న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదోవ పట్టించేటువంటి రివ్యూలను.. ఈ–కామర్స్ సైట్లలో కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలితో (ఏఎస్‌సీఐ) కలిసి ఈ–కామర్స్ కంపెనీలు, సంబంధిత వర్గాలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది.
నకిలీ, తప్పుదోవ పట్టించే రివ్యూల ప్రభావాలు, అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు వినియోగదారుల ఫోరమ్‌లు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ వర్గాలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలు రాశారు.
యూరోపియన్ యూనియన్‌లో 223 బడా వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ రివ్యూలపై జరిగిన సమీక్ష వివరాలను వాటిలో ప్రస్తావించారు. స్క్రీనింగ్ ఫలితాల ప్రకారం దాదాపు 55 శాతం వెబ్‌సైట్లు ఈయూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్‌లైన్ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్ తెలిపారు. అయితే, ఈ–కామర్స్ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment