విదేశీ సైట్లలో కొంటే బాదుడే..! | Buying from foreign ecommerce sites may get costlier | Sakshi
Sakshi News home page

విదేశీ సైట్లలో కొంటే బాదుడే..!

Published Tue, Feb 11 2020 2:19 AM | Last Updated on Tue, Feb 11 2020 2:19 AM

Buying from foreign ecommerce sites may get costlier - Sakshi

న్యూఢిల్లీ: విదేశీ ఈ–కామర్స్‌ సైట్లలో జరిపే కొనుగోళ్లు ఇకపై భారం కానున్నాయి. ఈ షాపింగ్‌ పోర్టల్స్‌లో లావాదేవీల్లో సుంకాలు, పన్నుల ఎగవేత ఉదంతాలు చోటు చేసుకుంటుండటంపై కేంద్రం మరింతగా దృష్టి సారించడమే ఇందుకు కారణం. సీమాంతర లావాదేవీలపై ప్రీ–పెయిడ్‌ విధానంలో కస్టమ్స్‌ సుంకాలు, పన్నులను వడ్డించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన పక్షంలో విదేశీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్ల ద్వారా జరిపే కొనుగోళ్లు దాదాపు 50% మేర భారం కాగలవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఏం జరుగుతోందంటే...
భారతీయులకు విదేశాల నుంచి వచ్చే గిఫ్టుల విలువ రూ. 5,000 దాకా ఉన్న పక్షంలో పన్నుల భారం ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని పలు చైనీస్‌ ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు .. ఇక్కడివారు కొనుగోలు చేసిన ఉత్పత్తులను బహుమతుల పేరిట ఎగుమతి చేస్తున్నాయి. తద్వారా సుంకాలు, పన్నుల ఎగవేత జరుగుతోంది. పలు ఉత్పత్తులపై భారీగా ఉండే సుంకాల భారం తగ్గడం వల్ల దేశీ ఈ–కామర్స్‌ పోర్టల్స్‌తో పోలిస్తే విదేశీ షాపింగ్‌ పోర్టల్స్‌లో కొనే ఉత్పత్తులు దాదాపు 40 శాతం చౌకగా లభిస్తున్నాయి. ఇలా విదేశీ ఈ–కామర్స్‌ సంస్థలు వ్యాపార లావాదేవీల కోసం గిఫ్ట్‌ విధానాన్ని దుర్వినియోగం చేస్తుండటం వల్ల దేశీ ఈ–కామర్స్‌ సంస్థలకు నష్టం జరుగుతోందని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్‌ చైర్మన్‌ సచిన్‌ తపారియా తెలిపారు.  

కస్టమ్స్‌ సుంకాలు, వస్తు–సేవల పన్ను (జీఎస్‌టీ) ఎగవేత జరుగుతున్న ఇలాంటి లావాదేవీలను గతేడాది.. కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ మరింత లోతుగా పరిశీలించింది. గిఫ్టుల రూపంలో వచ్చే దిగుమతులపై ముంబై కస్టమ్స్‌ విభాగం నిషేధం విధించింది. దీంతో ఈ తరహా కొనుగోళ్లు సుమారు 60 శాతం దాకా పడిపోయాయి. కీలకమైన ఔషధాలు, రాఖీలు మినహా గిఫ్ట్‌ మార్గంలో విదేశీ ఈ–కామర్స్‌ సైట్ల నుంచి వచ్చే ప్యాకేజీలన్నింటిపైనా నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య విధానంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది.

కొత్త విధానం ఇలా..
తాజాగా విదేశీ షాపింగ్‌ పోర్టల్స్‌ ద్వారా జరిగే కొనుగోళ్లపై సుంకాలు, పన్నులు విధించే అంశంపై కేంద్రం .. లోకల్‌సర్కిల్స్‌ వంటి సంబంధిత వర్గాల అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ విధానం ప్రకారం కస్టమ్స్‌ విభాగం సొంత పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ను వినియోగంలోకి తెస్తుంది. చైనా తదితర విదేశీ ఈ–కామర్స్‌ సంస్థలు.. భారత కస్టమర్ల నుంచి సుంకాలు, పన్నులు వసూలు చేసి ఈ ఐటీ సిస్టమ్‌ ద్వారా భారత ప్రభుత్వానికి చెల్లిస్తాయి. లావాదేవీ వివరాలు సమర్పించి, ప్రీపెయిడ్‌ సుంకాలను చెల్లించిన తర్వాత.. ఆయా ఈ–కామర్స్‌ సంస్థలకు రసీదు, లావా దేవీ రిఫరెన్స్‌ నంబరు లభిస్తుంది. ఈ ప్రక్రి య పూర్తయిన తర్వాతే ఉత్పత్తుల డెలివరీకి వీలవుతుంది. ప్రత్యామ్నాయంగా సదరు విదేశీ ఈ–కామర్స్‌ సంస్థకు భారత్‌లో ఉన్న భాగస్వామ్య సంస్థ అయినా సంబంధిత పన్నులు చెల్లిస్తే లావాదేవీకి ఆమోదముద్ర లభిస్తుంది. ఇలాంటి ప్రీ–పెయిడ్‌ మోడల్‌తో కస్టమర్లు, విదేశీ సరఫరాదారుల మధ్య లావాదేవీలపై పారదర్శకత పెరుగుతుందని లోకల్‌సర్కిల్స్‌ చైర్మన్‌ సచిన్‌ తపారియా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement