
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ఎల్2: ఎంపురాన్. ఈ మూవీకి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ.. తొలిరోజే ఏకంగా రూ.21 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్ల సాధించిన ఎంపురాన్.. మలయాళ ఇండస్ట్రీలోనే తొలి చిత్రంగా నిలిచింది.
తాజాగా ఎల్2: ఎంపురాన్ విడుదలైన 15 రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్కును దాటింది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ దేశీయ మార్కెట్‌లో రూ.102.9 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.120 కోట్లకు గ్రాస్‌తో అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.262.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే గురువారం రోజు మాత్రం కలెక్షన్స్ పరంగా చాలా అతి తక్కువగా నమోదైంది. కేవలం రూ. 70 లక్షలను మాత్రమే రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు మంజు వారియర్, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటించారు.