మీ బ్యాంక్‌ డిపాజిట్‌ ఎంత భద్రం? | Sakshi Special Story About Bank deposit insurance facility in india | Sakshi
Sakshi News home page

మీ బ్యాంక్‌ డిపాజిట్‌ ఎంత భద్రం?

Published Mon, Mar 10 2025 4:42 AM | Last Updated on Mon, Mar 10 2025 8:04 AM

Sakshi Special Story About Bank deposit insurance facility in india

రూ.5 లక్షల వరకు ఢోకా లేదు 

డీఐసీజీసీ ద్వారా ఈ మొత్తం వెనక్కి 

మూడు నెలల్లోగా చెల్లింపులు 

అంతకుమించితే రిస్క్‌ ఉన్నట్టే బ్యాంకు సంక్షోభంలో పడితే చిక్కులు 

పరిష్కారమయ్యేంత వరకు వేచి చూడాలి 

బీమా రక్షణ మరింత పెంచాలన్న ప్రతిపాదన

ముంబైకి చెందిన ధన్‌రాజ్‌ (50) ఉదయం నిద్రలేచి, పేపర్‌ చూడగానే ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. న్యూ ఇండియా సహకార బ్యాంక్‌లో స్కామ్‌ జరిగిందనేది ఆ వార్త సారాంశం. చిరుద్యోగి అయిన ధన్‌రాజ్‌ తన కుమార్తె వివాహం కోసమని రూ.4 లక్షలను అదే బ్యాంక్‌లో కొన్నాళ్ల క్రితం డిపాజిట్‌ చేశాడు. కంగారుగా బ్యాంక్‌ శాఖకు చేరుకుని విచారించగా, డిపాజిట్లకు ఢోకా లేదన్న సమాచారం విని కాస్తంత కుదుటపడ్డాడు. 

రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా సదుపాయం ఉంటుందని కస్టమర్లు చెప్పుకుంటుండగా విని.. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు. బ్యాంక్‌ డిపాజిట్‌.. దేశంలో చాలా మందికి తెలిసిన, ఇష్టమైన పెట్టుబడి సాధనం. చాలా మంది తమ పొదుపు సొమ్మును డిపాజిట్‌ రూపంలో మదుపు చేయడం కూడా చూస్తుంటాం. కానీ, ఇందులో ఉండే రిస్క్ ల గురించి అవగాహన ఉండదు. డిపాజిటర్లు అందరూ దీనిపై ఓసారి దృష్టి సారించాల్సిన అవసరాన్ని న్యూ ఇండియా కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఉదంతం గుర్తు చేస్తోంది. 

ఒకప్పుడు ప్రతి కుటుంబ ఆర్థిక సాధనాల్లో బ్యాంక్‌ డిపాజట్‌ (ఎఫ్‌డీ) తప్పకుండా ఉండేది. కాలక్రమంలో ఇతర సాధనాల పట్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు తదితర వాటిల్లో పెట్టుబడులు పెరుగుతూ, డిపాజిట్లు తగ్గుతున్నాయి. ఇప్పటికీ 15 శాతం గృహ పొదుపులు బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోకే (ఎఫ్‌డీలు/టర్మ్‌ డిపాజిట్లు) వెళుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎఫ్‌డీలు ఎంతో మందికి నమ్మకమైన, మెరుగైన సాధనం. దీర్ఘకాలంలో గొప్ప రాబడి రాకపోయినా సరే, అత్యవసరంలో వేగంగా వెనక్కి తీసుకునేందుకు అనుకూలంగా ఉండడం చాలా మందికి నచ్చే అంశం. పైగా డిపాజిట్‌ అంటే ఏ మాత్రం రిస్క్‌ ఉండదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ప్రభుత్వ గ్యారంటీ (సావరీన్‌) ఉంటే తప్పించి, బ్యాంక్‌ ఎఫ్‌డీ అయినా, ఏ ఇతర పెట్టుబడి సాధనంలో అయినా ఎంతో కొంత రిస్క్‌ ఉంటుంది. దీనిపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. 

మెరుగైన నియంత్రణలు 
ఎఫ్‌డీ ఎంతో ప్రాచుర్యానికి నోచుకోవడం వెనుక అందులోని సరళత్వం, భద్రత కీలకమని చెప్పుకోవాలి. ఏవో కొన్ని బ్యాంకు వైఫల్యాలను పక్కన పెడితే, మన దేశంలో బ్యాంకింగ్‌ రంగం పటిష్ట నియంత్రణల మధ్య కొనసాగుతుంటుంది. ప్రజల్లో నమ్మకం ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. బ్యాంక్‌ యాజమన్యాలు/ఉద్యోగుల మోసపూరిత వ్యవహారం, రుణ వ్యాపారంలో దూకుడైన తీరు కొన్ని సందర్భాల్లో సమస్యలు, సంక్షోభాలకు దారితీయవచ్చు. ఎంత కట్టుదిట్టమైన నియంత్రణలు ఉన్నా కానీ, 2019లో పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్, 2020లో యస్‌ బ్యాంక్, ఇప్పుడు న్యూ ఇండియా కోపరేటివ్‌ బ్యాంక్‌ సంక్షోభాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ కరాడ్‌ ఉదంతాలూ గుర్తుండే ఉంటాయి. కనుక బ్యాంక్‌ డిపాజిట్లలోనూ రిస్క్‌ ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాకపోతే మనదగ్గర ఆర్‌బీఐ పటిష్ట నియంత్రణల కారణంగా ఈ తరహా సంక్షోభాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.

డిపాజిట్‌పై బీమా 
ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని బ్యాంకుల్లోనూ రూ.5 లక్షల వరకు డిపాజిట్‌కు బీమా రక్షణ ఉంటుంది. అసలు లేదా అసలుతోపాటు వడ్డీ కలుపుకుని రూ.5 లక్షలకు మించి ఉన్నప్పటికీ బీమా రూ.5 లక్షలకే పరిమితం. బ్యాంక్‌ ఏదైనా సంక్షోభం పాలైతే అప్పుడు ఒక్కో డిపాజిట్‌ దారుడికి గరిష్టంగా రూ.5 లక్షలు వెనక్కి వస్తాయి. సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరెంట్, రికరింగ్‌ ఇలా అన్ని డిపాజిట్లకూ ఈ రక్షణ వర్తిస్తుంది. ఈ వ్యవహారం అంతా చూసేది ఆర్‌బీఐ అనుబంధ సంస్థ అయిన ‘డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (డీఐసీజీసీ). ప్రతి రూ.100 డిపాజిట్‌పై రూ.12 పైసలు చొప్పున ప్రీమియం కింద బ్యాంక్‌లు డీఐసీజీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒక బ్యాంక్‌కు చెందిన ఒకటికి మించిన శాఖలో డిపాజిట్లు ఉన్నప్పటికీ.. ఒక్కో ఖాతాదారుని పేరు మీద గరిష్ట బీమా రూ.5 లక్షలుగానే ఉంటుంది. కనుక ఒక బ్యాంక్‌లో రూ.5 లక్షలకు మించి చేసే డిపాజిట్‌పై కచ్చితంగా రిస్క్‌ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్‌లు చేస్తే.. అప్పుడు విడిగా ఒక్కో బ్యాంక్‌ పరిధిలో సంబంధిత వ్యక్తికి గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్‌కు బీమా రక్షణ వర్తిస్తుంది.

బ్యాంక్‌ కుదుటపడితే.. 
బ్యాంకులో మోసం కావచ్చు. లేదా లిక్విడిటీ సంక్షోభం తలెత్తవచ్చు. రుణ ఎగవేతలతో క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్‌బీఐ తప్పకుండా జోక్యం చేసుకుంటుంది. తాత్కాలిక నిర్వహణ బాధ్యతల కోసం బోర్డ్‌ను ఏర్పాటు చేస్తుంది. బ్యాంక్‌ వ్యవహారాలను లోతుగా పరిశీలించి, చక్కదిద్దే వరకు డిపాజిట్ల ఉపసంహరణపై పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధిస్తుంది. పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్‌లో రుణ అవకతవకలు సంక్షోభానికి దారితీయగా, ఆర్‌బీఐ దాన్ని చక్కదిద్దింది. అది ఇప్పుడు యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో భాగం అయింది. యస్‌ బ్యాంక్‌లోనూ రుణ మోసాలు బయటపడగా, కొత్త బోర్డ్‌ను ఏర్పాటు చేసి గాడిన పెట్టింది. రూ.5 లక్షలకు పైగా డిపాజిట్లు కలిగిన వారు.., రూ.5 లక్షలకు పైబడిన మొత్తాన్ని తిరిగి పొందడం కోసం బ్యాంక్‌ గాడిన పడే వరకు వేచి చూడాల్సిందే. అప్పటికీ పూర్తి మొత్తం వెనక్కి వస్తుందన్న గ్యారంటీ ఉండదు. ఎంత కోత పడుతుందన్నది బ్యాంక్‌ ఆర్థిక పద్దుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది.

బ్యాంకు నుంచే చెల్లింపులు 
బ్యాంక్‌లో సమస్య తలెత్తినప్పుడు డిపాజిట్‌దారులు డీఐసీజీసీని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్‌ నిర్వహణ బాధ్యతలు చూసే బోర్డ్‌.. డిపాజిట్‌దారుల వివరాలతో జాబితాను డీఐసీజీసీకి పంపిస్తుంది. ఆ వివరాల వాస్తవికతను 30 రోజుల్లోపు డీఐసీజీసీ తేల్చాలి. అక్కడి నుంచి 15 రోజుల్లోపు డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని బ్యాంక్‌కు డీఐసీజీసీ బదిలీ చేస్తుంది. అప్పుడు ఖాతాదారులకు బ్యాంక్‌ సిబ్బంది చెల్లింపులు చేస్తారు. బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన నాటి నుంచి 90 రోజుల్లో డిపాజిట్‌దారులకు బీమా మొత్తం వెనక్కి చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి.  

విచారించుకున్న తర్వాతే.. 
ఆర్‌బీఐ పరిధిలోని అన్ని బ్యాంక్‌లు తప్పనిసరిగా డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. అవి డిపాజిట్లపై బీమా ప్రీమియం కచ్చితంగా చెల్లించాల్సిందే. సందేహం ఉంటే డిపాజిట్‌ చేసే ముందు బ్యాంక్‌ అధికారిని అడిగి బీమా ఉందా? అని నిర్ధారించుకోవచ్చు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంక్‌లు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంక్‌లు, కో ఆపరేటివ్‌ బ్యాంక్‌లు, లోకల్‌ ఏరియా బ్యాంక్‌లు, రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌లు, పేమెంట్స్‌ బ్యాంక్‌లు, స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌లు, అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌లు డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. ప్రైమరీ కో ఆపరేటివ్‌ సొసైటీలు మాత్రం దీని కిందికి రావు.

అధిక వడ్డీ రేట్లు.. అన్నీ చూసాకే 
ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు యూనివర్సల్‌ బ్యాంకులతో పోల్చితే స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తుంటాయి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు రుణాలపై అధిక రేట్లను చార్జ్‌ చేస్తుంటాయి. కనుక అవి డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎక్కువ రేట్లను ఇస్తుంటాయి. ఏ బ్యాంక్‌ అయినా సరే అధిక వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తుంటే, అందులో ఇన్వెస్ట్‌ చేసే ముందు ఈ రేషియోలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. 

సీఆర్‌ఏఆర్‌: క్యాపిటల్‌ టు రిస్క్‌ అస్సెట్‌ రేషియో అని, దీన్నే క్యాపిటల్‌ అడెక్వెసీ రేషియో అని కూడా అంటారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు ఇది కనీసం 12 శాతంగా, ప్రైవేటు షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లకు 9 శాతం మేర ఉండాలి. అదే స్మాల్‌ ఫైనాన్స్‌బ్యాంక్‌లకు 15 శాతం ఉండాలి. బ్యాంక్‌ తనకు ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలను ఎంత సమర్థంగా ఎదుర్కోగలదన్నది ఇది తెలియజేస్తుంది.  

ఎల్‌సీఆర్‌: లిక్విడిటీ కవరేజీ రేషియో 100 శాతం ఉండాలి. 30 రోజుల అవసరాలకు సరిపడా నిధులు బ్యాంకుల వద్ద ఉంచడం కోసం ఈ నిబంధన. దీనివల్ల లిక్విడిటీ షాక్‌లను బ్యాంక్‌లు సమర్థంగా ఎదుర్కోగలవు.  

అసలు రాబడి ఎంత? 
అత్యవసర నిధిని అట్టి పెట్టుకునేందుకు, స్వల్పకాలిక అవసరాలకు ఉద్దేశించిన నిధులను బ్యాంక్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేసుకుంటానంటే ఫర్వాలేదు. కానీ, దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, సంపద సృష్టికి బ్యాంక్‌ డిపాజిట్‌ మెరుగైన సాధనం కాబోదు. ఈక్విటీలపై దీర్ఘకాలంలో 12 శాతం, బంగారంలో 8 శాతం మేర సగటు రాబడి ఉంటోంది. ఈక్విటీ, బంగారంలో పెట్టుబడిని విక్రయించినప్పుడే లాభాలపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్‌ డిపాజిట్లపై అలా కాదు. ప్రతి ఏటా ఆర్జించే వడ్డీ రాబడి అదే ఏడాది ఇన్వెస్టర్‌ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. అవసరమైతే పన్ను చెల్లించాలి. ఎఫ్‌డీ రాబడిపై పన్ను చెల్లించగా, మిగిలే నికర రాబడి ద్రవ్యోల్బణ స్థాయిలోనే ఉంటుంది. కనుక డిపాజిట్లలో కాంపౌండింగ్‌ ప్రయోజనం పెద్దగా ఉండదు.

బీమా మరింత పెంచేనా..? 
2019లో పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్‌లో సంక్షోభం తలెత్తిన తర్వాతే.. డిపాజిట్లపై రూ.లక్షగా ఉన్న బీమా పరిమితిని 2020 ఫిబ్రవరిలో రూ.5 లక్షలకు పెంచారు. ఈ బీమా రక్షణను మరింత పెంచాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు ఇటీవల చేసిన ప్రకటన ఈ దిశగా డిపాజిటర్లలో అంచనాలను పెంచింది. ఇప్పటికిప్పుడు దీన్ని పెంచకపోయినా, భవిష్యత్తులో ఇందుకు తప్పక అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.  

ఎన్‌బీఎఫ్‌సీ డిపాజిట్ల సంగతేంటి? 
బజాజ్‌ ఫైనాన్స్, శ్రీరామ్‌ ఫైనాన్స్‌ తదితర డిపాజిట్లు స్వీకరించే ఆర్‌బీఐ అనుమతి కలిగిన ఎన్‌బీఎఫ్‌సీలు (ఎన్‌బీఎఫ్‌సీ–డీ) దేశంలో 25 ఉన్నాయి. వీటి పరిధిలో 2024 మార్చి నాటికి రూ.1,02,994 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. మరి ఉన్నట్టుండి వీటిల్లో ఏదైనా ఎన్‌బీఎఫ్‌సీకి నిధుల సమస్య తలెత్తితే పరిస్థితి ఏంటి? బ్యాంకుల్లో మాదిరి వీటిల్లో డిపాజిట్‌లకు డీఐసీజీసీ కింద ఎలాంటి బీమా రక్షణ లేదు. ఇవన్నీ ప్రజల డిపాజిట్లే కనుక వీటిని సైతం డీఐసీజీసీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్లు ఉన్నాయి. వీటిల్లో డిపాజిట్‌ చేసే ముందు ఇన్వెస్టర్లు రిస్క్ లను అర్థం చేసుకోవాలి.    

బ్యాంకులకూ రేటింగ్‌ ఉండాలి.. 
ఎన్‌బీఎఫ్‌సీలు తమ నిధుల అవసరాల కోసం బాండ్లు, ఎన్‌సీడీలను జారీ చేస్తుంటాయి. సంబంధిత ఎన్‌బీఎఫ్‌సీ ఆర్థిక ఆరోగ్యం ఆధారంగా రేటింగ్‌ ఏజెన్సీలు క్రెడిట్‌ రేటింగ్‌ను ప్రకటిస్తాయి. నిబంధనల ప్రకారం రేటింగ్‌ తప్పనిసరి. బ్యాంక్‌లు సైతం బాండ్లను జారీ చేయాలంటే రేటింగ్‌ తీసుకోవాల్సిందే. కానీ బ్యాంక్‌ డిపాజిట్లకు వచ్చే సరికి ఈ తరహా రేటింగ్‌ విధానం లేకపోవడాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్‌ డిపాజిట్లకు సైతం రేటింగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల పాలన మెరుగుపడుతుందని ఎన్‌ఎస్‌జీ అండ్‌ పార్ట్‌నర్స్‌ పార్ట్‌నర్‌ రవి భడానీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల డిపాజిట్‌ చేసే సమయంలో ఆయా బ్యాంక్‌లకు సంబంధించి రిస్క్ ను ఇన్వెస్టర్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలా చేస్తే అప్పుడు బలహీన బ్యాంక్‌ల నుంచి అధిక రేటింగ్‌ ఉన్న బ్యాంకుల్లోకి డిపాజిట్లు తరలిపోయే రిస్క్‌ ఏర్పడుతుందని ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ సతీష్‌ మరాటే పేర్కొన్నారు. దీనికి బదులు మెరుగైన రేటింగ్‌ ఉన్న బ్యాంకులకు డిపాజిట్లపై బీమా ప్రీమియం తక్కువ వసూలు చేసే విధానం ఫలితమిస్తుందన్నారు.  

   – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement