E-commerce sites
-
నకిలీ రివ్యూల కట్టడిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదోవ పట్టించేటువంటి రివ్యూలను.. ఈ–కామర్స్ సైట్లలో కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలితో (ఏఎస్సీఐ) కలిసి ఈ–కామర్స్ కంపెనీలు, సంబంధిత వర్గాలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. నకిలీ, తప్పుదోవ పట్టించే రివ్యూల ప్రభావాలు, అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు వినియోగదారుల ఫోరమ్‌లు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ వర్గాలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలు రాశారు. యూరోపియన్ యూనియన్‌లో 223 బడా వెబ్సైట్లలో ఆన్లైన్ రివ్యూలపై జరిగిన సమీక్ష వివరాలను వాటిలో ప్రస్తావించారు. స్క్రీనింగ్ ఫలితాల ప్రకారం దాదాపు 55 శాతం వెబ్సైట్లు ఈయూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్లైన్ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్ తెలిపారు. అయితే, ఈ–కామర్స్ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్ వివరించారు. -
విదేశీ సైట్లలో కొంటే బాదుడే..!
న్యూఢిల్లీ: విదేశీ ఈ–కామర్స్ సైట్లలో జరిపే కొనుగోళ్లు ఇకపై భారం కానున్నాయి. ఈ షాపింగ్ పోర్టల్స్‌లో లావాదేవీల్లో సుంకాలు, పన్నుల ఎగవేత ఉదంతాలు చోటు చేసుకుంటుండటంపై కేంద్రం మరింతగా దృష్టి సారించడమే ఇందుకు కారణం. సీమాంతర లావాదేవీలపై ప్రీ–పెయిడ్ విధానంలో కస్టమ్స్ సుంకాలు, పన్నులను వడ్డించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన పక్షంలో విదేశీ ఆన్లైన్ షాపింగ్ సైట్ల ద్వారా జరిపే కొనుగోళ్లు దాదాపు 50% మేర భారం కాగలవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏం జరుగుతోందంటే... భారతీయులకు విదేశాల నుంచి వచ్చే గిఫ్టుల విలువ రూ. 5,000 దాకా ఉన్న పక్షంలో పన్నుల భారం ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని పలు చైనీస్ ఈ–కామర్స్ వెబ్సైట్లు .. ఇక్కడివారు కొనుగోలు చేసిన ఉత్పత్తులను బహుమతుల పేరిట ఎగుమతి చేస్తున్నాయి. తద్వారా సుంకాలు, పన్నుల ఎగవేత జరుగుతోంది. పలు ఉత్పత్తులపై భారీగా ఉండే సుంకాల భారం తగ్గడం వల్ల దేశీ ఈ–కామర్స్ పోర్టల్స్‌తో పోలిస్తే విదేశీ షాపింగ్ పోర్టల్స్‌లో కొనే ఉత్పత్తులు దాదాపు 40 శాతం చౌకగా లభిస్తున్నాయి. ఇలా విదేశీ ఈ–కామర్స్ సంస్థలు వ్యాపార లావాదేవీల కోసం గిఫ్ట్ విధానాన్ని దుర్వినియోగం చేస్తుండటం వల్ల దేశీ ఈ–కామర్స్ సంస్థలకు నష్టం జరుగుతోందని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ చైర్మన్ సచిన్ తపారియా తెలిపారు. కస్టమ్స్ సుంకాలు, వస్తు–సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేత జరుగుతున్న ఇలాంటి లావాదేవీలను గతేడాది.. కస్టమ్స్ డిపార్ట్మెంట్ మరింత లోతుగా పరిశీలించింది. గిఫ్టుల రూపంలో వచ్చే దిగుమతులపై ముంబై కస్టమ్స్ విభాగం నిషేధం విధించింది. దీంతో ఈ తరహా కొనుగోళ్లు సుమారు 60 శాతం దాకా పడిపోయాయి. కీలకమైన ఔషధాలు, రాఖీలు మినహా గిఫ్ట్ మార్గంలో విదేశీ ఈ–కామర్స్ సైట్ల నుంచి వచ్చే ప్యాకేజీలన్నింటిపైనా నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య విధానంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. కొత్త విధానం ఇలా.. తాజాగా విదేశీ షాపింగ్ పోర్టల్స్ ద్వారా జరిగే కొనుగోళ్లపై సుంకాలు, పన్నులు విధించే అంశంపై కేంద్రం .. లోకల్‌సర్కిల్స్ వంటి సంబంధిత వర్గాల అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ విధానం ప్రకారం కస్టమ్స్ విభాగం సొంత పేమెంట్ ఇంటర్ఫేస్ను వినియోగంలోకి తెస్తుంది. చైనా తదితర విదేశీ ఈ–కామర్స్ సంస్థలు.. భారత కస్టమర్ల నుంచి సుంకాలు, పన్నులు వసూలు చేసి ఈ ఐటీ సిస్టమ్ ద్వారా భారత ప్రభుత్వానికి చెల్లిస్తాయి. లావాదేవీ వివరాలు సమర్పించి, ప్రీపెయిడ్ సుంకాలను చెల్లించిన తర్వాత.. ఆయా ఈ–కామర్స్ సంస్థలకు రసీదు, లావా దేవీ రిఫరెన్స్ నంబరు లభిస్తుంది. ఈ ప్రక్రి య పూర్తయిన తర్వాతే ఉత్పత్తుల డెలివరీకి వీలవుతుంది. ప్రత్యామ్నాయంగా సదరు విదేశీ ఈ–కామర్స్ సంస్థకు భారత్‌లో ఉన్న భాగస్వామ్య సంస్థ అయినా సంబంధిత పన్నులు చెల్లిస్తే లావాదేవీకి ఆమోదముద్ర లభిస్తుంది. ఇలాంటి ప్రీ–పెయిడ్ మోడల్‌తో కస్టమర్లు, విదేశీ సరఫరాదారుల మధ్య లావాదేవీలపై పారదర్శకత పెరుగుతుందని లోకల్‌సర్కిల్స్ చైర్మన్ సచిన్ తపారియా తెలిపారు. -
రారా.. అక్కడకు రారా
ఓఎల్‌ఎక్స్‌తోపాటు ఇతర ఈ–కామర్స్ సైట్స్‌లో తక్కువ ధరకు వాహనాలు అమ్ముతామంటూ పోస్టులు పెట్టి అందినకాడికి దండుకునే మోసగాళ్ల పంథా మారుతోంది. ఇప్పటివరకు ఆన్లైన్లో ‘అడ్వాన్స్’ తీసుకుని మోసం చేసేవారు. తాజాగా తమ మాటల వలలో పడినవారిని రాజస్థాన్‌తోపాటు హర్యానాలోని కొన్ని ప్రాంతాలకు రప్పించి కిడ్నాప్ చేసి దోచేస్తున్నారు. ఈ విధంగా మోసపోయిన ఓ వ్యక్తి పోలీసుల్ని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. – సాక్షి, హైదరాబాద్ ఇక్కడివరకు రొటీన్ పంథానే.. ఓఎల్‌ఎక్స్‌తోపాటు మరికొన్ని సైట్స్లోనూ ఖాతాలు తెరిచి పోస్టింగ్స్ పెడుతున్న సైబర్ నేరగాళ్లు ప్రధానంగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన వారే. ప్రజల్ని తేలిగ్గా మోసం చేయడానికి దేశ వ్యాప్తంగా విధులు నిర్వర్తించే, ఎప్పుడు–ఎక్కడికైనా బదిలీ అయ్యే ఆర్మీ ఉద్యోగుల పేర్లు వాడుకుంటున్నారు. వివిధ మార్గాల్లో సేకరించినవారి ఫొటోలతోనో, తామే ఆ వేషాలు వేసుకునో పోస్టింగ్స్ చేస్తున్నారు. వాటిలో బుల్లెట్‌తోపాటు వివిధ రకాలైన కార్లకు సంబంధించిన ఆకర్షణీయమైన ఫొటోలను, వాటికి అత్యంత తక్కువ ధరలను పొందుపరుస్తున్నారు. తమకు వేరే ప్రాంతానికి బదిలీ అయినందుకో, రిటైర్ అయిన నేపథ్యంలోనో ఆయా వాహనాలను అమ్మి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నామంటూ ఆ పోస్ట్‌లో పొందుపరుస్తున్నారు. ఇక్కడిదాకా గతంలో ఎలా వ్యవహరించారో అలానే చేస్తున్నారు. పరిచయం లేని వారితో లావాదేవీలు వద్దు కేవలం ఓఎల్ఎక్స్ యాడ్స్ విషయంలోనే కాదు ఏ విషయంలోనూ పరిచయం లేని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు వద్దు. వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ వివిధ ఈ–కామర్స్ సైట్స్‌లో ఉన్న ప్రకటనలు గుడ్డిగా నమ్మకూడదు. ప్రత్యక్షంగా వస్తువుల్ని, వ్యక్తుల్ని చూడకుండా అడ్వాన్స్‌లు చెల్లించవద్దు. ఎవరైనా కొత్త వ్యక్తులు వ్యాపారం తదితరాల పేర్లు చెప్పి నగదుతో తమ ప్రాంతాలకు రమ్మంటే వెళ్లకపోవడం ఉత్తమం. అనేక సందర్భాల్లో ఆయా పోలీసు విభాగాల నుంచి పూర్తి సహకారం లభించకపోవచ్చు. అన్ని వివరాలు పక్కాగా సరిచూసుకున్న తర్వాతే ఆర్థిక లావాదేవీలు చేయాలి. – సైబర్ క్రైమ్ అధికారులు డిపాజిట్ కాకుండా నేరుగా రమ్మని.. కొత్తగా కనిపిస్తున్న వాహనాలు తక్కువ ధరకు విక్రయానికి ఉన్నాయని ఓఎల్ ఎక్స్ పోస్టు ద్వారా నమ్మినవారు ఎవరైనా సంప్రదిస్తే అసలు కథ మొదలెడుతున్నారు. ఇలా ఫోన్ ద్వారా సంప్రదిస్తే వాహనాలను చూపించాలన్నా, డెలివరీ ఇవ్వాలన్నా అడ్వాన్స్‌గా కొంత మొత్తం చెల్లించాలని చెప్పేవారు. దీనికోసం బోగస్ వివరాలతో తెరిచిన తమ బ్యాంకు ఖాతాలతోపాటు వివిధ వ్యాలెట్స్‌లోకి ఆ నగదు బదిలీ చేయించుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసేవారు. అడుగుపెట్టగానే అపహరించి... ఈ మాటలు నమ్మినవారు ఎవరైనా నగదుతో అక్కడకు చేరుకుంటే వెంటనే సీన్ మారి పోతోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వేచి ఉండే ఆ ముఠాలు కస్టమర్లను కిడ్నాప్ చేస్తున్నాయి. అక్కడి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి నగదు, బంగారం దోపిడీ చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా వారిని ఏటీఎం కేంద్రాలకు తీసుకువెళ్లి వీలున్నంత వరకు డ్రా చేయించి స్వాహా చేసి తీవ్రంగా భయపెట్టి వదిలిపెడుతున్నారు. బాధితులు అక్కడి పోలీసుల్ని ఆశ్రయించినా ఫలితం లేకుండా ఉండేందుకు హర్యానా పరిధిలో నేరం చేస్తే వెంటనే దగ్గరలోనే ఉండే యూపీ లేదా రాజస్థాన్ పరిధిలోకి వెళ్లిపోయి కొన్నిరోజులు తలదాచుకుంటున్నాయి. ఇటీవల ఓ వ్యక్తికి తక్కువ ధరకు కారును ఆశగా చూపి హర్యానాలోకి హొటల్కు రప్పించి నిలువు దోపిడీ చేసి పంపాయి. ఆ బాధితుడి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కేసు నమోదుకు సంబంధించి న్యాయపరమైన సలహా తీసుకోవాలని నిర్ణయించారు. -
ఆన్‌లైన్‌లోనూ చౌక ‘బేరం’
♦ కూపన్ల నుంచి పేమెంట్ల వరకూ ఆఫర్లు ♦ ఆదా చేయటానికి రకరకాల మార్గాలు ► షాపుకెళ్లి ఏదైనా కొనాలంటే... ముందు వస్తువు చూస్తాం. ధర అడుగుతాం. బేరమాడతాం. కొందరైతే... బేరమాడుతూనే ఉంటారు. ఎందుకంటే... బేరం చేసి కొనటమంటే అదో తృప్తే. ► మరి ఆన్లైన్ షాపింగ్ చేసేవారు ఈ తృప్తిని మిస్సవరా అంటే... కచ్చితంగా అవుతారు. ఎందుకంటే అక్కడంతా ఫిక్స్డ్ మయం. ఆన్లైన్లో ఒక ధర చూస్తే... దాన్ని చెల్లించాల్సిందే. మరి ఆ ధరను ఇంకా తగ్గించాలంటే...? ► ఆన్లైన్లో చెప్పిన ధర కన్నా తక్కువకు పొందటానికి చాలా చిట్కాలున్నాయి. వాటిని పాటిస్తే బయటి కన్నా చాలా తక్కువ ధరకే కొన్నామన్న తృప్తి మిగులుతుంది. ఈ ఆన్లైన్ చిట్కాలు ‘సాక్షి ప్రాఫిట్ ప్లస్’ పాఠకుల కోసం... సరదా కోసం షాపింగ్ చేయొద్దు కాలక్షేపం, సరదా కోసం ఈ-కామర్స్ సైట్లలో విహరించడం అంత మంచిది కాదు. మీకు ఒక వస్తువుతో నిజంగానే అవసరం ఉంటే అప్పుడు దాని కోసం షాపింగ్ చేయండి. ప్రస్తుతం మొబైల్ యాప్ ద్వారా రిటైలర్లు వినియోగదారులను ఆకర్షించడానికి మనీ బ్యాక్ గ్యారంటీ, రిప్లేస్మెంట్ గ్యారంటీ, ధరల డిస్కౌంట్ వంటి పలు రకాల ఆఫర్లను అందిస్తున్నారు. ఒక క్లిక్‌తో వస్తువులను కొనేలా చేస్తున్నాయి. షాపింగ్ సమయంలో ముందుగా నిర్దేశించుకున్న అవసరమైన వస్తువులను మాత్రమే కొనండి. ‘బయ్ హట్కే’ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే.. మీరు డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్... ఇలా దేని నుంచైనా షాపింగ్ చేయండి. కాకపోతే ‘బయ్ హట్కే’ యాప్‌ను మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. డెస్క్‌టాప్‌లో అయితే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను దీని ఎక్స్‌టెన్షన్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఫోన్‌లోనైతే యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు ఈ కామర్స్‌లో ఏ వస్తువు కొంటున్నా... అది ఇంకా తక్కువ ధరకు ఏ సైట్లో దొరుకుతుందో ఈ బయ్హట్కే ఎక్స్టెన్షన్ మీకు అక్కడే చూపిస్తుంటుంది. దాంతో మీరు ఏ సైట్ సదరు వస్తువును తక్కువ ధరకు ఆఫర్ చేస్తోందో అక్కడే తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరొక వెబ్సైట్లో ఒక మొబైల్ ఫోన్‌ను రూ.9,800 దగ్గర కొందామనుకున్నారు. కానీ మరో సైట్లో అదే మొబైల్‌ను రూ.8,800కు దొరుకుతోందని బయ్హట్కే ఎక్స్టెన్షన్ చూపించిందనుకోండి. నిక్షేపంగా సదరు వెబ్‌సైట్‌ను విజిట్ చేసి తెలుసుకోవచ్చు. అలా... తక్కువ ధరకు వస్తువు ఎక్కడ దొరుకుతోందో తెలుసుకుని కొనుక్కోవచ్చు. కాగా వీలైతే ఒక వస్తువు ధరను తెలుసుకోవడానికి పలు రకాల వెబ్సైట్లను వెదకాలి. జంగ్లీ.కామ్ వంటి సైట్లలో ఒక వస్తువు ధర వివిధ వెబ్‌సైట్స్‌లో ఎలా ఉందో ఒకేచోట తెలుసుకోవచ్చు. పండుగ సీజన్లలో షాపింగ్ చేయండి ఇంకా కొన్ని చేయొచ్చు. కంపెనీలు సాధారణంగా పండుగ రోజుల్లో పలు రకాల డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంటాయి. ఇదే విధంగా ఆన్లైన్ షాపింగ్ సంస్థలూ వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించడానికి దీపావళి, దసరా, రంజాన్ వంటి పండుగ రోజులతో పాటు ఇండిపెండెన్స్ డే వంటి ప్రత్యేక దినాల్లో కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కాబట్టి మీరు మీ షాపింగ్‌ను వీలైనంత వరకు ఈ పండుగ రోజుల్లో చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు మంచి ఆఫర్లు లభించే అవకాశం ఉంది. వీటితోపాటు కొన్ని కంపెనీలు ఇటీవల కాలంలో షాపింగ్ ఫెస్టివల్ మేళాలు కూడా నిర్వహిస్తున్నాయి. క్రెడిట్, డెబిట్‌కార్డులతో క్యాష్‌బ్యాక్ ఇక చివరిగా చెల్లింపులు చేసేటపుడు కాస్త ఆలోచించాలి. మీ క్రెడిట్, డెబిట్ కార్డులతో కూడా డిస్కౌంట్ ఆఫర్లు పొందవచ్చు. ఎందుకంటే చెల్లింపులు అధికంగా తమ బ్యాంకుల నుంచే జరగాలనే ఉద్దేశంతో బ్యాంకులు ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో ఆన్లైన్ షాపింగ్ చేస్తే అవి మనకు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఎస్బీఐ డెబిట్ కార్డుతో ఆన్లైన్ పేమెంట్ చేస్తే.. అమెజాన్ 10 శాతం, హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డుతో చెల్లింపులు జరిపితే స్నాప్‌డీల్ అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నాయి. నిజానికి ప్రతి బ్యాంకూ ఏదో ఒక సైట్‌తో ఒప్పందం చేసుకుందనేది కాదనలేని నిజం. కొంచెం కష్టపడి... కూపన్లు వెదకండి కావాల్సిన వస్తువు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతోందో తెలిసింది. మరి ఆ ధరకు కొనేయాలా? ఇంకా తగ్గుతుందా!! ఇది తెలుసుకోవటానికి కాస్త కూపన్లు అందించే సైట్లను వెదకాలి. ఇపుడు దాదాపు ఈ-కామర్స్ సంస్థలన్నీ కూపన్లు అందించే వెబ్సైట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ కూపన్ల సంస్థలు రకరకాల ఆఫర్లతో కొనుగోలు దారుల్ని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం వెబ్‌సైట్స్ పలు రకాల కూపన్లను ఆఫర్ చేస్తున్నాయి. కూపన్ దునియా, కూపన్జ్గురు, కూపన్నేషన్ సహా పలు వెబ్సైట్ల ద్వారా ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రైస్ అలర్ట్స్తో ఎంతో మేలు హడావుడిలో ఉండో... లేక ఈ వస్తువును ఇప్పుడే ఏం కొంటాంలే ధర తగ్గాక చూద్దాం అని భావించో కొనుగోలును వాయిదా వేసుకోవచ్చు. కానీ ధర ఎప్పుడు తగ్గుతుందో మీకు తెలియదు. అప్పుడేం చేయాలి? ఇలాంటి సమయాల్లో మీరు ప్రైస్ అలర్ట్స్ కోసం నమోదు చేసుకోవచ్చు. మీరు కొనాలి అని భావించిన వస్తువు ధర తగ్గినప్పుడు ఆ వెబ్‌సైట్స్ నుంచి మీకు ధరకు సంబంధించిన ఈ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్లు వస్తాయి. ఉదాహరణకు మీరు ఈ సమయంలో కొనాలి అని భావించే వస్తువు ధర రూ.5,000గా ఉందనుకోండి. కానీ మీరు ఆ వస్తువు ధర కచ్చితంగా రూ.4,700కు తగ్గుతుందని భావిస్తున్నారు. అలాంటప్పుడు మీరు ప్రైస్ అలర్ట్స్‌కు నమోదు చేసుకుంటే... ధర తగ్గినప్పుడు ఆ వెబ్‌సైట్స్ మీకు ఆ విషయాన్ని తెలియజేస్తాయి. కార్ట్‌లో వస్తువులను యాడ్ చేసి ఉంచండి మీరు ఆన్లైన్ షాపింగ్ చేసిన తర్వాత మీకు నచ్చిన వస్తువులను వెంటనే కొనకుండా షాపింగ్ కార్ట్‌లో యాడ్ చేసి ఉంచడం మరో పద్ధతి. వాటిని కొన్ని రోజుల పాటు అలాగే వదిలేయండి. ప్రస్తుతం ఈ-కామర్స్ సంస్థలు ఈ విధంగా వస్తువులను కొనకుండా కార్ట్‌లో యాడ్ చేసి వదిలేసిన అంశంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఎందుకంటే ఇలా కార్ట్‌లో యాడ్ అయిన వస్తువుల్లో దాదాపుగా 2/3 వంతు అమ్మకాలు నిలిచిపోతున్నాయి. అలాంటపుడు ఈ-కామర్స్ సంస్థలు వాటి ధరలు తగ్గాయని, మీరు కొనుగోలు చేయొచ్చని ప్రైస్ అలర్ట్స్ పంపిస్తున్నాయి. వాలెట్‌తో పేమెంట్స్ చేయండి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనకు సాధారణంగా అధిక డిస్కౌంట్లు కూపన్ల ద్వారానే లభిస్తాయి. అలానే కాకుండా ఈ-వాలెట్స్ ద్వారా కూడా మనం అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. మీకు డిస్కౌంట్ లభించని పక్షంలో ఈ-వాలెట్ చెల్లింపు ద్వారా కచ్చితంగా క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఉదాహరణకు మీరొక సినిమా టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను చూడండి.. మీరు పది సినిమా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉందనుకోండి. మీరు ఆ పది టికెట్లను ఒకేసారి బుకింగ్ చేసుకునేదానికి బదులు, ఒక్కొక్క దాన్ని ఒకసారి అంటే పదిసార్లు టికెట్లను బుకింగ్ చేసుకుంటే అ వెబ్సైట్ మీకు కచ్చితంగా అదనపు డిస్కౌంట్‌ను అందిస్తుంది. షాపింగ్‌కు పలు రకాల మెయిల్స్ వాడండి దాదాపుగా ప్రతి కంపెనీ కూడా కొత్త వినియోగదారులకు పలు రకాల డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. మీరు మొదటిసారి ఒక సైట్లో రిజిస్టర్ అయితే ఆ సైట్ సంస్థ మీకు ఈ-మెయిల్స్ ద్వారా కూపన్ కోడ్స్‌ను ఆఫర్ చేస్తుంది. దీనికి ఫుుడ్పాండా, ఓలా క్యాబ్స్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే మరిన్ని కంపెనీలు మొబైల్ యాప్ ద్వారా ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇక్కడ మెయిల్స్లాగా ఎక్కువ మొబైల్ నెంబర్లను ఉపయోగించడానికి ఆస్కారం లేదు. క్యాష్‌కరో.కామ్‌తో అదనపు క్యాష్‌బ్యాక్ మీరు కూపన్లు, వాలెట్స్ వంటి పలు రకాల మార్గాల్లో డిస్కౌంట్ పొందినప్పటికీ కూడా క్యాష్‌కరో.కామ్ లింక్‌ను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరికొంత క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. క్యాష్‌కరో.కామ్ అనేది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా ఆ వెబ్సైట్ లింక్‌ను ఉపయోగించి కొనుగోలు చేస్తే.. విక్రయ సంస్థ నుంచి ఈ వెబ్సైట్ కొంత మొత్తాన్ని కమిషన్ రూపంలో పొందుతుంది. ఇన్‌కాగ్నిటో మోడ్ తో బ్రౌజింగ్ చేయండి కొన్ని కంపెనీలు వారి పాత వినియోగదారులకు ఎలాంటి ఆఫర్లను అందించవు. అలాంటి సమయంలో మీరు మీ బ్రౌజర్లో ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఆన్‌చేసి షాపింగ్ చేయండి. అప్పుడు ఎవరు బ్రౌజింగ్ చేస్తున్నదీ ఆ కంపెనీలకు తెలియదు. అప్పుడు ఆ కంపెనీలు మీరు పాత కస్టమర్ అయినప్పటికీ కూడా కొత్త కస్టమర్‌గా భావించి మీకు ఆఫర్లను అందిస్తాయి. -
పోస్టల్ ఆదాయాలకు ఈ-రిటైల్ బూస్ట్
ముంబై : ఈ-మెయిల్స్, మొబైల్ ఫోన్ల రాకతో కాస్త కుదేలయిన పోస్టల్ శాఖకు .. ఆన్లైన్ షాపింగ్ సంస్థల రూపంలో ఆదాయాలు పెంచుకునేందుకు కొత్త మార్గం లభించింది. ఈ-కామర్స్ సైట్లు తమకొచ్చే ఆర్డర్లను డెలివరీ చేసేందుకు పోస్టల్ సర్వీసులను వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఈ-కామర్స్‌లో అవకాశాలను గుర్తించిన పోస్టల్ శాఖ, వాటిని అందిపుచ్చుకునేందుకు ఈ-కామర్స్, పార్సిల్ ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. కేవలం ఈ-కామర్స్ సంస్థల ఆర్డర్లను డెలివరీ చేయడం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 10 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రెట్టింపునకు కృషి జరుగుతోంది.