disclosure norms
-
ఫ్రెషర్లకు పెరిగిన ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్: ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు గతేడాది ద్వితీయ ఆరు నెలల (జూలై–డిసెంబర్) కాలంలో 3 శాతం పెరిగాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్ల నియామకాలు 62 శాతంగా ఉంటే, తర్వాతి ఆరు నెలల్లో 65 శాతంగా ఉన్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ తెలిపింది. కెరీర్ అవుట్‌లుక్ రిపోర్ట్ హెచ్‌వై2, 2023 నివేదికను విడుదల చేసింది. అలాగే అన్ని విభాగాల్లోనూ నియామకాల ఉద్దేశ్యం కూడా 68 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. ఈ స్థిరమైన వృద్ది రానున్న నెలల్లో ఉద్యోగ మార్కెట్ వృద్ధికి, ఫ్రెషర్ల ఉపాధికి దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఫ్రెషర్లకు (విద్య అనంతం ఉపాధి మార్కెట్లోకి వచ్చిన వారు) సంబంధించి అత్యధికంగా నియామకాల ఉద్దేశ్యం ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లలో 59 శాతం, టెలీ కమ్యూనికేషన్స్‌లో 53 శాతం, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాలో 50 శాతం చొప్పున నమోదైంది. కానీ, ఐటీ పరిశ్రమలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఫ్రెషర్ల నియామక ఉద్దేశ్యం 2023 మొదటి ఆరు నెలల్లో 67 శాతంగా ఉంటే, ద్వితీయ ఆరు నెలల్లో 49 శాతానికి తగ్గింది. అంటే 18 శాతం క్షీణత కనిపించింది. ట్రావెల్, హాస్పిటాలిటీ రంగంలో నియామకాల ధోరణి 5 శాతం పెరిగింది. వీరికి డిమాండ్.. డెవలప్మెంట్ ఆపరేషన్స్ ఇంజనీర్, చార్టర్ అకౌంటెంట్, ఎస్ఈవో అనలిస్ట్, యూఎక్స్ డిజైనర్లకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఇతర పట్టణాల కంటే బెంగళూరు ఫ్రెషర్ల నియామకాల పరంగా ముందుంది. నియామకాల ఉద్దేశ్యం 65 శాతంగా నమోదైంది. 2023 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ద్వితీయ ఆరు నెలల్లో 10 శాతం తగ్గినప్పుటికీ ముందు స్థానంలో ఉంది. ఆ తర్వాత ముంబైలో 61 శాతం, చెన్నైలో 47 శాతం, ఢిల్లీలో 43 శాతం చొప్పున నమోదైంది. కొత్త నిపుణులకు డిమాండ్ స్వల్పంగా పెరిగింది. వీటిపై దృష్టి పెట్టాలి.. ఫ్రెషర్లు తమ ఉద్యోగార్హతలు పెంచుకునేందుకు వీలుగా కొన్ని కోర్సులకు డిమాండ్ ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ కమ్యూనికేషన్, డేటా సైన్స్, బ్లాక్‌చైన్‌లో సర్టిఫికేషన్, ఆర్టిఫీషియల్ లెన్నింగ్ (ఏఐ), మెషిన్ లెన్నింగ్ (ఎంఎల్)లో పీజీ కోర్స్‌లకు డిమాండ్ ఉందని పేర్కొంది. డిగ్రీ అప్రెంటిస్‌లను నియమించుకునే విషయంలో తయారీ, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా, విద్యుత్, ఇంధన రంగాలు టాప్–3గా ఉన్నాయి. -
విరాళం రూ.2 లక్షలకు మించితే తెలియజేయాలి..
న్యూఢిల్లీ: సామాజిక సేవా సంస్థలు వెల్లడించాల్సిన వివరాల నిబంధనలను ఆదాయపన్ను శాఖ సవరించింది. ఈ మార్పులు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక మీదట చారిటబుల్ సంస్థలు తమ కార్యకలాపాలు ధార్మికమైనవా లేదా మతపరమైనవా లేక మతపరమైన సేవా కార్యక్రమాల కిందకు వస్తాయా? అన్నది వెల్లడించాల్సి ఉంటుంది. ఒకరోజులో రూ.2 లక్షలకు మించి ఎవరైనా విరాళం ఇస్తే ఆ వివరాలను ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలి. చెల్లించిన వ్యక్తి, చిరునామా, పాన్ నంబర్ ఇవ్వాలి. ఆదాయపన్ను చట్టంలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన ట్రస్టులు, వైద్య, విద్యా సంస్థల ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఈ సంస్థలు ఐటీ శాఖ నుంచి రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది. -
ఐసీఐసీఐకు సెబీ షాక్
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకునకు సెబీ షాకిచ్చింది. ఒప్పందాలను దాచి పెట్టిందన్న కారణంతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బ్యాంకుతో పాటు, దాని కంప్లెయిన్స్ అధికారి సందీప్ బాత్రాకు భారీ జరిమానా విధించింది. ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్నిరిపోర్టు చేయడంలో ఆలస్యం, ఇతర కొన్ని ముఖ్యమైన విషయాలను బహిర్గతం చేయడంలో లోపాల కారణంగా బ్యాంకునకు రూ. 10లక్షలు, సందీప్ బాత్రాకు రూ. 2 లక్షలు మొత్తం రూ.12 లక్షల జరిమానా విధించింది. కాగా 2010, మే 18న బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్‌తో ఐసీఐసీఐ బ్యాంకు బైండిగ్ ఇంప్లిమెంటేషన్ ఒప్పందానికి సంతకాలు చేసింది. అయితే ఈ ఒప్పందాన్ని రెగ్యులేటరీ సంస్థలకు నివేదించడంలో ఆలస్యం చేసింది. బైండింగ్ ఒప్పందంపై సంతకం చేసిన సమాచారాన్ని సకాలంలో స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించడంలో ఐసీఐసీఐ బ్యాంకు విఫలమైందని దర్యాప్తులో తేలిందని సెబీ తన ఆర్డర్లో తెలిపింది. -
ఆ వివరాల వెల్లడికి పీఎన్బీ నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో వెల్లడైన రూ 13,000 కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఆడిట్, విచారణ వివరాలను వెల్లడించేందుకు బ్యాంక్ నిరాకరించింది. ఈ వివరాలు వెల్లడిస్తే విచారణ ప్రక్రియపై ప్రభావం చూపుతుందని పీఎన్బీ పేర్కొంది. స్కామ్‌కు సంబంధించి తనిఖీ చేసిన పత్రాల నకలును వెల్లడించేందుకూ పీఎన్బీ నిరాకరించింది. ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నలకు బ్యాంక్ బదులిస్తూ సంస్థలో చోటుచేసుకున్న కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ, ఇతర నిఘా సంస్థలు విచారణ చేపడుతున్న దృష్ట్యా ఆర్టీఐ కింద కోరిన సమాచారాన్ని ఆర్టీఐ చట్టం 8 (1) (హెచ్) కింద ఇవ్వలేమని ఆర్టీఐ దరఖాస్తుదారుకు బ్యాంక్ స్పష్టం చేసింది. కేసు విచారణ పురోగతి, నిందితుల ప్రాసిక్యూషన్‌పై ప్రభావం చూపే సమాచారాన్ని సదరు సెక్షన్ల కింద నిరాకరించవచ్చని పేర్కొంది. పీఎన్బీలో నకిలీ పత్రాలతో బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్ ప్రమోటర్లు మెహుల్ చోక్సీ రూ వేల కోట్లు రుణాలు పొంది విదేశాల్లో తలదాచుకున్న విషయం తెలిసిందే. -
ఫండ్స్‌కు కొత్త నిబంధనల అమలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ రంగానికి సంబంధించి మంగళవారం(ఏప్రిల్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ఇకపై నెలకోసారి తమ నిర్వహణలోని ఆస్తుల వివరాలు ఫండ్స్ వెల్లడించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓటింగ్ హక్కులను వినియోగించుకుంటే అందుకు తగిన కారణాలను వెల్లడించాల్సి వస్తుంది. మ్యూచువల్ ఫండ్ రంగంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూపొందించిన తాజా నిబంధనలను ఫండ్ హౌస్‌లు ఇకపై తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వివిధ విభాగాలకు చెందిన పథకాల ద్వారా ఫండ్స్ నిర్వహిస్తున్న ఆస్తులు, ఇన్వెస్టర్ల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. తమ వెబ్సైట్ల ద్వారా ప్రతీ నెల కు సంబంధించిన వివరాలను 7 రోజుల్లోగా ప్రకటించాల్సి ఉంటుంది. దీంతోపాటు దేశీ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వెబ్సైట్లలో కూడా వివరాలను ప్రకటించాలి. ఈ బాటలో ప్రతీ క్వార్టర్ ముగిశాక 10 రోజుల్లోగా ఓటింగ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించాలి. వార్షిక నివేదికలోనూ ఈ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఓటింగ్ హక్కుల వినియోగంపై ఆడిటర్ల నుంచి సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో 45 ఫండ్ హౌస్‌లు కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 9 లక్షల కోట్లకుపైనే.