International Womens Day 2024
-
London: మహిళలు ఇల్లే కాదు.. సమాజ అభివృద్ధికి కూడా ఎంత కీలకం!
'ఒకటి ఒకటి కలిపితే రెండు కాదు, తోడుగా నిలబడితే 11 అని చాటుతూ, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రవాస మహిళలు 'తెలుగు లేడీస్ ఇన్ యూకే' అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని ఉమెన్స్ డే వేడుకలు జరుపుకున్నారు'. ఈ ‘తెలుగు లేడీస్ యూకే (UK)’ గ్రూపును శ్రీమతి శ్రీదేవి మీనావల్లి డిసెంబర్ 2011న ప్రారంభించారు. ఈ టీఎల్‌యూకే (TLUK) గ్రూపులో సుమారు 5,000 మంది పైగా తెలుగు మహిళలు ఉన్నారు. బ్రిటన్‌కు వలస వచ్చే తెలుగు ఆడపడుచుల అందరికీ నూతన పరిచయాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా, వైద్య, ఆర్థిక సందేహాలు, సలహాల ద్వారా చేయూతను అందించడమే ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం అని శ్రీదేవి గారు తెలిపారు. ప్రతి సంవత్సరంలా కాకుండా వినూత్నంగా ఈ ఏటా సెంట్రల్ లండన్ లోని థేమ్స్ నదిపై ఒక ప్రైవేట్ క్రూయిజ్ లో ఈ వేడుకలు జరుపుకున్నారు. థేమ్స్ నదిపై నాలుగు గంటల పాటు ప్రయాణం చేస్తూ విందు వినోదాలతో ,ఆటపాటలతో, లైవ్ ఎంటర్టైన్మెంట్ అందరూ ఉల్లాసంగా గడిపారు. ఆట పాటలతో పాటు రాఫెల్ ద్వారా ఈ గ్రూపు నిర్వహించే విద్యా వైద్య సేవా కార్యక్రమాల్లో తోడ్పడి మహిళలందరూ తమ చేయూతను అందించారు. మహిళలు ఇల్లే కాదు సమాజ అభివృద్ధికి కూడా ఎంత కీలకమో చాటిచెప్పారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి, స్వాతి డోలా, జ్యోతి సిరపు, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మై ఛాయిస్!
భారతీయ మహిళలకు కుర్తాలు ఇష్టమైన దుస్తులు. వృత్తిరీత్యా టీషర్ట్లు ధరించడం అందరికీ సౌకర్యం కాకపోవచ్చు. అందుకే ‘విమెన్స్ డే’ సందర్భంగా జొమాటో తన మహిళా డెలివరీ పార్టనర్లకు ఎర్ర కుర్తాలను బహూకరించింది. ఇకపై వారు డ్యూటీలో నచ్చిన టీ షర్ట్గాని, కుర్తా గాని ధరించవచ్చు. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్ యాడ్ ఇంటర్నెట్లో కుతూహలం రేపుతోంది. జొమాటోలో దేశమంతా మూడున్నర లక్షల మంది డెలివరీ పార్టనర్లు ఉన్నారు. అంటే ఫుడ్ డెలివరీ చేసే బోయ్‌లు. వీరిలో స్త్రీలు కేవలం 1500 నుంచి 2000 మంది మాత్రమే ఉన్నారు. టూ వీలర్ మీద వేళకాని వేళలో తిరగాల్సి రావడం వల్ల ఇదొక ఛాలెంజింగ్ జాబ్ అయ్యింది మహిళలకు. అయినప్పటికీ సవాలుగా తీసుకుని వందల ఆర్డర్లు డెలివరీ చేస్తున్న జొమాటో మహిళలు ఉన్నారు. వృత్తిరీత్యా వారు టీషర్ట్ ధరించాల్సి ఉంటుంది. అది అందరికీ సౌకర్యం కాకపోవచ్చు. అందుకే జొమాటో మొన్నటి విమెన్స్ డే రోజు కుర్తాలు బహూకరించింది. ‘మీ చాయిస్. మీరు టీషర్ట్ వేసుకోవచ్చు లేదంటే కుర్తాలు వేసుకోవచ్చు’ అని చెప్పింది. ఇందుకోసం ప్రమోషన్ యాడ్ చేస్తే మహిళా డెలివరీ పార్టనర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘జేబులున్న కుర్తా నాకు నచ్చింది’ అని ఒక మహిళ చెప్పింది. ‘ఫోటోలు బాగా తీయండి’ అని మరో మహిళ ఉత్సాహపడింది. ‘పదండి అందరం మనాలి వెళ్దాం’ అని మరో మహిళ ఉత్సాహ పరిచింది. కొత్త ఉపాధి మార్గంలో వెరవక నడిచే వీరందరినీ చూసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. దేశీయ దుస్తుల్లో బాగున్నారంటూ కితాబిచ్చారు. -
International Womens Day 2024: రాజ్యసభకు సుధామూర్తి
సాక్షి, న్యూఢిల్లీ/బనశంకరి: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమెను పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్ చేశారు. సామాజిక, విద్యా రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పెద్దల సభకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే రాజ్యసభకు నామినేట్ చేయడం తనకు డబుల్ సర్ప్రైజ్ అని సుధామూర్తి పేర్కొన్నారు. తాను ఏనాడూ పదవులు ఆశించలేదని చెప్పారు. రాష్ట్రపతి తనను పెద్దల సభకు నామినేట్ చేయడానికి గల కారణం తెలియదని అన్నారు. ఉన్నత చట్టసభకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇది తనకు కొత్త బాధ్యత అని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యురాలిగా తన వంతు సేవలు అందిస్తానని వివరించారు. ప్రధాని మోదీకి సుధామూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న సుధామూర్తి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సుధామూర్తిని రాష్ట్రపతిద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రంగాల్లో ఎన్నెన్నో సేవలు అందించిన సుధామూర్తి చట్టసభలోకి అడుగు పెడుతుండడం నారీశక్తికి నిదర్శనమని మోదీ ఉద్ఘాటించారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు. టెల్కోలో తొలి మహిళా ఇంజనీర్ డాక్టర్ సుధామూర్తి 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గావిలో జని్మంచారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ ఆర్‌హెచ్ కులకరి్ణ, విమలా కులకరి్ణ. సుధామూర్తి హుబ్లీలోని బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కంప్యూటర్స్‌లో ఎంఈ చేశారు. టాటా ఇంజినీరింగ్ లోకోమోటివ్ కంపెనీ(టెల్కో)లో ఉద్యోగంలో చేరారు. దేశంలోనే అతి పెద్దవాహన తయారీ కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్‌గా గుర్తింపు పొందారు. 1970 ఫిబ్రవరి 10న నారాయణమూర్తితో వివాహం జరిగింది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీకి సుధామూర్తి సహ వ్యవస్థాపకురాలు. సంస్థ ప్రారంభించే సమయంలో రూ.10వేలు తన భర్తకు ఇచ్చి ప్రోత్సహించారు. సేవా కార్యక్రమాలు.. పురస్కారాలు 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను సుధామూర్తి ప్రారంభించారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో పలు పుస్తకాలు రాశారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వరద బాధితుల కోసం 2,300 ఇళ్లు నిర్మించారు. పాఠశాలల్లో 70 వేల గ్రంథాల యాలు నిర్మించారు. భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మశ్రీ,, 2023లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి చింతామణి అత్తిమబ్బే అవార్డు స్వీకరించారు. సాహిత్యంలో ఆమె చేసిన సేవకుగానూ ఆర్కే నారాయణ సాహిత్య పురస్కారం, శ్రీరా జా–లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు. భర్త నారాయణమూర్తి (2014)తో సమానంగా 2023లో గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు ద్వారా తాను అందుకున్న మొత్తాన్ని టోరంటో విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు. నాన్ఫిక్షన్ విభాగంలో క్రాస్‌వర్డ్ బుక్ అ వార్డు, ఐఐటీ–కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు అక్షతామూర్తి, రోహన్‌మూర్తి సంతానం. అక్షతామూర్తి భర్త రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి. వీరిది ప్రేమ వివాహం. రాజ్య సుధ – ప్రత్యేక కథనం ఫ్యామిలీలో.. -
సిలిండర్ ధర రూ.100 తగ్గింపు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తగ్గిన ధర వెంటనే అమల్లోకి వచి్చందని ప్రభుత్వం పేర్కొంది. ధర తగ్గింపుతో ఢిల్లీలో 14.2 కేజీల గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.803కు దిగి వచి్చంది. స్థానిక పన్నుల్లో వ్యత్యాసాలను బట్టి రాష్ట్రాల్లో ధరలో స్వల్ప మార్పులు ఉండొచ్చు. దేశీయ ఇంధన ధరలకు ప్రామాణికంగా భావించే అంతర్జాతీయ చమురు, గ్యాస్ ధరలు స్వల్పంగా కిందకు దిగొచి్చన కారణంగానే ఎల్పీజీ ధర తగ్గించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. రికార్డుస్థాయిలో గత 23 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ‘ మహిళా దినోత్సవం సందర్భంగా మా ప్రభుత్వం ఎలీ్పజీపై రూ.100 తగ్గించింది. దేశవ్యాప్తంగా కోట్లాది గృహాలకు ముఖ్యంగా నారీశక్తికి ఈ నిర్ణయం లబ్ధి చేకూరుతుంది’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. గత ఆరునెలల వ్యవధిలో వంటగ్యాస్ ధర తగ్గించడం ఇది రెండోసారి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్‌లో సిలిండర్‌పై రూ.200 ధర తగ్గించారు. దీంతో అప్పటిదాకా తొమ్మిది నెలలుగా గరిష్టస్థాయి వద్ద ఉన్న సిలిండర్ ధర రూ.1,103 నుంచి రూ.903కు దిగివచి్చంది. శుక్రవారం నాటి తగ్గింపుతో వినియోగదారులకు ఇంకాస్త ఉపశమనం లభించింది. ఉజ్వల లబ్ధిదారులకు రూ.503కే : దేశవ్యాప్తంగా అందరూ సబ్సిడీయేతర ధరకే వంటగ్యాస్‌ను కొనుగోలుచేస్తున్నారు. అయితే ‘‘ ప్రధాన్‌మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత కనెక్షన్ పొందిన గ్రామీణ ప్రాంత పేదలకు మాత్రమే ఒక్కో సిలిండర్‌పై రాయితీ రూ.300 వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. తాజా తగ్గింపుతో వారు రూ.503కే సిలిండర్ పొందొచ్చు’’ అని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టంచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న గ్యాస్ ధరలు ఎన్నికల్లో ప్రధానాంశంగా మారాయి. 2021 జూలై– 2023 ఆగస్ట్ మధ్య సిలిండర్ ధర ఏకంగా రూ.294 పెరిగింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగదారులు 33 కోట్లకుపైగా ఉన్నారు. ఉజ్వల పథకం లబి్ధదారులు దాదాపు 10 కోట్ల మంది ఉంటారు. ధర తగ్గింపుతో దేశంలోని రిటైల్ చమురు రంగ సంస్థలకు రూ.వేల కోట్ల అదనపు భారం పడొచ్చని అంచనా. -
అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలుగులు నింపారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత తెలిపారు. జగనన్న గెలుపు.. ఈ రాష్ట్రంలోని మహిళల గెలుపు.. అని ఆమె అన్నారు. సంక్షేమ పథకాల్లో లబ్ధిపొందిన వారిలో బీసీ మహిళలే అధికమని.. అన్ని రంగాల్లో మహిళలకు సీఎం జగన్ అగ్రస్థానం కల్పించారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాళ్లు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కల్యాణి, పార్టీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ ‘అమ్మఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, మహిళా పోలీసు.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన పార్టీ అధ్యక్షుడు సీఎం అయ్యాకే తీసుకొచ్చారు. ఇవన్నీ ప్రతి అక్కచెల్లెమ్మకు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రతి ఓటరుకు చెప్పాలి.’ అని పేర్కొన్నారు. ప్రతీ మహిళా స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేయాలి: వరుదు కళ్యాణి వరుదు కళ్యాణి మాట్లాడుతూ ‘ఈ ఐదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.55లక్షల కోట్లు పేదల ఖాతాల్లో సీఎం జగన్ జమచేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలా ఎప్పుడైనా చేశారా? సీఎం జగన్ మహిళా పక్షపాతి. ఇవాళ రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఓ విలేజ్ సెక్రటేరియట్, విలేజ్ క్లినిక్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. వీటన్నింటిలో ఎక్కువ ఉద్యోగాలు పొందింది మహిళలే. నాడు–నేడుతో కొత్తరూపు సంతరించుకున్న బడులు, ఆస్పత్రులూ కనిపిస్తాయి. ఇవన్నీ ఈ 57 నెలల కాలంలోనే సీఎం వైఎస్ జగన్ చేశారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రతి మహిళ ఒక స్టార్ క్యాంపెయినర్ అయి వచ్చే ఎన్నికల్లో పనిచేయాలి.’ కోరారు. ఎన్నికల్లో ప్రచారం కోసం రాజీనామా చేశా: వాసిరెడ్డి పద్మ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కోట్లాదిమంది మహిళలు హారతి పడుతూ సీఎం వైఎస్ జగన్‌కు బిగ్ థాంక్స్ చెబుతున్నాం. కుటుంబంలో ఎవరూ ఇవ్వని సమానత్వం సీఎం జగన్ ఇచ్చారు. మహిళల పేరిట ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇలా ప్రతి పథకంలోనూ మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతతో వారికి గుర్తింపు, సమానత్వం వచ్చింది. ‘వై నాట్ 175’ అనే సీఎం జగన్ నినాదాన్ని నిజంచేసే శక్తి మహిళలకు ఉంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేయడానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశాను.’ అని వివరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు అమ్మాజీ, బండి పుణ్యశీల, బెందాళం పద్మావతి, డాక్టర్ శశికళ, భవానీ, నాగమణి, సంపత్ విజితా, ఏబీ రాణి, రజనీ, డాక్టర్ షమా సుల్తానా, మాధవీ వర్మ, రాజేశ్వరి, పార్టీ ఉపాధ్యక్షులు, జోనల్ కమిటీ చైర్మన్లు, మహిళా అడ్వొకేట్లు తదితరులు పాల్గొన్నారు. -
సమాజాన్ని అద్దంలో చూపించాను
‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ పేరుతో తన జర్నలిస్ట్ జీవితాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించారు అరుణా రవికుమార్. ముప్ఫై ఎనిమిదేళ్ల కిందట ‘అరుణా అశోకవర్ధన్’ పేరుతో తొలిసారి బైలైన్ చూసుకోవడం నుంచి నేటి వరకు సాగిన అక్షరయానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నేను మీడియా రంగంలోకి రావడమే ఒక ఆశ్చర్యం. నా చదువు ఇంగ్లిష్ మీడియంలో, గ్రాడ్యుయేషన్ సైన్స్‌లో సాగింది. అమ్మ రచయిత కావడంతో తెలుగు సాహిత్యం మీద అభిరుచి మెండుగా ఉండేది. నా లక్ష్యం సివిల్స్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ పరీక్షల నాటికి తాతగారు పోవడంతో రాయలేకపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఓ ఇంగ్లిష్ పత్రికలో జర్నలిస్టుగా చేరాను. నా తొలి రిపోర్టింగ్ జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ రిపోర్ట్ మీద. బై లైన్‌తో వచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు, ప్రపంచ విజేతనైన భావన. అలా మొదలైన నా జర్నీ ఎలక్ట్రానిక్ మీడియాకు మారింది. తెలుగులో ప్రైవేట్ టీవీ రంగంలో రిపోర్టర్ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళను. పెళ్లి చేసుకున్న తర్వాత విజయవాడకు బదిలీ కావడం కూడా చాలా కీలకమైన అనుభవాన్నిచ్చింది. అది 1988, మార్చి నెల పదవ తేదీ. విజయవాడ వెళ్లిన తొలి రోజు, దేవినేని మురళి హత్య. సూపర్ మార్కెట్లో ఉన్నాను. ఓ కుర్రాడు పరుగున లోపలికి వచ్చి షట్టర్ వేసేశాడు. భయం కలిగినప్పటికీ నిబ్బరంగా ఉండిపోయాను. ఓ అరగంట తర్వాత షట్టర్ తీశారు. రోడ్డు మీదకు వస్తే... అంతకు ముందు ఏమీ జరగనట్లు తుపాను తర్వాత ప్రశాంతతలా ఉంది వాతావరణం. జర్నలిస్టుగా కొత్త ప్రపంచాన్ని చూశాను. చీరాలలో చేనేతకారుల ఆకలి చావులను రిపోర్ట్ చేయగలిగాను. సమాజంలో వేళ్లూనికొని ఉన్న ఆవేదనలు, ఆందోళనలకు అద్దం పట్టాను. ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు సాంబశివుడి ఇంటర్వ్యూ చేశాను. ఎలిమినేటి మాధవరెడ్డి గారి హత్యకు కొద్దిగా ముందు ఆయనతోపాటు వారి వాహనంలోనే ప్రయాణించాను. అప్పటికే రెక్కీ నిర్వహించి హత్యకు ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆ తర్వాత నాకు తెలిసింది. బళ్లారిలో ఎన్నికలను కవర్ చేశాను. భ్రూణహత్యల మీద పరిశోధనాత్మక కథనాలకు యూనిసెఫ్ అవార్డు వచ్చింది. స్టూడియో లో ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల ఇంటర్వ్యూలు ఎన్ని చేసినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనా కథనాలు ఎక్కువ సంతోషాన్నిస్తాయి. ఫ్లోరోసిస్ బాధితుల కథనాలకు స్పందనగా ప్రభుత్వాలు నీటి సౌకర్యాన్ని కల్పించడం రిపోర్టర్‌గా నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సందర్భం. లంబాడా తండాల్లో ఆడపిల్లలను పుట్టగానే చంపేయడం, కుటుంబాన్ని పోషించడానికి ఓ మహిళ మూడుసార్లు సరోగసీ ద్వారా బిడ్డను కని అనారోగ్యం పాలు కావడం వంటి కథనాలెన్నింటికో నేను అక్షరసాక్షిని కావడం ద్వారా నాకు ఈ రంగం ఎంతో సంతృప్తినిచ్చింది. మా వారి బదిలీల రీత్యా, పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ల చదువులు కీలక దశల్లో ఉన్నప్పుడు కెరీర్లో విరామాలు తీసుకుంటూ నా వృత్తిని కొనసాగిస్తున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ‘మరాడర్స్ ఆఫ్ హోప్’ నా తొలి రచన. ‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ నా రెండవ రచన. ఇండిపెండెంట్ జర్నలిస్టుగా హైదరాబాద్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పటికీ రోజూ చదువుతాను, రాస్తుంటాను. మహిళ ఎన్ని సాధించినప్పటికీ సమాజంలో సమానత్వం మాత్రం పూర్తిస్థాయిలో రాలేదనే చెప్పాలి. అయితే నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో సమాజంలో స్త్రీ–పురుషుల మధ్య అసమానత్వం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంత తీవ్రంగా లేదు. కానీ సమానత్వం మాత్రం ఇంకా రాలేదు’’ అంటూ తన అక్షరయానం గురించి వివరించారు అరుణ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫొటో: అనిల్‌కుమార్ మోర్ల -
శ్రామికలోక శక్తిమంతులు
‘చీకటిని చూసి విచారించవద్దు. అదిగో చిరుదీపం’ అంటుంది ఆశావాదం. ‘ఏమీ లేదని బాధ పడవద్దు. నేనే నీ ఆయుధం, బలం’ అంటుంది ఆత్మవిశ్వాసం. ఆశావాదం వెల్లివిరిసే చోట ఆత్మవిశ్వాసం ఉంటుంది. జయంతి బురడ, రాణిమా దాస్, మలీషా ఖర్వాలకు ఘనమైన కుటుంబ నేపథ్యం లేదు. ‘జీరో’ నుంచి ప్రయాణం ప్రారంభించిన వీరు తమను తాము తీర్చిదిద్దుకుంటూ ‘హీరో’లుగా పేరు తెచ్చుకున్నారు. ఫోర్బ్స్ ఇండియా టాప్ సెల్ఫ్–మేడ్ ఉమెన్ 2024 (డబ్ల్యూ–పవర్ లీస్ట్)లో చోటు సాధించారు... గిరిజన గొంతుక గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసురావడానికి జర్నలిస్ట్ కావాలనుకుంది అడవి బిడ్డ జయంతి బురుడ. అయితే ఇంట్లో మాత్రం ‘చదివింది చాలు’ అనే మాట ఎప్పడూ వినిపించేది. దీంతో ఇంటిని విడిచిపెట్టి స్నేహితుల సహాయంతో ఒడిషా సెంట్రల్ యూనివర్శిటీలో జర్నలిజంలో డిగ్రీ చేసింది. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలోని సెర్పల్లి ఆమె స్వగ్రామం. 2015లో భువనేశ్వర్‌లోని కళింగ టీవీ న్యూస్ చానల్ రిపోర్టర్‌గా చేరిన జయంతి బురుడ జర్నలిస్ట్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. తన రిపోర్టింగ్ టూర్లలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, మౌలిక సదుపాయాల లేమిపై దృష్టి పెట్టడమే కాదు వాటి పరిష్కారానికి కూడా కృషి చేసింది. ఆడపిల్లల చదువు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 2018లో ‘బడా దీదీ యూనియన్’ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టింది. ‘బడా దీదీ యూనియన్’ ద్వారా గిరిజన మహిళల కోసం ఎన్నో అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించింది. తమను వేధిస్తున్న సమస్యలపై గిరిజన మహిళలు ధైర్యంగా గొంతు విప్పలేకపోవడాన్ని జయంతి గ్రహించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, ధైర్యంగా గొంతు విప్పడానికి 2022లో ‘జంగిల్ రాణి’ పేరుతో వేదిక ప్రారంభించింది. ‘మన కథ– మన కోసం’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇది. మల్కన్‌గిరిలోని ఏడు బ్లాక్‌లకు చెందిన యాభై మంది గిరిజన మహిళలు ఈ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్నారు. స్క్రిప్ట్‌లు రాయడం, వీడియోలు చిత్రీకరించడం, ఎడిటింగ్....మొదలైవాటిని వీరికి నేర్పించింది బురుడ. సంస్కృతి నుంచి తాము ఎదుర్కోంటున్న సమస్యల వరకు చేతిలోని సెల్‌ఫోన్‌తో వీడియో స్టోరీలు చేస్తున్నారు గిరిజన మహిళలు. ఈ స్టోరీలను ‘జంగిల్ రాణి’ ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేస్తారు. గిరిజన సమాజానికి, అడవులు, జీవనవైవిధ్యానికి ఉన్న సంబంధానికి అద్దం పట్టే సహజ కథనాలు ఇవి. ఎంతోమంది సాధారణ మహిళలలో అసాధారణ ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ఎంతో కృషి చేసింది జయంతి బురుడ. ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్ ‘ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్’గా పేరు సంపాదించిన మలీషా ఖర్వా ఫోర్బ్స్ ఇండియా ఉమెన్–పవర్ 2024 జాబితాలో చోటు సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్మన్తో కలిసి నటించిన తరువాత మలీషా జీవితం మారిపోయింది. ముంబైలోని ధారవి మురికివాడలో ఒక గుడిసెలో నివసిస్తున్న మలీషా రాబర్ట్ హాఫ్మన్ దృష్టిలో పడింది. ఆ అమ్మాయిలోని వెలుగేదో రాబర్ట్‌ను ఆకట్టుకుంది. ‘ఈ మట్టిలో మాణిక్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి’ అనుకున్నాడు. మోడల్, డ్యాన్సర్ కావాలన్న మలీషా కలను సాకారం చేసేందుకు తన వంతు సాయం అందించాడు. మలీషాకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో 4,50,000 మంది ఫాలోవర్లు, 88,700 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన మలీషా లగ్జరీ ఇండియన్ కాస్మోటిక్స్ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. పదహారు సంవత్సరాల మలీషా ఖర్వా మోడల్, కంటెట్ క్రియేటర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ‘కల నిజం చేసుకోవడానికి పేదరికం ఎంతమాత్రం అడ్డు కాదు’ అని నిరూపించిన మలీషా ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అంగన్వాడీ అక్క దేశంలోని 23 లక్షల అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ప్రతినిధిగా రాణిమా దాస్‌ను ఫోర్బ్స్ ఇండియా ‘ఉమెన్ పవర్ లిస్ట్ 2024’లో చోటు కోసం ఆల్ ఇండియా అంగన్ వాడీ వర్కర్ ఫెడరేషన్ నామినేట్ చేసింది. అస్సాంలో పరఖోవా గ్రామానికి చెందిన రాణిమా దాస్ ఎవరికి ఏ సమస్య వచ్చినా ‘నేను ఉన్నాను’ అంటూ ముందుకు వచ్చేది. సమస్యల పరిష్కారంతో పాటు మహిళలకు ఆరోగ్యానికి సంబంధించిన నలహాలు ఇవ్వడంలో మంచి పేరు తెచ్చుకుంది. అంకితభావం, నిబద్ధతతో వ్యవహరించే రాణిమాను ‘అక్కా’ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. గత పదిహేడేళ్లుగా పిల్లలను బడిలో చేర్పించడం, గర్భిణి స్త్రీలకు సూచనలు...మొదలైన ఎన్నో విషయాల్లో కృషి చేస్తోంది రాణిమా దాస్. సలహాలు, సహాయం విషయంలో ముందు ఉన్నట్లే పోరాట విషయంలో ముందుంటుంది. అస్సాం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెండ్ అయిన రాణిమా దాస్ అంగన్వాడీ వర్కర్ల వేతన పెంపుదల కోసం పోరాటం చేసింది. అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎప్పుడూ పోరాడతాం’ అంటున్న రాణిమా దాస్‌కు పోరాటం కొత్త కాదు. -
Infosys Sudha Murty: రాజ్య సుధ
సాటి మనుషుల కోసం పని చేయడం సామాజిక సేవ ద్వారా పరిస్థితులను మెరుగుపరచడం యువతకు స్ఫూర్తిగా నిలవడం.. రచయితగా ఎదగడం ఇన్ఫోసిస్ దిగ్గజంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం సుధామూర్తిని నేడు రాజ్యసభకు చేర్చాయి. ఉమెన్స్ డే రోజు ఆమెను రాష్ట్రపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి జీవన విశేషాలు. ► తొలి పాఠాలు సుధామూర్తి బాల్యం హుబ్లీలో గడిచింది. తండ్రి కులకర్ణి డాక్టర్. ఆయన రోజూ టీ సేవించేవాడు. ఒకరోజు పాలు రాలేదు. తండ్రి టీ తాగక వేరే ఏ పనీ మొదలుపెట్టలేక కూచుని ఉన్నాడు. ‘ఏంటి నాన్నా?’ అని అడిగింది సుధామూర్తి. ‘ఉదయాన్నే టీకి నేను అలవాటు పడ్డానమ్మా. ఇవాళ టీ తాగక తలనొప్పి వచ్చింది. నువ్వు మాత్రం దేనికీ అతిగా అలవాటు పడకు.. కాఫీ, టీలకైనా సరే’ అన్నాడు. సుధామూర్తి ఆ పాఠాన్ని గుర్తు పెట్టుకుంది. ఇవాళ ఆమెకు డెబ్బై నాలుగు ఏళ్లు. నేటికీ ఉదయాన్నే లేచి టీగానీ కాఫీ గాని తాగి ఎరగదు. సుధామూర్తి హుబ్లీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే షిగావ్‌లో పుట్టింది. అక్కడ ఆమె అమ్మమ్మ, తాతయ్య ఉండేవారు. తాతయ్య స్కూల్ టీచర్. ఆయన తనకంటే వయసులో ఎంత చిన్నవారినైనా ‘మీరు’ అని బహువచనం వాడేవారు. ‘నీ కంటే చిన్న కదా తాతయ్య’ అని సుధామూర్తి అంటే ‘లోపలి ఆత్మ పెద్దదే కదమ్మా’ అనేవారు. ఎదుటివారిని గౌరవించడం అలా నేర్చుకుందామె. తాతయ్య ఆమెకు మూడు జీవన పాఠాలు నేర్పారు. 1.సింపుల్‌గా జీవించు 2.జ్ఞానాన్ని సముపార్జిస్తూనే ఉండు 3. పుస్తకాలు చదువు. ఇవి సుధామూర్తి నేటికీ పాటిస్తూనే ఉంది. అమ్మమ్మ ‘ఆకలితో ఉన్నవారిని గమనించు’ అని చెప్పింది. వాళ్ల ఇంటికి రోజూ ఒక భిక్షకుడు వస్తే ఇంట్లో మంచి బియ్యం నిండుకుని ముతకబియ్యం ఉన్నా అమ్మమ్మ మంచి బియ్యమే భిక్షకుడికి వేసేది. ‘ముతక బియ్యం మనం తినొచ్చులే’ అనేది. ఇదీ సుధామూర్తికి తొలి పాఠమే. ఇక అమ్మ విమల నేర్పిన పాఠం– ‘ఎంతో అవసరమైతే తప్ప డబ్బు ఖర్చు పెట్టకు’ అని. అంతే కాదు నీకు బాల్యంలో మంచి అలవాట్లు ఉంటే అవే కాపాడతాయి అని కూడా ఆమె అనేది. ఉదయాన్నే లేచి కాగితం మీద 10 సార్లు ‘దేవుడికి నమస్కారం’ అని రాయించేదామె. నేటికీ సుధా మూర్తి ఆ అలవాటును మానలేదు. ఇక స్కూల్ టీచరు రాఘవేంద్రయ్య... ‘నీకు లెక్కలు భలే వస్తున్నాయి. లెక్కల్ని వదలకు. పైకొస్తావ్‘ అన్నాడు. ఆమె ఆనాటి నుంచి లెక్కల్నే రెక్కలుగా చేసుకుంది. ► కుతూహలమే గురువు చిన్నప్పుడు సుధామూర్తికి ప్రతిదీ కుతూహలమే. వీధుల్లో కొట్లాటలు అవుతుంటే అక్కడకు పరిగెత్తి వెళ్లి నిలబడేది. వినోదం కోసం కాదు. కారణం ఏమై ఉంటుందా అని. చిన్న ఊళ్లో ప్రతి ఇల్లూ అందరికీ పరిచయమే. అందరి జీవితాలనూ ఆమె పరిశీలిస్తూ ఉండేది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగితే ఆమె తప్పని సరిగా ఒక స్టీలు క్యారేజీ తీసుకుని బయలుదేరేది. విందులో ఏ పదార్థాలు బాగున్నాయో ఏ పదార్థాలు బాగలేవో మొత్తం రుచి చూసి వస్తూ వస్తూ బాగున్న వాటిని క్యారేజీలో అడిగి తెచ్చుకునేది. కాలేజీ రోజుల వరకూ కూడా పెళ్ళిళ్లకు క్యారేజీ తీసుకోకుండా సుధామూర్తి వెళ్లేది కాదు. ‘ఎందుకో నాకు గిన్నెల క్యారేజీ అంటే నేటికీ ఇష్టం’ అంటుందామె. ► మసాలా దోసె పార్టీ లెక్కలు బాగా నేర్చుకున్న సుధా హుబ్లీలోని బి.వి.బి. కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో చేరింది. ఇక ఆ రోజు నుంచి ఊళ్లోని పెద్ద మనుషులంతా ఆమె తండ్రి దగ్గరకు వచ్చి వాపోవడమే. ‘అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తున్నావ్. పెళ్లెవరు చేసుకుంటారు’ అని బెంగపడటమే. తండ్రి కూడా ఒక దశలో తప్పు చేశానా అనుకున్నాడు. కాని సుధామూర్తి మొదటి సంవత్సరానికి ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. తండ్రికి సంతోషం కలిగింది. ‘ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నావ్ కదా... పద మసాలా దోసె పార్టీ చేసుకుందాం’ అని తీసుకెళ్లాడు. ప్రతి సంవత్సరం ఆమె ఫస్ట్‌క్లాస్ తెచ్చుకోవడం.. తండ్రి తీసుకెళ్లి మసాలా దోసె తినిపించడం. ఆ తండ్రీ కూతుళ్ల జీవితంలో పార్టీ చేసుకోవడం అంటే అదే. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ‘కాని ఆ పార్టీ ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అపురూపం అనిపించేది’ అంటుందామె. ► చరిత్ర మార్చిన కార్డు ముక్క 1974లో టాటా వారి ‘టెల్కో’ సంస్థలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు పడ్డాయి. పేపర్లో ఆ యాడ్ చూసింది సుధామూర్తి. అర్హతలు అన్నీ ఆమెకు ఉన్నాయి. కాని యాడ్ కింద ‘స్త్రీలు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఉంది. అప్పుడు సుధామూర్తికి ఆగ్రహం వచ్చింది. రోషం కలిగింది. జె.ఆర్.డి.టాటాకు ఒక కార్డు గీకి పడేసింది. ‘దేశంలో ఉన్న ఇంతమంది స్త్రీలకు పని చేసే హక్కు లేకపోతే వారు ఎలా అభివృద్ధిలోకి వస్తారు?’ అని ప్రశ్న. ఆ కార్డు జె.ఆర్.డి. టాటాకు చేరింది. ఆ వెంటనే ఆమెకు ఇంటర్వ్యూకు పిలుపు, ఆపై ఉద్యోగం వచ్చాయి. పూణెలో సుధామూర్తి తొలి ఉద్యోగం చేసింది. ఆమె రాసిన లేఖను టాటా సంస్థ నేటికీ భద్రపరిచి ఉంచింది. 1974లో టెల్కోలో సుధామూర్తి ఒక్కతే మహిళా ఉద్యోగి. దాదాపు 50 ఏళ్ల తర్వాత సుధామూర్తి పూణెలో ఆ సంస్థను సందర్శిస్తే (ఇప్పుడు టాటా మోటార్స్) 900 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ‘నేను అక్కడ నిలబడి మా తండ్రిని తలుచుకుని ఉద్వేగంతో కన్నీరు కార్చాను. ఎవరు భయపెట్టినా నన్ను ఆయన చదివించాడు. నా వల్ల ఇవాళ ఇంతమంది మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు అని’ అందామె. ► జీవితం అంతులేని పోరాటం ‘జీవితం అంటే అంతులేని పోరాటం. ఎవరికీ ఏ వయసులో ఉన్నా కన్సెషన్ ఉండదు. పోరాటం చేయాలి. ఓడిపోయినా పోరాట అనుభవం మిగులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. క్షమిస్తే మంచిది. మర్చిపోతే ఇంకా మేలు. కాని ముందుకు సాగడమే అన్నింటికన్నా ఉత్తమమైనది. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని మెరిపిస్తాయి. ప్యాషన్‌తో పని చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. ఒక మనిషిని పైకి తెచ్చేది డబ్బు కాదు ప్యాషన్. నమ్మిన పనిని విలువలతో ఆచరిస్తే ఎవరైనా పైకి రావాల్సిందే’ అంటుందామె. ► రాజ్యసభ సభ్యురాలు ‘ఇది ఊహించలేదు. రాష్ట్రపతి నన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీని గురించి నేను కూచుని ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. ఏం చేయగలనో అంతా చేయాలి. ఇప్పుడు నేను భారత ప్రభుత్వ సేవకురాలిని’ అని కొత్త బాధ్యతకు సిద్ధమవుతోంది సుధామూర్తి. ఇల్లాలే శక్తి నారాయణ మూర్తితో వివాహం అయ్యాక ఇన్ఫోసిస్ సంస్థను ఆయన స్థాపించాలనుకున్నప్పుడు 10 వేల రూపాయలు పెట్టుబడి తనే ఇచ్చింది సుధామూర్తి. అయితే ఆమెను ఇన్ఫోసిస్‌కు బయటి వ్యక్తిగానే ఉండటం మంచిదని సూచించాడు నారాయణమూర్తి. ఆమె కొంచెం బాధపడింది. ఎప్పటికైనా ఇన్ఫోసిస్ సంస్థలో చేరతాననే భావించింది. అదే సమయంలో చాలా కాలం పాటు పిల్లల కోసం గృహిణిగా ఉండిపోయింది. ‘సంవత్సరంలో 200 రోజులు ప్రయాణాల్లో ఉండేవాడు నారాయణమూర్తి. ఆ రోజుల్లో ఫోన్ లేదు. కారు లేదు. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక్కదాన్నే వెళ్లాలి. సంస్థ ఆర్థిక కష్టాలు.. ఇంటి కష్టాలు.. అన్నీ తట్టుకుని నారాయణమూర్తికి వెన్నుదన్ను అందించాను. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్మన్ అయ్యాను. ఆ ఫౌండేషన్‌తో వేలాది మంది జీవితాల్లో వెలుగు తెచ్చే వీలు నాకు కలిగింది. ఈ సంతృప్తి ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా పని చేసి ఉంటే నాకు దక్కేది కాదు’ అంటుందామె. -
మరిచిపోలేని క్షణాలు.. సచిన్ ఎమోషనల్ పోస్ట్! ఎవరీ జసింత?
International Women’s Day: గత కొన్నేళ్లుగా క్రీడా రంగంలో మహిళల ప్రాతినిథ్యం పెరగడం హర్షణీయమని టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ అన్నాడు. వారికి మరింత ప్రోత్సాహం అందిస్తే క్రీడలకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ రాణించగలరని పేర్కొన్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తన కెరీర్‌లోని ప్రత్యేక క్షణాలను పంచుకుంటూ సచిన్ టెండుల్కర్ ఈ మేరకు ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశాడు. ‘‘గడిచిన కొన్నేళ్లలో భారత్, ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో స్త్రీల ప్రాతినిథ్యం పెరుగుతోంది. 2008లో.. 26/11 (ముంబై పేలుళ్ల) ఘటన తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. జాతి మొత్తానికి అదో భావోద్వేగపూరిత సందర్భం. ఆ సమయంలో గ్రౌండ్ స్టాఫ్ మెంబర్స్‌లో ఒకరైన మహిళ నా దగ్గరకు వచ్చి అందరి తరపునా శుభాకాంక్షలు తెలిపి.. తన ఆనందాన్ని పంచుకున్నారు. నా జీవితంలో అదొక మరుపురాని అనుభూతి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 2024లో.. జసింత కళ్యాణ్ ఇండియాలో మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటర్‌గా అవతరించారు. ఆమె ఒక అడుగు ముందుకు వేశారు. భవిష్యత్తులో మరింత మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అడ్డంకులు అధిగమించి.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఇలాంటి రోల్ మోడల్స్‌ను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ప్రశంసించుకుందాం’’ అని సచిన్ టెండుల్కర్ వుమెన్స్ డే విషెస్ తెలియజేశాడు. ఎవరీ జసింత కళ్యాణ్? కర్ణాటకకు చెందిన జసింత బెంగళూరులోని హరొబెల్ అనే గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి రైతు. ఇక చిన్నతనం నుంచే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడ్డ జసింత.. ఉపాధి కోసం బెంగళూరులో అడుగుపెట్టారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరి.. అనంతరం అడ్మినిస్ట్రేటర్‌గా విధులు నిర్వర్తించే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆట కంటే పిచ్‌పైనే ఎక్కువగా దృష్టి సారించిన జిసింత అభిరుచిని గమనించిన అసోసియేషన్ కార్యదర్శి బ్రిజేష్.. స్టేడియంలో పనిచేసే మాలీలపై బాస్‌గా బాధ్యతలు అప్పగించాడు. ఈ క్రమంలో పిచ్ క్యూరేటర్ ప్రశాంత్‌రావు జసింత ఆసక్తిని గమనించి పిచ్ తయారీలో మెళకువలు నేర్పాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి అనుభవం గడించిన జసింత.. భారత దేశంలోనే మొదటి మహిళా క్యూరేటర్‌గా పేరు తెచ్చుకున్నారు. మహిళా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బెంగళూరు పిచ్‌ల తయారీని ఆమె పర్యవేక్షిస్తున్నారు. Over the years, the rise of women in sport, in India and across the world, has been very encouraging. In 2008, in the aftermath of 26/11, India won the match against England, and it was an emotional moment for the entire nation. One of the first people with whom I was able to… pic.twitter.com/lw0lbRT5hy — Sachin Tendulkar (@sachin_rt) March 8, 2024 -
సృష్టికి మూలం.. సీఎం జగన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
గుంటూరు, సాక్షి: జగనన్న సంకల్పంతో.. మహిళా రాజకీయ సాధికారతలో దేశంలో నెంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. రాజకీయ, పాలనా పదవుల్లో మహిళలకు అగ్రతాంబూలం లభించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సృష్టికి మూలం మహిళలు. అలాంటి అక్కచెల్లెమ్మలకు మన ప్రభుత్వంలో అత్యున్నత పదవులు కల్పించాం, సంక్షేమ పథకాల్లోనూ ఎక్కువ శాతం వారినే లబ్ధిదారులను చేశాం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. సృష్టికి మూలం మహిళలు. అలాంటి అక్కచెల్లెమ్మలకు మన ప్రభుత్వంలో అత్యున్నత పదవులు కల్పించాం, సంక్షేమ పథకాల్లోనూ ఎక్కువ శాతం వారినే లబ్ధిదారులను చేశాం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నా హృద… pic.twitter.com/u8SkR9hoP7 — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024 -
మహిళా దినోత్సవం: ఈ సవాళ్లపై దృష్టిసారించమంటున్న యూఎన్!
ప్రతి ఏడాది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవా(మార్చి 8)న్ని ఘనంగా జరుపుకోవడానికి ప్రపంచమంతా కలిసి ఒక్కతాటిపైకి రావడం విశేషం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేస్తున్న అద్భుతమైన పనులను గుర్తించే చర్చించే రోజు. సామాజిక న్యాయయోధుల నుంచి శాస్త్రవేత్తలు, కళాకారులు, రాజకీయ నాయకులు వరకు మహిళలు ప్రతి రంగంలో శరవేగంగా దూసుకుపోతున్నారు. ఈ రోజు గతం గురించి మాట్లాడటం కంటే భవిష్యత్తు వైపుకే దృష్టిసారించాలి. ఎందుకంటే? స్త్రీలు కొన్ని విషయాల్లో సవాళ్లు ఎదుర్కుంటూనే ఉన్నారు. ఎంతలా స్త్రీలు ఉద్యోగాల్లో రాణిస్తున్నా పురుషులతో సమానంగా జీతాన్ని మాత్రం పొందలేకపోతున్నారు. అలాగే మంచి విద్యను అందుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి "మహిళల కోసం పెట్టుబడి పెట్టండి: పురోగతిని వేగవంతం చేయండి" అని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తోంది. మహిళలకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రపంచం ఆమోదయోగ్యమైనదిగా అనిపిస్తుంది. సమిష్టిగా పని చేయాల్సిన ఐదు కీలక విభాగాలు.. లింగ సమానత్వం అనేది గొప్ప మానవ హక్కుల సమస్యగా ఉంది. అందువల్ల మహిళల కోసం పెట్టుబడులు పెట్టండి అని పిలుపునిస్తోంది ఐక్యరాజ్యసమితి. దీన అర్థ స్త్రీ పురుష లింగ సమానత్వం కోసం పెట్టుబడులు పెట్టమని ఘంటా పథంగా చెబుతోంది. పేదరికాన్ని అంతం చేయడం!: కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు 75 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో పడిపోయారు. అందువల్ల 2030 నాటికి సుమారు 342 మిలియన్లకు పైగా మహిళలు, బాలికలు పేదరికంలో పడకుండా నిరోధించేలా తక్షణ చర్య తీసుకోవడం కీలకం. లింగ సమానంగా ఫైనాన్సింగ్ అమలు చేయడం: పెరుగుతున్న ధరల కారణంగా 2025 నాటికి దేశాలు ప్రజలపై ఖర్చు చేయడం 75% మేర తగ్గించొచ్చు. ఆ ప్రభావం మహిళలు వారి అవసరమైన సేవలపై ప్రతికూల ప్రభావం ఏర్పడవచ్చు హరిత ఆర్థిక వ్యవస్థగా, సురక్షిత సమాజంగా మార్చడం!: ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మహిళలను అసమానంగా ఉంది. ముఖ్యంగా న్యాయవాద మహిళల గొంతులు విస్తరించేలా గ్రీన్ ఎకనామీగా సురక్షిత సమాజంగా మారాలని ప్రతిపాదించారు ఫెమినిస్ట్ మార్పు మేకర్లకు మద్దతు ఇవ్వడం: ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్త్రీవాద సంస్థలు అధికారిక అభివృద్ధి సహాయంలో 0.13% మాత్రమే పొందుతున్నాయి. (చదవండి: ఇల్లాలిగా, బిజినెస్ విమెన్‌గా సరిలేరామెకు! దటీజ్ నీతా!) -
ప్రజాపాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. మహిళల సాధికారితతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలి. మహిళల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ద్వారా త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. మహిళలకు అండగా ఉండేలా తమ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తుందన్నారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం తప్పకుండా దేశమందరి దృష్టిని ఆకర్షిస్తుందనే నమ్మకం ఉందని సీఎం అన్నారు. ఇదీ చదవండి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి? -
వనిత ప్రగతి పరుగు?!
"ఆడాళ్ళు మీకు జోహార్లు .. ఓపిక,ఒద్దిక మీ పేర్లు- మీరు ఒకరి కంటే ఒకరు గొప్పోళ్ళు.." - ఆచార్య ఆత్రేయ. అది అక్షరాలా నిజం. 'క్షమయా ధరిత్రి' అన్న ఆర్యోక్తికి మరోరూపం ఇచ్చారు ఆచార్యులవారు. ప్రతి రంగంలోనూ ఒకరిని మించి మరొకరు దూసుకెళ్తునే ఉన్నారు. ముళ్ళపూడి వెంకటరమణ ఇలా చమత్కరించారు. "ఆడవాళ్లు - మగవాళ్లు ఇద్దరూ సమానమే,కాకపోతే మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం". ముళ్ళపూడివారి మాటలు కూడా నిజాన్ని ప్రతిబింబించేవే. 'ఆకాశంలో సగం' అనే మాట వినడానికి అందంగానే ఉంటుంది కానీ, ఆచరణలో అన్నింటా ఆడవాళ్లకు సగభాగం దొరుకుతోందన్నది అర్ధసత్యం. ఇప్పటికీ ప్రపంచంలో స్త్రీ ఎక్కువ గౌరవాలు పొందుతున్నది మన భరతభూమిలో అన్నది కాదనలేని నిజం. కొంత ఛాందసాలు, చాదస్తాలు రాజ్యమేలుతున్నా, మన వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలు మనల్ని మిగిలినవారి కంటే భిన్నంగా నిలుపుతున్నాయి. బంధాలు, బాంధవ్యాల వీచికలు ఇంకా వీస్తూనే ఉన్నాయి. ప్రతి మార్చి 8వ తేదీ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకోవడంతోనే సరిపోదు. నిజమైన పండుగ వారి గుండె గుడిలో నిండుగ ఉదయించాలి. ఈ వేడుకను ఒకొక్క దేశంలో ఒకొక్క రకంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం కాకమునుపే అమ్మను అమ్మవారుగా నిత్యం కొలిచే ఆచారం మనకు వేళ్లూనుకొని వుంది.అదే సమయంలో కష్టాలు,కన్నీళ్లు,బానిసత్వం, అణగదొక్కే విధానం,ఆచారాల పేరిట అసమానతలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆధునిక సమాజంలోనూ ఆటవిక పోకళ్ళు వదలడం లేదు.'నిర్భయ' చట్టాల వంటివి ఎన్ని వచ్చినా,ఆడపిల్లలు నిర్భయంగా తిరిగే రోజులు ఇంకా రాలేదు. అక్షరాస్యత పెరుగుతున్నా,అరాచకాలు ఆగడంలేదు.ఉద్యోగిత పెరుగుతున్నా సమానత ఇంకా సాధ్యమవ్వలేదు. ఓటు హక్కు వచ్చినా,చట్ట సభల్లో మహిళలు ఇంకా ఆమడ దూరంగానే ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించినా, ఆచరణకు ఏళ్ళుపూళ్ళు పట్టేలా వుంది. శాసనాలు చేసే అధికారం రావాలంటే ఇంకా చాన్నాళ్ళు ఆగాల్సిందే.అప్పటిదాకా శాసించే శక్తి మగవాళ్ల దగ్గరే వుంటుంది. ప్రజాస్వామ్యం,రాజ్యాంగం అందించిన అవకాశాలతో మహిళామణులు రాష్ట్రపతి , స్పీకర్ వంటి అత్యున్నత పదవులను అందుకున్నా, అది సరిపోదు.సమత, సమతుల్యత ఇంకా సాధించాల్సి వుంది. ఇంకొక వైపు వరకట్నపు చావులు, అత్తారింటి వేదింపులు ఆగకుండా సాగుతూనే ఉన్నాయి. 'స్త్రీలకు స్త్రీలే శత్రువులు' అన్నది ఇంకా వీడడం లేదు. లింగవివక్ష నుంచి పూర్తిగా బయటపడే తరుణం కోసం తరుణులంతా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆర్ధిక స్వేచ్ఛ,సమానత్వం కోసం ఎదురుతెన్నులు కాస్తూనే ఉన్నారు.కార్మిక సంఘాలు ఏర్పడినా,చట్టాలు వచ్చినా మహిళా కార్మికులు,కర్షకుల వేతనాల చెల్లింపుల్లో అన్యాయం జరుగుతూనే ఉంది.1991లో భారతదేశం సరళీకరణ ఆర్ధిక విధానాల వల్ల ప్రైవేట్ రంగం ఎంతో బలపడింది.ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి కానీ, ఎంపిక ప్రక్రియలో అసమానత అలాగే ఉంది.సాఫ్ట్ వేర్ రంగం మాత్రం కాస్త నయం.అమ్మాయిలను తరలించే (విమెన్ ట్రాఫికింగ్) విషవ్యాపారం,బాలికలపై అత్యాచారాలు యదేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. గ్రామీణ మహిళా సాధికారత ఎంతో పెరగాల్సి ఉంది. పేదరిక విముక్తి, ఆకలి నిర్మూలనకు ముగింపు వాక్యాలు పలకాల్సి ఉంది. 'పని సంస్కృతి' (వర్క్ కల్చర్ ) మారుతున్న క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులకు తగినట్లుగా సౌకర్యాలు పెరగాలి. 100 సంవత్సరాల పై నుంచీ 100 దేశాలకు పైగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదాన్ని వినిపిస్తున్నారు. అవి నినాదాల దశ దాటి ఆచరణ దశకు చేరుకోవడం లేదు. కొంత అభివృద్ధి, ప్రగతి చోటుచేసుకున్నప్పటికీ సమగ్రత,సంపూర్ణత సాధించాల్సి ఉంది. 'లింగ సమానత్వం సాధించడం' 2022 సంవత్సరంలో ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ డిజిటల్ యుగంలో, 'నవీనత్వం - సాంకేతికతలో లింగ వివక్షలేని సమానత్వం' 2023 ఎజెండాగా కల్పన చేసుకున్నారు. ' ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ - యాక్సలరేట్ ప్రోగ్రెస్ '- 2024 ఎజెండాగా పెట్టుకున్నారు. మహిళా సాధికారితను సాధించడానికి ఇంకెన్నాళ్లు పోరాడాలి? అనుకున్నది జరగాలి, ఈ పోరాటం ఆగాలి అన్నది మహిళాలోకం కోరుకుంటున్నది. మహిళా ప్రగతి వేగం పెరగాలని ఈ ఏటి ప్రధాన ఎజెండా. వినడానికి ఎజెండాలు ఎప్పుడూ బాగానే వుంటాయి. ఆచరణలో ఎక్కడ? అనే ప్రశ్నలు ఉదయించడం మానడంలేదు. మరోపక్క...స్త్రీలు అబల దశ నుంచి సబల దశకు చేరుకుంటూనే ఉన్నారు.అనేక రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. కొన్ని రంగాల్లో మించి పోతున్నారు. ఇది పూర్తిగా మహిళామణుల స్వయంకృషి,పట్టుదల, దీక్షాదక్షతలు మాత్రమే. అందివచ్చిన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్నారు. సవాళ్లు, దాడులు ఎదుర్కొని నిలుస్తున్నారు.కాకపోతే, సమానత్వంలో సమగ్రత సాధించాలి. మహిళాలోకం వెలగాలి, వెలుగులు పంచాలి (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మా శర్మ స్పెషల్ స్టోరీ..) - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
మహిళలు తీసుకోవాల్సిన పాలసీలు
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో నారీమణులు క్రమంగా అన్ని విభాగాల్లో రాణిస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం ముందుకు సాగుతున్నారు. దాంతో వారు తమ వ్యక్తిగత వృద్ధితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావాన్ని చూపుతున్నారు. దేశపురోభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తున్న మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి ఆసుపత్రిపాలైతే ఆర్థికంగా చితికిపోకుండా బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు తమ ఆర్థిక రక్షణ కోసం కొన్ని రకాల సాధారణ బీమా పాలసీలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అందులో ప్రధానంగా.. ఆరోగ్య బీమా ఇంట్లో మహిళలతోపాటు కుటుంబం అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. కొన్ని బీమా పాలసీలు ప్రసూతి ఖర్చులను చెల్లిస్తాయి. కొత్తగా వివాహం అయిన వారు ఇలాంటి పాలసీలను పరిశీలించాలి. డెలివరీకి 90 రోజుల ముందు నుంచీ, డెలివరీ అయిన 90 రోజుల వరకూ ఏదైనా చికిత్స తీసుకుంటే ఆ ఖర్చులను పాలసీలు చెల్లిస్తాయి. తీవ్ర వ్యాధులకు.. కొన్ని జీవన శైలి, తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించేలా పాలసీలు తీసుకోవాలి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి మహిళలకు మాత్రమే వస్తాయి. ఇలాంటి వ్యాధులను గుర్తించినప్పుడు క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు ఒకేసారి 100 శాతం పాలసీ విలువను చెల్లిస్తాయి. అనారోగ్యం వల్ల ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో 3 నెలల జీతాన్ని అందించే ఏర్పాటూ ఇందులో ఉంటుంది. వాహన బీమా మెట్రోనగరాలతోపాటు ఇతర సిటీల్లో దాదాపు చాలామంది మహిళలు వాహనాలు నడుపుతున్నారు. అయితే చాలా మంది వాహన ఇన్సూరెన్స్ అయిపోయన తర్వాత రెన్యూవల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కచ్చితంగా వాహన బీమా ఉండేలా చూసుకోవాలి. కనీసం థర్డ్ పార్టీ బీమా పాలసీ లేకుండా వాహనాన్ని నడపకూడదు. ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’ టర్మ్ పాలసీ ఏ క్షణాన ఏ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ప్రమాదవశాత్తు మనకు ఏదైనా జరిగితే మన కుటుంబం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోకుండా టర్మ్ పాలసీ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీల ఆర్థికపరమైన అంశాలపై కొన్ని ఆసక్తికర సర్వేలు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా దేశంలోని మహిళా ఉద్యోగుల్లో అత్యధికులు ఆంత్రప్రెన్యూర్స్‌గా ఎదగాలని భావిస్తున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు ఆన్లైన్ మార్కెటీర్ ఇండియాలెండ్స్ చేపట్టిన ఈ సర్వేలో స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలతోపాటు ప్రథమ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోగల 24-55 ఏళ్లకు చెందిన 10వేలకుపైగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వే జరిగింది. వీరిలో ఏకంగా 76 శాతం మంది తమకు సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనే కోరిక ఉన్నట్టు చెప్పడం విశేషం. ఇక 86 శాతం మంది బడ్జెటింగ్, ఇన్వెస్టింగ్, సేవింగ్, ఇతర ఆర్థిక అంశాలపై నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఆసక్తిని వ్యక్తపరిచినట్లు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులపై డేటాను అందించే ఆన్లైన్ వేదిక ఇండియాలెండ్స్ తెలిపింది. పెరుగుతున్న రుణాలు.. గత ఏడాది మహిళలు తీసుకున్న రుణాల్లో 19 శాతం వృద్ధి కనిపించింది. 2023లో రూ.30.95 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు. 2022లో రూ.26 లక్షల కోట్లేనని ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కంపెనీ క్రిఫ్ హై మార్క్ తెలిపింది. ఇక అంతకుముందుతో పోల్చితే గతేడాది వ్యక్తిగత రుణాలు 26 శాతం పెరిగి రూ.12.76 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇదీ చదవండి: మహిళలకు బ్యాంక్ అదిరిపోయే ఆఫర్లు.. ప్రధాన స్థానాల్లో.. తాము ఎక్కువ రేటింగ్ ఇచ్చిన సంస్థల బోర్డుల్లో మహిళా డైరెక్టర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. 3,138 కంపెనీలకు బీఏఏ, ఆపై రేటింగ్‌నే ఇచ్చామని, వీటి బోర్డుల్లో సగటున 29 శాతం మహిళలే ఉన్నారని చెప్పింది. ఇదిలావుంటే ఫార్చూన్ ఇండియా 500 కంపెనీల్లో కేవలం 1.6 శాతం కంపెనీలకే మహిళలు నాయకత్వం వహిస్తున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఫార్చూన్ ఇండియా నెక్స్ 500 కంపెనీల్లో మహిళల సారథ్యంలో పనిచేస్తున్నవి 5 శాతంగా ఉన్నాయి. -
మహిళలకు బ్యాంక్ అదిరిపోయే ఆఫర్లు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పలు సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మహిళా ఖాతాదార్లకు ఆఫర్లు ప్రకటించింది. బీఓబీ మహిళా శక్తి సేవింగ్స్ ఖాతా లేదా బీఓబీ వుమెన్ పవర్ కరెంట్ ఖాతాలను జూన్ 30లోగా తెరిచి, డిసెంబరు 31 వరకు రుణం పొందేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ ఖాతాలు తెరిచిన మహిళలకు అందించే రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల (0.25%) వరకు వడ్డీ రాయితీ ఇవ్వనుంది. ఇదీ చదవండి: రూ.75కే సినిమాలు.. దేశంలోనే తొలి ఓటీటీ ప్రారంభించిన ప్రభుత్వం ద్విచక్ర వాహన రుణాలకైతే 0.25%, విద్యా రుణాలకైతే 0.15%, వాహన, గృహ, తనఖా రుణాలపై 0.1% వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు బీఓబీ ప్రకటించింది. రిటైల్ రుణాలపై (వ్యక్తిగత రుణాలతో సహా) ప్రాసెసింగ్ రుసుమును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వార్షిక సురక్షిత డిపాజిట్ లాకర్ ఛార్జీలపై 50% రాయితీ ఇవ్వనున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. -
మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినప్పుడు బీజేపీ ఎక్కడుంది?
కోల్‌కతా: ‘సందేశ్‌ఖాలీ’ తుపాను ధాటికి పశి్చమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని, నారీశక్తి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీని గద్దె దింపుతుందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీటైన జవాబిచ్చారు. రాష్ట్రంలో మహిళలకు తమ ప్రభుత్వం అండగా నిలబడిందని పునరుద్ఘాటించారు. దేశంలోనే మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రం తమదేనని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే గురువారం కోల్‌కతాలో ‘మహిళా హక్కులే మాకు ముఖ్యం’ పేరిట చేపట్టిన పాదయాత్రలో మమత ముందు నడిచారు. ఆమెను వందలాది మంది మహిళలు, పార్టీ కార్యకర్తలు అనుసరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బీజేపీపాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరిగిన అకృత్యాలపై మమత విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ సందేశ్‌ఖాలీపై బీజేపీ దేశానికి తప్పుడు సందేశాలు పంపుతోంది. బెంగాల్లో మహిళలకు రక్షణ లేదంటూ నిన్న ఇక్కడికొచ్చి లెక్చర్లు దంచేసిన మోదీ బీజేపీపాలిత రాష్ట్రాల్లో మహిళలు అకృత్యాలకు బలైనప్పుడు ఎందుకు మౌనం వహించారు?’’ అని నిలదీశారు. ‘‘మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినపుడు ఈ బీజేపీ ఏం చేసింది?. ఉత్తరప్రదేశ్ హథ్రాస్‌లో అత్యాచారం చేసి మృతదేహాన్ని బలవంతంగా తగలబెడితే బీజేపీ సర్కార్ ఏం చేసింది?. గుజరాత్లో సర్వం కోల్పోయిన బిల్కిస్ బానోకు దక్కిన న్యాయమెంత?’’ అని ప్రశ్నించారు. ‘నిజానికి దేశంలో మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రం బెంగాల్’ అని ప్రకటించారు. ఎక్కడ పోటీచేసినా ఓడిస్తాం గురువారం బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్‌నూ మమత విమర్శించారు. ‘‘ తన తీర్పుల ద్వారా బెంగాల్లో వేలాది మంది యువత నుంచి ఉద్యోగాలు లాక్కున్నారు. వారు మిమ్మల్ని క్షమించరు. మీ తీర్పుల విశ్వసనీయతపై ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసినా సరే మిమ్మల్ని ఓడించి తీరతాం’ అని అన్నారు. ‘‘ పింటూ బాబు(బీజేపీ) ఆగ్రహంతో ఊగిపోయినా సరే బెంగాల్లో మీ విభజన రాజకీయాలు నడవనివ్వను. బెంగాల్‌కు 450కిపైగా బృందాలను పంపిన పింటూ బాబు.. మహిళలను లైంగికంగా వేధించి నగ్నంగా ఊరేగించిన మణిపూర్‌కు ఒక్క బృందాన్ని కూడా పంపలేదు’ అని మమత గుర్తుచేశారు. ‘బీజేపీపాలిత యూపీలో మహిళలపై దారుణ అత్యాచారాలు జరుగుతున్నాయి. మణిపూర్‌లో మహిళలు రేప్‌కు గురై, అగి్నకి ఆహుతైన ఉదంతంలో అక్కడి బీజేపీ సర్కార్ సిగ్గుతో తలదించుకోవాలి’ అని మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ సందేశ్‌ఖాలీ ఘటనను తీవ్రంగా ఖండించాల్సిందే. టీఎంసీ కార్యకర్తలు బాధ్యుతులుగా తేలితే అరెస్ట్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడను’ అని ఆమె స్పష్టంచేశారు. పాదయాత్రలో సందేశ్‌ఖాలీ ప్రాంతానికి చెందిన 200కుపైగా మహిళలు పాల్గొన్నారు. -
గ్లామర్, డ్యాన్స్‌లకు మాత్రమే పరిమితం కాదని నిరూపించిన హీరోయిన్లు
డ్యాన్స్ మాత్రమే వచ్చా? అలా అంటారేంటీ.. ఫైట్స్ కూడా చేస్తారు. కాకపోతే ఆ ఒక్క చాన్స్ రావాలి. ఆ చాన్స్ వచ్చినప్పుడు హీరోయిన్లు యాక్షన్‌లోకి దిగుతారు. అలా కొందరు కథానాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు పెరిగాయి. ఈ మహిళా దినోత్సవానికి కథానాయికల పరంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక సినిమాలో సమస్యలపై పోరాడుతున్న హీరో‘యిన్ యాక్షన్’ గురించి తెలుసుకుందాం. యువతి పోరాటం ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’.. ఇలా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో అనుష్కా శెట్టి సూపర్ హిట్. తాజాగా ఆమె మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ సైన్ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దు లొకేషన్స్‌లో ఇటీవల షూటింగ్ జరి΄ారు. ఓ యువతి పోరాటంతో సాగే ఈ సినిమాకు ‘శీలవతి’ టైటిల్‌ను అనుకుంటున్నారట. సత్యభామ పోలీసాఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. ఓ అమ్మాయి హత్య కేసులో నిజమైన దోషులను పోలీస్ ఆఫీసర్ సత్యభామ ఏ విధంగా పట్టుకుంది? అనే అంశంతో ఈ సినిమా సాగుతుంది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే హిందీలో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ‘ఉమ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిటెక్టివ్ అను ఓ కొత్త చిత్రం కోసం చెన్నైలో డిటెక్టివ్ ఏజెన్సీ ఆరంభించనున్నారు శ్రుతీహాసన్. ఈ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శకుడు. ఇందులో డిటెక్టివ్ అను ΄ాత్రలో కనిపిస్తారు శ్రుతీహాసన్. ఈ సినిమాకు ‘ది చెన్నై స్టోరీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. తన నాన్న ఆచూకీ తెలుసుకోవాల్సిందిగా ఓ ఇంగ్లిష్ కుర్రాడు చెన్నైకి వచ్చి, డిటెక్టివ్ అనుని కలిశాక ఏం జరిగింది? అనే అంశం చుట్టూ ఈ సినిమా ఉంటుంది. అలాగే శ్రుతీహాసన్ నటించిన ఇంగ్లిష్ చిత్రం ‘ది ఐ’. చనిపోయిన భర్త అస్తికలను సముద్రంలో కలిపేందుకు మరో చోటుకు వెళ్లిన ఓ మహిళ ఎలాంటి నిజాలు తెలుసుకుంది? ఎవరెవర్ని హత్య చేయాలనుకుంటుంది? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. కాలేజ్ స్టూడెంట్ రష్మికా మందన్నా తొలిసారి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘చిలసౌ’ (2018)తో దర్శకుడిగా హిట్టైన నటుడు రాహుల్ రవీంద్రన్ ఇటీవల ‘ది గాళ్ ఫ్రెండ్’ కోసం మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక కాలేజ్ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఓ కాలేజ్ స్టూడెంట్ ప్రేమ, సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. రష్మిక నటిస్తున్న మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రెయిన్ బో’. ఈ సినిమాకు శాంతరూబన్ దర్శకుడు. ఓ మనిషి తన జీవితంలో ఎదుర్కొనే వివిధ దశల పరిస్థితులను ‘రెయిన్ బో’లో చెబుతున్నారట. హక్కుల కోసం పోరాటం ‘మహానటి’ (2018) సినిమాతో నటిగా తనలో ఎంత ప్రతిభ ఉందో నిరూపించుకున్నారు కీర్తీ సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ‘రఘు తాతా’, ‘రివాల్వర్ రీటా’, ‘కన్నె వెడి’ వంటి మూడు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఉన్నాయి. ‘రఘు తాతా’కు సుమన్‌కుమార్ దర్శకుడు. బలవంతంగా హిందీ భాష నేర్చుకోవాలన్నప్పుడు ఓ యువతి ఏ విధంగా పోరాటం చేసింది? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. అలాగే కీర్తి మరో ఫిల్మ్ ‘రివాల్వర్ రీటా’ కూడా పోరాటం నేపథ్యంలో సాగే సినిమాయే. ‘కన్నె వెడి’ సినిమాకు గణేశ్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హీరోయిన్గా ‘బేబీ జాన్’ చిత్రంతో హిందీకి పరిచయం అవుతున్నారు కీర్తి. గీతాంజలి మళ్లీ వచ్చింది తెలుగు హీరోయిన్ అంజలి నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గీతాంజలి’. 2014లో విడుదలైన ఈ హారర్ కామెడీ ఫిల్మ్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ వస్తోంది. అంజలి మెయిన్ లీడ్ రోల్ చేశారు. ఏప్రిల్ 11న విడుదల కానుంది. శివ తుర్ల΄ాటి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించిన ‘గీతాంజలి 2’ అంజలి కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఓ ఇంట్లో చోటు చేసుకునే హారర్ ఎలిమెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. రోడ్ ట్రిప్ హీరోయిన్లు అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత కలిసి రోడ్ ట్రిప్‌కు వెళ్లారు. వెకేషన్ కోసం కాదు.. సినిమా కోసమే. రోడ్ ట్రిప్ నేపథ్యంలో ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, దర్శన, సంగీత లీడ్ రోల్స్ చేస్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ వరుసగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు హన్సిక. గత ఏడాది హన్సిక మెయిన్ లీడ్ రోల్ చేసిన ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’, ‘105 మినిట్స్’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది మరో రెండు రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. తమిళ ‘గార్డియన్’ చిత్రం నేడు విడుదల అవుతోంది. కాగా హన్సిక సైన్ చేసిన ‘రౌడీ బేబి’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. జేఏమ్ రాజశరవణన్ ఈ మూవీకి దర్శకుడు. ఇవి కాకుండా హన్సిక చేతిలో మరో రెండో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలు ఉన్నాయి. ఇలా మరికొందరు హీరోయిన్లు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌కి సై అన్నారు. -
International Womens Day 2024: ప్రతి రంగంలో ప్రతిభ
వివిధ రంగాలలో విజయపథంలో దూసుకుపోతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళలు వినీతసింగ్ (కాస్మెటిక్స్) వినీతసింగ్కు తండ్రి తేజ్‌సింగ్ స్ఫూర్తిప్రదాత. ఆయన శాస్త్రవేత్త. ఏడాదిలో 365 రోజులూ పనిచేసేవాడు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో డిజిటల్–ఫస్ట్ కాస్మటిక్ బ్రాండ్ ‘సుగర్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది వినీత. ఐఐటీ–మద్రాస్, ఐఐఎం–అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వినీత ఒక ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో అధిక వేతనంతో కూడిన జాబ్ ఆఫర్‌ను వదులుకొని వ్యాపారరంగంలోకి అడుగు పెట్టింది. మొదటి స్టార్టప్ ‘క్వెట్జాల్’ ఘోరంగా విఫలమైంది. 2012లో మన దేశంలో ఇ–కామర్స్ ఊపందుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలకు ప్రతినెలా వివిధ రకాల బ్యూటీ ప్రాడక్ట్స్ తక్కువ ధరకు అందించే ‘ఫ్యాబ్ బ్యాగ్’ అనే సబ్స్క్రిప్షన్స్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ వ్యాపారం హిట్ అయింది. అయితే ఈ మేకప్ బ్రాండ్లు మన భారతీయ స్కిన్‌టోన్, జీవన విధానానికి అనుగుణంగా లేవని గ్రహించింది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని 2015లో కాస్మటిక్ ‘సుగర్’ను స్టార్ట్ చేసి తిరుగులేని విజయం సాధించింది. నేహా సతక్ (ఆస్ట్రోమ్ టెక్నాలజీ) టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసింది నేహా సతక్.‘ఆస్ట్రోమ్ టెక్నాలజీ’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన సత్తా చాటింది. ‘నన్ను నేను ఒక ఇన్నోవేటర్‌గా భావిస్తాను’ అంటుంది ‘ఆస్ట్రోమ్ టెక్నాలజీ’ కో–ఫౌండర్, సీయీవో నేహా సతక్. ‘ఇన్నోవేటివ్ హై– బ్యాండ్‌విడ్త్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి, ఇంటర్నెట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటు ధరలోక్లి తీసుకురావడానికి, మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలనే ఆలోచనలో ఆస్ట్రోమ్ టెక్నాలజీ మొదలు పెట్టాం. ఆస్ట్రోమ్ గిగామెష్ డివైజ్ చుట్టుపక్కల ఉన్న నాలుగు డివైజ్‌లను కనెక్ట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఒక పరికరాన్ని మాత్రమే కనెక్ట్ చేయగలదు’ అంటుంది నేహా సతక్. హర్దిక షా (ఫిన్‌టెక్) ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది హర్దిక షా. చిన్నపాటి వ్యాపారం నిర్వహించడానికి తల్లి పడే కష్టాలను దగ్గరి నుంచి చూసిన షా యూఎస్‌లో కంప్యూటర్ సైన్స్ చేసింది. కొలంబియా బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తయిన తరువాత టాప్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంది. మన దేశంలో చిన్న వ్యాపారాలు చేస్తున్నవారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిపుణులతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆ తరువాత బెంగళూరు కేంద్రంగా ‘కినార క్యాపిటల్’ అనే ఫిన్‌టెక్‌ను ప్రారంభించింది. ఈ ఫిన్టెక్కు ఆరు రాష్ట్రాల్లో 110 శాఖలు ఉన్నాయి. ‘గ్యారెంటీ లేని బిజినెస్. చాలా రిస్క్’ అన్నారు హర్థిక షా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు. అయితే ఆ మాటలేవీ ఆమెపై ప్రభావం చూపలేదు. తొలి అడుగుల్లోనే కస్టమర్లు, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని గెలుచుకుంది. ‘ఫిన్ టెక్’ ఫీల్డ్‌లో విజయకేతనం ఎగరేసింది. డా. ప్రియా అబ్రహం, వైరాలజిస్ట్ మన దేశంలోని ప్రసిద్ధ వైరాలజిస్ట్‌లలో డా. ప్రియా అబ్రహం ఒకరు. కేరళలోని కొట్టాయం జిల్లాలో పుట్టిన ప్రియ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు(సీఎంసీ)లో బయాలజీలో పీహెచ్డీ చేసింది. సీఎంసీ ‘క్లినికల్ వైరాలజీ సెక్షన్’ హెడ్‌గా పనిచేసింది. వైరల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన ఎన్నో కమిటీల్లో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీలో పనిచేసింది. నేషనల్ వైరల్ ఇన్ఫెక్షన్ సర్వైలెన్స్ రిసెర్చ్‌లో భాగం అయింది. కోవిడ్–19కి జస్ట్ రెండు నెలల ముందు పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ హెడ్‌గా బాధత్యలు చేపట్టింది. ‘ఆ టైమ్‌లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను’ అని కరోనా కాలాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ప్రియ. టెస్టింగ్ కిట్లను వివిధ టెస్టింగ్ ల్యాబ్‌లకు పంపే లాజిస్టిక్స్‌ను నిర్వహించడం నుంచి కొత్తగా పుడుతున్న వేరియెంట్లను నిశితంగా పరిశీలించడం వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో ప్రియ ఆమె బృందం ఎంతో కృషి చేసింది. లాజిస్టిక్స్ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా మన దేశంలో జరిగిన అన్ని వ్యాక్సిన్ ట్రయల్స్ పర్యవేక్షణలోనూ కీలక పాత్ర పోషించింది. ‘గుర్తింపు, విజయం రావాలని ఆశగా పరుగెత్తినంత మాత్రాన రావు. మనం చేసిన కృషిని బట్టి వెదుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి’ అంటుంది ప్రియా అబ్రహం. రిమ్జిమ్ అగర్వాల్ (న్యూరో–ఇన్ఫర్మేటిక్స్) లైనా ఇమాన్యుయేల్‌తో కలిసి న్యూరో–ఇన్ఫర్మేటిక్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రెయిన్‌సైట్’ను ప్రారంభించింది రిమ్జిమ్ అగర్వాల్. బ్రెయిన్‌సైట్ ఏఐ సాఫ్ట్వేర్ మెంటల్ హెల్త్ ప్రాక్టిషనర్స్కు, న్యూరోసర్జన్స్ బాగా ఉపయోగపడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్‌లో పీహెచ్డీ చేసిన అగర్వాల్ మెంటల్ హెల్త్‌కు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) అప్లికేషన్లను స్టడీ చేసింది. ‘గూగుల్ మ్యాప్ ఆఫ్ ది బ్రెయిన్’గా ‘బ్రెయిన్‌సైట్’ ప్లాట్‌ఫామ్ గుర్తింపు పొందింది. ఈ ప్లాట్‌ఫామ్‌ను నాలుగు రకాల టెక్నాలజీలతో రూపొందించారు. స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్‌లాంటి మానసిక వ్యాధులకు సంబంధించి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. మెదడులో ఏం జరుగుతుందో అనేదానిపై ‘బ్రెయిన్‌సైట్’ సాంకేతికత దృష్టి సారిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే మానసిక సమస్యతో బాధపడుతున్న వారి గురించి సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ‘మా పరిశోధనలను ఎక్కువమందికి చేరువ చేయాలనే లక్ష్యంతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాను. ఫంక్షనల్ అంశాలకు కృత్రిమ మేధస్సును వర్తింప చేస్తున్న ప్రపంచంలోని అతి కొద్ది కంపెనీలలో మా కంపెనీ ఒకటి’ అంటుంది అగర్వాల్. అశ్వినీ అశోకన్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఇంటరాక్షన్ డిజైన్ కోర్సు చదువుతున్న రోజుల నుంచి అశ్వినీ అశోకన్‌కు కంప్యూటర్‌కు సంబంధించి విషయాలపై ఆసక్తి ఉండేది. ‘ఇంటెల్’లో దశాబ్దం పాటు వివిధ రకాల ఇంటర్నెట్ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన విభాగాల్లో పనిచేసింది. ఈ అనుభవ జ్ఞానంతో ‘మ్యాడ్స్ట్రీట్ డెన్’ను ప్రారంభించింది. డిజిటల్, ఏఐ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించి కంపెనీల జర్నీలో ‘మ్యాడ్స్ట్రీట్’ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. 2020–2021లో కంపెనీలో రకరకాల పరిశ్రమలలోకి విస్తరించింది. వ్యాపార విజయాలకు మాత్రమే కాదు ఉద్యోగాలలో జెండర్ ఈక్వాలిటీకి కూడా ప్రాధాన్యత ఇస్తోంది అశ్విని. కోవిడ్ సమయంలో ఉద్యోగాలు మానేసిన ఎంతోమందిని తిరిగి పనిలో చేరేలా కృషి చేసింది. ‘అన్ని రకాల కంపెనీలను నడిపించడంలో మహిళలు ముందుండాలి’ అని కోరుకుంటున్న అశ్వినీ అశోకన్ ఈ భూగోళంలో ప్రతి ఉద్యోగి, ప్రతి వ్యక్తిని ఏఐ నేటివ్‌గా చూడాలనుకుంటుంది. అపర్ణ పురోహిత్ (వినోద రంగం) మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అపర్ణ పురోహిత్ ఎన్నో కలలతో దిల్లీ నుంచి ముంబైలోకి అడుగు పెట్టింది. ముంబైకి వచ్చిన ఐదేళ్ల తరువాత ఇండిపెండెంట్ డైరెక్టర్–ప్రొడ్యూసర్ కావాలనే తన కలను సాకారం చేసుకుంది. కథలు చెప్పాలనే కలతో ముంబైకి వచ్చిన అపర్ణ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజనల్స్’ హెడ్‌గా కొత్త ప్రయాణం ప్రారంభించింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఎన్నో ప్రాజెక్ట్‌లలో పనిచేసింది. ‘ఇది నా పని కాదు’ అని ఎప్పుడూ అనుకోలేదు. ట్యూషన్ల్ చెప్పడం నుంచి వాయిస్ ఓవర్ వరకు ఎన్నో పనులు చేసింది. ‘అమెజాన్ ప్రైమ్వీడియో–ఇండియా’ హెడ్ హోదాలో పాతాళ్ లోక్, మీర్జాపూర్ మేడ్ ఇన్ హెవెన్, ది ఫర్గెటన్ ఆర్మీలాంటి ఒరిజినల్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ కంటెంట్‌తో మంచి పేరు తెచ్చుకుంది. ‘సూపర్మెన్లాగా సూపర్ ఉమెన్ అనే మాట ఎందుకు వినిపించదు’ అనే మాటకు అపర్ణ పురోహిత్ ఇచ్చిన జవాబు... ‘తమ దైనందిన జీవితంలో మహిళలు ఎప్పుడూ సూపరే’. -
International Womens Day 2024: ఆహారంలోనే ఆరోగ్యం.. మూడుతరాల కోడళ్ల ముచ్చట్లు
ఒక మహిళ శక్తిమంతురాలు... అని చెప్పడానికి ఒక నిదర్శనం ఆమె కుటుంబాన్ని నిర్వహించే తీరు. శక్తిమంతురాలైన మహిళ తన ఇంట్లో వ్యక్తుల మధ్య ఉండాల్సిన కుటుంబ బంధాలను చక్కగా నిర్వహించగలుగుతుంది. ఏ ఇంట్లో అయినా బంధాలు, బాంధవ్యాల నిర్వహణ బాధ్యత మహిళ భుజాల మీదనే ఉంటుంది. మగవాళ్లు పని ఒత్తిడిలో క్షణికావేశానికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగింది మహిళ మాత్రమే. ఆ మహిళ ఆ మగవ్యక్తికి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంటి కోడలు కావచ్చు. ఒక ఇంట్లో తల్లి, కోడలు, కొత్తతరం కోడలు అందరూ అనుబంధాలకు విలువ ఇచ్చేవారైతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఫొటో చెప్తోంది. ఉపాసన, సురేఖ, అంజనాదేవి... కొణిదెల ఇంటి మూడు తరాల కోడళ్లు. తమ ఇంటి రుచుల అనుబంధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. పిల్లలు తింటేనే నాకు బలం నాకు వంట చేయడం చాలా ఇష్టం. అయితే పెద్దగా ఓపికలేదిప్పుడు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు ‘ఏమైనా వండి పంపించమంటావా’ అని అడుగుతాను. మొన్నొక రోజు చరణ్ ‘నాయనమ్మా రొయ్యల పలావు చేస్తావా’ అన్నాడు. రేపు ఎలా ఉంటుందో, చేయగలనా లేదా అని ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రొయ్యల పలావు వండి, చరణ్ తిని బాగుందన్న తర్వాత నెమ్మదించాను. ప్రతిదీ రుచిగా ఉండాలనుకుంటాను. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా మంచి కాఫీ కోసం నెల్లూరు, నిర్మలా కేఫ్ నుంచి కాఫీ పొడి తెప్పించుకునేదాన్ని. పిల్లలందరికీ చక్కగా వండి పెట్టడమే నాకు సంతోషం, అదే నా బలం. – అంజనాదేవి మా కోడలు నన్ను మార్చేసింది గత ఏడాది మహిళాదినోత్సవానికి – ఈ మహిళా దినోత్సవానికి మధ్య నా జీవితం ఓ కీలకమైన మలుపు తీసుకుంది. గృహిణిగా ఉన్న నన్ను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది ఉపాసన. ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభానికి మూలం కోసం నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. మా పెళ్లయిన కొత్తలో చిరంజీవి షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు నేనూ వెళ్లాను. 47 రోజులు అక్కడ ఆయన మీట్, సాస్‌లు తినలేక ఇబ్బంది పడ్డారు. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం నేను కనుక్కున్న ఫార్ములానే ఈ ప్రీ కుక్డ్ ఫుడ్. అలాగే ఉపాసన ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లినప్పుడు తను ప్రెగ్నెంట్. భోజనం సరిగా తింటుందో లేదోనని ఇదే ఫార్ములా ఇన్స్టంట్ మిక్స్‌లు చేసిచ్చాను. తను చాలా సంతోషపడింది. ఇండియా వచ్చిన తరవాత తన ఆలోచన నాతో చెప్పింది. ఎంటర్ప్రెన్యూర్ అనే మాటే అప్పుడు నాకు అర్థం కాని విషయం. అయితే వంట వరకు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెటింగ్ వంటివన్నీ ఉపాసన చూసుకుంటుంది. ఈ సందర్భంగా అరవై దాటిన మహిళలకు నేను చెప్పే మాట ఒక్కటే. యాభై దాటే వరకు మన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా గడిచిపోతుంది. అరవైలలోకి వస్తున్నారంటే దేహం మీద దృష్టి పెట్టాలి. రోజుకో గంట సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు, బతికినన్నాళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా ఉపాసన మాటలను విన్న తర్వాత నాకు తెలిసిందేమిటంటే... ఈ తరం మహిళలు ముఖ్యంగా గృహిణులు తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. అలాగని అందరికీ పెద్ద పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే వెసులుబాటు ఉండదు. ఆర్థిక సౌలభ్యం లేదని దిగులు చెందవద్దు. ఇంట్లోనే చేయగలిగే పచ్చళ్లు, హోమ్ఫుడ్తో చిన్నస్థాయిలో మొదలుపెట్టండి. మీ కృషితో మీ కుటీర పరిశ్రమను విస్తరించండి. మీకంటూ గుర్తింపు దానంతట అదే వస్తుంది. – సురేఖ అత్తమ్మ నా రోల్‌మోడల్ మీకు తెలుసా... అత్తమ్మ వెయిట్ లిఫ్టర్! రోజూ ఎక్సర్సైజ్లో భాగంగా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆమె ప్రతి విషయంలో ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్తగా ఉంటారో, మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తారో... అన్నీ నాకు గొప్పగా అనిపిస్తాయి. ప్రీ కుక్డ్ ఫుడ్ ఫార్ములా తెలిసి ఎంత ఎగ్జయిట్ అయ్యానో చెప్పలేను. ట్రావెల్ చేసే వాళ్లకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా, దీనిని అందరికీ పంచుదామన్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉప్మా, పులిహోర వంటి మిక్స్‌లు ఉన్నప్పటికీ వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అలా క్రృతిమ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసిన మా అత్తమ్మ రెసిపీలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఇప్పుడు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ నాలుగు ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చాం. మరో మూడు ప్రయోగాల దశ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు అందిస్తున్న చిరుధాన్యాలు, పప్పులతో ఇన్స్టంట్ ఫుడ్ పౌడర్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. ఈ ఐడియాకి అత్తమ్మ గారింట్లో ఆశ్చర్యపోయారు. కానీ మా పుట్టింట్లో మహిళలందరూ ఎంటర్ప్రెన్యూర్లే కావడంతో వాళ్లు విన్న వెంటనే సంతోషంగా స్వాగతించారు. హెల్త్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆహారంలోనే ఆరోగ్యం ఉంది. – ఉపాసన ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి -
ఏం చేస్తున్నామన్నది కాదు ముఖ్యం...మహిళా ఆటో డ్రైవర్ సక్సెస్ స్టోరీ
ఏ పని అయితేనేం.. గౌరవంగా బతకాలి.. ఒకళ్ల మీద ఆధారపడకుండా బతకాలి.. ఇదీ హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న అరుణ అంతరంగం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం. ఆటోడ్రైవర్‌గా పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది.. తాను చేస్తున్న పని పట్ల ఈ నిబద్ధతే ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపింది. బిజీ బిజీ నగరంలో, ట్రాఫిక్ కష్టాలను ఈదుతూ కుటుంబ బాధ్యతలను మోస్తోంది. బిడ్డల్ని ప్రాణానికి ప్రాణంగా సాదుకుంటోంది. ఏడడుగులు నడిచి, కడదాకా తోడు ఉంటానని బాస చేసిన భర్త అనారోగ్యంతో తనకు దూరమైతే... కుంగిపోలేదు. ఆ కష్టాన్ని దిగమింగుకుంది. ఆడది అంటే అబల కాదు.. ఆడపులిలా బతకాలి అన్న భర్త మాటలే ఆమెకు వేద మంత్రాలయ్యాయి. ఆయన నేర్పించిన విద్యతోనే బతుకు దెరువు వెతుక్కుంది. కష్టాలు, కన్నీళ్లు ఎన్నొచ్చినా.. వెరవ లేదు. చివరికి తోటి డ్రైవర్ల నుంచి వేధింపులొచ్చినా బెదరలేదు. అన్నల్లా ఆదరించిన మరికొంతమంది ఆటో కార్మికులు, కుటుంబం మద్దతుతో నెగ్గుకొస్తోంది. నేను నేటి మహిళను అంటోంది. సాధారణంగా మగవాళ్లకే పరిమితమని భావించే మోటార్ ఫీల్డ్‌లో సత్తా చాటుకుంటోంది అరుణ. హైదరాబాద్ రోడ్లపై రివ్వున దూసుకు పోతుంది. బాధలొచ్చాయని భయపడకుండా తనలాగా ధైర్యంగా బతకాలని తోటి మహిళలందరికీ పిలుపునిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలందరికీ శుభాకాంక్షలు అందిస్తోంది సాక్షి. డాట్ కామ్. -
ఫార్చూన్ 500 లీడర్లలో మహిళలు అంతంతే ..
న్యూఢిల్లీ: కార్పొరేట్ ప్రపంచంలో మహిళలు దూసుకెడుతున్నా.. కంపెనీలకు సారథ్యం వహిస్తున్న వారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది. ఫార్చూన్ ఇండియా 500 కంపెనీల్లో కేవలం 1.6 శాతం సంస్థలు మాత్రమే మహిళల సారథ్యంలో ఉండటం ఇందుకు నిదర్శనం. ఫార్చూన్ ఇండియా, ఎస్పీ జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దీనికి తోడ్పాటు అందించగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్లో 16 రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించారు. వీటిలో 130 మంది పైచిలుకు పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు. అలాగే సర్వే ప్రశ్నాపత్రం ద్వారా ఫార్చూన్ 500 కంపెనీల అభిప్రాయాలు కూడా సేకరించారు. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను గుర్తించడంలో పరిశ్రమ పారదర్శకంగా వ్యవహరిస్తుండటం ప్రశంసనీయం‘ అని నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ .. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. అధ్యయనం విశేషాలు.. ► ఫార్చూన్ ఇండియా ఏటా అత్యధిక ఆదాయాలు ఆర్జించే 500 టాప్ కంపెనీలతో జాబితా విడుదల చేస్తుంటుంది. అధ్యయనం ప్రకారం వీటిలో కేవలం 1.6 శాతం సంస్థల్లోనే మహిళా ఎండీలు/సీఈవోలు ఉన్నారు. తర్వాత స్థానంలో ఉండే నెక్ట్స్ 500 సంస్థల్లో 5 శాతం, ఫార్చూన్ ఇండియా 1000 కంపెనీల లిస్టులో 3.2 శాతం మంది ఉన్నారు. ► కుటుంబ బాధ్యతల కారణంగా 30–40 శాతం మంది ఉద్యోగినులు .. మిడిల్ మేనేజ్మెంట్ స్థాయికి రాగానే నిష్క్రమిస్తుండటంతో వారి ప్రాతినిధ్యం తగ్గుతోంది. ప్రసూతి సెలవులు తీసుకోవడం, ప్రసవం తర్వాత తిరిగి ఉద్యోగాల్లో చేరడం సవాలుగా ఉంటోంది. ► కార్పొరేట్ మైండ్సెట్పరమైన సమస్యలు కూడా కెరియర్లో మహిళల పురోగతికి సమస్యాత్మకంగా ఉంటున్నాయి. ఉద్యోగినులు ఆరు నెలల పాటు మెటర్నిటీ లీవులు తీసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మిడ్–మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలను తీసుకోవడానికి సంస్థలు సంకోచిస్తున్నాయి. ఇది పెయిడ్ లీవు కావడంతో చాలా మటుకు సంస్థలు – ముఖ్యంగా చిన్న సంస్థలు – పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడటం లేదు. అలాగే పిల్లల బోర్డు ఎగ్జామ్ల కోసం, తల్లిదండ్రులు..లేదా అత్తమామల సంరక్షణ కోసం నలభైలలో బ్రేక్ తీసుకోవాల్సి వస్తుండటం వంటివి కూడా మహిళ ఉద్యోగులకు సమస్యాత్మకంగా ఉంటున్నాయి. ► వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే మహిళలు వెళ్లలేరు, లాభనష్టాల పరిస్థితులను సరిగ్గా చక్కబెట్టగలిగే సామరŠాధ్యలు వారికి ఉండవు అనే మూస అభిప్రాయాలు కూడా వారి పురోగతికి అవరోధాలుగా ఉంటున్నాయి. ఇలాంటి అభిప్రాయాల వల్ల వారిని నేరుగా అడగకుండానే యాజమాన్యాలు మహిళా ఉద్యోగుల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటోంది. ► అయితే, కంపెనీల్లో లింగ అసమానతలపై అవగాహన పెరుగుతోంది. రూ. 200 కోట్లు ఆర్జించిన ఎయిర్‌బీఎన్‌బీ మహిళా హోస్ట్‌లు ఆన్లైన్ హోస్టింగ్ ప్లాట్‌ఫాం ఎయిర్బీఎన్బీలోని మహిళా హోస్ట్‌లు (ఆతిథ్య సేవలు అందించేవారు) దేశీయంగా 2023లో రూ. 200 కోట్లు పైగా ఆర్జించారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలు, కమ్యూనిటీల వృద్ధిపై మహిళలు చూపుతున్న సానుకూల ప్రభావాలకు ఇది నిదర్శనమని ఎయిర్‌బీఎన్‌బీ తెలిపింది. భారత్‌లోని తమ హోస్టింగ్ కమ్యూనిటీలో సుమారు 30 శాతం మంది మహిళలు ఉన్నారని ఎయిర్‌బీఎన్‌బీ ఇండియా జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ తెలిపారు. మహిళా పర్యాటకులకు, మహిళా హోస్ట్‌లకు సురక్షితమైన పరిస్థితులు కలి్పంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. మహిళా అతిథులు భారత్‌లో ఎక్కువగా గోవా, బెంగళూరు, ఢిల్లీ, పుణె, డెహ్రాడూన్, జైపూర్లను ఎంచుకుంటున్నారని వివరించారు. అంతర్జాతీయంగా లండన్, దుబాయ్, టొరంటో, ప్యారిస్ మొదలైనవి భారతీయ మహిళా పర్యాటకులకు ఫేవరెట్‌గా ఉంటున్నాయని బజాజ్ పేర్కొన్నారు. 2023 మహిళా రుణాల్లో భారీ పురోగతి మహిళా రుణాల విషయంలో 2023లో మంచి పురోగతి కనిపించింది. మహిళా రుణాలు పెరిగినట్లు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఒకటి పేర్కొంది. వ్యక్తిగత రుణాలు, ద్విచక్ర వాహన రుణాల పోర్ట్‌ఫోలియో అత్యంత వేగంగా 26 శాతం వృద్ధిని కనబరిచినట్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రిఫ్ హై మార్క్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం మహిళలకు సంబంధించి మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో 2022 చివరి నాటికి రూ. 26 లక్షల కోట్ల నుండి 2023లో రూ. 30.95 లక్షల కోట్లకు ఎగసింది. వ్యాపారవేత్తలుగా మారేందుకు ఆసక్తి మహిళా ఉద్యోగస్థుల్లో అత్యధికుల అభిమతం ఇండియాలెండ్స్ సర్వేలో 76 శాతంమంది ఓటు ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై అవగాహనకూ సై దేశీయంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో అత్యధిక శాతంమంది వ్యాపారవేత్తలు(ఎంటర్ప్రెన్యూర్)గా మారేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. సొంత బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచనను కలిగి ఉన్నట్లు ఇండియాలెండ్స్ నిర్వహించిన సర్వే పేర్కొంది. 24–55 ఏళ్ల మధ్య వయసున్న 10,000 మంది వర్కింగ్ ఉమన్‌తో సర్వే చేపట్టినట్లు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల గణాంకాలు అందించే ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ ఇండియాలెండ్స్ తెలియజేసింది. మెట్రో నగరాలతోపాటు టైర్–1, టైర్–2 పట్టణాలలో ఉద్యోగాలు చేసే మహిళలను సర్వేకు పరిగణించినట్లు వెల్లడించింది. వీరిలో 76 శాతం మంది సొంత బిజినెస్‌ను ప్రారంభించాలనే కోరికను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. 86 శాతంమంది మహిళలు బడ్జెటింగ్, పెట్టుబడులు, పొదుపు తదితర విభిన్న ఆర్థిక ప్రొడక్టుల(ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్)పై అవగాహనను పెంపొందించుకోవాలనే పట్టుదలను ప్రదర్శించినట్లు వివరించింది. వ్యాపారవేత్తలు సైతం పలువురు మహిళా వ్యాపారవేత్తలను సైతం సర్వేకు పరిగణించినట్లు ఇండియాలెండ్స్ పేర్కొంది. వీరిలో 68 శాతం ఉమన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తమ కంపెనీ ఖాతాలను స్వతంత్రంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 32 శాతంమంది మాత్రమే ఇందుకు భర్తలు, కుటుంబ సభ్యులు, వృత్తి నిపుణులపై ఆధారపడుతున్నట్లు తెలియజేశారు. ఇక బిజినెస్ ఉమన్‌లో దాదాపు 69 శాతంమంది, వేతనాలు అందుకునే మహిళల్లో 51 శాతంమంది తమ సొమ్మును పెట్టుబడులకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. వీరిలో 79 శాతంమంది సొంతంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. కేవలం 21 శాతంమంది పెట్టుబడులకు సంబంధించి తమ భాగస్వాములు లేదా తల్లిదండ్రుల సహాయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక 25 శాతంమంది మహిళలు విశ్వాసంలేక సొంత పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకపోగా.. మరో 29 శాతంమంది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్పట్ల పరిమిత అవగాహన కారణంగా వెనకడుగు వేస్తున్నట్లు వెల్లడించారు. సర్వే వివరాలిలా సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 34 శాతంమంది మహిళలు 25–34 మధ్య వయసు కలిగినవారుకాగా.. సుమారు 26 శాతంమంది 35–44 మధ్యవయసు గలవారిగా ఇండియాలెండ్స్ తెలియజేసింది. 22 శాతంమంది 18–24 ఏజ్ గ్రూప్‌కాగా.. 45 ఏళ్లకుపైబడినవారు 19 శాతంగా వెల్లడించింది. ఈ మహిళల్లో 44.5 శాతంమంది ఉద్యోగస్థులు, సొంత ఉపాధిగలవారు 31 శాతంమంది, గృహిణులు 12 శాతంమంది, సీఏలు, అడ్వకేట్లు తదితర వ్యక్తిగత వృత్తి నిపుణులు 4.4 శాతంమందిగా తెలియజేసింది. -
International Womens Day 2024: ఆర్థిక స్వాతంత్య్రం అంటే?
స్త్రీలు సంపాదనపరులైతే ఏమవుతుంది? ఆర్థికంగా సమృద్ధి సాధిస్తే ఏమవుతుంది? తమ జీవితాలపై అధికారం వస్తుంది. కీలక నిర్ణయాలప్పుడు గొంతెత్తే ఆత్మవిశ్వాసం వస్తుంది. తమకు ఏ హక్కులు రక్షణ ఇస్తాయో ఎరుక కలుగుతుంది. స్త్రీ ఇవన్నీ కుటుంబ సంక్షేమానికే వెచ్చిస్తుంది. స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం ఇంటా, బయటా స్త్రీ, పురుషుల సమ భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తుంది. కాని స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రానికి ఇంకా ఎంతో చైతన్యం కావాలి. స్త్రీలు సాధికారత పొందటం అంటే ఏమిటి? పరాధీనత నుంచి బయటపడటమే. అంటే? మరొకరు తనను పోషించే స్థితి నుంచి బయటపడటమే. తండ్రి, భర్త, కుమారుడి సంపాదన వల్ల మాత్రమే జీవితం గడుస్తూ ఉంటే కనుక ఆ పరాధీనత నుంచి బయట పడటం. అంటే బంధం నుంచి బయటపడటం కాదు. స్థితి నుంచి మాత్రమే. స్త్రీలు సాధికారత ఎప్పుడు పొందుతారంటే ఆర్థికంగా వారు స్వేచ్ఛ పొందినప్పుడు. స్త్రీలకు సామాజికంగా, కుటుంబపరంగా హక్కులు ఉంటాయి. అయితే ఆ హక్కులను దక్కించుకోవాలంటే వారికి ఆర్థిక ఆత్మవిశ్వాసం ఉండాలి. పుట్టుక నుంచే స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలనే భావన ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచే తీసివేయడం నేటికీ జరుగుతోంది. ‘ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టడానికి’ అనుకునే తల్లిదండ్రులు, భర్త సంపాదన వల్ల మాత్రమే ఆమె బతకాలనుకునే తల్లిదండ్రులు ఆమె చదువును నిర్లక్ష్యం చేయడం గ్రామీణ భారతంలో నేటికీ జరుగుతూనే ఉంది. ఆడపిల్లకు ఆస్తిపాస్తులు ఇచ్చినా చదువు వల్ల వచ్చే, ఆమెకై ఎంచుకునే ఉపాధి నుంచి వచ్చే సంపాదన కలిగించే ఆత్మవిశ్వాసం వేరు. స్త్రీలను ‘అదుపులో ఉంచడం’ అంటే వారిని ఆర్థిక వనరుల నుంచి దూరంగా పెట్టడమే. పోపుల డబ్బాలో కొద్దిపాటి చిల్లరకే ఆమె హక్కుదారు. దానివల్ల న్యూనతతో ఉండాలి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాల సమయంలో భర్త/తండ్రి/కుమారుడి మాట చెల్లుబాటు కావడానికి కారణం వారు ‘ఆర్థిక వనరులు కలిగి ఉండటం’. ‘రూపాయి సంపాదన లేని దానివి నువు కూడా మాట్లాడేదానివేనా’ అని స్త్రీలను పరోక్షంగా అనడం. అదే ఆమెకు సంపాదన ఉంటే నా వల్ల కూడా కుటుంబం నడుస్తోంది కాబట్టి కుటుంబ సంక్షేమం కోసం నా పాయింట్ చెప్పాల్సిందే అని అనగలదు. కుటుంబపరంగా, సామాజికంగా తన జీవితం ఏ విధంగా గడవాలని స్త్రీ ఆశిస్తుందో ఆ నిర్ణయాన్ని వెల్లడించే శక్తి ఆర్థిక స్వావలంబన వల్ల కలుగుతుంది. ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం అవసరం. అందుకు చదువు ముఖ్య సాధనం. సాధికారత అంటే? స్త్రీలు సాధికారత పొందాలంటే వారి ఆకాంక్షలకు సమాజం ఆమోదం తెలపాల్సిందే. ఒక స్త్రీ అంట్రప్రెన్యూర్ కావాలనుకున్నా, పెద్ద పెద్ద సంస్థల్లో నాయకత్వ స్థానానికి ఎదగాలనుకున్నా, కాన్పు సమయంలో బ్రేక్ తీసుకుని నాలుగైదేళ్ల తర్వాత తిరిగి తన ఉద్యోగం చేయాలని అనుకున్నా, పెళ్లి తర్వాత పై చదువులకు వెళ్లాలనుకున్నా, గృహిణిగా ఉంటూ ఇంటిపట్టునే ఏదైనా పనిచేసి సంపాదించాలనుకున్నా వారికి అడ్డుగా నిలవకపోవడమే చేయవలసింది. ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలు తమ సంపాదనలో 90 శాతం కుటుంబం కోసం ఖర్చు పెడతారు. పురుషులు నలభై–యాభై శాతం ఖర్చు పెడతారు. స్త్రీలు సాధికారత పొందడం అంటే తాము ఏం చేసినా పడి ఉంటుందనే భావన నుంచి పురుషులను బయట పడేయడం. ఎక్కువ తక్కువ లేని గౌరవ బంధాలను ప్రతిపాదించడం. ఆర్థిక అక్షరాస్యత స్త్రీలు సాధికారత, ఆర్థిక స్వావలంబన పొందాలంటే ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి స్త్రీలకు ఆర్థిక అక్షరాస్యతను కలిగించాలి. వ్యక్తిగత ఖర్చులు, కుటుంబ బడ్జెట్, పొదుపు, ఆదాయం తెచ్చే పెట్టుబడి... వీటి గురించి అవగాహన ఉండాలి. ‘మీ జీవితం మీ చేతుల్లో ఉండాలంటే’ మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలి... అందుకు ఏమి చేయాలో తెలుసుకోవాలి. సొంత ఆస్తి, స్వీయపేరు మీద పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, ఎమర్జన్సీ ఫండ్ కలిగి ఉండటం, డిజిటల్ పరిజ్ఞానం పొంది ఉండటం– అంటే ఆర్థిక లావాదేవీలు ఫోన్‌మీద, కంప్యూటర్ మీద చేయగలిగి వేగంగా పనులు నిర్వర్తించ గలగడం. కుటుంబ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అనుకుంటే కుటుంబంలో కీలకమైన వాటాదారైన స్త్రీ ఎంత ఆర్థిక సమృద్ధితో ఉంటే దేశ సమృద్ధి అంతగా పెరుగుతుంది. ఉమెన్స్ డే సందేశం అదే. -
మన సంస్కృతికి చిహ్నం చీరకట్టు
ఖైరతాబాద్ (హైదరాబాద్): చీరకట్టు అంటే భారతదేశ సంప్రదాయం, సంస్కృతికి చిహ్నం అని...చీర అంటే సంతోషం, గౌరవానికి చిరునామా అని గవర్నర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ‘శారీ వాకథాన్’లో గవర్నర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సంస్కృతి మహోత్సవాలు– 2024 వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించిన శారీ వాకథాన్‌లో వందలాది మంది మహిళలు, విద్యార్థినులు చీరలు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తాను విదేశాల్లో చదువుకునే సమయంలో ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండా చీర ఎలా కడతారంటూ తన స్నేహితులు ఆశ్చర్యపోయేవారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, 75 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభలో పాసైన సందర్భంగా ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 33 శాతం రిజర్వేషన్ ఉపయోగించుకుని అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్న మహిళలకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. అనంతరం బెలూన్స్ ఎగురవేసి శారీ వాకథాన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దర్శన జర్దోష్, పద్మశ్రీ ఆనంద శంకర్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్‌తో పాటు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. -
పర్పుల్ కలర్ ఎందుకు?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోగోలు, పోస్టర్లు, ప్రచార చిత్రాల్లో పర్పుల్ కలర్ కనిపిస్తుంది. గూగుల్ కూడా తన లోగోలో ఈ రంగే వాడుతుంది. ర్యాలీల్లో మహిళలు ఈ రంగు దుస్తులు ధరిస్తారు. దీనికి కారణం ఏమిటి? పర్పుల్ రంగు హుందాతనానికి గుర్తు. దీనిని దర్పానికి, సృజనాత్మకతకి, ఆధ్యాత్మికతకు సంకేతంగా ఉపయోగిస్తారు. ఒకప్పుడు అమెరికాలో మహిళలు ఓటు హక్కు కోసం ఉద్యమించినప్పుడు తెలుపు, ఆకుపచ్చ, పర్పుల్ రంగులను ఉద్యమంలో ఉపయోగించారు. తెలుపు స్వచ్ఛతకు, ఆకుపచ్చ ఆశకు, పర్పుల్ హుందాతనానికి చిహ్నంగా వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి పర్పుల్ స్త్రీల ఉద్యమరంగు అయ్యింది. ఆ రోజుల్లో పర్పుల్ రంగును ‘డై’ చేయాలంటే ఖర్చుగా ఉండేది. కులీన వంశస్తుల స్త్రీలే పర్పుల్ రంగు గౌన్లు ధరించేవారు. ‘స్త్రీల అమూల్యతను’ తెలపడానికి పర్పుల్ ఆ విధంగా చిహ్నమైంది. మరో విషయం ఏమిటంటే పింక్, బ్లూ కలర్స్ కలిపితే పర్పుల్ అవుతుంది. పింక్ కలర్ స్త్రీత్వానికి గుర్తు అయితే బ్లూ పురుష సామర్థ్యానికి చిహ్నం. స్త్రీ పురుషులు సమానం అని చెప్పడానికి పర్పుల్ కచ్చిత నిర్వచనంగా నిలుస్తుంది. మార్చి 8న అంతర్జాతీయ దినోత్సవాన్ని పర్పుల్ కలర్‌తో సెలబ్రేట్ చేసుకోవాలి. ఆఫీసుల్లో హెచ్ఆర్లో ఈ కలర్ రిబ్బన్స్ అలంకరించడం ద్వారా మహిళా ఉద్యోగుల పట్ల వారి ఆకాంక్షల పట్ల సంఘీభావం తెలపాలి.