రుణాల ప్రీక్లోజర్‌ ఛార్జీలపై ఆర్‌బీఐ స్పందన | RBI indeed made some changes regarding loan repayment charges | Sakshi
Sakshi News home page

రుణాల ముందస్తు ముగింపుపై ఛార్జీలొద్దు

Published Sat, Feb 22 2025 9:01 AM | Last Updated on Sat, Feb 22 2025 10:16 AM

RBI indeed made some changes regarding loan repayment charges

బ్యాంక్‌లు రుణాల ముందస్తు చెల్లింపులపై రుణగ్రహీతల నుంచి ప్రీ పేమెంట్‌ పెనాల్టీ/ ఫోర్‌క్లోజర్‌ పేరుతో వసూలు చేసే ఛార్జీల విధానాన్ని తొలగించే దిశగా ఆర్‌బీఐ(RBI) ముఖ్యమైన ప్రతిపాదన చేసింది. వ్యక్తులు, ఎంఎస్‌ఈలు  తీసుకునే అన్ని ఫ్లోటింగ్‌ రేటు రుణాలు, వ్యాపార అవసరాలకు తీర్చుకునే వాటిపైనా ముందస్తు చెల్లింపుల చార్జీలు ఉండకూడదన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం.

‘టైర్‌ 1, టైర్‌ 2 ప్రాథమిక అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంక్‌లు, బేస్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీలు మినహా అన్ని రెగ్యులేటెడ్‌ ఎంటిటీలు (ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని రకాల బ్యాంక్‌లు, ఇతర ఎన్‌బీఎఫ్‌సీలు) ఫ్లోటింగ్‌ రేటు రుణాలను ముందుగా తీర్చివేస్తే ఎలాంటి చార్జీలు/పెనాల్టీలు విధించరాదు’ అని ఆర్‌బీఐ ముసాయిదా సర్క్యులర్‌ పేర్కొంది. ఎంఎస్‌ఈ రుణ గ్రహీతలు అయితే రూ.7.50 కోట్ల వరకు పూర్తి రుణ మొత్తాలకు ఇది వర్తిస్తుంది. ఎలాంటి లాకిన్‌ పీరియడ్‌ లేకుండా దీన్ని అమలు చేయాలని పేర్కొంది. ఈ ముసాయిదాపై మార్చి 21 వరకు సూచనలు, సలహాలను ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

రిస్క్‌ ఇన్వెస్టింగ్‌పై అవగాహన కల్పించాలి

అన్‌సెక్యూర్డ్‌ రుణాలు, వేలం వెర్రిగా డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ పెరిగిపోతుండటంపై రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యుటీ గవర్నర్‌ ఎం రాజేశ్వర్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక లాభాల్లో ఉండే ఆకర్షణ వల్ల దీర్ఘకాలిక ఆర్థిక భద్రత గురించి పట్టించుకోని పరిస్థితి ఉంటోందని పేర్కొన్నారు. అనాలోచితమైన విధంగా ఆర్థిక సేవలను విస్తరిస్తే (ఆర్థికీకరణ) రిస్కులు తప్పవని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక సంస్థలను హెచ్చరించారు.

ఇదీ చదవండి: ‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’

ఈ నేపథ్యంలో ప్రజల్లో అన్‌సెక్యూర్డ్‌ రుణాలు, స్పెక్యులేటివ్‌ ఇన్వెస్టింగ్‌ వల్ల తలెత్తే రిస్క్‌ల గురించి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై ఆర్థిక రంగానికి చెందిన ఇతర నియంత్రణ సంస్థలతో కూడా ఆర్‌బీఐ కలిసి పని చేస్తోందని రావు చెప్పారు. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్లే అమాయకులు మోసగాళ్ల బారిన పడుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయని వివరించారు. ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వ్యవస్థే పూనుకోవాలని సూచించారు. శరవేగంగా మారిపోతున్న ప్రపంచంలో నియంత్రణనేది చాలా సున్నితమైన అంశంగా మారిందని రావు చెప్పారు. నియంత్రణను మరీ తగ్గిస్తే వ్యవస్థాగతంగా రిస్క్‌లు పెరుగుతాయని, అలాగని మరీ ఎక్కువగా నియంత్రిస్తే కొత్త ఆవిష్కరణలకు, రుణ లభ్యతకు అవరోధాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement