Sakshi News home page

మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినప్పుడు బీజేపీ ఎక్కడుంది?

Published Fri, Mar 8 2024 5:32 AM

Mamata Banerjee slams PM Narendra Modi - Sakshi

హథ్రాస్‌లో అత్యాచార బాధితురాల్ని తగలబెడితే ఏం చేశారు?

బిల్కిస్‌ బానో ఉదంతంలో స్పందించరెందుకు ?

మోదీ ‘సందేశ్‌ఖాలీ’ మాటలకు ధీటైన జవాబిచి్చన దీదీ

కోల్‌కతా: ‘సందేశ్‌ఖాలీ’ తుపాను ధాటికి పశి్చమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతుందని, నారీశక్తి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీని గద్దె దింపుతుందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు పశి్చమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీటైన జవాబిచ్చారు. రాష్ట్రంలో మహిళలకు తమ ప్రభుత్వం అండగా నిలబడిందని పునరుద్ఘాటించారు. దేశంలోనే మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రం తమదేనని వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే గురువారం కోల్‌కతాలో ‘మహిళా హక్కులే మాకు ముఖ్యం’ పేరిట చేపట్టిన పాదయాత్రలో మమత ముందు నడిచారు. ఆమెను వందలాది మంది మహిళలు, పార్టీ కార్యకర్తలు అనుసరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బీజేపీపాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరిగిన అకృత్యాలపై మమత విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ సందేశ్‌ఖాలీపై బీజేపీ దేశానికి తప్పుడు సందేశాలు పంపుతోంది.

బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదంటూ నిన్న ఇక్కడికొచ్చి లెక్చర్లు దంచేసిన మోదీ బీజేపీపాలిత రాష్ట్రాల్లో మహిళలు అకృత్యాలకు బలైనప్పుడు ఎందుకు మౌనం వహించారు?’’ అని నిలదీశారు. ‘‘మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినపుడు ఈ బీజేపీ ఏం చేసింది?. ఉత్తరప్రదేశ్‌ హథ్రాస్‌లో అత్యాచారం చేసి మృతదేహాన్ని బలవంతంగా తగలబెడితే బీజేపీ సర్కార్‌ ఏం చేసింది?. గుజరాత్‌లో సర్వం కోల్పోయిన బిల్కిస్‌ బానోకు దక్కిన న్యాయమెంత?’’ అని ప్రశ్నించారు. ‘నిజానికి దేశంలో మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రం బెంగాల్‌’ అని ప్రకటించారు.

ఎక్కడ పోటీచేసినా ఓడిస్తాం
గురువారం బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌నూ మమత విమర్శించారు. ‘‘ తన తీర్పుల ద్వారా బెంగాల్‌లో వేలాది మంది యువత నుంచి ఉద్యోగాలు లాక్కున్నారు. వారు మిమ్మల్ని క్షమించరు. మీ తీర్పుల విశ్వసనీయతపై ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసినా సరే మిమ్మల్ని ఓడించి తీరతాం’ అని అన్నారు. ‘‘ పింటూ బాబు(బీజేపీ) ఆగ్రహంతో ఊగిపోయినా సరే బెంగాల్‌లో మీ విభజన రాజకీయాలు నడవనివ్వను.

బెంగాల్‌కు 450కిపైగా బృందాలను పంపిన పింటూ బాబు.. మహిళలను లైంగికంగా వేధించి నగ్నంగా ఊరేగించిన మణిపూర్‌కు ఒక్క బృందాన్ని కూడా పంపలేదు’ అని మమత గుర్తుచేశారు. ‘బీజేపీపాలిత యూపీలో మహిళలపై దారుణ అత్యాచారాలు జరుగుతున్నాయి. మణిపూర్‌లో మహిళలు రేప్‌కు గురై, అగి్నకి ఆహుతైన ఉదంతంలో అక్కడి బీజేపీ సర్కార్‌ సిగ్గుతో తలదించుకోవాలి’ అని మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ సందేశ్‌ఖాలీ ఘటనను తీవ్రంగా ఖండించాల్సిందే. టీఎంసీ కార్యకర్తలు బాధ్యుతులుగా తేలితే అరెస్ట్‌ చేసేందుకు ఏమాత్రం వెనుకాడను’ అని ఆమె స్పష్టంచేశారు. పాదయాత్రలో సందేశ్‌ఖాలీ ప్రాంతానికి చెందిన 200కుపైగా మహిళలు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement