
రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సందర్భం
‘మహిళల శక్తి సామర్థ్యాలు సమాజానికి సంపూర్ణంగా ఉపయోగపడితేనే అభివృద్ధి సాధ్యం’ అనే భావనను చాలామంది ప్రముఖులు వ్యక్తీకరిస్తుంటారు. ఈ అభిప్రాయం మంచి ఉద్దేశంతో చేసిందే కావచ్చు గానీ... మహిళల శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా సమాజానికి ఉపయోగపడటం లేదనే అర్థం స్ఫురిస్తుంది.
అనాదిగా మహిళలు తమ సంపూర్ణ శక్తి సామర్థ్యాలను తమ కుటుంబానికి, తద్వారా సమాజానికి అందిస్తూనే ఉన్నారు. కాకపోతే, వారు చేసే సేవ లను కొలిచే కొలమానం ఉండదు. వారి సేవలు అనేక రూపాల్లో కారు చౌకగా దోపిడీకి గురవుతున్నాయి. ఉదాహరణకు చట్టాలు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో పురుష కూలీకి లభించే వేతనం మహిళా కూలీకి దక్కదు.
మహిళల శక్తి సామర్థ్యాలను అన్ని రంగాలలో సమాన ప్రాతినిధ్యంలో ఉపయోగించుకోగలిగితేనే సమాజం మరింత అభివృద్ధి చెందగలుగుతుందన్నది ఓ కఠోర వాస్తవం. తదనుగుణమైన కార్యాచరణకు పూనుకోవాల్సింది ప్రభుత్వాలే. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కావాలని కలవరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరడం అన్ని రంగాలలో మహిళలను వినియోగించుకోవడం మీదనే ఆధారపడి ఉంది.
భారతదేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలోని అనేక దేశాలలో శతాబ్దాలపాటు కొనసాగిన సాంఘిక దురాచారాలు, కట్టుబాట్లు మహిళల మనో వికాసాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని దెబ్బ తీశాయి. రాజ్యాంగంలోని 14, 15 అధికరణలు పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించి నప్పటికీ ఆచరణలో ఆమడ దూరంలోనే ఉన్నాయి. సామాజిక, రాజకీయ కారణాల వల్ల కొన్ని చట్టాల్ని అమలు చేయలేక ప్రభుత్వాలు నిస్సహాయంగా ఉండి పోతున్నాయి.
అయితే, సానుకూల పరిస్థితులు క్రమేపీ నెల కొంటున్నాయి. ప్రపంచీకరణ మొదలై ప్రైవేటు రంగం ఆధిపత్యం, టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో పలు రంగాల్లో మహిళలు అగ్రభాగాన రాణిస్తున్నారు. ఉదాహరణకు చంద్రయాన్–3 ప్రాజెక్టులో వంద మందికిపైగా మహిళా శాస్త్రవేత్తలు పని చేశారు.
2018లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మహిళా శాస్త్రవేత్తల పథకం మంచి ఫలితాలు అందిస్తోంది. దాదాపు 2,000 మంది మహిళా శాస్త్ర వేత్తలు చేసే పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) చేస్తున్న కృషి కారణంగా, 2000– 01లో జరిగిన పరిశోధనలలో 13 శాతంగా ఉన్న మహిళల వాటా, ప్రస్తుతం 30 శాతం దాటింది.
దాంతోపాటు, మహిళల ఆరోగ్యం, భద్రత లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ‘నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో’ వివరాల ప్రకారం, దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు ఏటా 8% మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత విషయంలో అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో భారతదేశం 5వ స్థానంలో నిలవడం సిగ్గుచేటు. మన దేశంలో పర్యటించే విదేశీ మహిళా టూరిస్టులకు ఆ యా దేశాలు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇది దేశ పర్యాటక రంగం అభివృద్ధికి అవరోధం.
రాజకీయ భాగస్వామ్యం పెరగాలి!
మహిళల శక్తి సామర్థ్యాలు మిగతా రంగాలలో కంటే రాజకీయ రంగంలో అతి తక్కువ స్థాయిలో వినియోగం అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖాగుప్తాను ఎంపిక చేసిన బీజేపీ... మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించుకొంది.
అందుకు వారిని అభినందించాల్సిందే! కానీ, ఇది ఒక పార్శ్వం మాత్రమే. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఎంపికైన మహిళలు కేవలం ఐదుగురే. లోక్‌సభలో సైతం మహిళల ప్రాతినిధ్యం గరిష్ఠంగా 15 శాతం మించడం లేదు. 17వ లోక్‌సభలో మహిళా సభ్యుల శాతం 14.4 శాతం కాగా, ప్రస్తుత 18వ లోక్‌సభలో అది 13.6 శాతానికి తగ్గడం గమనార్హం!
లోక్‌సభ, శాసనసభలలో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన బిల్లు 1996లో హెచ్.డి.దేవెగౌడ సారరథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రవేశ పెట్టినపుడు ఈ రచయిత కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కలిసిరాని రాజకీయ పార్టీల వైఖరి కారణంగా ఈ బిల్లు పలు పర్యాయాలు వాయిదాలు పడుతూ ఎట్టకేలకు 27 సంవత్సరాల తర్వాత మోదీ చొరవతో 2023లో పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా రూపొందింది.
అయితే జనగణన, డీలిమిటేషన్ వంటి ప్రక్రియలను దాటాలి కనుక 2029 నుంచి మాత్రమే ఈ చట్టం అమలులోకి రాగలదు. కానీ చట్టం అమలయ్యే వరకు వేచి చూడకుండా, పార్టీల పరంగా 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించుకొంటే అందుకు జవాబు దొరకదు.
అనేక దేశాలలో మహిళలకు లభించిన హక్కులు, స్వేచ్ఛ, ఇతర సామాజికపరమైన భద్రతలన్నీ ఉద్యమాలు, పోరాటాల కారణంగానే లభించాయి. మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ రాజకీయాల స్వరూపం మారుతుంది.
బ్రిటన్‌కు చెందిన ‘వరల్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ ఎకనమిక్స్ రీసెర్చ్’... మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలలో ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉందనీ, అక్కడి ప్రజలు సైతం తమ ప్రజాప్రతినిధి పనితీరు పట్ల ఎక్కువ సంతృప్తికరంగా ఉన్నారనీ వెల్లడించింది.
‘ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం’ అంటూ మాటల్లో మాత్రమే మహిళలను అందలం ఎక్కించడం కాకుండా, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో వారికి సముచిత ప్రాతినిధ్యం అందించాలి. అప్పుడే సమాజం అభివృద్ధి పథంలో వడిగా ముందుకు సాగుతుంది.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment