
బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని సులభతరం చేయడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 91 రోజులు, 182 రోజులకు సంబంధించిన ట్రెజరీ బిల్లుల వేలానికి వేసిన బిడ్లను తిరస్కరించింది. ఈ బిడ్ల విలువ రూ.26,000 కోట్లుగా ఉంది. ఫారెక్స్ మార్కెట్లో ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం, డాలర్లను విక్రయించడం, రూపాయి లిక్విడిటీని తగ్గించడం వంటి నగదు సంక్షోభం పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది.
ట్రెజరీ బిల్లులు
ట్రెజరీ బిల్లులను సాధారణంగా టీ-బిల్లులు అని పిలుస్తారు. ఇవి నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసే స్వల్పకాలిక రుణ సాధనాలుగా తోడ్పడుతాయి. అవి ప్రామిసరీ నోట్ల రూపంలో ఉంటాయి. ఒక సంవత్సరంలోపు లేదా నిర్ణీత గడువులోపు తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. టీ-బిల్లుల కాలపరిమితి 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజులు. ఇతర రకాల ప్రభుత్వ బాండ్ల మాదిరిగా కాకుండా టీ-బిల్లులకు కాలానుగుణ వడ్డీ సమకూరదు. దానికి బదులుగా, అవి వాటి ముఖ విలువ(ఫేస్ వాల్యూ)కు డిస్కౌంట్‌ను అందిస్తాయి. కొనుగోలు ధర, ముఖ విలువ మధ్య వ్యత్యాసం పెట్టుబడిదారులకు సంపాదించిన వడ్డీని సూచిస్తుంది. టీ-బిల్లులను సురక్షితమైన, అత్యంత లిక్విటిడీ పెట్టుబడుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే వీటికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. తక్కువ మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి.
ఇదీ చదవండి: 2047 నాటికి రూ.3,000 లక్షల కోట్ల ఆదాయం!
బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితుల కారణంగా తాజాగా 91 రోజులు, 182 రోజుల టీ-బిల్లుల కోసం వేసిన బిడ్లను ఆర్‌బీఐ తిరస్కరించింది. కానీ, 364 రోజుల టీ-బిల్లుల కోసం రూ.7,000 కోట్ల విలువైన బిడ్లను మాత్రం ఆమోదించింది. సాధారణంగా ట్రెజరీ బిల్లులను ద్రవ్య మార్కెట్(మనీ మార్కెట్) సాధనాలుగా జారీ చేస్తారు. ఈ టీ-బిల్లులకు ఇన్వెస్టర్లు ఆఫర్ చేసే రేట్లు ఆర్‌బీఐ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న దానికంటే ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ పార్టిసిపెంట్స్ పేర్కొన్నారు. ఈ వ్యవహారం వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు పరోక్షంగా దోహదం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment