న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు గడిచిన ఆర్థిక సంవత్సరం (2022–23) పెద్దగా కలసి రాలేదు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.653 కోట్లకు పరిమితమయ్యాయి. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడం ఇందుకు కారణమని చెప్పుకోవాలి. పెట్టుబడులు తగ్గినప్పుటికీ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్టర్ల ఫోలియోలు (ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు నంబర్) మార్చి చివరికి 47 లక్షలకు పెరిగాయి.
చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2022–23లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.2 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపించారు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీల దిద్దుబాటుకు లోను కాగా, డెట్ సాధనాలు ఆకర్షణీయంగా మారడం గమనించొచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ప్రకారం.. 2021–22లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.2,541 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ, 2022–23లో 75 శాతం తగ్గి రూ.653 కోట్లకు పరిమితయ్యాయి. 2019–20లో చూసినా కానీ రూ.1,614 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. అంతకుముందు సంవత్సరాల్లో గోల్డ్ ఈటీఎఫ్‌లు నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. గడిచిన నాలుగేళ్లలో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈక్విటీల్లోకి పెట్టుబడులు కుమ్మరించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మంచి రాబడులు వస్తుండడంతో ఈక్విటీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది.
బంగారం ప్రియం..
వార్షికంగా చూస్తే 2022–23లో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గడం అన్నది ఇన్వెస్టర్లు ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ పేర్కొన్నారు. ‘‘ఈక్విటీలకు ప్రాధాన్యం పెరిగినట్టు కనిపిస్తోంది. ఈక్విటీ విభాగాల్లోకి అదే పనిగా పెట్టుబడులు పెరగడం దీన్ని తెలియజేస్తోంది. రూపాయి బలహీన పడడం, యూఎస్ డాలర్ అప్ ట్రెండ్‌లో ఉండడం బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం చూపించాయి. మరింత ఖరీదుగా బంగారాన్ని మార్చేశాయి.
ఇది మొత్తం మీద బంగారం ఈటీఎఫ్ పెట్టుబడులపై ప్రభావం చూపించింది’’అని కవిత కృష్ణన్ వివరించారు. మరోవైపు గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కారు సావరీన్ గోల్డ్ బాండ్‌లను నాలుగు విడతలుగా ఇష్యూ చేసింది. ఇది కూడా గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులపై ప్రభావం చూపించింది. మార్చి చివరి వారంలో బంగారం ధర 10 గ్రాములు రూ.59,400కు చేరడం తెలిసిందే.
బంగారం ధరలు సానుకూలంగా ఉండడం, అదే సమయంలో ఇతర పెట్టుబడి సాధనాలు ప్రతికూల రాబడులు ఇవ్వడంతో, ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో రాబడులు స్వీకరించినట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవచ్చన్న అంచనాల నేపథ్యంలో 2023లో బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ సౌకర్యస్థాయికి ఎగువన కొనసాగుతుండడం, వడ్డీ రేట్లపై సెంట్రల్ బ్యాంకుల వైఖరి, ఆర్థిక వృద్ధి అవకాశాలు బలహీనపడిన నేపథ్యంలో బంగారం ధరలు మరో 10–15 శాతం మేర ప్రస్తుత సంవత్సరంలో పెరిగే అవకాశాలున్నాయని గోపాల్ కావలిరెడ్డి అంచనా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment