Advertising Standards Council
-
ఫాలోవర్లపై ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం.. 79 శాతం మంది కొనేందుకు రెడీ!
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తమ కంటెంట్‌తో లక్షలాది మంది నెటిజన్లను ‘ఫాలోవర్లు’గా మార్చుకుంటున్న వ్యక్తులు ఇటీవలి కాలంలో ఇన్ఫ్లుయెన్సర్లుగా సరికొత్త పాత్ర పోషిస్తున్నారు. విషయ పరిజ్ఞానం, చలాకీ మాటలతో విజ్ఞానం, వినోదం అందిస్తూనే వివిధ సంస్థల ఉత్పత్తులను ప్రచారం చేస్తూ వాటిని కొనేలా ‘ఫాలోవర్ల’ను ప్రభావితం చేస్తున్నారు. ఉత్పత్తుల తయారీ సంస్థలకు కొనుగోళ్లు పెంచడంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర నిర్ణయాత్మకంగా మారుతోందని అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. 79% మందిలో నమ్మకం... దేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేస్తున్న వస్తువులను కొనేందుకు 70 శాతం మంది ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ‘ఇన్ఫ్లుయెన్సర్ ట్రస్ట్ రిపోర్ట్’పేరిట 18 ఏళ్లకు పైబడిన వారిపై నిర్వహించిన ఈ సర్వేలో తాము ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చెబుతున్న విషయాలను విశ్వసిస్తున్నట్లు 79 శాతం మంది పేర్కొన్నారు. వారిలో 30 శాతమైతే సంపూర్ణంగా నమ్ముతున్నట్లు తెలపగా 49 శాతం మంది ఎంతో కొంత విశ్వసిస్తున్నట్లు తెలియజేశారు. నివేదికలోని ముఖ్యాంశాలు... ►సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎండార్స్ చేసిన వస్తువుల్లో కనీసం ఒకటైనా కొనుగోలు చేశామన్న 90 శాతం మంది నెటిజన్లు. ►వారు సూచించిన లేదా పేర్కొన్న ఉత్పత్తుల్లో మూడుకన్నా ఎక్కువే కొంటున్నామన్న వారు 61 శాతం (25 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వారు). ►ఇన్ఫ్లుయెన్సర్లు పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించడంతోపాటు ఆయా బ్రాండ్లతో తమకున్న సంబంధాల గురించి దాచకుండా బయటపెట్టినప్పుడే వినియోగదారులు వారిని విశ్వసిస్తున్నారు. ►సెలబ్రిటీలుగా, ఇన్ఫ్లుయెన్సర్లుగా వారు గడిపే జీవనశైలి, వ్యక్తిగత జీవితం, అనుభవాలు కస్టమర్ల విశ్వాసాన్ని పెంచుతున్నాయి. ►ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్లలో విశ్వసనీయత కొరవడితే వారిని ‘ఫాలోవర్లు’నమ్మే పరిస్థితి లేదు. ఫిర్యాదులు సైతం ఉన్నాయి... వివిధ బ్రాండ్లు, ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి ఆస్కికి 2,767 ఫిర్యాదులు (2021–22లో 1,592, 2021–22 ఏప్రిల్–డిసెంబర్ల మధ్య 1,175) అందాయి. ఇందులో వర్చువల్ డిజిటల్ అసెట్స్, పర్సన్కేర్ వంటి అంశాలపై వినియోగదారుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో ఆయా సంస్థలు, ఉత్పత్తులతో ఉన్న అనుబంధం, ఇతర అంశాలను తెలియజేయాలంటూ ఇన్ఫ్లుయెన్సర్లను 2021 మేలో ఏఎస్సీఐ కోరింది. 500 కోట్ల నెటిజన్లు.. ప్రపంచంలోని సగం జనాభాకు పైగా... అంటే దాదాపు 500 కోట్ల మంది సోషల్ మీడియాలోని ఏదో ఒక వేదికపై యాక్టివ్‌గా ఉన్నారు. 2027కల్లా ఈ సంఖ్య 600 కోట్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. పనిచేస్తున్న మార్కెటింగ్ వ్యూహాలు సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తులు ఉపయోగిస్తున్న లేదా ప్రచారం చేస్తున్న వస్తువులను ‘ఫాలోవర్లు’కొనుగోలు చేసేలా చేయడంలో మార్కెటింగ్ వ్యూహాలు బాగా పనిచేస్తున్నాయి. ఆన్లైన్ మార్కెటింగ్ అందుబాటులోకి వచ్చాక ఎవరూ వ్యక్తిగతంగా షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నచ్చిన ఉత్పత్తులను ఉన్న చోటు నుంచే వెతికి కొనుగోలు చేయడం నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతోంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
GenderNext: ప్రకటనల్లో నేటి మహిళ
కురులకు షాంపూలు.. మేనికి సబ్బులు.. వంటింట్లో కుకర్, మిక్సీలకే కాదు పురుషులు వాడే షేవింగ్ క్రీములకూ మహిళలను చూపించనిదే ఏ ప్రకటనా ఉండదనే విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రకటనల్లో మహిళా శక్తిని ఏ విధంగా చూపుతున్నారనే అంశం మీద అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కీ), ఫ్యూచర్ బ్రాండ్స్ ఆధ్వర్యంలో జెండర్ నెక్ట్స్ పేరిట ఓ స్టడీ నిర్వహించింది. ‘నేటి ఆధునిక రోజుల్లోనూ వాణిజ్య ప్రకటనల్లో చాలా వరకు మహిళల్ని ఇంకా మూస పద్ధతిలోనే చూపిస్తున్నారు’ అనేది ఈ స్టడీలో తేలింది. ప్రకటనల రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై చేసిన లోతైన పరిశీలన ఇది. దాదాపు 600 ప్రకటనల్ని పరిశీలించిన అనంతరం మహిళల శక్తిని తక్కువ చేసి చూపుతున్నట్టు జెండర్ నెక్ట్స్ స్టడీ నిరూపించింది. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న నేటి మహిళను ఆంక్షల్లో చూపెట్టడం సరికాదన్న విషయాన్ని స్పష్టం చేసింది. సంధించిన బాణాలు పర్సనల్ కేర్, ఫ్యాషన్, బ్యూటీ, హెల్త్, గాడ్జెట్స్, వీల్స్, విద్య, మనీ... సంబంధిత ప్రకటనలపై స్టడీ చేసిన అనంతరం కొన్ని ప్రశ్నలను రూపొందించి, వాటిని ఆన్లైన్ వేదిక ద్వారా ‘నేటి కాలంలో ప్రకటనలు మహిళల్ని ఎలా చూపిస్తున్నాయి? మహిళలు తమను తాము ఎలా భావిస్తున్నారు? తమను ఎలా చూపాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నలకు వృత్తి ఉద్యోగాలలో ఉన్న మహిళల నుంచి సమాధానాలు రాబట్టింది. ఈ పరిశోధనలో భాగంగా అన్ని రకాల ప్రకటనలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం జెండర్ నెక్ట్స్ స్టడీకి ప్రధాన ఆథర్ గా వ్యవహరించిన లిపికా కుమరన్ మాట్లాడుతూ ‘ప్రకటనల్లో సానుకూల అంశాలున్నప్పటికీ, మెయిన్ స్ట్రీమ్ అడ్వర్టయిజింగ్‌లో కొన్ని హానికరమైన స్టీరియో టైప్స్ పాత్రలున్నాయ’న్నారు. మహిళలకు సవాల్! మహిళలు ఆహారం తీసుకునే అలవాటును అత్యంత సున్నితంగా చూపడం పట్ల స్టడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే మిగిలిన వారంతా విశ్రాంతిగా కూర్చుని ఉండగా మహిళలు ఆపసోపాలు పడుతూ ఇంట్లో పనులు చేస్తున్నట్టు చూపడం, షాపింగ్‌లో అధికంగా ఖర్చు చేసేవారన్నట్టు, బ్యూటీ యాడ్స్‌లో మగవాళ్ల చూపులకు నచ్చే విధంగా ఉండేలా చూపడం, టెక్నాలజీ, గాడ్జెట్స్ వాడకంలో మహిళల శక్తి తక్కువ అన్నట్టు చూపడంతో పాటు మగ సెలబ్రిటీలు మహిళలకు సవాళ్లు విసురుతుండడం, ఆదేశాలు ఇస్తుండడం.. వంటివి అభ్యంతరకరంగా తేల్చారు. డిటర్జెంట్, ఫుడ్‌కు సంబంధించినవన్నీ మహిళల చేత మహిళలకోసమే రూపొందించినట్టుగా ఉండటం కూడా ఇందులో ప్రధానంగా గుర్తించారు. అంగీకరించని నేటి తరం ప్రకటనలపై విభిన్న వర్గాల మహిళలు సైతం ఈ అభ్యంతరాల్ని సమర్థించారు. స్వయం సమృద్ధి దిశగా తమ ప్రయాణానికి ప్రకటనలు నేస్తాలు కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇంట్లో పనంతా నెత్తినేసుకునేలా చూపడాన్ని నవ యువ వధువులు అంగీకరించడం లేదు. అలాగే మహిళా దినోత్సవం రోజున ఇచ్చే ప్రకటనల్లో... ఎన్నో కష్టాల తర్వాత మహిళలు విజేతలు అయినట్టుగా చూపడం కూడా ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ పరిశోధన ఫలితాల అనంతరం ప్రకటనల్లో మహిళల పాత్ర మెరుగుదలకు గాను అస్కీ పలు ప్రతిపాదనలు చేసింది. ఈ అధ్యయనం కోసం జాతీయ, ప్రాంతీయ ప్రకటనదారులు, ఏజెన్సీ, విధాన నిర్ణేతలు, న్యాయవాదులు .. ఇలా అందరు నిపుణులు సంప్రదించారు. ‘ప్రకటనలలో మహిళలను హానికరమైన మూసపద్ధతుల్లో చూపడం వల్ల యువతుల మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, వీటి వల్ల వారు సమాజంలో తమ విలువను ఏ విధంగా చూస్తారు’ అనే అంశాన్ని ఈ స్టడీ వెలుగులోకి తీసుకువచ్చింది. ఇటీవల ఒక పాల ఆధారిత ఉత్పత్తి కంపెనీ తన యానివర్సరీ వేడుకల్లో భాగంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో భార్య, అమ్మ, అత్త, అమ్మమ్మ స్థానంలో ఉన్న ఆడవాళ్లందరూ మగవాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టేవారిగానే చూపారన్న అభియోగాలను సోషల్‌మీడియా వేదికగా ఎదుర్కొంటోంది. -
నకిలీ రివ్యూల కట్టడిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదోవ పట్టించేటువంటి రివ్యూలను.. ఈ–కామర్స్ సైట్లలో కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలితో (ఏఎస్సీఐ) కలిసి ఈ–కామర్స్ కంపెనీలు, సంబంధిత వర్గాలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. నకిలీ, తప్పుదోవ పట్టించే రివ్యూల ప్రభావాలు, అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు వినియోగదారుల ఫోరమ్‌లు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ వర్గాలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలు రాశారు. యూరోపియన్ యూనియన్‌లో 223 బడా వెబ్సైట్లలో ఆన్లైన్ రివ్యూలపై జరిగిన సమీక్ష వివరాలను వాటిలో ప్రస్తావించారు. స్క్రీనింగ్ ఫలితాల ప్రకారం దాదాపు 55 శాతం వెబ్సైట్లు ఈయూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్లైన్ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్ తెలిపారు. అయితే, ఈ–కామర్స్ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్ వివరించారు. -
‘నెట్వర్క్’ ప్రకటనలపై ఎయిర్‌టెల్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ‘అధికారికంగా’ అత్యంత వేగవంతమైన నెట్వర్క్ ప్రకటనల విషయంలో టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇవి తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆస్కీ ఆక్షేపించింది. ఏప్రిల్ 11లో ఈ ప్రకటనలను మార్చాలని లేదా ఉపసంహరించాలని సూచించింది. ఎయిర్టెల్ నెట్వర్క్ అత్యంత వేగవంతమైనదంటూ కన్సల్టెన్సీ సంస్థ ఊక్లా ఇచ్చిన సర్టిఫికెట్‌కు ఊతంగా సరైన ఆధారాలేమీ లేవని ఆస్కీ ఫాస్ట్ ట్రాక్ కంప్లయింట్స్ కమిటీ (ఎఫ్టీసీసీ) అభిప్రాయపడింది. ఎయిర్టెల్ ప్రకటనలపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఫిర్యాదును సమర్ధిస్తూ ఎఫ్టీసీసీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎయిర్టెల్ ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు ఎఫ్టీసీసీ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని భారతి ఎయిర్టెల్ తెలిపింది. దీనిపై అప్పీలు చేయనున్నట్లు వివరించింది. మొబైల్ స్పీడ్ టెస్టులు నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఊక్లా నిర్ధారించిన వాస్తవిక అంశాల అధారంగానే తమ ప్రకటనలు రూపొందించినట్లు, ఆ వివరాలు ఆస్కీకి కూడా సమర్పించినట్లు ఎయిర్టెల్ పేర్కొంది.