దేశాన్ని అట్టుడికించిన కేసులో కోర్టు తీర్పు వెలువడింది. తీరా తీర్పు సైతం ఆ కేసులానే చర్చకు దారి తీస్తోంది. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలోని సెమినార్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ డాక్టర్‌పై గత ఆగస్ట్ 9న జరిగిన దారుణ హత్యాచార ఘటనపై తాజా తీర్పు సహేతుకం కాదనే విమర్శ వినిపిస్తోంది. ఆస్పత్రిలో వాలంటీరైన సంజయ్ రాయ్ భారతీయ న్యాయ సంహిత లోని వివిధ సెక్షన్ల కింద నేరస్థుడంటూ శనివారమే కోర్ట్ ప్రకటించేసింది.
కానీ, ఈ కేసులో అతనికి ఉరిశిక్ష బదులుగా యావజ్జీవ కారాగారవాస శిక్ష మాత్రమే విధిస్తున్నట్టు సియాల్డాలోని అడిషనల్ జిల్లా, సెషన్స్ కోర్ట్ సోమవారం తీర్పు చెప్పేసరికి మళ్ళీ తేనెతుట్టె కదిలింది. బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారే కాక, అటు కేంద్ర నేరదర్యాప్తు సంస్థ (సీబీఐ), ఇటు బాధితురాలి కుటుంబం సైతం నేరస్థుడికి ఉరిశిక్ష విధించాలంటూ వాదించింది. కానీ, అంతటి తీవ్ర శిక్ష విధించేందుకు హేతుబద్ధత లేదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం గమనార్హం. దాంతో, మహిళా లోకంలో, బాధిత, వైద్య వర్గాల్లో అసహనం కట్టలు తెంచుకుంది. సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాలే అందుకు నిదర్శనం.
హత్యాచారానికి గురైన ఆడకూతురు, ఆమె కుటుంబం బాధను ముగ్గురు ఆడపిల్లలకు తల్లినైన తాను అర్థం చేసుకోగలనంటూ నేరస్థుడి తల్లే స్వయంగా అనడం గమనార్హం. కన్నకొడుకైనా సరే నేరం రుజువైతే, శిక్ష పడాల్సిందేనని ఆ మాతృమూర్తి అన్న మాటలు జరిగిన ఘటన రేపిన భావోద్వేగాలను గుర్తు చేస్తుంది. పైపెచ్చు, ఆగస్ట్ 9 తర్వాత బెంగాల్‌లో అయిదు హత్యాచార ఘటనల్లో, మైనర్లపై దారుణానికి పాల్పడ్డ నేరస్థులకు ‘పోక్సో’ కోర్టులు ఏకంగా మరణశిక్షే విధించాయి. అందుకే, ఈ కేసులోనూ నేరస్థుడికి ఉరిశిక్ష పడుతుందనీ, పడాలనీ బలమైన భావన వ్యాపించింది. అయితే జరిగింది వేరు.
బెంగాల్‌నే కాక అప్పట్లో భారత్ మొత్తాన్నీ కదిలించిన ఈ ఘటనలో బాధిత కుటుంబానికి రూ. 17 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ ఘటన ఉరిశిక్ష విధించాల్సినంత అత్యంత అరుదైన కేసు ఏమీ కాదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. బెంగాల్ ఏలిక మమతా బెనర్జీ సైతం తీర్పుతో సంతృప్తికరంగా లేమంటూ కుండబద్దలు కొట్టేసి, తీర్పుపై హైకోర్టుకు వెళతామని తేల్చేశారు.
సర్వసాధారణంగా నేరం తాలూకు తీవ్రత, సమాజంపై దాని ప్రభావం, నేరస్థుడి గత చరిత్ర, ప్రవర్తన లాంటివన్నీ మరణశిక్ష విధింపునకు ప్రాతిపదిక అవుతాయి. అయితే, గౌరవ న్యాయస్థానం తన ముందున్న సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే ఎలాంటి తీర్పునైనా ఇస్తుంది. తీర్పు చెబుతూ న్యాయమూర్తి సైతం ఆ మాటే అన్నారు. అంతేతప్ప, మీడియాలో సాగుతున్న ప్రచారం సహా ఇతరేతర కారణాలను బట్టి శిక్షపై నిర్ణయం తీసుకోవడం జరగదు. కాబట్టి, తగినంత బలమైన సాక్ష్యాధారాలు లేనందు వల్లనే ఈ కేసులో నేరస్థుడికి కోర్ట్ మరణశిక్ష విధించలేదా అన్నది ఆలోచించాల్సిన అంశం.
తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ ఆ అంశంపై మరింత స్పష్టత రాదు. ఆస్పత్రి సిబ్బంది భద్రత కోసం పనిచేయాల్సిన వాలంటీర్ రాయ్ అసలు తన ఉద్యోగ ధర్మాన్నే మంటగలిపి, కాపాడాల్సిన డాక్టర్‌నే కాటేశాడన్నది చేదు నిజం. అతడు చేసిన నేరం ఘోరం, హేయమన్నదీ నిర్వివాదాంశం. అయితే, హత్యాచారానికి పాల్పడ్డ సదరు నేరస్థుడు జీవితంలో మారే అవకాశం లేదంటూ ప్రాసిక్యూషన్ బలంగా వాదించలేక పోయింది. ఆ మాటను నిరూపించలేక పోయింది. అది కూడా శిక్ష విషయంలో నేరస్థుడికి కలిసొచ్చిందని నిపుణుల మాట.
కోల్‌కతా కేసు దర్యాప్తు ఆది నుంచి అనుమానాలకు తావివ్వడం దురదృష్టకరం. నిజానిజా లేమో కానీ, అత్యంత హేయమైన ఈ ఘటనలో శిక్షపడ్డ నేరస్థుడే కాక, ఇంకా పలువురి హస్తం ఉంద నేది అందరి నోటా వినిపిస్తున్న మాటే. స్థానిక పోలీసుల నుంచి చివరకు సీబీఐ చేతుల్లోకి దర్యాప్తు వెళ్ళినా జనంలో అనుమాన నివృత్తి కాలేదన్నది నిష్ఠురసత్యం. సీసీ టీవీ దృశ్యాల్లో 68 దాకా రాకపోకలు కనిపించినా, రాయ్ ఒక్కరినే గుర్తించారన్న ఆరోపణలే అందుకు సాక్ష్యం.
పనికి మాలిన రీతిలో దర్యాప్తు జరిగిందనీ, పలుకుబడి గల బడాబాబులు తప్పించుకున్నారనీ, ఆఖరికి ఒకడే నేర స్థుడని తీర్మానించి యావజ్జీవ ఖైదుతో సరిపెట్టారనీ విమర్శలు వెల్లువెత్తడానికి కారణమూ అదే. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ సహా పలువురి వ్యవహారశైలి, ఆశ్రిత పక్ష పాతం, అవినీతి ఆరోపణలు, ఆస్పత్రి యంత్రాంగం పనితీరు, వగైరా... ఎన్నో ప్రశ్నల్ని ముందుకు తెచ్చాయి. సాక్ష్యాధారాల తారుమారు యత్నంలో ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసినా, నిర్ణీత 90 రోజుల వ్యవధిలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోయే సరికి నిష్పూచీగా ఆయన బయటకొచ్చారంటే మన నిఘా, దర్యాప్తు సంస్థలు ఎంత ఘనంగా పనిచేస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కీలకమైన మరో విషయం – ఈ ఘటనకు కారణమైన పరిస్థితులు. ప్రగతి బాటలో ముందున్నా మనే దేశంలో... పనిప్రదేశాల్లో సైతం మహిళలకు రక్షణ కొరవడడం, ఉద్యోగస్థలాలు స్త్రీలకు సురక్షితంగా లేకపోవడం శోచనీయం. కోల్‌కతా ఘటనతో పార్టీలు, ప్రజలు కదం తొక్కిన మాట నిజమే కానీ, ఇప్పటికైనా ఈ పరిస్థితుల్ని సమూలంగా మార్చాల్సిన అవసరం పాలకులకుంది. అవినీతి పంకిలమై, లోపభూయిష్ఠంగా నడుస్తున్న అనేక వ్యవస్థల్ని చక్కదిద్దాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనే కోర్టులు ఉన్నంతలో సత్వర న్యాయం అందించడం, ప్రజాభిప్రాయం కన్నా ప్రత్యక్ష సాక్ష్యాలే ప్రాతి పదికగా తీర్పులివ్వడం ఆహ్వానించదగ్గదే. అయితే, చాలా సందర్భాల్లో న్యాయం చెప్పడమే కాదు... న్యాయమే చేస్తున్నట్టు కనిపించడం ముఖ్యం. ఈ కేసులో అది జరిగిందా అన్నదే పలువురి ప్రశ్న.
తప్పు ఎవరిది? శిక్ష ఏమిటి?
Published Tue, Jan 21 2025 12:50 AM | Last Updated on Tue, Jan 21 2025 12:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment