
మలయాళ చిత్రపరిశ్రమలో 'L2 ఎంపురాన్' చిత్రం చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పలువురికి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నోటీసులు పంపింది. ఈ సినిమా నిర్మాత గోకులం గోపాలన్ కార్యాలయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ చిత్ర దర్శకుడు, నటుడు పృథ్విరాజ్ సుకుమారన్‌కు కూడా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా లూసిఫర్-1 నిర్మాత ఆంథోనీ పెరుంబవూర్‌కు కూడా ఐటీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. 2019లో విడుదలైన సినిమాకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు.
లూసిఫర్-1 నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్‌కు నోటీసులు ఇవ్వడం వెనుక 'L2 ఎంపురాన్' కారణం కాదని ఐటీ శాఖ పేర్కొంది. 'మరక్కార్: అరేబియా సముద్ర సింహం, లూసిఫర్' సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై స్పష్టత ఇవ్వాలని నోటీసులో తెలిపింది. ఈ నెలాఖరులోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలని ఆంథోనీ పెరుంబవూరును ఐటీ శాఖ కోరింది. 2022లో మొత్తం సినిమా పరిశ్రమలో ఐటీ దాడులు చేసిందని, దానికి కొనసాగింపుగానే ఈ చర్య తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. సినిమాకు సంబంధించి ఓవర్సీస్ హక్కులు, నటీనటులకు చెల్లించే రెమ్యూనరేషన్ వంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వాలని ఆంథోనీ పెరుంబవూరును అధికారులు ప్రధానంగా ప్రశ్నించారు.

మోహన్‌లాల్ కారు డ్రైవర్ 'ఆంటోనీ పెరుంబవూర్'
మోహన్‌లాల్‌కు వీరాభిమాని 'ఆంటోనీ పెరుంబవూర్'.. సుమారు 20 ఏళ్ల క్రితం ఆంటోనీ సొంతూరులో మోహన్‌లాల్ సినిమా షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ కోసం కొన్ని కార్లు అవసరం రావడంతో అక్కడే ఉన్న ఒక కాంట్రాక్టర్‌తో ఆ చిత్ర నిర్మాత ఒప్పందం చేసుకున్నాడు. అలా తొలిసారి మోహన్‌లాల్ వద్దకు తాత్కాలిక డ్రైవర్‌గా ఆంటోనీ వెళ్లాడు. ఆ సినిమా పూర్తి అయిన కొద్దిరోజులకు మోహన్‌లాల్‌కు పర్సనల్ డ్రైవర్ కావాలని అనుకున్నాడు. అప్పుడు ఆయనకు వెంటనే గుర్తొచ్చిన పేరు ఆంటోనీ.. వెంటనే అతన్ని పిలిచి తన వద్ద పనిచేస్తావా..? అని ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఆయన కూడా వెంటనే ఒప్పుకొని పనిలో సెట్ అయ్యాడు. అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అప్పటికే స్టార్ హీరోగా ఉన్న మోహన్‌లాల్ చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టాలనుకున్నాడు. దీంతో తనే ఫైనాన్షియర్‌గా ఉంటూ ఆంటోనీని నిర్మాతను చేశాడు. అలా ఆయన చాలా సినిమాలకు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా విడుదల చేశాడు. L2 ఎంపురాన్ ప్రాజెక్ట్‌లో కూడా అంటోనీ నిర్మాతగా ఉన్నారు.