కదలిక
పత్రికలకు, రేడియోకు దూరంగా ఉండే ఆ బామ్మ ఆగ్రహంతో రగిలిపోయింది. కోలకతాలో జూనియర్ డాక్టర్‌పై సాగిన హత్యాచారకాండను మనవరాళ్ల ద్వారా వినగానే ‘సమాజం ఇలాంటి వాటిని ఎలా అంగీకరిస్తుంది? పదండి అందరం నిరసన తెలుపుదాం’ అని 90 ఏళ్ల మాయా రాణి అర్ధరాత్రి కేండిల్ పట్టి రెండు మైళ్లు నడిచింది. ప్రతి అడుగు మనలో కదలిక ఆశిస్తోంది.
ఆమెను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. నడుము ఒంగిపోయినా అడుగులు తొణకడం లేదు. శరీరం బలహీనంగా ఉన్నా మాట తీవ్రతలో వెనుకంజ లేదు. మొన్నటి బుధవారం (ఆగస్టు 14) కోల్‌కతాలో అర్ధరాత్రి సాగిన నిరసనలో 90 ఏళ్ల ఆ బామ్మ చేతిలో క్యాండిల్ పట్టుకుని జనంతోపాటు నడుస్తూంటే అందరూ ఆమెను చూసి స్ఫూర్తి పొందారు. ఆమెతోపాటు మరింత ఉద్వేగంగా నడిచారు.
ఇంత దారుణమా...
కోల్‌కతాలోని జోకా ప్రాంతంలో నివాసం ఉండే 90 ఏళ్ల మాయారాణి చక్రవర్తికి ఆగస్టు 9న జరిగిన హత్యాచారం గురించి మనవరాళ్ల ద్వారా తెలిసింది. డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం జరిపి హత్య చేశారన్న వార్త తెలియగానే ఆమె కదిలిపోయింది. తన కోల్‌కతా నగరంలో ఇంత దారుణమా అనుకుందామె.
‘ఇంతటి ఘోరాన్ని నా జీవితంలో వినలేదు’ అందామె వాళ్లతో. ‘దీనిని సమాజం ఎలా అంగీకరిస్తుంది? మీరంతా ఏం చేస్తున్నారు?’ అని మనవరాళ్లను ప్రశ్నించింది. ‘మేము అర్ధరాత్రి నిరసన చేయబోతున్నాం. రాత్రిళ్లు సురక్షితంగా తిరగ్గలిగే మా హక్కు కోసం నినదించబోతున్నాం’ అని వాళ్లు చెప్పారు. ‘అయితే నేనూ వస్తాను’ అందామె. ‘రెండు మైళ్లు నడవాలి’ అన్నారు వాళ్లు. ‘నేను నడుస్తాను’ అందామె ఖండితంగా.
క్యాండిల్ పట్టుకుని...
మోకా అనే ఏరియాలోని తన అపార్ట్‌మెంట్ నుంచి ఆ ఏరియా ఇ.ఎస్.ఐ ఆస్పత్రి వరకు మూడు కిలోమీటర్లు నడిచింది మాయారాణి చక్రవర్తి. ‘బయట క్షేమంగా లేకపోతే ఇంట్లో మాత్రం క్షేమంగా ఎలా ఉండగలరు ఆడవాళ్లు. నా మనవరాళ్లు పని మీద, చదువు కోసం బయటకు వెళితే వాళ్లు వచ్చేంత వరకూ బితుకుబితుకుమంటూ ఉండాలా నేను. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితిని అందరం మార్చాలి. అంతేకాదు ఇంత దారుణ నేరం చేసినవారికి శిక్ష పడాలి’ అందామె. సమాజంలో ఎన్ని ఘోరాలు జరిగినా జడత్వంతో మనకెందుకులే అనుకునేవారికి ఆ బామ్మ కదలిక ఒక దివిటీ కావాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment