మళ్లీ జోరందుకున్న పెట్టుబడులు...
బడ్జెట్లో సుంకం కోత.. పన్ను ఊరట ప్రభావం
తాజా గోల్డ్ బాండ్ల జారీ ఇప్పట్లో లేనట్టే!
ఇన్వెస్టర్లు పుత్తడి పెట్టుబడుల వెంట పడుతున్నారు. భారీగా లాభాలందిస్తున్న సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్‌జీబీ) జారీ నిలిచిపోవడం... తాజా బడ్జెట్లో పన్ను ఊరట.. బంగారం రేట్లు అంతకంతకూ దూసుకుపోతుండటంతో మదుపరులు మళ్లీ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా బంగారం కొనుగోళ్లకు సై అంటున్నారు.
గత కొంతకాలంగా మెరుపు కోల్పోయిన గోల్డ్ ఈటీఎఫ్‌లు మళ్లీ తళుక్కుమంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 6,134 కోట్ల విలువైన పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి వచి్చనట్లు అంచనా. ఇందులో రూ.4,500 కోట్లు గత నాలుగు నెలల్లోనే మదుపరులు ఇన్వెస్ట్ చేయడం విశేషం. అంతేకాదు, ఒక్క ఆగస్ట్ నెలలోనే మునుపెన్నడూ లేనంత స్థాయిలో రూ.1,611 కోట్ల నిధులు వెల్లువెత్తాయి.
బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం రేట్లు రూ. 3,000కు పైగా దిగొచి్చన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ప్రియులు పండుగ చేసుకున్నారు. ఆభరణాల కొనుగోళ్లు జోరందుకోవడంతో పాటు అటు డిజిటల్ రూపంలో కూడా ఇన్వెస్టర్లు పెట్టుబడుల స్పీడ్ పెంచారు. ఇదిలాఉంటే, అంతర్జాతీయంగా పుత్తడి సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో దూసుకెళ్తూనే ఉంది. తాజాగా ఔన్స్ రేటు 2,600 డాలర్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. దీంతో దేశీయంగానూ సుంకం కోతకు ముందు స్థాయికి, అంటే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.75,500కు చేరింది.
గోల్డ్ బాండ్ల నిలిపివేత ఎఫెక్ట్...
గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదరణ తగ్గేందుకు గోల్డ్ బాండ్లు ప్రధాన కారణం. దేశంలో బంగారం దిగుమతులకు అడ్డుకట్టవేయడం కోసం 2016లో ప్రవేశపెట్టిన ఎస్‌జీబీ స్కీమ్‌ను ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభం వరకు పక్కాగా అమలు చేసింది. క్రమంతప్పకుండా ఎస్‌జీబీలను జారీ చేస్తూ వచి్చంది. అటు బంగారం ధర భారీగా పెరగడంతో పాటు వార్షికంగా 2.5% వడ్డీ రేటు లభించడం.. 8 ఏళ్ల మెచ్యూరిటీ వరకు పెట్టుబడులను కొనసాగిస్తే మూలధన లాభాల పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డ్ బాండ్లపై బాగా ఆసక్తి చూపారు.
ఈ ఏడాది ఆగస్ట్‌లో గడువు తీరిన ఎస్‌జీబీలపై 120 శాతం పైగానే రాబడి లభించడం విశేషం. ప్రస్తుతం ఇంకా రూ.27,000 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లు ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. అయితే, బంగారం ధర భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రం కొత్త గోల్డ్ బాండ్ల జారీకి ముఖం చాటేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. దీంతో ఇక ఈ స్కీమ్‌కు ప్రభుత్వం నీళ్లొదిలినట్టేననేది పరిశీలకుల అభిప్రాయం.
ఈటీఎఫ్‌ల వైపు చూపు...
గడిచిన ఏడాది కాలంలో గోల్డ్ 20 శాతం మేర రాబడులు అందించింది. గోల్డ్ బాండ్ల జారీ నిలిచిపోవడంతో ఇన్వెస్టర్లకు ప్రధానంగా రెండే ఆప్షన్లున్నాయి. ఇప్పటికే ట్రేడవుతున్న గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడం, లేదంటే గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం. ‘బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై సానుకూల పన్ను విధానం, కస్టమ్స్ సుంకం తగ్గింపు, తాజా గోల్డ్ బాండ్ల జారీ లేకపోవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు మళ్లీ గోల్డ్ ఈటీఎఫ్‌ల బాట పడుతున్నారు’ అని మనీ మంత్ర ఫౌండర్ విరల్ భట్ పేర్కొన్నారు. గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ తర్వాత భారీగా లాభాలను కళ్లజూసిన ఇన్వెస్టర్లు సైతం మళ్లీ ఆ ఆప్షన్ లేకపోవడంతో గోల్డ్ ఈటీఎఫ్‌లకు తిరిగొస్తున్నారని ఫండ్ డి్రస్టిబ్యూటర్లు చెబుతున్నారు. తాజా బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను తగ్గింపు కూడా గోల్డ్ ఈటీఎఫ్‌లకు సానుకూలంగా మారింది. పెట్టుబడిని రెండేళ్లకు పైగా కొనసాగిస్తే 12.5% సుంకం చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ఇన్వెస్టర్ల ట్యాక్స్ శ్లాబ్‌ను బట్టి పన్ను విధింపు ఉండేది.
రేటు రయ్ రయ్...
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత ఖాయంగా కనిపిస్తుండటంతో బంగారం రేట్లు మరింత ఎగబాకే అవకాశం ఉందనేది ఫండ్ మేనేజర్ల అంచనా. ‘మెరుగైన రాబడుల నేపథ్యంలో పసిడి పెట్టుబడుల ట్రెండ్ కొనసాగనుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన పుత్తడిలోకి పెట్టుబడులు పెరిగాయి. సెంట్రల్ బ్యాంకులు సైతం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. ఇవన్నీ గోల్డ్ రష్‌కు మరింత దన్నుగా నిలుస్తున్నాయి’ అని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment