటీ తర్వాత అప్పటి పసిడి ముఖ విలువకు సరిసమానంగా రూపాయి మారకంలో చెల్లింపు జరుగుతుంది. బాండ్లపై వచ్చే వడ్డీ మాత్రం పసిడి గ్రాముల రూపంలో ఉండవచ్చని చర్చాపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. బంగారం రేట్లు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంటాయి కనుక.. ఇందులో ఉండే రిస్కుల గురించి ఇన్వెస్టరు అవగాహన ఉండాలి. ఇతరత్రా రుణాలు తీసుకునేందుకు వీటిని తనఖా కింద కూడా ఉపయోగించుకోవచ్చు. లోన్ టు వేల్యూ నిష్పత్తి ప్రస్తుతం బంగారం విషయంలో పాటిస్తున్నట్లే ఆర్బీఐ నిర్దేశించే విధంగా ఉంటుంది. పోస్టాఫీసుతో పాటు బ్రోకర్లు, ఏజెంట్ల ద్వారా వీటిని విక్రయించాలని, అందుకు తగిన కమీషన్ ఇవ్వాలన్నది ప్రతిపాదన. ప్రభుత్వ హామీ ఉండే ఈ బాండ్లను సులభంగా కమోడిటీ ఎక్స్చేంజీల్లో విక్రయించడానికి, ట్రేడింగ్ చేయడానికి వీలుంటుంది.