అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో నారీమణులు క్రమంగా అన్ని విభాగాల్లో రాణిస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం ముందుకు సాగుతున్నారు. దాంతో వారు తమ వ్యక్తిగత వృద్ధితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావాన్ని చూపుతున్నారు.
దేశపురోభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తున్న మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి ఆసుపత్రిపాలైతే ఆర్థికంగా చితికిపోకుండా బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు తమ ఆర్థిక రక్షణ కోసం కొన్ని రకాల సాధారణ బీమా పాలసీలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అందులో ప్రధానంగా..
ఆరోగ్య బీమా
ఇంట్లో మహిళలతోపాటు కుటుంబం అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. కొన్ని బీమా పాలసీలు ప్రసూతి ఖర్చులను చెల్లిస్తాయి. కొత్తగా వివాహం అయిన వారు ఇలాంటి పాలసీలను పరిశీలించాలి. డెలివరీకి 90 రోజుల ముందు నుంచీ, డెలివరీ అయిన 90 రోజుల వరకూ ఏదైనా చికిత్స తీసుకుంటే ఆ ఖర్చులను పాలసీలు చెల్లిస్తాయి.
తీవ్ర వ్యాధులకు..
కొన్ని జీవన శైలి, తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించేలా పాలసీలు తీసుకోవాలి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి మహిళలకు మాత్రమే వస్తాయి. ఇలాంటి వ్యాధులను గుర్తించినప్పుడు క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలు ఒకేసారి 100 శాతం పాలసీ విలువను చెల్లిస్తాయి. అనారోగ్యం వల్ల ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో 3 నెలల జీతాన్ని అందించే ఏర్పాటూ ఇందులో ఉంటుంది.
వాహన బీమా
మెట్రోనగరాలతోపాటు ఇతర సిటీల్లో దాదాపు చాలామంది మహిళలు వాహనాలు నడుపుతున్నారు. అయితే చాలా మంది వాహన ఇన్సూరెన్స్ అయిపోయన తర్వాత రెన్యూవల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కచ్చితంగా వాహన బీమా ఉండేలా చూసుకోవాలి. కనీసం థర్డ్ పార్టీ బీమా పాలసీ లేకుండా వాహనాన్ని నడపకూడదు.
ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’
టర్మ్ పాలసీ
ఏ క్షణాన ఏ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ప్రమాదవశాత్తు మనకు ఏదైనా జరిగితే మన కుటుంబం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోకుండా టర్మ్ పాలసీ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment