బ్యాంకుల వద్ద క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన డిపాజిట్లు ఏటా పెరుగుతున్నాయి. అందులో కొందరు ఖాతాదారులు చనిపోయి ఉంటారు. మరికొందరు ఇతర కారణాల వల్ల వారి డబ్బుకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు చేయరు. దాంతో అవి ఎవరు క్లెయిమ్ చేయకుండా అలాగే బ్యాంకుల్లో పోగవుతాయి. అలా అని ఆ డబ్బును బ్యాంకు వాటి కార్యకలాపాలకు ఉపయోగించేందుకు మాత్రం నిబంధనలు ఒప్పుకోవు. కచ్చితంగా ఆ డబ్బును సదరు ఖాతాదారులకే చెల్లించేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అయితే ఎవరు క్లెయిమ్ చేయని (అన్‌క్లెయిమ్డ్) డిపాజిట్లు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.42,270 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది కాలంతో పోలిస్తే 28 శాతం పెరిగాయి.
పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు పనిచేయకుండా ఉన్న అకౌంట్లలోని డిపాజిట్లను అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. కిందటేడాది మార్చి 31 నాటికి రూ.32,934 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అవి ఈ ఏడాది మార్చి నాటికి రూ.42,272 కోట్లకు చేరిందని ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ పార్లమెంట్‌లో వెల్లడించారు.
ఈ ఫండ్స్‌ను ఆర్‌బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (డీఈఏ)ఫండ్‌లో ఉంచుతారు. ఈ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తిరిగి సదరు ఖాతాదారులకు పంపేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటోందని కరాద్ వెల్లడించారు. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లో ఉంచాలని ఇప్పటికే ఆర్‌బీఐ సూచించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఖాతాలకు సంబంధించి కస్టమర్లను సంప్రదించాలని, ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోతే వారి లీగల్ వారసులకు వివరాలు అందించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించేందుకు బోర్డు ఆమోదంతో కొన్ని రూల్స్ రెడీ చేయాలని, గ్రీవెన్స్ రిడ్రస్సల్ మెకానిజంను ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని ఆర్‌బీఐ సలహా ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
రూ.1,432.68 కోట్లు రిటర్న్..
డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు సెంట్రలైజ్డ్ వెబ్‌సైట్ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్‌వే టూ యాక్సెస్ ఇన్‌ఫర్మేషన్ ను ఆర్‌బీఐ అందుబాటులోకి తీసుకొచ్చిందని కరాద్ అన్నారు. దీనికి తోడు ‘100 డేస్ 100 పేస్’ క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాల్లోని టాప్ 100 అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను 100 రోజుల్లో బ్యాంకులు సెటిల్ చేయనున్నాయి. ఈ ప్రచారం ఈ ఏడాది జూన్ 1న మొదలై సెప్టెంబర్ 8 వరకు కొనసాగిందని మంత్రి వెల్లడించారు. క్యాంపెయిన్ ముగిసే సమయానికి 31పెద్ద బ్యాంకులు రూ.1,432.68 కోట్లను నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారికి రిటర్న్ చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి: జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి
Comments
Please login to add a commentAdd a comment