న్యూఢిల్లీ: ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అయిన ‘జెమ్’పై వస్తు, సేవల కొనుగోళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించాయి. వివిధ శాఖలు, విభాగాల నుంచి కొనుగోళ్ల కార్యకలాపాలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో (ఎక్స్) పేర్కొన్నారు. జెమ్‌ను కేంద్ర సర్కారు 2016 ఆగస్ట్ 9న ప్రారంభించడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విభాగాల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.
2021–22 ఆర్థిక సంవత్సరానికి జెమ్‌పై కొనుగోళ్ల విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.2 లక్షల కోట్లను అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనుగోళ్ల విలువ రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెమ్‌పై 62 లక్షల విక్రేతలు, సరీ్వస్ ప్రొవైడర్లు నమోదై ఉన్నారు. 63,000 ప్రభుత్వ కొనుగోళ్ల విభాగాలు కూడా నమోదై ఉన్నాయి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పారా మిలటరీ దళాలు కొనుగోలుదారుల జాబితాలో ఉన్నాయి. స్టేషనరీ నుంచి వాహనాలు, కంప్యూటర్, ఫర్నిచర్ వరకు అన్ని రకాల విక్రేతలు దీనిపై నమోదై ఉన్నారు. సేవల విభాగంలో రవాణా, లాజిస్టిక్స్, వ్యర్థాల నిర్వహణ, వెబ్‌కాస్టింగ్‌కు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. మొత్తం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థల వాటా 83 శాతంగా ఉన్నట్టు వాణిజ్య శాఖ తెలిపింది. మొత్తం 312 రకాల సేవలు, 11,800 ఉత్పత్తులు జెమ్‌పై విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. జెమ్ ఆరంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.5.93 లక్షల కోట్ల కొనుగోళ్లు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment