
ఫ్యాషన్, టెలికం రంగాల్లో అత్యధికం
ఏఎస్‌సీఐ వెల్లడి
ముంబై: ‘డిజిటల్ స్టార్లు’గా వెలుగొందుతున్న చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు వాస్తవానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అడ్వరై్టజింగ్ ప్రమాణాల మండలి ఏఎస్‌సీఐ ఆందోళన వ్యక్తం చేసింది. మూడింట రెండొంతుల మంది (69 శాతం) యధేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వ్యాఖ్యానించింది. ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ 2024’ జాబితాలో పేర్కొన్న ఇన్‌ఫ్లుయెన్సర్ల తీరుతెన్నులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఏఎస్‌సీఐ ఈ విషయాలు వెల్లడించింది.
ఇందుకోసం 2024 సెప్టెంబర్–నవంబర్ మధ్యకాలంలో వారు ఇన్‌స్ట్రాగాం, యూట్యూబ్‌లో ప్రమోట్ చేసిన పోస్టులను విశ్లేషించింది. దీని ప్రకారం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు నిర్దేశించిన డిస్‌క్లోజర్ (కీలక వివరాలను ఫాలోయర్లకు వెల్లడించడం) మార్గదర్శకాలను పాటించడంలో 69 శాతం మంది విఫలమైనట్లు ఏఎస్‌సీఐ పేర్కొంది. పరిశీలించిన 100 పోస్టుల్లో 29 పోస్టుల్లో మాత్రమే తగినన్ని డిస్‌క్లోజర్స్ ఉన్నాయని, 69 కేసుల్లో ఉల్లంఘనలు రుజువయ్యాయని వివరించింది. ఫ్యాషన్–లైఫ్‌స్టయిల్, టెలికం ఉత్పత్తులు, పర్సనల్ కేర్ విభాగాల్లో ఈ ధోరణి అత్యధికంగా కనిపించింది.
నిర్దిష్ట మార్గదర్శకాల ప్రకారం ఇన్‌ఫ్లుయెన్సర్లు తాము ప్రమోట్ చేసే కంపెనీలు లేదా ఉత్పత్తులతో తమకున్న సంబంధాన్ని స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. దీనితో వారి ఫాలోయర్లు పూర్తి సమాచారం ఆధారంగా సముచిత నిర్ణయం తీసుకునే వీలుంటుంది. ఇన్‌ఫ్లుయెన్సర్లతో ప్రకటనల్లో పారదర్శకత లోపించడం, నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తుండటం ఆందోళనకరమైన విషయమని నివేదిక పేర్కొంది. నియంత్రణ సంస్థపరమైన చర్యలకు గురికాకుండా ప్రకటనకర్తలు, ఏజెన్సీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సమష్టిగా నిబంధనలకు అనుగుణంగా పని చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment