సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో వెల్లడైన రూ 13,000 కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఆడిట్, విచారణ వివరాలను వెల్లడించేందుకు బ్యాంక్ నిరాకరించింది. ఈ వివరాలు వెల్లడిస్తే విచారణ ప్రక్రియపై ప్రభావం చూపుతుందని పీఎన్‌బీ పేర్కొంది. స్కామ్‌కు సంబంధించి తనిఖీ చేసిన పత్రాల నకలును వెల్లడించేందుకూ పీఎన్‌బీ నిరాకరించింది.
ఆర్‌టీఐ కింద అడిగిన ప్రశ్నలకు బ్యాంక్ బదులిస్తూ సంస్థలో చోటుచేసుకున్న కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ, ఇతర నిఘా సంస్థలు విచారణ చేపడుతున్న దృష్ట్యా ఆర్‌టీఐ కింద కోరిన సమాచారాన్ని ఆర్‌టీఐ చట్టం 8 (1) (హెచ్) కింద ఇవ్వలేమని ఆర్‌టీఐ దరఖాస్తుదారుకు బ్యాంక్ స్పష్టం చేసింది.
కేసు విచారణ పురోగతి, నిందితుల ప్రాసిక్యూషన్‌పై ప్రభావం చూపే సమాచారాన్ని సదరు సెక్షన్‌ల కింద నిరాకరించవచ్చని పేర్కొంది. పీఎన్‌బీలో నకిలీ పత్రాలతో బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్ ప్రమోటర్‌లు మెహుల్ చోక్సీ రూ వేల కోట్లు రుణాలు పొంది విదేశాల్లో తలదాచుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment