
భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఎవరూ క్లెయిమ్ చేయని డబ్బును తిరిగి చెల్లించేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నాయి. బ్యాంకు ఖాతాదారులు, వారి నామినీలు రూ.78,213 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను తిరిగి పొందడంలో సహాయపడటానికి ఒక క్రమబద్ధమైన ప్రక్రియను అవలంబించేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సాధారణ దరఖాస్తు ఫారాలు, డాక్యుమెంటేషన్ ప్రక్రియను 2026 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తిగా ఆన్‌లైన్‌లో అమలులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాయి. ఇది భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరింత పారదర్శకతను పెంచేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రాల బడ్జెట్‌తో సమానం
క్లెయిమ్ చేయని డిపాజిట్లు భారత ఆర్థిక వ్యవస్థకు నిరంతర సవాలుగా మారుతున్నాయి. సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఇతర బ్యాంకింగ్ సాధనాల్లో తరచుగా నిధులు పేరుకుపోతున్నాయి. ఖాతాదారులు తమ డబ్బును ఉపసంహరించుకోవడంలో విఫలమైనప్పుడు లేదా నామినీలకు వారి అర్హతల గురించి తెలియనప్పుడు ఇది మరింతగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ క్లెయిమ్ చేయని రూ.78,213 కోట్ల డబ్బు బ్యాంకుల వద్ద మూలుగుతుంది. ఈ మొత్తం కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌తో సమానం ఉండడం గమనార్హం.
డిజిటలైజేషన్ వల్ల లాభాలు..
ప్రస్తుత నిబంధనల ప్రకారం అన్‌క్లెయిమ్డ్ నగదును క్లెయిమ్ చేయాలంటే విస్తృతమైన పేపర్ వర్క్, వ్యక్తిగత విజిట్‌లు ఉంటున్నాయి. దాంతో చాలామంది వీటిని క్లెయిమ్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే దీన్ని సరళతరం చేస్తూ కొన్ని కామన్ అప్లికేషన్ ఫారాలను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలున్నాయి. ఇది కార్యరూపం దాలిస్తే బ్యాంకులకు అతీతంగా ఆన్‌లైన్‌లో కామన్ వివరాలు నమోదు చేసేందుకు వీలవుతుంది. ఇది ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. దీనితో పాటు అవసరమైన డాక్యుమెంట్ల ప్రామాణీకరణ గందరగోళం, జాప్యాన్ని తగ్గిస్తుంది. నామినీలు లేదా ఖాతాదారులు ఇకపై బ్యాంక్ నిర్దిష్ట పేపర్ వర్క్ కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు.
ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?
ఇంటర్నెట్ వాడుతున్న వారికి ప్రయోజనం
2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ మొత్తం పునరుద్ధరణ ప్రక్రియ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ మార్పు దరఖాస్తుదారులు అప్లికేషన్ సమర్పించడానికి, పత్రాలను అప్‌లోడ్ చేయడానికి, వారి అభ్యర్థనలను తాము ఉన్న ప్రదేశంలో నుంచే ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇటీవలి అంచనాల ప్రకారం 80 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులన్న దేశంలో ఇలా ఆన్‌లైన్‌లో క్లెయిమ్ సేవలందించడం ఎంతో తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి ఇది కీలకంగా మారనుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment