Purchases
-
బీఎఫ్ఎస్ఐలో జోరుగా నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగ సీజన్ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు, కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా వ్యక్తిగత రుణాలతో పాటు టూవీలర్లు, కార్లు మొదలైన వాహన రుణాలకు డిమాండు 12 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్లో వినాయక చవితితో మొదలై నవంబర్ వరకు కొనసాగే పండుగల సీజన్లో కార్యకలాపాలను సమర్ధమంతంగా నిర్వహించుకునేందుకు బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) సంస్థలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఆర్థిక సంస్థలు ఈ బిజీ వ్యవధిలో కస్టమర్లకు మెరుగైన సరీ్వసులు అందించగలిగే, డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించగలిగే నైపుణ్యాలున్న సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. స్టాఫింగ్ సేవల సంస్థ టీమ్‌లీజ్ నివేదిక ప్రకారం బీఎఫ్ఎస్ఐ రంగంలో రిటైల్ రుణాలు, సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్ఐ), పేమెంట్ సేవల విభాగాల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉంటున్నాయి. పండుగ సీజన్ దన్నుతో జూలై–నవంబర్ మధ్య కాలంలో ఈ విభాగాల్లో కొలువులు సంఖ్య 12,000 నుంచి 19,000కు పెరిగే అవకాశం ఉందని టీమ్‌లీజ్ పేర్కొంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తేవడం, చిన్న మొత్తాల్లో రుణాలివ్వడంపై మైక్రోఫైనాన్స్ ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో ఎంఎఫ్ఐ సరీ్వసులకు డిమాండ్ 25 శాతం పెరుగుతుందని తెలిపింది. అలాగే, పేమెంట్ సరీ్వసుల్లో హైరింగ్ 41 శాతం పెరుగుతుందని, క్రెడిట్ కార్డుల విభాగంలో జాబ్ ఓపెనింగ్స్ 32 శాతం పెరుగుతాయని టీమ్‌లీజ్ వివరించింది. కొత్త నైపుణ్యాల్లో సిబ్బందికి శిక్షణ .. ఆర్థిక సేవల సంస్థలు కేవలం సిబ్బంది సంఖ్యను పెంచుకోవడమే కాకుండా బిజీ సీజన్లో మార్కెట్ డిమాండ్‌కి తగ్గ సేవలందించేలా ప్రస్తుత ఉద్యోగులకు కూడా కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపైనా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఎప్పుడైనా సరే పండుగ సీజన్లో బీఎఫ్‌ఎస్‌ఐపై అధిక ఒత్తిడి ఉంటుంది. అయితే, ఈ ఏడాది నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ అసాధారణంగా పెరిగింది. రిటైల్ రుణాల నుంచి పేమెంట్ సేవల వరకు ఈ పరిశ్రమలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మా డేటా ప్రకారం కంపెనీలు కూడా పరిస్థితులకు తగ్గట్లే స్పందిస్తున్నాయి. కీలకమైన ఈ సీజన్లో నిరంతరాయ సేవలు అందించేందుకు సిబ్బందిని పెంచుకుంటున్నాయి. అలాగే ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడంపై దృష్టి పెడుతున్నాయి’’ అని టీమ్‌లీజ్ సర్వీసెస్ వీపీ కృషే్ణందు చటర్జీ తెలిపారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌లు జిగేల్!
ఇన్వెస్టర్లు పుత్తడి పెట్టుబడుల వెంట పడుతున్నారు. భారీగా లాభాలందిస్తున్న సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) జారీ నిలిచిపోవడం... తాజా బడ్జెట్లో పన్ను ఊరట.. బంగారం రేట్లు అంతకంతకూ దూసుకుపోతుండటంతో మదుపరులు మళ్లీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా బంగారం కొనుగోళ్లకు సై అంటున్నారు. గత కొంతకాలంగా మెరుపు కోల్పోయిన గోల్డ్ ఈటీఎఫ్‌లు మళ్లీ తళుక్కుమంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 6,134 కోట్ల విలువైన పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి వచి్చనట్లు అంచనా. ఇందులో రూ.4,500 కోట్లు గత నాలుగు నెలల్లోనే మదుపరులు ఇన్వెస్ట్ చేయడం విశేషం. అంతేకాదు, ఒక్క ఆగస్ట్ నెలలోనే మునుపెన్నడూ లేనంత స్థాయిలో రూ.1,611 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం రేట్లు రూ. 3,000కు పైగా దిగొచి్చన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ప్రియులు పండుగ చేసుకున్నారు. ఆభరణాల కొనుగోళ్లు జోరందుకోవడంతో పాటు అటు డిజిటల్ రూపంలో కూడా ఇన్వెస్టర్లు పెట్టుబడుల స్పీడ్ పెంచారు. ఇదిలాఉంటే, అంతర్జాతీయంగా పుత్తడి సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో దూసుకెళ్తూనే ఉంది. తాజాగా ఔన్స్ రేటు 2,600 డాలర్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. దీంతో దేశీయంగానూ సుంకం కోతకు ముందు స్థాయికి, అంటే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.75,500కు చేరింది. గోల్డ్ బాండ్ల నిలిపివేత ఎఫెక్ట్... గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదరణ తగ్గేందుకు గోల్డ్ బాండ్లు ప్రధాన కారణం. దేశంలో బంగారం దిగుమతులకు అడ్డుకట్టవేయడం కోసం 2016లో ప్రవేశపెట్టిన ఎస్జీబీ స్కీమ్‌ను ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభం వరకు పక్కాగా అమలు చేసింది. క్రమంతప్పకుండా ఎస్జీబీలను జారీ చేస్తూ వచి్చంది. అటు బంగారం ధర భారీగా పెరగడంతో పాటు వార్షికంగా 2.5% వడ్డీ రేటు లభించడం.. 8 ఏళ్ల మెచ్యూరిటీ వరకు పెట్టుబడులను కొనసాగిస్తే మూలధన లాభాల పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డ్ బాండ్లపై బాగా ఆసక్తి చూపారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో గడువు తీరిన ఎస్‌జీబీలపై 120 శాతం పైగానే రాబడి లభించడం విశేషం. ప్రస్తుతం ఇంకా రూ.27,000 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లు ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. అయితే, బంగారం ధర భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రం కొత్త గోల్డ్ బాండ్ల జారీకి ముఖం చాటేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. దీంతో ఇక ఈ స్కీమ్‌కు ప్రభుత్వం నీళ్లొదిలినట్టేననేది పరిశీలకుల అభిప్రాయం. ఈటీఎఫ్‌ల వైపు చూపు... గడిచిన ఏడాది కాలంలో గోల్డ్ 20 శాతం మేర రాబడులు అందించింది. గోల్డ్ బాండ్ల జారీ నిలిచిపోవడంతో ఇన్వెస్టర్లకు ప్రధానంగా రెండే ఆప్షన్లున్నాయి. ఇప్పటికే ట్రేడవుతున్న గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడం, లేదంటే గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం. ‘బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై సానుకూల పన్ను విధానం, కస్టమ్స్ సుంకం తగ్గింపు, తాజా గోల్డ్ బాండ్ల జారీ లేకపోవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు మళ్లీ గోల్డ్ ఈటీఎఫ్‌ల బాట పడుతున్నారు’ అని మనీ మంత్ర ఫౌండర్ విరల్ భట్ పేర్కొన్నారు. గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ తర్వాత భారీగా లాభాలను కళ్లజూసిన ఇన్వెస్టర్లు సైతం మళ్లీ ఆ ఆప్షన్ లేకపోవడంతో గోల్డ్ ఈటీఎఫ్‌లకు తిరిగొస్తున్నారని ఫండ్ డి్రస్టిబ్యూటర్లు చెబుతున్నారు. తాజా బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను తగ్గింపు కూడా గోల్డ్ ఈటీఎఫ్‌లకు సానుకూలంగా మారింది. పెట్టుబడిని రెండేళ్లకు పైగా కొనసాగిస్తే 12.5% సుంకం చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ఇన్వెస్టర్ల ట్యాక్స్ శ్లాబ్‌ను బట్టి పన్ను విధింపు ఉండేది.రేటు రయ్ రయ్...భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత ఖాయంగా కనిపిస్తుండటంతో బంగారం రేట్లు మరింత ఎగబాకే అవకాశం ఉందనేది ఫండ్ మేనేజర్ల అంచనా. ‘మెరుగైన రాబడుల నేపథ్యంలో పసిడి పెట్టుబడుల ట్రెండ్ కొనసాగనుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన పుత్తడిలోకి పెట్టుబడులు పెరిగాయి. సెంట్రల్ బ్యాంకులు సైతం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. ఇవన్నీ గోల్డ్ రష్కు మరింత దన్నుగా నిలుస్తున్నాయి’ అని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా అభిప్రాయపడ్డారు. -
Loans: రుణ పడొద్దు!
సొంత కారు, అందమైన భవంతి, ఇంట్లో అన్ని రకాల సాధనాలు (మెషీన్లు).. ఎందులోనూ రాజీపడేది లేదన్నట్టుగా ఉంది నేటి యువతరం ధోరణి. ముందు పొదుపు, తర్వాతే ఖర్చు.. గతంలో మన పెద్దలు అనుసరించిన ధోరణి. ముందు ఖర్చు.. మిగిలితేనే పొదుపు అన్నట్టుగా ఉంది నేటి తీరు. ఏ అవసరం వచ్చినా ‘తగ్గేదే లే’ అన్న ధోరణి కనిపిస్తోంది. కొనుగోళ్ల నుంచి వైద్య చికిత్సల వరకు అన్నింటికీ రుణబాట పడుతున్నారు. తీర్చే సామర్థ్యం ఉంటేనే రుణం తీసుకోవాలి. ప్రాధాన్యత లేని వాటికి సైతం రుణాలను ఆశ్రయిస్తే తీర్చే విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కారణం ఏదైనా సకాలంలో రుణం వాయిదా చెల్లించలేకపోతే, ఎదుర్కోవాల్సిన పరిణామాలు చాలానే ఉంటాయి. చివరికి ఉద్యోగ అన్వేషణకు సైతం దూరం కావాల్సి రావచ్చు. గతంలో బ్యాంకుల రుణ వృద్ధిలో కార్పొరేట్ రుణాలదే పైచేయిగా ఉండేది. మొదటిసారి 2020 (కరోనా విపత్తు కాలంలో) నవంబర్‌లో బ్యాంకుల రుణాల్లో కార్పొరేట్లను కాదని రిటైల్ రుణాలు ముందుకు వచ్చేశాయి. అప్పటి నుంచి 2023 నవంబర్ 17 నాటికి చూస్తే రిటైల్ రుణాలు 79 శాతం పెరగ్గా.. కార్పొరేట్ రుణాల్లో వృద్ధి 28 శాతానికి పరిమితమైంది. 2023లో రెండో త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లోనూ రిటైల్ రుణాల్లో వృద్ధి 15 శాతంగా నమోదైంది. రిటైల్ రుణాల్లో కన్జ్యూమర్ ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం తీసుకునేవి (విలువ పరంగా) 20 శాతం పెరిగాయి. ద్విచక్ర వాహన రుణాలు 18 శాతం వృద్ధి చెందాయి. వ్యక్తిగత అవసరాల కోసం తీసుకునే రుణాలు 12 శాతం పెరిగాయి. ఆటో రుణాలు 13 శాతం పెరిగితే, ఇంటి రుణాలు విలువ పరంగా మైనస్ 6 శాతంగా ఉన్నాయి. వినియోగ రుణాలు ఎక్కువగా ఉంటున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, అదే సమయంలో రుణ ఎగవేతల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ రుణాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. 2023 జూలై నాటికి క్రెడిట్ కార్డ్ రుణాలు రూ.2.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం కంటే 31 శాతం పెరిగాయి. రిటైల్ రుణాలన్నీ కూడా అన్సెక్యూర్డ్. రుణ గ్రహీత చేతులు ఎత్తేస్తే అది బ్యాంకింగ్ వ్యవస్థపై భారాన్ని మోపుతుంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ వ్యక్తిగత, అన్ సెక్యూర్డ్, క్రెడిట్ కార్డ్ రుణాలకు రిస్క్ వెయిటేజీ పెంచుతూ, వీటికి బ్యాంకులు మరిన్ని నిధులను పక్కన పెట్టేలా గత నవంబర్‌లో ఆదేశాలు తీసుకొచి్చంది. క్రెడిట్ స్కోర్‌కు విఘాతం తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోయినా, రుణాన్ని ఎగవేసినా అది క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా తగ్గించేస్తుంది. కరోనా అనంతరం రిటైల్ రుణాలు తీసుకోవడం గణనీయంగా పెరిగిపోగా, అదే సమయంలో అంతకుముందు తీసుకున్న రుణాలకు సంబంధించి ఎగవేతలు కూడా పెద్ద మొత్తంలోనే నమోదయ్యాయి. దీంతో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు పెద్ద మొత్తాల్లో కేటాయింపులు చేయాల్సి వచి్చంది. ఈ పరిణామాలతో చాలా మంది రుణ గ్రహీతల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడింది. నేడు ప్రతి రుణానికి సంబంధించి చెల్లింపుల చరిత్రతో క్రెడిట్ బ్యూరోలు రికార్డులను నిర్వహిస్తున్నాయి. రుణం సకాలంలో చెల్లించకపోయినా, ఎగ్గొట్టినా, సెటిల్మెంట్ చేసుకున్నా, రుణం కావాలంటూ విచారణలు చేసినా, అవన్నీ సంబంధిత వ్యక్తి పేరిట రికార్డుగా నమోదవుతాయి. వీటి ఆధారంగానే క్రెడిట్ బ్యూరోలు స్కోర్‌ను కేటాయిస్తుంటాయి. 750, అంతకుమించి క్రెడిట్ స్కోర్ ఉంటే అది మెరుగైనది. రుణం సులభంగా వస్తుంది. మెరుగైన రేటుకు వస్తుంది. 750కంటే తక్కువ ఉంటే రుణం పొందడం కష్టమవుతుంది. ఒకవేళ రుణం లభించినా, అది అధిక వడ్డీ రేటుపై తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ వాయిదాలను సకాలంలో చెల్లించాలి. నేడు దాదాపు అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ స్కోర్ ఆధారంగానే అన్సెక్యూర్డ్ రుణాలు మంజూరు చేస్తున్నాయి. తదుపరి పరిణామాలు.. బకాయి చెల్లించాలంటూ రుణగ్రహీతను రుణం ఇచి్చన సంస్థలు కోరతాయి. గడువు తీరిన 30 రోజులకూ చెల్లింపులు చేయకపోతే అప్పుడు ఆయా రుణగ్రహీతల సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తుంటాయి. 30–60 రోజుల పాటు చెల్లింపులు చేయకపోతే అది క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తుంది. ఇక రుణ వాయిదా 60 రోజులు దాటినా చెల్లించలేని వారి క్రెడిట్ స్కోర్ మరింత తగ్గిపోతుంది. తక్కువ క్రెడిట్ స్కోర్ వల్ల భవిష్యత్తులో రుణానికి ద్వారాలు మూసుకుపోతాయి. అత్యవసరంలో రుణం కావాల్సి వస్తే నిరాకరణ ఎదురుకావచ్చు. డిజిటల్‌గా రుణాలు ఇచ్చే సంస్థలు కనీసం ఒక్క రోజు ఆలస్యం చేసినా,ఎగవేతదారుల జాబితాలో చేరాల్సి వస్తోంది. 650–750 మధ్య స్కోర్ ఉన్న వారికి గృహ రుణం కావాలంటే, మెరుగైన స్కోర్ ఉన్న వారితో పోలిస్తే 2 శాతం అధిక రేటు చెల్లించాల్సి వస్తుంది. రూ.50 లక్షల రుణం 20 ఏళ్ల కాలవ్యవధికి కావాలంటే, తక్కువ స్కోర్ కారణంగా వడ్డీ రూపంలో అదనంగా రూ.12 లక్షల వరకు భారాన్ని మోయాల్సి రావచ్చు. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య ఈ రేటు వ్యత్యాసం మారుతుంది. రుణం ఎగ్గొట్టడం సివిల్ నేరం కిందకు వస్తుంది. రుణ గ్రహీత ఇచి్చన చెక్కుల ద్వారా వసూలు చేసుకునే చర్యలను ఆరి్థక సంస్థలు ప్రారంభిస్తాయి. గడువు ముగిసిన 90 రోజుల్లోపు కూడా రుణ గ్రహీత చెల్లించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, నోటీసు వస్తుంది. 180 రోజులు (ఆరు నెలలు) ముగిసినా ఎలాంటి ఫలితం లేకపోతే అప్పుడు నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్ యాక్ట్, 1881లోని సెక్షన్ 138 కింద రుణం ఇచి్చన సంస్థ కేసు దాఖలు చేస్తుంది. చెల్లించే సామర్థ్యం ఉన్నా, చెల్లించకపోతే ఉద్దేశపూర్వక ఎగవేతదారు అనే ముద్ర పడుతుంది. సరైన కారణంతో రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు రుణం ఇచి్చన సంస్థతో చర్చలు నిర్వహించి పరిష్కారానికి, పరస్పర అంగీకారానికి రావచ్చు. హోమ్‌లోన్ లేదా ప్రాపర్టీ లోన్ లేదా బంగారంపై రుణం వంటి సెక్యూర్డ్ రుణాల్లో రుణ గ్రహీత చెల్లింపుల్లో చేతులు ఎత్తేస్తే.. తనఖాగా ఉంచిన ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తుంటాయి. అలాగే, ఆటోమొబైల్ రుణాల్లోనూ వాహనాన్ని జప్తు చేసి, చెల్లింపులకు తగినంత వ్యవధి ఇస్తాయి. అప్పటికీ చెల్లించకపోతే వాహనాన్ని వేలం వేసి రుణంలో సర్దుబాటు చేసుకుంటాయి. బ్యాంక్ జాబ్ కష్టమే! బలహీన క్రెడిట్ స్కోర్ ఉందంటూ ఉద్యోగ దరఖాస్తు తిరస్కరించే అధికారం బ్యాంకుల బోర్డులకు ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 650 క్రెడిట్ స్కోర్ ఉండాలన్న నిబంధనను ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విధించింది. బా«ధ్యతాయుత ఆరి్థక నడవడిక ఉండాలన్నది దీని వెనుక ఉద్దేశం. ఎంతో విలువైన లావాదేవీల వ్యవహారాల బాధ్యతలను బ్యాంకుల ఉద్యోగులు చూస్తుంటారు. అందుకే ఈ నిబంధన ప్రవేశపెట్టారు. అందుకే బ్యాంకు ఉద్యోగాలకు ప్రయతి్నంచే వారు మెరుగైన స్కోర్ కోసం ముందు నుంచే తగిన జాగ్రత్త చర్యలను పాటించడం మంచిది. కొన్ని బహుళజాతి సంస్థలు కూడా ఉద్యోగం కోరుతున్న వారి క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తుంటాయి. 2022 మార్చిలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం జారీ చేసిన ప్రకటనలో.. బ్యాంక్‌లు/ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తీసుకున్న ఏ రుణం చెల్లింపుల్లో అయినా విఫలం అయినట్టయితే, క్రెడిట్ కార్డ్ బకాయిలు సకాలంలో చెల్లింపులు చేయకపోతే అటువంటి వారు నియామకానికి అర్హులు కాదని స్పష్టంగా పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో ఉద్యోగార్థుల క్రెడిట్ రిపోర్ట్‌లను పరిశీలించడం సర్వసాధారణమని.. దీనివల్ల ఆర్థికంగా ఎంత బాధ్యతాయుతంగా ఉంటారనేది తెలుస్తుందని డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఫైబ్ హెచ్ఆర్ హెడ్ మోనికా మిశ్రా తెలిపారు. ఇది సంస్థలో మోసాలు, చోరీల అవకాశాలను తెలియజేస్తుందన్నారు. ఆర్థిక అంశాల నిర్వహణలో బాధ్యతారహితంగా ఉండే వ్యక్తి, కంపెనీ ఆరి్థక వ్యవహారాల నిర్వహణకు సరైన వ్యక్తి కాదని మిశ్రా వివరించారు. ఏ రుణంలో ప్రతికూలతలు ఎలా..? రుణం కోసం రుణం... తీసుకున్న రుణాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో మరో రుణం తీసుకుని చెల్లించే ఆలోచనలు సరికాదు. ముందు తీసుకున్న రుణంపై అధిక వడ్డీ రేటు ఉండి, చాలా తక్కువ రేటుకే మరో సంస్థ రుణం ఇవ్వడానికి ముందుకు వస్తే అప్పుడు ఆలోచించొచ్చు. తక్కువ రేటుపై రుణం తీసుకుని అధిక రేటుతో కూడిన రుణాన్ని తీర్చివేయవచ్చు. వ్యక్తిగత రుణాలపై 14–15 శాతం మేర వడ్డీ రేటు ఉంటే, మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 12 శాతానికే లభిస్తుంది. అలాంటప్పుడు పరిశీలించొచ్చు. అంతేకానీ, చెల్లింపుల సమస్య నుంచి బయటపడేందుకు మరో రుణాన్ని ఆశ్రయిస్తే సమస్యను పెంచుకున్నట్టు అవుతుంది. అలాగే, క్రెడిట్ కార్డ్‌పై 3–4 రూపాయల వడ్డీ పడుతుంది. వ్యక్తిగత రుణాన్ని తీసుకుని క్రెడిట్ కార్డ్ రుణాన్ని తీర్చివేయవచ్చు. రుణ గ్రహీత ముందున్న మార్గం రుణం తీసుకుని, చెల్లింపులు సకాలంలో చేయకపోయినా.. రుణం ఇచ్చిన సంస్థలు గౌరవప్రదంగా, పారదర్శకంగానే వ్యవహరించాలి కానీ, వేధించడం, బెదిరించడం చేయకూడదని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి తెలిపారు. రుణం 90 రోజులకు మించి చెల్లింపులు లేకపోతే, అప్పటికీ చెల్లించేందుకు 60 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూర్డ్ రుణం చెల్లించనప్పుడు, తనఖాలో ఉంచిన ఆస్తులు లేదా వాహనాలను విక్రయించగా, వచ్చే మొత్తం నుంచి రుణం మినహాయించుచుని మిగిలినది తిరిగి రుణ గ్రహీతకు ఇచ్చేయాల్సి ఉంటుంది. రుణం చెల్లించలేనప్పుడు మారటోరియం లేదా వన్‌టైమ్ పరిష్కారం కోసం డిమాండ్ చేయవచ్చు. రుణం చెల్లించలేకపోవడం వెనుక సహేతుక కారణాలు ఉంటే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సంస్థను సంప్రదించాలి. చెల్లించడానికి మరింత సమయం ఇవ్వాలని కోరొచ్చు. మీరు చెప్పిన కారణాల్లో వాస్తవికత ఉందని బ్యాంక్/ఎన్బీఎఫ్సీ భావిస్తే రుణ చెల్లింపులపై స్వల్పకాలం పాటు మారటోరియం (విరామం) కలి్పస్తాయి. లేదంటే రుణ కాల వ్యవధిని పెంచి, ఈఎంఐ మొత్తాన్ని తగ్గిస్తాయి. క్రెడిట్ కార్డు రుణం క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తం చెల్లించలేని సందర్భాల్లో, మినిమం డ్యూ (బిల్లులో నిరీ్ణత శాతం) చెల్లించినా సరిపోతుంది. ఈ మినిమం డ్యూని కూడా చెల్లించనట్టయితే ఆరు నెలలు వేచి చూసిన తర్వాత డిఫాల్ట్‌గా ఖరారు చేస్తారు. డిపాజిట్‌ను సెక్యూరిటీగా ఉంచి క్రెడిట్ కార్డు తీసుకుంటే, బకాయి పడిన సందర్భంలో డిపాజిట్‌ను రద్ధు చేసి రుణం కింద సర్దుబాటు చేసుకుంటారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పొందిన క్రెడిట్‌కార్డు అయితే, బకాయి వసూలు బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగిస్తాయి క్రెడిట్ కార్డు కంపెనీలు. రుణ గ్రహీత నుంచి రుణాన్ని రప్పించే ప్రయత్నాలను ఏజెన్సీలు చేస్తాయి. అప్పటికీ ఫలితం లేకపోతే కోర్టులో కేసు దాఖలవుతుంది. బ్యాంక్‌లు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు బ్లాక్ లిస్ట్‌ను నిర్వహిస్తుంటాయి. చెల్లింపులు చేయని వారిని బ్లాక్ లిస్ట్‌లో చేరుస్తాయి. విద్యా రుణం విద్యా రుణం ఈఎంఐ చెల్లింపులు సాధారణంగా కోర్సు ముగిసి, ఉద్యోగంలో చేరిన నాటి నుంచి మొదలవుతాయి. కానీ, కొన్ని కారణాల వల్ల కోర్స్‌లో సకాలంలో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగం రాదు. కోర్సు పూర్తి చేసినా కానీ వెంటనే అందరికీ ఉపాధి లభిస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. లేదంటే ఉద్యోగం వచి్చనప్పటికీ, అది కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వచి్చన సందర్భాల్లో రుణ ఈఎంఐ చెల్లించలేకపోతే, తదుపరి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెంటనే ఉద్యోగం లభించకపోయినా, వచ్చిన ఉద్యోగం కోల్పోయినా బ్యాంకులను సంప్రదించి, పూర్తి వివరాలు తెలియజేయాలి. మరింత గడువు కోరాలి. లేదంటే బ్యాంక్‌లు నిర్ణీత కాలం పాటు వేచి చూసి మిగిలిన రుణాల మాదిరే నోటీసు జారీ ద్వారా తదుపరి చర్యలు ప్రారంభిస్తాయి. విద్యా రుణానికి సంబంధించి డిఫాల్టర్‌గా మారితే భవిష్యత్‌లో ఎన్నో రుణాలకు అవరోధంగా మారొచ్చు. రూ.4–10 లక్షల వరకు విద్యా రుణాలకు బ్యాంక్‌లు ఎలాంటి సెక్యూరిటీని కోరవు. అంతకుమించితే మరో వ్యక్తిని గ్యారంటర్‌గా, లేదా ప్రాపరీ్టని తనఖాగా ఉంచాలని కోరతాయి. సకాలంలో చెల్లించలేకపోతే గ్యారంటర్ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. వ్యక్తిగత రుణం వ్యక్తిగత రుణం వాయిదా గడువు ముగిసిన 30 రోజుల వరకు చెల్లించకపోతే డిఫాల్ట్‌గా పరిణిస్తాయి. ఇదే విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు తెలియజేస్తాయి. ఇలా వరుసగా మూడు వాయిదాల్లో విఫలమైతే అప్పుడు రుణంపై అదనపు వడ్డీ రేటును (పీనల్ ఇంటరెస్ట్) వడ్డిస్తాయి. 30 నుంచి 60 రోజుల్లోపు రుణ వాయిదాను వడ్డీ, అన్ని చార్జీలతో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్‌పై స్వల్ప ప్రభావమే పడుతుంది. 90 రోజులకు కూడా చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్‌పై ఎక్కువ ప్రభావం పడుతుంది. 180 రోజుల తర్వాత కూడా చెల్లింపులు రాకపోతే అప్పుడు రుణ గ్రహీతపై కేసులు దాఖలవుతాయి. వినియోగ రుణం కన్జ్యూమర్ ఉత్పత్తుల కోసం తీసుకునే రుణాలు, వాహన రుణాలు అయినా గడువులోపు చెల్లించకపోతే ఒకటి రెండుసార్లు నోటీసును జారీ చేస్తాయి. 30 రోజుల్లోగా చెల్లించకపోతే అప్పుడు ముందుగా సమర్పించిన చెక్కులను నగదుగా మార్చుకునే చర్యలు మొదలు పెడతాయి. చెక్కులు బౌన్స్ అయితే కోర్టులో కేసు దాఖలు చేస్తాయి. వాహనం లేదా ఉత్పత్తిని స్వా«దీనం చేసుకుంటాయి. వడ్డీసహా రుణ మొత్తాన్ని చెల్లించి సమస్య నుంచి బయటపడవచ్చు. గృహ రుణం ఇంటిపై పొందే మార్ట్గేజ్ రుణం చెల్లించకపోతే ఇంటిని కోల్పోవాల్సి వస్తుంది. గడువు ముగిసిన తర్వాత 30 రోజుల్లోపు చెల్లింపులు లేకపోతే దాన్ని డిఫాల్ట్ (బకాయిపడినట్టు)గా పరిగణిస్తారు. వరుసగా మూడు ఈఎంఐలు కూడా చెల్లించకపోతే, అప్పుడు బకాయిలను 60 రోజుల్లోగా సెటిల్ చేసుకోవాలంటే లీగల్ నోటీసు పంపిస్తాయి. ఆ గడువులోపు స్పందించకపోతే, సర్ఫేసీ చట్టం కింద ఇంటి జప్తు ప్రక్రియను మొదలు పెడతాయి. ఆ తర్వాత కూడా కొల్లేటరల్ (తాకట్టు) విలువ, వేలం తేదీ తదితర వివరాలతో ఒక నోటీసు పంపిస్తాయి. అప్పుడు స్పందించినా, బ్యాంక్‌లు పరిష్కారానికి అవకాశం ఇస్తాయి. చివరి ఆప్షన్‌గా ఇంటిని వేలం నిర్వహిస్తాయి. దీనివల్ల ఇంటిని కోల్పోవడంతోపాటు, క్రెడిట్ రిపోర్ట్‌లో కొన్నేళ్లపాటు దీని ప్రభావం కనిపిస్తుంది. -
‘జెమ్’పై రూ.2 లక్షల కోట్ల కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అయిన ‘జెమ్’పై వస్తు, సేవల కొనుగోళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించాయి. వివిధ శాఖలు, విభాగాల నుంచి కొనుగోళ్ల కార్యకలాపాలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో (ఎక్స్) పేర్కొన్నారు. జెమ్‌ను కేంద్ర సర్కారు 2016 ఆగస్ట్ 9న ప్రారంభించడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విభాగాల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి జెమ్‌పై కొనుగోళ్ల విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.2 లక్షల కోట్లను అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనుగోళ్ల విలువ రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెమ్‌పై 62 లక్షల విక్రేతలు, సరీ్వస్ ప్రొవైడర్లు నమోదై ఉన్నారు. 63,000 ప్రభుత్వ కొనుగోళ్ల విభాగాలు కూడా నమోదై ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పారా మిలటరీ దళాలు కొనుగోలుదారుల జాబితాలో ఉన్నాయి. స్టేషనరీ నుంచి వాహనాలు, కంప్యూటర్, ఫర్నిచర్ వరకు అన్ని రకాల విక్రేతలు దీనిపై నమోదై ఉన్నారు. సేవల విభాగంలో రవాణా, లాజిస్టిక్స్, వ్యర్థాల నిర్వహణ, వెబ్‌కాస్టింగ్‌కు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. మొత్తం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థల వాటా 83 శాతంగా ఉన్నట్టు వాణిజ్య శాఖ తెలిపింది. మొత్తం 312 రకాల సేవలు, 11,800 ఉత్పత్తులు జెమ్‌పై విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. జెమ్ ఆరంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.5.93 లక్షల కోట్ల కొనుగోళ్లు జరిగాయి. -
కరెంట్ కొనుగోలుపై ఈనాడు పిచ్చిరాతలు
-
వ్యవసాయ ట్రాక్టర్ల అమ్మకాల్లో భారీ వృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయ ట్రాక్టర్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. 2021–22తో పోల్చి చూస్తే 2022–23లో వ్యవసాయ ట్రాక్టర్ల అమ్మకాల్లో ఏకంగా 82.14 శాతం వృద్ధి నమోదయ్యింది. 2021–22లో 19,259 వ్యవసాయ ట్రాక్టర్లను రైతులు కొనుగోలు చేయగా.. 2022–23లో ఏకంగా 35,079 వ్యవసాయ ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించడంతో పాటు రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించడం ద్వారా ఎక్కువ ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు సబ్సిడీ రూపంలో రూ.1,052 కోట్లు వెచి్చంచి రైతులకు లబ్ధి చేకూర్చింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ ట్రాక్టర్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయని రవాణా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను ప్రభుత్వమే సబ్సిడీపై అందిస్తోంది. బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చూస్తోంది. -
రూ.6,828 కోట్లతో 70 శిక్షణ విమానాలు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం రూ.6,828 కోట్లతో 70 హెచ్‌టీటీ–40 బేసిక్ శిక్షణ విమానాల కోనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) బుధవారం ఆమోదం తెలియజేసింది. రానున్న ఆరేళ్లలో ఈ విమానాలు ఐఏఎఫ్‌కు అందనున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్లో వెల్లడించారు. హెచ్‌టీటీ–40 విమానాలను ప్రభుత్వ రంగంలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఉత్పత్తి చేయనుందని భారత రక్షణ శాఖ తెలియజేసింది. తక్కువ వేగంతో నడిచే ఈ విమానాలతో వైమానిక దళం సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వొచ్చని పేర్కొంది. హెచ్‌టీటీ–40 విమానాల తయారీలో హెచ్ఏఎల్ సంస్థ ప్రైవేట్ పరిశ్రమలను కూడా భాగస్వాములను చేయనుంది. దీనివల్ల 100కుపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 1,500 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. -
బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు?
నరసాపురం(పశ్చిమగోదావరి): 20 రోజుల క్రితం తగ్గిన బంగారం ధరలు మళ్లీ 10 రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ధరలు ఇంకా తగ్గుతాయని కొన్ని నెలలుగా బులియన్ వర్గాలు విశ్లేషిస్తూ వస్తున్నాయి. అయితే సీన్ రివర్స్ అయ్యింది. వారం రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుతున్నాయి మరో వైపు వెండిదీ అదే దారి. ప్రస్తుతం నరసాపురం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 53,400, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.48,200 వద్ద ట్రేడవుతోంది. 916 కేడీఎం ఆభరణాల బంగారం కాసు ప్రస్తుతం రూ 38,550కు చేరింది. నెలరోజుల క్రితం కాసుధర రూ.37,024గా ఉంది. నెలరోజుల్లో రూ.1536లు పెరిగింది. కిలో వెండి ధర 62,000గా ట్రేడవుతోంది. చదవండి: లోన్ యాప్స్ వేధింపులకు ఇక చెక్.. ట్రోల్ ఫ్రీ నంబర్ రిలీజ్ చేసిన హోంశాఖ నెలరోజుల క్రితం వరకూ బంగారం ధరలు తగ్గుతూ వస్తుండటంతో ఇంకా తగ్గుతాయని బులియన్ వర్గాలు అంచనా వేశాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. చైనా, ఆ్రస్టేలియా, లాటిన్ అమెరికా దేశాలు భారీగా బంగారం నిల్వలను పెంచుకునే ప్రయత్నం చేయడం, రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం చల్లారకపోవడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని అంటున్నాయి. రూపాయి మారకం విలువ రికార్డుస్థాయిలో పడిపోవడం మరో కారణం. షేర్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో మదుపర్లు బంగారం వైపు మళ్లడం ధరల పెరుగుదలకు కారణాలుగా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా పెరగొచ్చని భావిస్తున్నారు. రూ.4 కోట్ల వరకూ తగ్గిన అమ్మకాలు బంగారం ధరల పెరుగుదల అమ్మకాలపై పడింది. మొన్నటి వరకూ కళకళలాడిన జ్యుయెలరీ షాపులు వెలవెల బోతున్నాయి. ఒక్క నరసాపురం మార్కెట్లోనే హోల్‌సేల్, రిటైల్ కలిపి రోజుకు రూ.5 కోట్ల వరకూ అమ్మకాలు జరుగుతాయి. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయి. పెరిగిన ధరలతో ఉమ్మడి పశ్చిమలో రోజుకు రూ 4 కోట్లు వరకూ అమ్మకాలు తగ్గినట్లు అంచనా. దీపావళికి బంగారం అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. ధరల పెరుగుదల దీపావళి అమ్మకాలపై కూడా ప్రభావం చూపుతుందని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వేచి చూసే ధోరణిలో కొనుగోలుదారుడు ప్రస్తుతం బంగారం కొనాలా? కొన్ని రోజులు ఆగాలా? అనే సందిగ్ధంలో కొనుగోలుదారుడు ఉన్నాడు. ధరలు ఇంకా తగ్గుతాయనే విశ్లేషణతో, బంగారం కొనుగోళ్ళను చాలామంది వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా పెరుగుతున్న ధరలు వారిని షాక్‌కు గురిచేసాయి. ఇప్పుడేమో ధరలు ఇంకా పెరుగుతాయని చెప్పడంతో కొనాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ నష్టాల్లో ఉంది. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరగడంతో నరసాపురం మార్కెట్లోనే దాదాపు 40 శాతం అమ్మకాలు తగ్గాయి. దీపావళి పండుగ అమ్మకాలపై కూడా ప్రభావం పడింది. పండుగకు ముందస్తు ఆర్డర్లు పెద్దగా రావడంలేదు. పెట్టుబడుల రూపంలో కొనుగోలు చేసే బిస్కెట్ అమ్మకాలు మాత్రం నిలకడగా సాగుతున్నాయి. – వినోద్‌కుమార్‌జైన్, నరసాపురం చాంబర్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
‘మెట్రో ఇండియా’ రేసులో రిలయన్స్, ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ: మెట్రో ఇండియా ఆస్తుల కొనుగోలు రేసు ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటోంది. థాయిలాండ్‌కు చెందిన చరోన్ పోక్పాండ్ (సీపీ) గ్రూపు సైతం రంగంలోకి వచ్చింది. అలాగే, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ (విప్రో ప్రేమ్‌జీ సొంత పెట్టుబడుల సంస్థ), ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ కూడా రేసులో ఉన్నాయి. ప్రముఖ రిటైల్ సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ కూడా పోటీ పడుతున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు పేర్కొన్నాయి. జర్మనీకి చెందిన రిటైలర్ మెట్రో ఏజీ.. భారత్‌లోని తన ఆస్తులను విక్రయానికి పెట్టడం తెలిసిందే. ఇక 1–1.5 బిలియన్ డాలర్లతో మెట్రో ఇండియా ఆస్తుల కొనుగోలు అవకాశాలను టాటా గ్రూపు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్ బెయిన్ క్యాపిటల్ మదింపు వేస్తున్నట్టు సమాచారం. ఫ్లిప్‌కార్ట్–వాల్‌మార్ట్, డీమార్ట్, అమెజాన్ ఈ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టేనని తాజా సమాచారం. ఈ వారంలోనే నాన్‌బైండింగ్ ఆఫర్లను సమర్పించాల్సి ఉంటుంది. నాన్ బైండింగ్ ఆఫర్లు వచ్చిన తర్వాత ఆయా సంస్థలతో మెట్రో ఏజీ చర్చలు నిర్వహించనుంది. ఇందుకు రెండు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు అనుకున్నంత ఆశావహంగా లేకపోవడంతో మెట్రో ఏజీ తన ఆస్తులను విక్రయించి వెళ్లిపోవాలని అనుకుంటుండడం తెలిసిందే. పదికి పైగా సంస్థలు తొలుత ఆసక్తి చూపించగా.. అధిక పోటీ కారణంగా కొన్ని సంస్థలు ముందే తప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సహా సుమారు పది సంస్థలు పోటీ పడుతున్నట్టు తొలుత పేర్లు వినిపించడం గమనార్హం. ‘‘మా విధానం ప్రకారం మీడియాలో వచ్చే ఊహాజనిత వార్తలపై స్పందించం. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను మదింపు వేస్తూనే ఉంటుంది’’అని రిలయన్స్ రిటైల్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. -
కొత్త బండి వద్దు బాస్.. పాతదయితేనే మేలు !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బండి ఇప్పుడు వద్దు. తరువాత కొందాం.. ఇదీ అత్యధికుల మాట. కోవిడ్–19 మహమ్మారి తదనంతర ప్రభావమే ఈ వాయిదా నిర్ణయానికి కారణం. కార్ ట్రేడ్ టెక్ మొబిలిటీ ఔట్లుక్ నివేదిక ప్రకారం ఫోర్ వీలర్‌ను కొనుగోలు చేసే విషయంలో 80 శాతం మంది వాయిదాకే మొగ్గు చూపారట. అదే ద్విచక్ర వాహనాల విషయంలో ఈ సంఖ్య 82 శాతముంది. దేశవ్యాప్తంగా 2022 మార్చి 3–12 మధ్య ఇండియన్ ఆటోమోటివ్ కంజ్యూమర్ కాన్వాస్ పేరుతో 2,56,351 మంది వినియోగదార్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కార్ ట్రేడ్ టెక్ మొబిలిటీ ఔట్లుక్ విడుదల చేసింది. వాహన కొనుగోళ్లను వాయిదా వేసే వ్యక్తుల సంఖ్య 2022లో పెరిగింది. కోవిడ్–19 ప్రభావాల నుండి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని నివేదిక వివరించింది. ఈవీల విషయంలో ఇలా.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) డిమాండ్ ఊపందుకుంది. 40 శాతం ద్విచక్ర వాహనదార్లు ఈ ఏడాది ఈవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 2021లో ఈ సంఖ్య 37 శాతముంది. ఈవీ పట్ల ఆసక్తి చూపుతున్న ఫోర్ వీలర్ కస్టమర్ల సంఖ్య గతేడాది మాదిరిగానే 33 శాతముంది. సర్వే సానుకూల సెంటిమెంట్‌ను సూచిస్తోందని కార్ ట్రేడ్ టెక్ కంజ్యూమర్ బిజినెస్ సీఈవో బన్వారి లాల్ శర్మ తెలిపారు. ‘ప్రజలు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నారు. కస్టమర్ల నిర్ణయాలను ప్రభావితం చేసే అనేక అంశాలున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ తన అమ్మకాలను పెంచుకోవడానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి పెట్టాలి’ అని వివరించారు. ప్రీ–ఓన్డ్‌కు కస్టమర్ల సై.. పాత వాహనం (ప్రీ–ఓన్డ్) కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2021లో వీరి సంఖ్య 14 శాతముంటే.. ఇప్పుడు 20 శాతానికి చేరింది. లీజింగ్, ప్రీ–ఓన్డ్, సబ్స్క్రిప్షన్ మోడల్ విధానాన్ని ఎంచుకోవాలని 26 శాతం మంది భావిస్తున్నారు. కొత్త వెహికిల్ కొనడం కోసం దాచుకున్న డబ్బులు, పాత వాహనం విక్రయంపైనే 18 శాతం మంది నమ్మకం పెట్టుకున్నారట. గతేడాది ఈ సంఖ్య 14 శాతముంది. ఆన్లైన్లో కొనుగోలుకు 49 శాతం మంది ఓకే ఆన్నారట. వాహనాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం లేనందున ఆన్లైన్ పట్ల ఆసక్తి లేకపోవడానికి కారణమని 28 శాతం మంది తెలిపారు’ అని నివేదిక వివరించింది. ప్రీ–ఓన్డ్‌ను ఎంచుకునే వారి సంఖ్య 20 రెట్లు పెరిగిందని ఎవర్ కార్స్ ఎండీ కృష్ణ తిరుగుడు వెల్లడించారు. అదనపు ఖర్చు లేకపోవడం, తక్కువ ధర, మంచి కండీషన్, మెరుగైన మోడల్ లభించడం ఈ స్థాయి డిమాండ్‌కు కారణమన్నారు. -
రూపే కార్డు కస్టమర్లకు శుభవార్త
సాక్షి, ముంబై: ముంబై: రూపేకార్డు కస్టమర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. వివిధ బ్రాండ్ల కొనుగోళ్లపై ‘‘రూపే ఫెస్టివల్ కార్నివాల్’’ పేరుతో 65 శాతం వరకు డిస్కౌంట్లను ఇస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్, స్విగ్గి, శామ్సంగ్ వంటి టాప్ బ్రాండ్లపై రూపే కార్డు కస్టమర్లు 10-65శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. ఆరోగ్యం, ఫిట్నెస్, ఎడ్యుకేషన్, ఈ–కామర్స్ లాంటి వాటిపైనే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరాలైన డైనింగ్, ఫుడ్ డెలివరి, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, వెల్నెస్, ఫార్మసీతో పాటు మరికొన్నింటిపైనా ఆకర్షణీయమైన ఆఫర్లను పొం దవచ్చు. సురక్షితమైన, కాంటాక్ట్‌లెస్, క్యాష్‌లెస్ పే మెంట్లను పెంచడమే లక్ష్యమని ఎన్సీసీఐ పేర్కొంది. ‘‘కార్నివాల్ ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌం ట్లు కస్టమర్ల పండుగ సంతోషాల్ని మరింత పెం చుతాయి. ఇదే సమయంలో డిజిటల్, కాంటాక్ట్‌లెస్ పేమెంట్ల సంఖ్య పెరుగుతుంది’’ అని ఎన్పీసీఐ మార్కెటింగ్ చీఫ్ కునాల్ కలవాతియా తెలిపారు. -
షాపింగ్‌కు సై!
సాక్షి, హైదరాబాద్: పండుగల సీజన్ షాపింగ్ కళను సంతరించుకోనుంది. కరోనా భయంతో గత ఆరేడు నెలలుగా బయటకు వెళ్లేందుకు జంకుతున్న ప్రజలు రానున్న పండుగల కోసం బయటకు వచ్చేందుకు ఉత్సుకతతో ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్లాకింగ్ ప్రక్రియ మొదలై కొన్ని మినహా దాదాపు అన్ని కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఆన్‌లైన్‌తో పాటు ప్రత్యక్షంగా షాపింగ్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. త్వరలోనే మొదలుకానున్న పండుగల సీజన్లో 80 శాతం భారతీయ వినియోగదారులు వివిధ వస్తువుల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్లు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్), లిట్మస్ వరల్డ్ (లిట్మస్ వరల్డ్ పీపుల్ పల్స్ ఇనిషియేటివ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అన్లాకింగ్ ఇండియన్ కన్జూమర్ సెంటిమెంట్ పోస్ట్ లాక్డౌన్’సర్వేలో వెల్లడైంది. సుదీర్ఘ కాలం పాటు ఇళ్లకే పరిమితం కావడంతో స్నేహితులు, బంధువులకు ఇచ్చేందుకు కానుకలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఉన్నా పండుగ కోసం వస్తువులు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. సర్వే చేసిన వారిలో ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రథమ శ్రేణి (టైర్–1) నగరాల్లోని 80 శాతం మంది, ఆగ్రా, అమృత్సర్, చండీగఢ్ తదితర టైర్–2 సిటీల్లో 12 శాతం మందిని, ఔరంగాబాద్, జోధ్‌పూర్, గ్వాలియర్ తదితర టైర్–3 సిటీల్లో 8 శాతం మంది ఉన్నారు. సర్వేలో ముఖ్యాంశాలు.. ►3 నెలల్లోనే రిటైల్ స్టోర్లలో షాపింగ్ చేసేందుకు 62 శాతం, ఆ తర్వాత కొనుగోలు చేసేందుకు 38 శాతం మొగ్గు ►టైర్–2, టైర్–3 సిటీల్లోని 75 శాతం మంది 3 నెలల్లోనే రిటైల్ స్టోర్లలో షాపింగ్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఏవి కొంటారు? ►53% మంది దుస్తులు, వస్త్రాలు, ఆహారపదార్థాలు, నిత్యావసరాల కొనుగోళ్లు ►31 శాతం మంది కన్జూమర్ డ్యూరబుల్స్/ఎలక్ట్రానిక్స్ కొనుగోలు ►25 శాతం మంది బ్యూటీ, వెల్నెస్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ►24 శాతం మంది పాదరక్షలు, బూట్లు వంటివి కొనుగోలు ►18 శాతం స్పోర్ట్స్ గూడ్స్, ఎంటర్టైన్మెంట్ ఎక్విప్మెంట్, బుక్స్ ►17% ట్రావెల్/లీజర్/లైఫ్ స్టైల్ వస్తువులు ►12 శాతం ఫర్నిచర్, ఫర్నిషింగ్ ►9 శాతం బంగారం, వాచ్‌లు, ఇతర వ్యక్తిగత వస్తువులు కన్జూమర్ డ్యూరబుల్స్/ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు ►ఆన్లైన్లో కొనేందుకు 70 శాతం మంది మహిళల మొగ్గు ►స్వయంగా రిటైల్ స్టోర్లకు వెళ్లి కొంటా మంటున్న 60 శాతం పురుషులు ఆన్లైన్ ప్రక్రియ మొదలయ్యాక షాపింగ్ ఇలా.. ►45 ఏళ్లకు పైబడిన వారు 67 శాతం మంది ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేసేందుకు సిద్ధం ►64 శాతం పురుషులు ఆఫ్‌లైన్‌లో, 60 శాతం మహిళలు ఆన్లైన్లో కొనుగోళ్లు ►టైర్–2, టైర్–3 నగరాల్లో 75 శాతం మంది ఆఫ్‌లైన్‌లో కొనుగోలు ►టైర్–1 సిటీల్లోని వారు ఆన్లైన్, ఆఫ్లైన్లలో సమానంగా షాపింగ్ చేస్తామని వెల్లడి వివిధ వస్తువుల కొనుగోళ్లు ఇలా... ►జ్యూవెల్లరీ, వాచ్‌లు, ఇతర వస్తువులను రిటైల్ స్టోర్లలోనే కొనుగోలు చేస్తామన్న 70 శాతం మంది ►బ్యూటీ, వెల్నెస్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌లను ఆన్లైన్లో కొంటామంటున్న 60 శాతం మహిళలు ►అన్ని నగరాలు, వయసుల వారు రిటైల్ స్టోర్లకే వెళ్లి బూట్లు, పాదరక్షలు కొనుగోలు చేస్తామన్న 70 శాతం ►స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఎక్విప్మెంట్ ఆన్లైన్లో కొంటామన్న 67 శాతం మహిళలు, రిటైల్ స్టోర్లకు వెళ్తామన్న 62 శాతం పురుషులు ►ఫర్నిచర్, ఫర్నిషింగ్‌లను ఆన్లైన్లో కొనుగోలుకు 64 శాతం మహిళలు, రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు 61 శాతం పురుషులు సుముఖత. -
మార్కెట్ యార్డుకు పసుపు కళ
సాక్షి, నిజామాబాద్: జిల్లా వ్యవసాయ మార్కెట్లో పసుపు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించగా సుమారు రెండు నెలలుగా మార్కెట్ యార్డు మూతపడింది. బుధవారం నుంచి మార్కెట్ యార్డులో పసుపు పంట క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో మంగళవారం రోజునే రైతులు పసుపు పంటను యార్డుకు తీసుకొచ్చారు. కాగా ప్రతి రోజు 10 వేల బస్తాల పసుపు మాత్రమే క్రయవిక్రయాలు జరగనున్నాయి. చదవండి: ఉచిత ‘బియ్యం’ అందేనా! అంతకు మించి పసుపు పంటను మార్కెట్ యార్డులోకి అనుమతించడం లేదు. ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే రైతులు పసుపును మార్కెట్ యార్డుకు తీసుకురావాలని అధికారులు సూచించారు. దీంతో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రైతులు భారీగా పసుపును తీసుకొస్తున్నారు. భారీ ఎత్తున రైతులు తరలి వస్తుండటంతో సిబ్బంది టోకెన్లు ఇస్తూ మార్కెట్లోకి అనుమతిస్తున్నారు. కాగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పసుపునకు అనుమతి నిరాకరించారు. చదవండి: పోస్టు చేయడమే పాపమైంది... -
కందులు కొంటాం రండి!
సాక్షి, హైదరాబాద్: కందుల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్క్‌ఫెడ్ ద్వారా అదనంగా 56 వేల మెట్రిక్ టన్నుల కందు లు కొనుగోలు చేయడానికి అనుమతినిస్తూ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరకు 47,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. మరో 56 వేల మెట్రిక్ టన్నులు కొనాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం స్పందించకపోవడంతో తానే కొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్రం, రాష్ట్రం వాటాలు కలిపి మొత్తం 1,03,500 మెట్రిక్ టన్నుల కందుల కొనుగోళ్లకు అనుమతి లభించినట్లయింది. ‘కంది.. రంధి’శీర్షికతో ‘సాక్షి’ఈ నెల 21న కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. రూ.381 కోట్లు కేటాయింపు.. అదనపు కందుల కొనుగోలు కోసం అనుమతించాలని కోరుతూ మార్క్‌ఫెడ్ ఎండీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం 2019–20 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్ర వాటా కింద 56 వేల మెట్రిక్ టన్నుల కంది కొనుగోళ్లను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశించింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొక్కజొన్న కొనుగోలు కోసం మంజూరు చేసిన రూ.1,500 కోట్ల రుణా ల్లో మిగిలిన రూ.381 కోట్లను కందుల కొనుగోలుకు వినియోగించుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వాటా కందుల కొనుగోలు సందర్భంగా ఎలాంటి ఆర్థిక నష్టాలు వచ్చినా అంతే మొత్తాన్ని మార్క్‌ఫెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని హామీ ఇచ్చింది. కందుల కొనుగోళ్లు నేరుగా రైతుల నుంచే చేపట్టాలని, మధ్య దళారులు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆన్లైన్లో పేరు లేకున్నా కొనాల్సిందే.. కంది కొనుగోళ్లకు సంబంధించి సజావుగా సేకరించడానికి తామిచ్చే మార్గదర్శకాలను పాటించాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన వారికి లేఖ రాశారు. వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న ఆన్లైన్ పోర్టల్‌లో కంది రైతుల పేర్లు లేకపోయినా, కందులు కొనాలని ఆయన ఆదేశించారు. నిజమైన రైతులను గుర్తించడానికి జిల్లా స్థాయి ప్రొక్యూర్మెంట్ కమిటీ (డీఎల్‌పీసీ) సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏఈవో, వీఆర్వోలు ఇచ్చే ధ్రువీకరణతో మండల వ్యవసాయాధికారి ధ్రువీకరణ ఉంటేనే ఆయా రైతుల కందులను కొనాలని ఆయన ఆదేశించారు. సేకరణ కేంద్రాల నుంచి 50 కిలోమీటర్ల లోపల గోదాముల్లో నిల్వ చేయాలన్నారు. నిబం ధనల ప్రకారం వ్యవహరించకుంటే కఠిన చర్యలుంటాయని ఆయన వ్యవసాయాధికారులను హెచ్చరించారు. వ్యవసాయ, రెవెన్యూ, సహకార, మార్కెటింగ్, పోలీస్ విభాగాల సమన్వయంతో జిల్లా స్థాయి విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు చేయాలన్నారు. -
విదేశీ సైట్లలో కొంటే బాదుడే..!
న్యూఢిల్లీ: విదేశీ ఈ–కామర్స్ సైట్లలో జరిపే కొనుగోళ్లు ఇకపై భారం కానున్నాయి. ఈ షాపింగ్ పోర్టల్స్‌లో లావాదేవీల్లో సుంకాలు, పన్నుల ఎగవేత ఉదంతాలు చోటు చేసుకుంటుండటంపై కేంద్రం మరింతగా దృష్టి సారించడమే ఇందుకు కారణం. సీమాంతర లావాదేవీలపై ప్రీ–పెయిడ్ విధానంలో కస్టమ్స్ సుంకాలు, పన్నులను వడ్డించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన పక్షంలో విదేశీ ఆన్లైన్ షాపింగ్ సైట్ల ద్వారా జరిపే కొనుగోళ్లు దాదాపు 50% మేర భారం కాగలవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏం జరుగుతోందంటే... భారతీయులకు విదేశాల నుంచి వచ్చే గిఫ్టుల విలువ రూ. 5,000 దాకా ఉన్న పక్షంలో పన్నుల భారం ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని పలు చైనీస్ ఈ–కామర్స్ వెబ్సైట్లు .. ఇక్కడివారు కొనుగోలు చేసిన ఉత్పత్తులను బహుమతుల పేరిట ఎగుమతి చేస్తున్నాయి. తద్వారా సుంకాలు, పన్నుల ఎగవేత జరుగుతోంది. పలు ఉత్పత్తులపై భారీగా ఉండే సుంకాల భారం తగ్గడం వల్ల దేశీ ఈ–కామర్స్ పోర్టల్స్‌తో పోలిస్తే విదేశీ షాపింగ్ పోర్టల్స్‌లో కొనే ఉత్పత్తులు దాదాపు 40 శాతం చౌకగా లభిస్తున్నాయి. ఇలా విదేశీ ఈ–కామర్స్ సంస్థలు వ్యాపార లావాదేవీల కోసం గిఫ్ట్ విధానాన్ని దుర్వినియోగం చేస్తుండటం వల్ల దేశీ ఈ–కామర్స్ సంస్థలకు నష్టం జరుగుతోందని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ చైర్మన్ సచిన్ తపారియా తెలిపారు. కస్టమ్స్ సుంకాలు, వస్తు–సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేత జరుగుతున్న ఇలాంటి లావాదేవీలను గతేడాది.. కస్టమ్స్ డిపార్ట్మెంట్ మరింత లోతుగా పరిశీలించింది. గిఫ్టుల రూపంలో వచ్చే దిగుమతులపై ముంబై కస్టమ్స్ విభాగం నిషేధం విధించింది. దీంతో ఈ తరహా కొనుగోళ్లు సుమారు 60 శాతం దాకా పడిపోయాయి. కీలకమైన ఔషధాలు, రాఖీలు మినహా గిఫ్ట్ మార్గంలో విదేశీ ఈ–కామర్స్ సైట్ల నుంచి వచ్చే ప్యాకేజీలన్నింటిపైనా నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య విధానంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. కొత్త విధానం ఇలా.. తాజాగా విదేశీ షాపింగ్ పోర్టల్స్ ద్వారా జరిగే కొనుగోళ్లపై సుంకాలు, పన్నులు విధించే అంశంపై కేంద్రం .. లోకల్‌సర్కిల్స్ వంటి సంబంధిత వర్గాల అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ విధానం ప్రకారం కస్టమ్స్ విభాగం సొంత పేమెంట్ ఇంటర్ఫేస్ను వినియోగంలోకి తెస్తుంది. చైనా తదితర విదేశీ ఈ–కామర్స్ సంస్థలు.. భారత కస్టమర్ల నుంచి సుంకాలు, పన్నులు వసూలు చేసి ఈ ఐటీ సిస్టమ్ ద్వారా భారత ప్రభుత్వానికి చెల్లిస్తాయి. లావాదేవీ వివరాలు సమర్పించి, ప్రీపెయిడ్ సుంకాలను చెల్లించిన తర్వాత.. ఆయా ఈ–కామర్స్ సంస్థలకు రసీదు, లావా దేవీ రిఫరెన్స్ నంబరు లభిస్తుంది. ఈ ప్రక్రి య పూర్తయిన తర్వాతే ఉత్పత్తుల డెలివరీకి వీలవుతుంది. ప్రత్యామ్నాయంగా సదరు విదేశీ ఈ–కామర్స్ సంస్థకు భారత్‌లో ఉన్న భాగస్వామ్య సంస్థ అయినా సంబంధిత పన్నులు చెల్లిస్తే లావాదేవీకి ఆమోదముద్ర లభిస్తుంది. ఇలాంటి ప్రీ–పెయిడ్ మోడల్‌తో కస్టమర్లు, విదేశీ సరఫరాదారుల మధ్య లావాదేవీలపై పారదర్శకత పెరుగుతుందని లోకల్‌సర్కిల్స్ చైర్మన్ సచిన్ తపారియా తెలిపారు. -
మళ్లీ 11,000 పైకి నిఫ్టీ
కీలక రేట్ల విషయమై ఆర్బీఐ విధానం మారవచ్చనే అంచనాలతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. వడ్డీ రేట్ల ప్రభావిత రంగ షేర్లతో పాటు ఇతర రంగాల షేర్లలో కూడా కొనుగోళ్లు జోరుగా సాగాయి. స్టాక్ సూచీలు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ లాభపడ్డాయి. స్టాక్ సూచీలు రెండూ ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్లపైకి ఎగబాకగా, బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 37,000 పాయింట్లపైకి చేరింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటంతో ఐటీ, లోహ, ఆర్థిక, ఇంధన, ఫార్మా రంగ షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 358 పాయింట్లు పెరిగి 36,975 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 11,062 పాయింట్ల వద్ద ముగిశాయి. నేడు ఆర్బీఐ పాలసీ.. మంగళవారం ప్రారంభమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నేడు (గురువారం) ముగియనుంది. కీలక రేట్లపై నిర్ణయాన్ని ఆర్బీఐ నేడు వెల్లడిస్తుంది. రేట్ల కోత ఉండకపోవచ్చని, అయితే ద్రవ్యోల్బణం దిగివస్తుండటంతో రేట్ల విషయమై ఆర్బీఐ వైఖరి ‘తటస్థ’ విధానానికి మారవచ్చని అంచనాలున్నాయి. బాండ్ల రాబడులు తగ్గడం, రూపాయి స్వల్పంగా బలపడటం ఈ అంచనాలకు మరింత బలాన్నిచ్చాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముడి చమురు ధరలు తగ్గడం, ఈ నెలలో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,624 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరపడం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధి సాధించగలమని కేంద్రం పేర్కొనడం... సానుకూల ప్రభావం చూపించాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 388 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. జపాన్ మార్కెట్ స్వల్పంగా పెరగ్గా, చైనా, దక్షిణ కొరియా మార్కెట్లు చాంద్రమాన కొత్త సంవత్సరాది కారణంగా పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై, స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆల్‌టైమ్ హైకి టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఈ క్యూ3లో నికర లాభం 28 శాతం పెరగడంతో టెక్ మహీంద్రా షేర్ భారీగా లాభపడింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.814ను తాకిన ఈ షేర్ చివరకు 8 శాతం లాభంతో రూ.811 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5,995 కోట్లు పెరిగి రూ.79,588 కోట్లకు ఎగసింది. ఈ షేర్‌తో పాటు ఇన్ఫోసిస్, దివీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, బాటా ఇండియా తదితర షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఆగని అనిల్ షేర్ల పతనం... అనిల్ అంబానీ షేర్ల పతనం కొనసాగింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ ఇంట్రాడేలో 38 శాతం క్షీణించి రూ.142ను తాకింది. చివరకు 32 శాతం నష్టంతో రూ.154 వద్ద ముగిసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్ ఇంట్రాడేలో 11 శాతం తగ్గి ముఖ విలువ రూ.5 కంటే దిగువకు, రూ.4.85ను తాకింది. చివరకు 1 శాతం లాభంతో రూ.5.48 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇతర గ్రూప్ కంపెనీలు–రిలయన్స్ పవర్ 14 శాతం, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 12 శాతం, రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ 11 శాతం చొప్పున నష్టపోయాయి. గత మూడు రోజుల్లో రిలయన్స్ నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్ షేర్ మినహా అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ఆరు షేర్లు 22 శాతం నుంచి 53 శాతం రేంజ్లో పడిపోయాయి. మూడు సెన్సెక్స్ షేర్లకే నష్టాలు 31 సెన్సెక్స్ షేర్లలో కేవలం మూడు– యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ.. మాత్రమే నష్టపోగా మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి. స్టాక్ సూచీలు భారీగా లాభపడినప్పటికీ, దాదాపు 400 షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అరవింద్, ఏబీజీ షిప్‌యార్డ్, ఇక్రా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
గ్రాముకు రూ. 3,119 ధర..
న్యూఢిల్లీ: కొత్తగా జారీ చేసే పసిడి బాండ్ల సిరీస్‌కు సంబంధించి గ్రాముకు రూ.3,119 ధరను కేంద్రం నిర్ణయించింది. 2018–19 సావరీన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్‌లో నాలుగో సిరీస్ కింద బాండ్ల జారీ డిసెంబర్ 24న ప్రారంభమై 28న ముగుస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారికి, డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిపేవారికి ఇష్యూ ధరలో గ్రాముపై రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. ఈ కేటగిరీకి చెందిన వారికి గ్రాము ధర రూ.3,069గా ఉంటుందని పేర్కొంది. అక్టోబర్‌తో ప్రారంభమైన పసిడి బాండ్ల జారీ వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ప్రతి నెలా ఉంటుంది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్), పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సే్చంజీల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. భౌతిక రూపంలో బంగారానికి డిమాండ్ తగ్గించేందుకు, పసిడి కొనుగోళ్లకు వెచ్చిస్తున్న మొత్తాన్ని ఆర్థిక సాధనాల్లోకి మళ్లించేందుకు 2015 నవంబర్‌లో సావరీన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
త్వరలో శనగ కొనుగోళ్లు ప్రారంభం
జైనథ్ : మండలకేంద్రంలోని మార్కెట్ యార్డులో త్వరలోనే శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని మార్క్‌ఫెడ్ డీఎం పుల్లయ్య, మార్కెటింగ్‌శాఖ ఏడీఎం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కొనుగోలు కేంద్రాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. వేసవికాలం దృష్ట్యా తాగునీరు, నీడకోసం చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన రైతులను న్యాయం జరిగేలా కూపన్లు జారీ చేసి తేదీల వారీగా కొనుగోలు చేపట్టాలన్నారు. దళారులకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సర్సన్ లింగారెడ్డి, బేల ఎంపీపీ రఘుకుల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ తల్లెల చంద్రయ్య, ఏఎంపీ వైఎస్ చైర్మన్ ఎల్టి భూమారెడ్డి, నాయకులు గంభీర్ టాక్రే, పూండ్రు వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్, ఏఎంసీ కార్యరద్శి శ్రీకాంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి వివేక్ పాల్గొన్నారు. -
డ్యుయల్ డెస్క్‌ల కొనుగోలు వివాదాస్పదం
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన డ్యుయల్ డెస్క్‌ల కొనుగోలు వివాదాస్పదమవుతోంది. చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి డ్యుయల్ డెస్క్‌ల సరఫరా పేరిట ఓ మధ్య వ్యాపారి అధిక ధరలతో వంద.. వెయ్యి కాదు.. ఏకంగా లక్ష బల్లలను సరఫరా చేసేలా ఆర్డర్ సొంతం చేసుకున్నారు. విద్యాశాఖ టెండర్లు పిలిచి ఈ పనులు అప్పగించిందా? అంటే అదీ లేదు. జైళ్ల శాఖ పేరుతో నామినేషన్‌పై వీటి కొనుగోలుకు విద్యా శాఖ ఓకే చెప్పింది. సాధారణంగా రూ.10 లక్షల విలువైన పనులకూ ప్రభుత్వానికి ఫైలు పంపించే విద్యా శాఖ రూ.50 కోట్ల విలువైన ఈ పనులకు సొంతంగా ఆర్డర్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. పైగా చర్లపల్లి సెంట్రల్ జైలులో ఏడాది పొడవునా పని చేసినా లక్ష బల్లల తయారీ సామర్థ్యం లేదని విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు. అయినా జైలు పేరుతో బయటి వ్యక్తికి లక్ష బల్లల సరఫరా ఆర్డర్ అప్పగించారని, ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్ల దందా కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓపెన్ మార్కెట్లో చూస్తే.. విద్యాశాఖ ఆర్డర్ ఇచ్చిన డ్యుయల్ డెస్క్‌లను పరిశీలిస్తే అంత ధర లేదని చిన్నతరహా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు విద్యార్థులు కూర్చునేందుకు వీలున్న ఈ బల్లల తయారీకి రూ.2,800 వరకు ఖర్చవుతుందని, సరఫరా, లాభాల కింద రూ.1,200 కలిపినా రూ.4 వేలకు మించదని పేర్కొంటున్నాయి. కానీ ముగ్గురు విద్యార్థులు కూర్చునే బల్లలకు రూ.5,050 రేటుతో రూ.50 కోట్లకుపైగా విలువైన ఆర్డర్‌ను ఎలాంటి టెండర్లు లేకుండా ఇవ్వడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇవేకాదు పదో తరగతి పరీక్షల కోసం మరో 11 వేల వరకు డ్యుయల్ డెస్క్‌ల సరఫరాకూ ఆర్డర్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో రూ.15 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ మాత్రమే కాదు.. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలు కూడా గురుకులాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జైల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలి. సాధారణంగా జైలులో తయారు చేసే బల్లలపై పన్నులు ఉండవు. అలాంటప్పుడు మరింత రేటు తగ్గాల్సి ఉన్నా.. అధిక ధరలకు ఆర్డర్ ఇవ్వడం గమనార్హం. జెమ్ ఏం చెబుతోందంటే.. గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్(జెమ్).. ప్రధానమంత్రి నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ సూచనల మేరకు ఏర్పాటైన ఆన్లైన్ మార్కెట్ ఇదీ. ఇందులో వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రభుత్వాలకు అవసరమైన పరికరాలను స్పెసిఫికేషన్స్ ప్రకారం ఆయా వ్యాపార సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో డెస్క్‌లు సరఫరా చేసే వ్యాపార సంస్థలు వెయ్యికిపైగా ఉన్నాయి. విద్యాశాఖ నిర్దేశిత ప్రమాణాలతో కూడిన డ్యుయల్ డెస్క్‌లు రూ.1,600 నుంచి రూ.3,500 వరకు ధర ఉన్నాయి. కానీ దాని నుంచి కొనుగోలు చేసేందుకు విద్యా శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విచారణకు ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ఈ విషయాన్ని తేల్చాలని జైలు అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. ధరలు మేం నిర్ణయించం.. లక్ష డ్యుయల్ డెస్క్‌ల కొనుగోలు కోసం చర్లపల్లి జైలుకు ఆర్డర్ ఇచ్చింది వాస్తవమే. జైళ్లలో తయారయ్యే వస్తువులను ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేయాలన్న నిబంధన ఉంది. ఆ మేరకే మేం ఆర్డర్ ఇచ్చాం. అయితే ధరలను మేం నిర్ణయించం. మేం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం జైలు అధికారులే ధర నిర్ణయించారు. ఆ ప్రకారమే కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం. – కిషన్, పాఠశాల విద్యా కమిషనర్ -
బంగారం వ్యాపారాలకు నోటు ఎఫెక్టు
10 గ్రాములపై రూ.2,550 తగ్గుదల కొనుగోళ్లులేక రూ.17 కోట్ల నష్టం మరో నెల తప్పని సంక్షోభం ‘నోటు’ పాట్లతో పసిడి వెలుగు మసకబారింది. స్వర్ణం ధర కిందికి దిగుతోంది. నగల షాపులు వెలవెలబోతున్నారుు. 17 రోజులుగా పసిడి వర్తకులు కొనుగోళ్లు లేక డీలా పడుతున్నారు. ఫలితంగా ఈ పక్షం రోజుల్లో బంగారం ధరలు దిగిరాక తప్పలేదు. వాణిజ్య విపణిలో 10 గ్రాములపై రూ.2,550 తగ్గుదల నమోదైంది. మరో నెలరోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. తిరుపతి (అలిపిరి): పెద్ద నోట్ల రద్దు జిల్లా బంగారు వ్యాపారాన్ని తలకిందులు చేసింది. కోనుగోలుదారులు లేక జ్యువెలరీ షాపులు వెలవెలబోతున్నారుు. వెరుు్యని చెల్లని నోటుగా ప్రకటించడం బంగారు వ్యాపార రంగాన్ని మరింత కుదిపేసింది. మరోవైపు గోల్డ్ కొనుగోళ్లపై ఐటీ అధికారులు ఆంక్షలు విధించడంతో 17 రోజులుగా వ్యాపారం లేదు. జిల్లాలో గుర్తింపు పొందిన 450 బంగారు దుకాణాల్లో నిత్యం రూ.కోటిమేర వ్యాపారం జరుగుతుంది. నోట్ల రద్దు ప్రభావంతో కొనుగోళ్లు 10 శాతానికి పడిపోయాయని వ్యాపారులే చెబుతున్నారు. నోట్ల రద్దు తర్వాత జిల్లాలో బంగారు వ్యాపార రంగం రూ.17 కోట్లమేర నష్టాన్ని చవిచూడాల్సివచ్చిందని అంచనా. ఈ నెల 10వ తేదీన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,600గా నమోదైంది. నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో దీని ధర శనివారం నాటికి రూ.28,050కి పడిపోరుుంది. 10 గ్రాముల బంగారంపై రూ.2,550 తగ్గుదల నమోదమైంది. ఒక వైపు బంగారు ధరలు పతనం కావడం.. మరో వైపు జిల్లాలో నోటు కష్టాలు కొనసాగుతుండడం వంటి కారణాలతో బంగారు వ్యాపారులు ఎదురీదాల్సిన పరిస్థితులు నెలకొన్నారుు. స్వైపింగ్ కష్టాలు: పెద్ద నోట్లతో లావాదేవీలు జరపకూడదని కేంద్రం బంగారు వ్యాపార రంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో వ్యాపారులు కష్టాల్లో కూరుకుపోయారు. స్వైపింగ్ మిషన్ల ద్వారా కొనుగోళ్లకు ప్రజలు రాకపోవడంతో వ్యాపారం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వ్యాపారం పూర్తిగా పడిపోరుుంది కొనుగోలు దారులు లేక వ్యాపారం పూర్తిగా పడిపోరుుంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. స్వైపింగ్ మిషన్ ద్వారా లావాదేవీలు కొనసాగించవచ్చని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ దీని ద్వారా కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. కొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. -
‘పత్తి’పై స్పష్టతేది!
మద్దతు ధరపై ప్రస్తావనే కరువు కొనుగోళ్లు ప్రారంభమెప్పుడో చెప్పనేలేదు కొలిక్కిరాని ‘పత్తికి ఈ-నామ్’ అమలు అంశం పత్తి కొనుగోళ్లపై అఖిలపక్ష సమావేశం తీరిదీ.. మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలకు రూ.8 కోట్లు ఆదిలాబాద్ అర్బన్ : ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి పంటకు మద్దతు ధర ఇవ్వడం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం, మార్కెట్ యార్డుల ద్వారా పత్తి కొనుగోళ్ల ప్రారంభం ఎప్పుడో తేల్చడం వంటి వాటిపై స్పష్టత ఇవ్వకుండానే అఖిలపక్ష సమావేశం ముగిసింది. రైతులు పత్తి ని అమ్మడంలో ఎదుర్కొంటున్న సమస్యల పరి ష్కారానికి సలహాలు, సూచనలు, మార్కెట్లలో కల్పించాల్సిన సౌకర్యాలు, పత్తికి ఈ-నామ్ అమలుకు ఏం చర్యలు తీసుకోవాలి.. కొనుగోళ్లు ఎప్పుడనేది ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించాల్సి ఉంది. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ శాఖ మంత్రి రామన్న అధ్యక్షతన పత్తి కొనుగోళ్లపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ముందుగా వ్యవసాయ మార్కెటింగ్ డిప్యూటీ డెరైక్టర్ శ్రీనివాస్ ఈ ఏ డాది కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన జాతీయ వ్యవసాయ మార్కెటింగ్(ఈ-నామ్) విధానంపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. మార్కెటింగ్‌పై అవగాహన కల్పించండి మంత్రి రామన్న మాట్లాడుతూ, ఆన్లైన్ మార్కెటింగ్‌పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, దాని నిబంధనలు రైతులకు తెలిసేలా చూడాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అందరూ మాట్లాడే విధంగా అఖిలపక్షం నాయకులు సహకరించాలని మంత్రి కోరారు. కొన్ని చోట్ల సోయా పంటకు మొలకలు వచ్చాయని, మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా రైతులు విజ్ఞప్తి చేశారు. రైతు సంఘం నాయకులు ఒక్కొక్కరుగా మాట్లాడారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహావిష్కరణకు మంత్రి సమావేశం మధ్యలోంచి వెళ్లిపోయూరు. జేసీ సుందర్ అబ్నార్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ అధ్వైత్ కుమార్, నిర్మల్ ఆర్డీవో శివలింగయ్య సమావేశాన్ని ఉన్నవారితోనే కొనసాగించారు. తేమశాతం, దళారీలు, వ్యాట్, మార్కెట్ పని చేసే సమయాలు, మార్కెట్ యార్డుల్లో ఖాళీ పోస్టుల భర్తీ, ఈ-నామ్ ల్యాబ్ ఏర్పాటు, మైయిశ్చర్ మీటర్లు, రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యంపై జేసీతో మాట్లాడారు. చర్చలో ఇవి ప్రస్తావించారు.. అఖిలపక్ష సమావేశంలో పలువురు ప్రజాప్రతి నిధులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, కమీషన్ ఏజెంట్లు మాట్లాడారు. జిల్లాలోని ఆదిలాబాద్, భైంసా మార్కెట్లలో ప్రారంభించిన ఈ-నా మ్ భైంసాలో నడవడం లేద ని, నామ్‌కే వాస్తేగా.. ఉంద ని రైతు సోలంగి భీంరావు స మావేశం దృష్టికి తీసుకురా గా, కేవలం మినుముల కొ నుగోలుకు మాత్రమే ఈనా మ్ అమలు చేస్తున్నామని అధికారులు చెప్పా రు. మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసి నిఘా ఉంచాలని, రైతులు కట్టిన బీ మా డబ్బులు వచ్చేట్లు చూడాలని రైతు భూ మారెడ్డి కోరారు. అయితే ప్రభుత్వం నుంచి రూ.8 కోట్లు విడుదలయ్యాయని, ఈ ఏడాది నుంచే సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. తేమ విషయంలో, పత్తి అమ్మిన రైతులకు డబ్బుల చెల్లిం పు విషయంలో చాలా జాప్యం జరుగుతోందని, మార్కెట్‌కు తీసుకువచ్చిన పత్తిని గోదాముల్లో పెట్టుకునేలా సౌకర్యాలు కల్పించాలని రైతు సంఘం నాయకుడు బండి దత్తాత్రి స మావేశంలో ప్రస్తావించగా, తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉన్నా పత్తికి మద్దతు ధర ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మార్కె ట్ యార్డుల్లో రైతులకు ఏ అపాయం జరిగినా ప్రభుత్వాలు ఆదుకోవాలని, ఈనామ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలపాలని నాయకుడు గోవర్ధన్ యాదవ్ కోరారు. జిల్లాలో రెండు చోట్ల ఈ-నామ్ ప్రారంభించామని, ఈ ఏడాది పత్తికి అమలు చేయనున్నట్లు అధికారులు వివరించారు. మార్కెట్లో సీసీఐ అధికారులు తప్పకుండా ఉండాలని, ఆదిలాబాద్ మార్కెట్ గోదాముల పక్కన కొందరు ఇళ్లు ఎందుకు కట్టుకొని ఉన్నారో తెలపాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లోకా భూమారెడ్డి కోరారు. రైతులు తీసుకువచ్చిన పత్తికి రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. మార్కెట్‌యార్డుకు వచ్చే రోడ్లు బాగాలేవని, మార్కెట్లో రైతులను నిలుపు దోపిడీకి గురి చేస్తున్నారని, తాగునీరు, అన్నదానం, ఇతర సౌకర్యాలు కల్పించాలని, తేమ నిర్ధారణ నిష్పక్షపాతంగా జరగాలని, అందుకు సీనియర్ అధికారిని నియమించాలని పలువురు నాయకులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా, పత్తి కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారు.. పత్తికి ఈ-నామ్ అమలు చేస్తారా.. లేదా అన్నది కొలిక్కి రాలేదు. వ్యవసాయ మార్కెటింగ్ ప్రాంతీయ ఉప సంచాలకుడు శ్రీనివాస్, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, అఖిలపక్షం నాయకులు సురేశ్‌జోషి, గణపత్తి, లోకా భూమారెడ్డి, యూనుస్ అక్బానీ, బండి దత్తాత్రి, ప్రభాకర్‌రెడ్డి, అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు. -
రియల్ మార్కెట్లో కొనుగోళ్ల హుషారు!
* జిల్లాల్లోనూ అమ్మకాల జోరు * కొనుగోళ్లకిదే సరైన సమయమంటున్న నిపుణులు * కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టిసారిస్తున్న కంపెనీలు సాక్షి, హైదరాబాద్: వేచి చూద్దామా? కొనుగోలు చేద్దామా? స్థిరాస్తి మార్కెట్లో పరిణామాలు చూస్తుంటే కొనుగోలుకు మరింకెంతమాత్రం ఆలస్యం చేయవద్దు అంటున్నాయి. స్థిరాస్తి డెవలపర్లు, మార్కెట్ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. తాజాగా తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో గతేడాదితో పోలిస్తే పాతికశాతం వృద్ధి నమోదుచేయడం గమనిస్తే మార్కెట్ క్రమంగా పెరుగుతుందన్న సంకేతాలూ కనబడుతున్నాయి. ఆల స్యం చేస్తే ఇప్పుడున్న ధరల్లో భవిష్యత్తులో రక్కపోవచ్చు. స్థిరాస్తి రంగంలో హైదరాబాద్, రంగారెడ్డి చుట్లుపక్కలే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికాలంగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఐటీ, ఐటీ ఆధారిత, ఇతర పరిశ్రమల నిర్వాహకులు రాజధానితో పాటూ చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్లాంట్లు, కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలు వేలకోట్ల పెట్టుబడులను ప్రకటించేశాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిపై అంచనాలతో అక్కడి స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన మొదలు.. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్ట్‌లు రియల్‌రంగానికి ఊతమిస్తున్నాయి. పాతికశాతం పెరిగిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయమే ఇందుకు నిదర్శనం. జిల్లాల్లోనూ వృద్ధి.. నగరానికి దీటుగా జిల్లాల్లోనూ రియల్ రంగం పరుగులు పెడుతోంది. యాదాద్రి క్షేత్రం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం, వరంగల్-హైదరాబాద్‌ను పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటించడంతో ఈ మార్గంలో పెద్ద ఎత్తున స్థిరాస్తి వెంచర్లు ఏర్పాటయ్యాయి.పెట్టుబడి కోణంలో ఎక్కువమంది ఇక్కడ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ర్టంలోకెల్లా రిజిస్ట్రేషన్ల ఆదాయం నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 37 శాతం పెరగడం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. ఎప్పుడూ ముందుండే రంగారెడ్డి జిల్లాను నల్లగొండ మించిపోయింది. రంగారెడ్డి జిల్లాల్లోనూ ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ నిర్మాణాలు, స్థలాల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వృద్ధి 29 శాతంగా ఉంది. ఆపిల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు నగరానికొచ్చాయి. ఇవన్నీ మార్కెట్‌ను సానుకూల దిశగా తీసుకెళుతున్నాయని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణాలపరంగా వేగం పెరగడంతో హైదరాబాద్ సౌత్‌లో 26 శాతం వృద్ధి నమోదైంది. ఇందుకు తగ్గట్టుగానే డెవలపర్లూ కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ పశ్చిమం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఇటీవల పలు సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. కొత్తగా వచ్చేవారూ ఇక్కడే కావాలంటున్నారు. సంస్థలన్నీ ఈ ప్రాంతంలో కేంద్రీకృతం కావటంతో పెద్ద సంస్థలు తమ ప్రీమియం ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. పూర్తికావొచ్చిన ప్రాజెక్ట్‌ల్లోనూ విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్ట్‌ల విస్తరణలతో.. హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోనూ స్థిరాస్తి రంగం వేగం పుంజుకుంది. ఇదేదో మేం చెబుతున్నది కాదు. పెరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయమే మార్కెట్లో క్రయవిక్రయాలు పెరిగాయనేందుకు రుజువు. ఇటీవల ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలు, కొన్ని కంపెనీలు తమ ప్లాంట్ ఏర్పాటుకూ ముందుకు రావటం ఈ వృద్ధికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ప్రభుత్వం ప్రకటించింది. ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లూ రానున్నాయి. వరంగల్‌లో ఐటీ విస్తరణకు చర్యలు మొదలయ్యాయి. సైయంట్ సంస్థ కార్యాలయ ఏర్పాటుకు ముందుకొచ్చింది కూడా. టెక్స్‌టైల్స్‌గా ప్రకటించేసింది ప్రభుత్వం. ఖమ్మం నగరంలో ఔటర్‌రింగ్‌రోడ్డు ఏర్పాటు వంటివి ప్రభుత్వం ప్రకటించేసింది. ఇవన్నీ ఆయా జిల్లాల్లో స్థిరాస్తి రంగం అభివృద్ధికి దోహదపడుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
కడియమే కదిలొచ్చింది
-
‘సెస్’ కొనుగోళ్లపై మంత్రి కేటీఆర్ ఆరా
సిరిసిల్ల : సిరిసిల్ల ‘సెస్’ పరిధిలో టెండర్లు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్ గురువారం ఆరా తీసినట్లు సమాచారం. ఎల్లారెడ్డిపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ‘సెస్’ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డిని తన వాహనంలో ఎక్కించుకుని కొనుగోళ్ల వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు జరిగాయని చైర్మన్ లక్ష్మారెడ్డి వివరణ ఇవ్వగా.. పారదర్శకంగా టెండర్లు నిర్వహించకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పాలకవర్గం సభ్యుల మధ్య అంతర్గత కలహాలపైనా మంత్రి ఆరా తీసినట్లు తెలిసింది. ప్రధానంగా ‘సాక్షి’ కథనాలను ప్రస్తావిస్తూ.. ‘సెస్’ పరిధిలో ఇటీవల నెలకొన్న అంశాలను మంత్రి కేటీఆర్ అడిగినట్లు సమాచారం. ఉద్యోగుల సరెండర్, మూకుమ్మడి సిమ్‌కార్డుల సరెండర్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. సమర్థవంతమైన సేవలు అందించే ‘సెస్’ పరువుతీయకుండా నిజాయితీగా వినియోగదారులకు సేవలు అందించాలని కేటీఆర్ సూచించినట్లు తెలిసింది. అత్యవసరం మేరకే కొనుగోళ్లు – ‘సెస్’ ఎండీ నాంపల్లి గుట్ట ‘సెస్’ పరిధిలో అత్యవసరమైన పనుల కోసం టెండర్లు లేకుండానే కొనుగోళ్లకు పర్చేజ్ కమిటీ ఆమోదంతో ఆర్డర్లు ఇచ్చామని మేనేజింగ్ డైరెక్టర్ కె.నాంపల్లి గుట్ట తెలిపారు. సిరిసిల్ల ‘సెస్’ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మధ్యమానేరు పునరావాస కాలనీల్లో విద్యుద్దీకరణ కోసం ప్రభుత్వం కలెక్టర్ ద్వారా ‘సెస్’ సంస్థకు రూ.4.87 కోట్లు డిపాజిట్ చేసిందని వివరించారు. పునరావాస కాలనీల్లో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాటు చేసేందుకు అత్యవసరంగా భావించి పాలకవర్గం నిర్ణయం మేరకు కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. టెండర్లు లేకుండా అవసరం మేరకు కొనుగోళ్లు చేయవచ్చని ‘సెస్’ నిబంధనల్లో ఉందని వివరించారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులన్నీ సిద్ధంగా ఉన్నాయని ఎండీ తెలిపారు. ‘సెస్’ సంస్థకు నష్టం కలిగించే పనులు చేయడం లేదని పేర్కొన్నారు. పాలకవర్గంలోని కొందరు డైరెక్టర్లు వ్యతిరేకిస్తున్నా.. టెండర్లు లేకుండా కొనుగోళ్లు చేయడంపై ‘సాక్షి’లో ప్రచురితమైన వరస కథనాలపై ఎండీ స్పందించి వివరణ ఇచ్చారు. సమావేశంలో ఏడీఈ రాజిరెడ్డి ఉన్నారు. -
కంపెనీల కొనుగోళ్ల రేసులోఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్
న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టుబ్రోకి చెందిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ కంపెనీ ఇతర ఐటీ కంపెనీలను కొనుగోళ్లపై కన్నేసింది. ఎనలిటిక్స్, కన్సల్టింగ్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, క్లౌడ్ ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫార్మేషన్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ తెలిపింది. ఈ కంపెనీ రూ.1,200 కోట్ల సమీకరణ నిమిత్తం ఈ నెల 11న(వచ్చే సోమవారం) ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోంది. ఈ ఐపీఓలో ఎల్ అండ్ టీకి చెందిన 1.7 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో జారీ చేస్తారు. దీంతో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌కు ఎలాంటి నిధులు రావు. ఐపీఓ నిధులన్నీ మాతృసంస్థ ఎల్ అండ్ టీకి వెళతాయి. తమకు 250 మందికి పైగా క్లయింట్లున్నారని, వీరికి సేవలందించడానికి భారత్, అమెరికా, యూరప్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఐటీ కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ సీఈఓ, ఎండీ సంజయ్ జలోన చెప్పారు. కంపెనీల కొనుగోళ్లకు కావలసిన నిధులను అంతర్గతంగా సమకూర్చుకుంటామని, లేదా మార్కెట్ నుంచి సమీకరిస్తామని, లేదా పబ్లిక్ ఇష్యూకు వస్తామని పేర్కొన్నారు. తమ ఆదాయంలో 69 శాతం అమెరికా నుంచి, 17 శాతం యూరప్ నుంచి, భారత్ నుంచి 5 శాతం చొప్పున లభిస్తాయని, మిగిలింది ఇతర దేశాల నుంచి వస్తోందని వివరించారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చేది 2 శాతమేనని, అందుకని బ్రెగ్జిట్ ప్రభావం తమపై ఉండదని పేర్కొన్నారు. ఐపీఓ ధర శ్రేణి రూ.705-710 కాగా ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఐపీఓ)కు ధర శ్రేణిని రూ.705-710గా కంపెనీ నిర్ణయించింది. లిస్టయిన తర్వాత ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎల్ అండ్ టీ నుంచి స్టాక్ మార్కెట్లోకి లిస్టింగ్ కోసం వస్తోన్న రెండో అనుబంధ కంపెనీ ఇది. ఐదేళ్ల క్రితం ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ ఐపీఓకు వచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,000 కోట్లుగా ఉంది.