Womens power
-
ఆణిముత్యాలు
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్‌లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా... శ్రుతకీర్తి శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్‌గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి. నీరజ గొడవర్తి ‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు. లక్ష్మీదేవి కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్‌లోని డాలస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్‌లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్‌ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు. రజనీ లక్కా రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు. దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్‌లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్‌గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు. పెన్నా కృష్ణప్రశాంతి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్‌గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. -
సుచరిత సుమధుర శ్రుతి
విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువును మాత్రమే కాదు... సమాజాన్ని కూడా లోతుగా చదివే వారే ఎంటర్ప్రెన్యూర్లుగా గెలుపు జెండా ఎగరేయగలరని నిరూపించారు ‘కలైడోఫిన్’ కో–ఫౌండర్, సీయివో సుచరిత ముఖర్జీ, ‘అప్నాక్లబ్’ సీయీవో శ్రుతి. తాజాగా... ఫోర్బ్స్ ఆసియా ‘100 టు వాచ్’ వార్షిక జాబితాలో ఆరు భారతీయ కంపెనీలు చోటు చేసుకున్నాయి. వాటిలో ‘కలైడోఫిన్’‘అప్నాక్లబ్’లు ఉన్నాయి.. అయిదుగురు కుటుంబ సభ్యుల పోషణ బాధ్యతను తలకెత్తుకున్న చెన్నైకి చెందిన రమణీ శేఖర్ దినసరి కూలీ. రోజుకు రెండు వందల రూపాయల వరకు సంపాదిస్తుంది. కంటిచూపు కోల్పోవడంతో భర్త ఇంటికే పరిమితం అయ్యాడు. కొడుకు, కూతురు కాస్తో కూస్తో చదువుకున్నారుగానీ ఏ ఉద్యోగమూ చేయడం లేదు. వీరితోపాటు తల్లి పోషణ భారం కూడా తనదే. ఒక విధంగా చెప్పాలంటే నెలాఖరుకు పైసా మిగలడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘కలైడోఫిన్’ పేరు మీద అయిదు వందల రూపాయలు పొదుపు చేయడం మానలేదు రమణి. ‘అత్యవసర పరిస్థితుల్లో వైద్య అవసరాల కోసం ఈ డబ్బును ఉపయోగిస్తాను’ అంటున్న రమణి కొంత డబ్బును సెల్ఫ్–హెల్ప్ గ్రూప్ సేవింగ్ స్కీమ్స్‌లో కూడా పెడుతుంది. ‘రమణిలాంటి ఎంతోమంది పేదవాళ్లకు కష్ట సమయంలో కలైడోఫిన్ అండగా ఉంది’ అంటుంది ఫిన్‌టెక్ కంపెనీ ‘కలైడోఫిన్’ కో–ఫొండర్, సీయీవో సుచరిత ముఖర్జీ. దీర్ఘకాల, మధ్యకాల, స్వల్పకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఉదాన్, లక్ష్య, ఉమ్మిద్ అనే ప్యాకేజ్‌లను లాంచ్ చేసింది కలైడోఫిన్. ‘కలైడోఫిన్’ ప్యాకేజిలలో ఒకటైన ‘లక్ష్య’ను పేద ప్రజల ఆరోగ్యం, చదువు, వివాహాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు నుంచి నాలుగు సంవత్సరాల కాలపరిమితితో రూపొందించారు. ఈ ప్యాకేజీలో మరణం లేదా అంగవైకల్యానికి బీమా ఉంటుంది. ‘తమ ఆర్థిక స్థాయిని బట్టి ఎవరైనా సరే వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసులతో యాక్సెస్ కావచ్చు’ అంటూ దిగువ మధ్యతరగతి, పేదవర్గాలకు భరోసాతో బయలుదేరింది కలైడోఫిన్. చెన్నై కేంద్రంగా ప్రారంభమైన ఈ ఫిన్‌టెక్ కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. వ్యాపారవేత్తకు కేవలం వ్యాపార దృష్టి మాత్రమే కాదు సాధ్యసాధ్యాలకు సంబంధించి వినియోగదారుల దృష్టి నుంచి కూడా ఆలోచించాలి. ఈ విషయంలో తగిన అధ్యయనం చేసింది సుచరిత. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో డిగ్రీ, ఐఐఎం, అహ్మదాబాద్‌లో ఎంబీఎ చేసిన సుచరిత ఐఎఫ్ఎంఆర్ ట్రస్ట్ గ్రూప్ కంపెనీలలో ఉన్నత హోదాలలో పనిచేసింది. ఆ తరువాత ‘కలైడోఫిన్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం ప్రారంభించింది. శ్రుతి తండ్రి ఐఏఎస్ అధికారి. అయినప్పటికీ ఆయనకు ఆడపిల్లల విషయంలో ‘అయ్యో!’లు తప్పలేదు. ‘పాపం ఆయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని లేని బాధను కొని తెచ్చుకునేవారు చుట్టాలు, పక్కాలు. స్కూల్ నుంచి కాలేజీ రోజుల వరకు ఎన్నోసార్లు లింగవివక్షతను ఎదుర్కొంది శ్రుతి. ఆత్మవిశ్వాసం ఉన్నా తప్పే లేకున్నా తప్పే అన్నట్లుగా ఉండేది పరిస్థితి. ఆత్మవిశ్వాసం ఉంటే ‘అంత వోవర్ కాన్ఫిడెన్సా?’ అని వెక్కిరింపు. లేకపోతే‘అంత ఆత్మన్యూనతా!’ అని చిన్నచూపు. ఇలాంటి పరిస్థితులను తట్టుకొని పెద్ద ప్రయాణమే చేయాల్సి వచ్చింది శ్రుతి. అయితే ఆ ప్రయాణంలో ఆమె ఎప్పుడూ ఆగిపోలేదు. ఐఐటీ–దిల్లీలో ఎం.టెక్. పూర్తిచేసిన శ్రుతి ఉద్యోగం చేయాలనుకుంది. ఆ తరువాత ‘ఉద్యోగం చేయగలనా?’ అని కూడా అనుకుంది. దీనికి కారణం... తన స్వతంత్ర వ్యక్తిత్వం. ‘నీకు చాలా కోపం’ అనే మాట చాలాసార్లు విన్నది.‘ఆవేశంతో కనిపించే వాళ్లకు సాధించాలనే కసి ఎక్కువగా ఉంటుంది’ అనే మాట కూడా విన్నది. ‘అప్నాక్లబ్’ రూపంలో అది తన విషయంలో నిజమైంది. వ్యాపారంలో రాణించాలనుకున్న శ్రుతి హార్వర్డ్ బిజినెస్ స్కూల్(హెచ్‌బీఎస్)లో ఎంబీఏ చేసింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘సైర్’ పేరుతో ట్రావెల్ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. అయితే అది తనకు చేదు అనునుభవాన్ని నేర్పించడమే కాకుండా తియ్యటి పాఠాలు నేర్పింది. చిన్న పట్టణాలకు చెందిన వాళ్లు ఎఫ్ఎంసీజీ(ఫాస్ట్–మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) ప్రాడక్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారనే విషయం గ్రహించిన శ్రుతి ‘అప్నాక్లబ్’ పేరుతో ఎఫ్ఎంసీజీ హోల్‌సేల్ ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టింది. సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘ఫరవాలేదు’ అనుకుంటున్న సమయంలో కంపెనీ వేగంగా దూసుకుపోవడం మొదలైంది. టైగర్ గ్లోబల్, ట్రూ స్కేల్ క్యాపిటల్, ఫ్లోరిష్ వెంచర్స్, వైట్‌బోర్డ్ క్యాపిటల్... బ్యాకర్స్గా ‘అప్నాక్లబ్’ శక్తిమంతంగా తయారైంది. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోతోంది. ‘నీకున్న ఆవేశానికి ఉద్యోగం చేయడం కష్టం. వ్యాపారం చేయడం అంత కంటే కష్టం’ అనే మాటను ఎన్నోసార్లు విన్నది శ్రుతి. ఇప్పుడు అలాంటి మాటలు ముఖం చాటేశాయి. ‘ఏదో సాధించాలనే గట్టి తపన, సంకల్పబలం ఉన్న మహిళ’ అనే ప్రశంసపూర్వకమైన మాటలు ‘అప్నాక్లబ్’ సీయీవో శ్రుతి గురించి తరచు వినిపిస్తున్నాయి. -
GenderNext: ప్రకటనల్లో నేటి మహిళ
కురులకు షాంపూలు.. మేనికి సబ్బులు.. వంటింట్లో కుకర్, మిక్సీలకే కాదు పురుషులు వాడే షేవింగ్ క్రీములకూ మహిళలను చూపించనిదే ఏ ప్రకటనా ఉండదనే విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రకటనల్లో మహిళా శక్తిని ఏ విధంగా చూపుతున్నారనే అంశం మీద అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కీ), ఫ్యూచర్ బ్రాండ్స్ ఆధ్వర్యంలో జెండర్ నెక్ట్స్ పేరిట ఓ స్టడీ నిర్వహించింది. ‘నేటి ఆధునిక రోజుల్లోనూ వాణిజ్య ప్రకటనల్లో చాలా వరకు మహిళల్ని ఇంకా మూస పద్ధతిలోనే చూపిస్తున్నారు’ అనేది ఈ స్టడీలో తేలింది. ప్రకటనల రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై చేసిన లోతైన పరిశీలన ఇది. దాదాపు 600 ప్రకటనల్ని పరిశీలించిన అనంతరం మహిళల శక్తిని తక్కువ చేసి చూపుతున్నట్టు జెండర్ నెక్ట్స్ స్టడీ నిరూపించింది. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న నేటి మహిళను ఆంక్షల్లో చూపెట్టడం సరికాదన్న విషయాన్ని స్పష్టం చేసింది. సంధించిన బాణాలు పర్సనల్ కేర్, ఫ్యాషన్, బ్యూటీ, హెల్త్, గాడ్జెట్స్, వీల్స్, విద్య, మనీ... సంబంధిత ప్రకటనలపై స్టడీ చేసిన అనంతరం కొన్ని ప్రశ్నలను రూపొందించి, వాటిని ఆన్లైన్ వేదిక ద్వారా ‘నేటి కాలంలో ప్రకటనలు మహిళల్ని ఎలా చూపిస్తున్నాయి? మహిళలు తమను తాము ఎలా భావిస్తున్నారు? తమను ఎలా చూపాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నలకు వృత్తి ఉద్యోగాలలో ఉన్న మహిళల నుంచి సమాధానాలు రాబట్టింది. ఈ పరిశోధనలో భాగంగా అన్ని రకాల ప్రకటనలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం జెండర్ నెక్ట్స్ స్టడీకి ప్రధాన ఆథర్ గా వ్యవహరించిన లిపికా కుమరన్ మాట్లాడుతూ ‘ప్రకటనల్లో సానుకూల అంశాలున్నప్పటికీ, మెయిన్ స్ట్రీమ్ అడ్వర్టయిజింగ్‌లో కొన్ని హానికరమైన స్టీరియో టైప్స్ పాత్రలున్నాయ’న్నారు. మహిళలకు సవాల్! మహిళలు ఆహారం తీసుకునే అలవాటును అత్యంత సున్నితంగా చూపడం పట్ల స్టడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే మిగిలిన వారంతా విశ్రాంతిగా కూర్చుని ఉండగా మహిళలు ఆపసోపాలు పడుతూ ఇంట్లో పనులు చేస్తున్నట్టు చూపడం, షాపింగ్‌లో అధికంగా ఖర్చు చేసేవారన్నట్టు, బ్యూటీ యాడ్స్‌లో మగవాళ్ల చూపులకు నచ్చే విధంగా ఉండేలా చూపడం, టెక్నాలజీ, గాడ్జెట్స్ వాడకంలో మహిళల శక్తి తక్కువ అన్నట్టు చూపడంతో పాటు మగ సెలబ్రిటీలు మహిళలకు సవాళ్లు విసురుతుండడం, ఆదేశాలు ఇస్తుండడం.. వంటివి అభ్యంతరకరంగా తేల్చారు. డిటర్జెంట్, ఫుడ్‌కు సంబంధించినవన్నీ మహిళల చేత మహిళలకోసమే రూపొందించినట్టుగా ఉండటం కూడా ఇందులో ప్రధానంగా గుర్తించారు. అంగీకరించని నేటి తరం ప్రకటనలపై విభిన్న వర్గాల మహిళలు సైతం ఈ అభ్యంతరాల్ని సమర్థించారు. స్వయం సమృద్ధి దిశగా తమ ప్రయాణానికి ప్రకటనలు నేస్తాలు కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇంట్లో పనంతా నెత్తినేసుకునేలా చూపడాన్ని నవ యువ వధువులు అంగీకరించడం లేదు. అలాగే మహిళా దినోత్సవం రోజున ఇచ్చే ప్రకటనల్లో... ఎన్నో కష్టాల తర్వాత మహిళలు విజేతలు అయినట్టుగా చూపడం కూడా ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ పరిశోధన ఫలితాల అనంతరం ప్రకటనల్లో మహిళల పాత్ర మెరుగుదలకు గాను అస్కీ పలు ప్రతిపాదనలు చేసింది. ఈ అధ్యయనం కోసం జాతీయ, ప్రాంతీయ ప్రకటనదారులు, ఏజెన్సీ, విధాన నిర్ణేతలు, న్యాయవాదులు .. ఇలా అందరు నిపుణులు సంప్రదించారు. ‘ప్రకటనలలో మహిళలను హానికరమైన మూసపద్ధతుల్లో చూపడం వల్ల యువతుల మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, వీటి వల్ల వారు సమాజంలో తమ విలువను ఏ విధంగా చూస్తారు’ అనే అంశాన్ని ఈ స్టడీ వెలుగులోకి తీసుకువచ్చింది. ఇటీవల ఒక పాల ఆధారిత ఉత్పత్తి కంపెనీ తన యానివర్సరీ వేడుకల్లో భాగంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో భార్య, అమ్మ, అత్త, అమ్మమ్మ స్థానంలో ఉన్న ఆడవాళ్లందరూ మగవాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టేవారిగానే చూపారన్న అభియోగాలను సోషల్‌మీడియా వేదికగా ఎదుర్కొంటోంది. -
జంక్షన్లో ఉద్యమించిన మహిళాశక్తి
సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో మహిళలు కదంతొక్కారు. వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి స్ఫూర్తితో మేము సైతం.. అంటూ సమైక్య శంఖం పూరించారు. తాము తలచుకుంటే ఏమైనా సాధిస్తామని.. సత్తాచాటుతామని విభజనవాదులను హెచ్చరించారు. హనుమాన్‌జంక్షన్‌లో శుక్రవారం రెండువేల మందికి పైగా మహిళలు భారీ ర్యాలీ చేశారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. దాదాపు ప్రతి ఊళ్లోనూ నారీమణులు ముందువరుసలో నిలిచారు.. సమైక్య సమరభేరి మోగించారు. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగాయి. మానవహారాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్యక్రమాలతో శుక్రవారం అన్ని ప్రాంతాలు అట్టుడికాయి. హనుమాన్‌జంక్షన్‌లో రెండు వేల మంది మహిళలు సమైక్య మహిళా శంఖారావం పేరిట భారీ ర్యాలీ చేశారు. కాకాని భవన్ నుంచి మొదలైన ర్యాలీ సెంటర్ వరకు సాగింది. అక్కడ భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ మానవహారం నిర్మించారు. జగయ్యపేట నియోజకవర్గంలోని పేట, పెనుగంచిప్రోలు మండలాల్లో జేఏసీ నేతృత్వంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పాత మున్సిపల్ సెంటర్లో పండ్ల వ్యాపారులు రిలే నిరహారదీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు మూడో రోజు కొనసాగాయి. మైలవరం మండలంలోని కీర్తిరాయునిగూడెంలో గ్రామస్తులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ సంఘీభావం తెలిపింది. మైలవరం సెంటర్లో వంటావార్పు నిర్వహించారు. గుడివాడలో జేఏసీ నేతృత్వంలో జరుగుతున్న రిలేదీక్షలో స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగులు, టీచర్లు వేర్వేరుగా రిలే దీక్షలు చేపట్టారు. పామర్రు నాలుగు రోడ్ల సెంటర్లో రాపర్ల గ్రామ సర్పంచి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కైకలూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 31వ రోజుకు చేరాయి. తాలూకా సెంటర్లో ఎన్జీవోల దీక్షలు 24వ రోజుకు చేరాయి. వీరికి మద్దతుగా బార్ అసోసియేషన్ సభ్యులు రిలే దీక్షలు చేశారు. శిబిరం వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నూజివీడులో ఆర్టీసీ, గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లిలో జేఏసీ నేతలు రహదారులు శుభ్రం చేసి నిరసన తెలిపారు. చల్లపల్లిలో ఎయిడెడ్ పాఠశాల సిబ్బంది విధులు బహిష్కరించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావాలంటూ అవనిగడ్డలో జరిగిన సర్వమత ప్రార్థనల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ పాల్గొన్నారు. కోడూరులో విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఘంటసాలలో డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహించారు. బెజవాడలో.. విజయవాడలోని కెనాల్ గెస్ట్‌హౌస్ సమీపంలో పలు ఉద్యోగ సంఘాలు సర్వమత ప్రార్థనలు నిర్వహించాయి. వన్‌టౌన్‌లో బీసీ సంఘాలు చేపట్టిన రిలే నిరహారదీక్షల్లో వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. చిట్టినగర్‌లో రాజకీయ జేఏసీ తలపెట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వన్‌టౌన్ నెహ్రూబొమ్మ సెంటర్లో క్రీడాకారుడు రవికిరణ్, సింగ్‌నగర్‌లో వైఎస్సార్ సీపీ నాయకుడు సరగడ శ్రీనివాసరెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. పాత బస్టాండ్ వద్ద దేవాదాయ శాఖ ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. శ్రీ దుర్గా మలేశ్వరస్వామి దేవస్థానం ఆల్క్యాడర్ ఎంప్లాయిస్ యూనియన్ నేతృత్వంలో రిలే దీక్షలు కొనసాగాయి. హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై జరిగిన దాడిని నిరసిస్తూ విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు సబ్ కలెక్టర్ కార్యాలం వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.