
న్యూఢిల్లీ: సామాజిక సేవా సంస్థలు వెల్లడించాల్సిన వివరాల నిబంధనలను ఆదాయపన్ను శాఖ సవరించింది. ఈ మార్పులు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక మీదట చారిటబుల్ సంస్థలు తమ కార్యకలాపాలు ధార్మికమైనవా లేదా మతపరమైనవా లేక మతపరమైన సేవా కార్యక్రమాల కిందకు వస్తాయా? అన్నది వెల్లడించాల్సి ఉంటుంది.
ఒకరోజులో రూ.2 లక్షలకు మించి ఎవరైనా విరాళం ఇస్తే ఆ వివరాలను ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలి. చెల్లించిన వ్యక్తి, చిరునామా, పాన్ నంబర్ ఇవ్వాలి. ఆదాయపన్ను చట్టంలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన ట్రస్టులు, వైద్య, విద్యా సంస్థల ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఈ సంస్థలు ఐటీ శాఖ నుంచి రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది.