కురులకు షాంపూలు.. మేనికి సబ్బులు.. వంటింట్లో కుకర్, మిక్సీలకే కాదు పురుషులు వాడే షేవింగ్ క్రీములకూ మహిళలను చూపించనిదే ఏ ప్రకటనా ఉండదనే విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రకటనల్లో మహిళా శక్తిని ఏ విధంగా చూపుతున్నారనే అంశం మీద అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కీ), ఫ్యూచర్ బ్రాండ్స్ ఆధ్వర్యంలో జెండర్ నెక్ట్స్ పేరిట ఓ స్టడీ నిర్వహించింది. ‘నేటి ఆధునిక రోజుల్లోనూ వాణిజ్య ప్రకటనల్లో చాలా వరకు మహిళల్ని ఇంకా మూస పద్ధతిలోనే చూపిస్తున్నారు’ అనేది ఈ స్టడీలో తేలింది.
ప్రకటనల రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై చేసిన లోతైన పరిశీలన ఇది. దాదాపు 600 ప్రకటనల్ని పరిశీలించిన అనంతరం మహిళల శక్తిని తక్కువ చేసి చూపుతున్నట్టు జెండర్ నెక్ట్స్ స్టడీ నిరూపించింది. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న నేటి మహిళను ఆంక్షల్లో చూపెట్టడం సరికాదన్న విషయాన్ని స్పష్టం చేసింది.
సంధించిన బాణాలు
పర్సనల్ కేర్, ఫ్యాషన్, బ్యూటీ, హెల్త్, గాడ్జెట్స్, వీల్స్, విద్య, మనీ... సంబంధిత ప్రకటనలపై స్టడీ చేసిన అనంతరం కొన్ని ప్రశ్నలను రూపొందించి, వాటిని ఆన్‌లైన్ వేదిక ద్వారా ‘నేటి కాలంలో ప్రకటనలు మహిళల్ని ఎలా చూపిస్తున్నాయి? మహిళలు తమను తాము ఎలా భావిస్తున్నారు? తమను ఎలా చూపాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నలకు వృత్తి ఉద్యోగాలలో ఉన్న మహిళల నుంచి సమాధానాలు రాబట్టింది. ఈ పరిశోధనలో భాగంగా అన్ని రకాల ప్రకటనలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం జెండర్ నెక్ట్స్ స్టడీకి ప్రధాన ఆథర్ గా వ్యవహరించిన లిపికా కుమరన్ మాట్లాడుతూ ‘ప్రకటనల్లో సానుకూల అంశాలున్నప్పటికీ, మెయిన్ స్ట్రీమ్ అడ్వర్టయిజింగ్‌లో కొన్ని హానికరమైన స్టీరియో టైప్స్ పాత్రలున్నాయ’న్నారు.
మహిళలకు సవాల్!
మహిళలు ఆహారం తీసుకునే అలవాటును అత్యంత సున్నితంగా చూపడం పట్ల స్టడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే మిగిలిన వారంతా విశ్రాంతిగా కూర్చుని ఉండగా మహిళలు ఆపసోపాలు పడుతూ ఇంట్లో పనులు చేస్తున్నట్టు చూపడం, షాపింగ్‌లో అధికంగా ఖర్చు చేసేవారన్నట్టు, బ్యూటీ యాడ్స్‌లో మగవాళ్ల చూపులకు నచ్చే విధంగా ఉండేలా చూపడం, టెక్నాలజీ, గాడ్జెట్స్ వాడకంలో మహిళల శక్తి తక్కువ అన్నట్టు చూపడంతో పాటు మగ సెలబ్రిటీలు మహిళలకు సవాళ్లు విసురుతుండడం, ఆదేశాలు ఇస్తుండడం.. వంటివి అభ్యంతరకరంగా తేల్చారు. డిటర్జెంట్, ఫుడ్‌కు సంబంధించినవన్నీ మహిళల చేత మహిళలకోసమే రూపొందించినట్టుగా ఉండటం కూడా ఇందులో ప్రధానంగా గుర్తించారు.
అంగీకరించని నేటి తరం
ప్రకటనలపై విభిన్న వర్గాల మహిళలు సైతం ఈ అభ్యంతరాల్ని సమర్థించారు. స్వయం సమృద్ధి దిశగా తమ ప్రయాణానికి ప్రకటనలు నేస్తాలు కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇంట్లో పనంతా నెత్తినేసుకునేలా చూపడాన్ని నవ యువ వధువులు అంగీకరించడం లేదు. అలాగే మహిళా దినోత్సవం రోజున ఇచ్చే ప్రకటనల్లో... ఎన్నో కష్టాల తర్వాత మహిళలు విజేతలు అయినట్టుగా చూపడం కూడా ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ పరిశోధన ఫలితాల అనంతరం ప్రకటనల్లో మహిళల పాత్ర మెరుగుదలకు గాను అస్కీ పలు ప్రతిపాదనలు చేసింది.
ఈ అధ్యయనం కోసం జాతీయ, ప్రాంతీయ ప్రకటనదారులు, ఏజెన్సీ, విధాన నిర్ణేతలు, న్యాయవాదులు .. ఇలా అందరు నిపుణులు సంప్రదించారు. ‘ప్రకటనలలో మహిళలను హానికరమైన మూసపద్ధతుల్లో చూపడం వల్ల యువతుల మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, వీటి వల్ల వారు సమాజంలో తమ విలువను ఏ విధంగా చూస్తారు’ అనే అంశాన్ని ఈ స్టడీ వెలుగులోకి తీసుకువచ్చింది.
ఇటీవల ఒక పాల ఆధారిత ఉత్పత్తి కంపెనీ తన యానివర్సరీ వేడుకల్లో భాగంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో భార్య, అమ్మ, అత్త, అమ్మమ్మ స్థానంలో ఉన్న ఆడవాళ్లందరూ మగవాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టేవారిగానే చూపారన్న అభియోగాలను సోషల్‌మీడియా వేదికగా ఎదుర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment