న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి 2021లో రూ.4,814 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ మార్కెట్ల విలువలు గరిష్టాలకు చేరి, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. 2020లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.6,657 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. దాంతో పోలిస్తే గతేడాది పెట్టుబడులు తగ్గినట్టు తెలుస్తోంది. అనిశ్చిత పరిస్థితుల్లో బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణిస్తుండడం తెలిసిందే. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు గతడాది కోలుకోవడం, అంతకుముందు ఏడాదితో పోలిస్తే బంగారం ఈటీఎఫ్‌లోకి పెట్టుబడులు తగ్గడానికి దారితీసినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు.
2022లోనూ ఈ విభాగం పెట్టుబడులను ఆకర్షిస్తుందని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో జిమ్మీ పటేల్ పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించడంతో అది వృద్ధి, మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందన్నారు. ‘‘ఫెడ్ మానిటరీ పాలసీని కఠినతరం చేయడం డాలర్‌కు, యూఎస్ ఈల్డ్స్‌కు మద్దతునిస్తుంది. ఇది బంగారానికి ఎదురుగాలి అవుతుంది. ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు కొంతకాలం పాటు స్థిరీకరణను చూడొచ్చు. పెట్టుబడిదారులు బంగారాన్ని కూడబెట్టుకోవడానికి ఇది అనుకూల సమయం అవుతుంది’’అని జిమ్మీ పటేల్ వివరించారు. ఈ ఏడాది కూడా బంగారం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ సైతం అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment