Insurance Facility
-
పెట్స్‌కు బీమా.. యజమానికి ధీమా
సాక్షి, హైదరాబాద్: ప్రాణప్రదంగా పెంచుకున్న పెంపుడు జంతువులకు బీమా కల్పించడం ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగింది. ఆపదలో ఉన్న పెట్స్‌కు బీమా రూపంలో ఆపన్న హస్తం అందించేందుకు నగరవాసులు అమితాసక్తి చూపుతున్నారు. ఇటీవలికాలంలో సంపన్న వర్గాలతోపాటు ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతికి చెందిన వారు కూడా తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకోవడంపై మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జాతులకు చెందిన కుక్కలు, పిల్లులు, పక్షులకు బీమా సౌకర్యం కల్పించేందుకు పలు ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇటీవల వేలాది జంతువులకు ఇలాంటి భరోసా కల్పించినట్లు బీమా కంపెనీలు చెబుతున్నాయి. సాధారణ అనారోగ్యం మొదలు చిన్నపాటి సర్జరీలు, కేన్సర్, గుండెజబ్బుల వంటి ప్రమాదకర వ్యాధుల చికిత్సలకు సైతం డబ్బులు చెల్లిస్తారు. వ్యాక్సినేషన్, డీవార్మింగ్, టిక్ట్రీట్మెంట్, డాక్టర్ విజిట్ వంటివి కూడా బీమా పరిధిలోకి రావ డం విశేషం. ఒకవేళ ఆ పెట్ ఆకస్మికంగా మరణించినా యజమానికి బీమా మొ త్తాన్ని చెల్లించే కంపెనీలు కూడా ఉన్నాయి. నెలకు రూ.122 నుంచి 500 వరకు.. సాధారణంగా ఇళ్లలో పెంచుకునే శునకాల జీవితకాలం సుమారు 12 ఏళ్లు ఉంటుంది. అయితే బీమా కంపెనీలు రెండు నెలల నుంచి 8 ఏళ్ల మధ్య వయసున్న కుక్కలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తున్నాయి. ఇందుకోసం పెట్స్ యజమానులు నెలకు రూ.122 నుంచి 500 వరకు ప్రీమియంగా చెల్లిస్తున్నారు. పెంపుడు జంతువులకు అనారోగ్యానికి నెలకు రూ.8 వేల నుంచి 10 వేల వరకు ఖర్చు చేస్తున్న వారికి ఈ బీమా ఆర్థికంగా బాగా కలిసివస్తుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. పెట్స్‌కు చికిత్సకయ్యే ఖర్చులో 80 శాతం వరకు కంపెనీ చెల్లిస్తుంది. కేన్సర్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు తదితర ప్రమాదకర వ్యాధుల సర్జరీలకు సుమారు రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈ చికిత్సలు కూడా బీమా పరిధిలోకి వస్తాయి. ముందుకొస్తున్న కంపెనీలు.. పెట్స్‌కు బీమా సౌకర్యం కల్పిస్తున్న వాటిలో పాటెక్టో వెటీనా హెల్త్‌కేర్ ఎల్ఎల్పీ, న్యూ ఇండియా అస్యూరెన్స్, పావ్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలున్నాయి. ఈ బీమా వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఇతర కంపెనీలు సైతం ఈ రంగంలోకి వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నగరంలో పెట్స్‌ను విక్రయించే దుకాణాలు, వాటికి అవసరమైన ఆహారం, మందులు అందించే సంస్థలు సైతం బాగా విస్తరించాయి. ఇదే క్రమంలో బీమా సదుపాయం రావడంతో పెంపుడు జంతువుల బతుకులకు భరోసా లభిస్తోందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. పెట్స్ బీమా అత్యవసర జాబితాలోకి.. ఇçప్పుడు పెట్స్ ఇన్సూరెన్స్ కూడా అత్యవసర జాబితాలోకి చేరింది. హెల్త్‌కేర్, సర్జరీ వంటివి యజమానికి భారం కాకుండా పలు బీమా కంపెనీలు పాలసీలు ఇస్తున్నాయి. ఎక్కువ మంది నగరవాసులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. –డాక్టర్ ఎం.అరుణ్‌కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, సరూర్‌నగర్ ప్రైమరీ వెటర్నరీ సెంటర్ -
గ్రీన్హౌస్ నిర్మాణాలకు బీమా
- ఓరియంటల్, యూఐఐ బీమా కంపెనీలకు అప్పగింత - ఏడాదికి ఎకరానికి రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రీమియం నిర్ధారణ - తొలి ఏడాది గ్రీన్హౌస్ నిర్మించిన కంపెనీలదే ప్రీమియం చెల్లింపు బాధ్యత - ఈదురు గాలులు, అగ్ని ప్రమాదాల్లో నష్టపోతే రూ.24 లక్షల వరకు పరిహారం సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ (పాలీహౌస్) నిర్మాణాలకు బీమా సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈదురు గాలులు, భారీ వర్షాలు, తుపాన్లు, వరదలు, భూకంపాలకు గ్రీన్హౌస్ నిర్మాణాలు ధ్వంసమైతే రైతులకు బీమా సొమ్ము లభిస్తుంది. గ్రీన్హౌస్ నిర్మాణాలకు బీమా కల్పించేందుకు ఓరియంటల్ బీమా కంపెనీ, యునెటైడ్ ఇండియా బీమా (యూఐఐ) కంపెనీలు ముందుకొచ్చాయి. గత ఆరు నెలల్లో గ్రీన్‌హౌస్‌లు నిర్మించిన రైతులందరినీ తప్పనిసరిగా బీమా పరిధిలోకి తీసుకొస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో వారంతా తప్పనిసరిగా ప్రీమియం చెల్లించాలి. త్వరలో విధివిధానాలను ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తామని ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రూ.34 లక్షల మొత్తానికి బీమా... తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎకరా గ్రీన్హౌస్ నిర్మాణానికి రూ. 40 లక్షల వరకు ఖర్చు కానుంది. అందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇతర రైతులకు 75 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇంత భారీగా సొమ్ము ఇస్తున్న నేపథ్యంలో ఈదురు గాలులు, వరదలు, ఇతరత్రా నష్టం జరిగితే చెల్లించిన సొమ్మంతా నష్టపోయే పరిస్థితి రానుంది. అందుకోసం బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎకరాకు రూ. 34 లక్షల బీమా చేయించడానికి అవకాశం కల్పించింది. ఓరియంటల్ బీమా కంపెనీ ఏడాదికి రూ. 7,013 ప్రీమియంగా వసూలు చేస్తుంది. గ్రీన్హౌస్లో పాలీ షీట్లకు ఏడాదికి 50 శాతం, అలాగే నిర్మాణంపై 15 శాతం తరుగుదలగా లెక్కిస్తుంది. ఇక యునెటైడ్ ఇండియా బీమా కంపెనీ కూడా పాలీషీట్లపై 40 శాతం, నిర్మాణంపై 15 శాతం తరుగుదలను లెక్కించింది. ఈ కంపెనీ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రూ. 9,844 ప్రీమియంగా నిర్ణయించింది. ఈ జిల్లాలు భూకంప జోన్లు కాబట్టి అధిక ప్రీమియం చెల్లించాలని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో రూ. 9,649గా నిర్ధారించింది. గ్రీన్హౌస్ నిర్మాణం, పాలీషీట్లు, షేడ్నెట్లకు కూడా కవరేజీ ఉంటుంది. గ్రీన్హౌస్లో పండించే పంటలకు మాత్రం కవరేజీ ఉండదు. రూ. 23 లక్షల నుంచి రూ. 24.64 లక్షల వరకు క్లెయిమ్స్ తరుగుదలను, ఇతరత్రా వాటిని లెక్కలోకి తీసుకుంటే గ్రీన్హౌస్ నిర్మాణం, పాలీషీట్లు పాడైపోతే ఓరియంటల్ బీమా కంపెనీ గరిష్టంగా రూ.24.64 లక్షల వరకు క్లెయిమ్ ఇవ్వనుంది. అందులో నిర్మాణంపై రూ. 23.27 లక్షలు, పాలీషీట్పై రూ.1.34 లక్షలు క్లెయిమ్స్ ఇవ్వనుంది. యునెటైడ్ ఇండియా బీమా కంపెనీ రూ.23.06 లక్షలు క్లెయిమ్స్ ఇవ్వనుంది. అందులో నిర్మాణంపై రూ.22.05 లక్షలు, పాలీషీట్లపై రూ.1.01 లక్షలు ఇవ్వనుంది. పాలీషీట్లపై రెండో ఏడాది 80 శాతం తరుగుదల చూపిస్తారు. దీనివల్ల రైతుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా పాలీషీట్లపై ఐదేళ్ల వారంటీని కూడా కంపెనీ కల్పించింది. కాబట్టి రెండో ఏడాది పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక ఈదురు గాలులతో పాలీషీట్లు ధ్వంసం అవుతాయే కానీ... గ్రీన్హౌస్ నిర్మాణానికి పెద్దగా జరిగే నష్టం ఏమీ ఉండదు. కాబట్టి కంపెనీలకు కూడా లాభదాయకమే అవుతుంది. -
చిన్న కంపెనీ కార్మికులకూ ఈపీఎఫ్
చట్టాన్ని సవరిస్తాం: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: పది మంది ఉన్న చిన్న కంపెనీల్లో పని చేసే కార్మికులకూ భవిష్యనిధి(ఈపీఎఫ్) సౌకర్యం కల్పించేలా చట్టాన్ని సవరిస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రస్తుతం 20 మందికిపైగా కార్మికులున్న కంపెనీల్లో పనిచేసే వారికే ఈపీఎఫ్ వర్తిస్తుందన్నారు. చట్టం సవరిస్తే కోట్లాది మంది కార్మికులకు పెన్షన్, పదవీవిరమణ ప్రయోజనం, మెడికల్, బీమా సౌకర్యం వంటివన్నీ వర్తిస్తాయని శనివారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో చెప్పారు. కనీస పరిమితి వంటివాటి అంశాల్లోనూ కార్మికులకు ఉపయోగపడే చాలా సవరణలు తెస్తామన్నారు. అన్ని అలవెన్సులు కలిపి 7 వేలు జీతం దాటే ప్రతీ కాంట్రాక్టు ఉద్యోగికి పీఎఫ్ వర్తింపజేస్తామన్నారు. పత్తి కొనుగోలులో ప్రభుత్వం ఇచ్చే బోనస్, ధర వంటివాటిలో అక్రమాలకు చోటులేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దళారుల పాలు కాకుండా రైతులకే నేరుగా ఆన్లైన్ చెల్లింపులు చేయాలన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమన్నారు. -
గుడ్లు తేలేసిన పౌల్ట్రీ
పరిశ్రమదారులకు అందని పరిహారం నడిరోడ్డున వేలాది మంది కార్మికులు అప్పులు పుట్టక అల్లాడుతున్న రైతులు గణనీయంగా తగ్గిన గుడ్లు, కోళ్ల ఉత్పత్తి పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు. హుద్‌హుద్ దెబ్బకు కనివినీ ఎరుగని రీతిలో నష్టపోయిన పౌల్ట్రీ రైతులునష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. పూర్తిస్థాయిలో పరిహారమందక..నేలమట్టమైన ఫారాలను నిలబెట్టుకునేందుకు అప్పులు పుట్టక అల్లాడిపోతున్నారు. వేలాది మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయి వలస బాట పడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ ధాటికి జిల్లాలో మూడువందలకు పైగా కోళ్లఫారాలు నేలమట్టమయ్యాయి. 16.17లక్షల బ్రా యిలర్, 15.21లక్షల లేయర్ కోళ్లు చనిపోయినట్టు అధికారులే లెక్క తేల్చారు. వీటిలో ఏ ఒక్క ఫారానికి సరైన బీమా సౌకర్యం లేకపోవడంతో ఏఒక్కరూ జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేకపోతున్నారు. చనిపోయిన కోడికి రూ.500 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయగా, గుడ్డుపెట్టే కోడికి రూ.150లు, బ్రాయిలర్ కోడికి రూ.75ల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. లేయర్ కోళ్ల ఫారానికి గరిష్టంగా రూ.15లక్షలు, బ్రాయిలర్ కోళ్ల ఫారానికి రూ.7.5లక్షల చొప్పున సీలింగ్ విధించారు. ఈ విధంగా రూ.120కోట్లు మంజూరు చేశారు. ఈమొత్తంలో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే రైతుల అకౌంట్లకు జమయింది. మిగిలిన 50శాతం మంది బాధిత రైతులు పరిహారం కోసం కళ్లల్లో ఒత్తులేకుసుని ఎదురు చూస్తున్నారు. పరిహారంవిషయంలో చాలా మంది అర్హులైన రైతులకు అన్యాయమే జరిగింది. ఈ పరిహారం 25 శాతం నష్టాన్ని కూడా పూడ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ పరిహారం అందితే కాస్త కుదుటపడవచ్చునని రైతులు ఆశిస్తున్నారు. మళ్లీ నిలదొక్కుకునేందుకు అప్పుల కోసం ప్రైవేటు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. నేలమట్టమైన ఫారాల్లో కేవలం 50 శాతమే తిరిగి నిలదొక్కుకోగలిగాయి. అదీ కూడా తాత్కాలిక షెడ్లలో రూ.10ల వడ్డీకి అప్పులు చేసి మరీ పెట్టుబడులతో ఫారాలను నిలబెట్టుకోగలిగారు. మిగిలినవి తుఫాన్‌కు సాక్ష్యాలుగానే నేటికీ దర్శనమిస్తున్నాయి. తుఫాన్ దెబ్బకు జిల్లాలో గుడ్లు, కోళ్ల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. జిల్లాలో సాధారణంగా రోజుకు 60 లక్షల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం 35లక్షల నుంచి 40లక్షలకు మించడం లేదు. ఇక జిల్లాలో 20లక్షల వరకు బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి జరిగేది. తుఫాన్ తర్వాత అది 13లక్షల నుంచి 15లక్షలకు పడిపోయింది. ఈ పరిశ్రమ టర్నో వర్ కూడా సగానికి పైగా తగ్గిపోయిందని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. దీంతో జిల్లా అవసరాల కోసం ఉభయగోదావరి జిల్లాల నుంచి గుడ్లు,కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫారం పునర్నిర్మాణం కోసం ఉపయోగించే ముడిసరుకుపై 14 శాతం వ్యాట్‌ను రద్దు చేయాలని, ఉమ్మడి రాష్ర్టంలో జారీ చేసిన జీవో మేరకు పౌల్ట్రీ పరిశ్రమకు యూనిట్ రూ.3.88లకే విద్యుత్ సరఫరా చేయాలని, టర్మ్, వర్కింగ్ కాపిటల్ రుణాలపై వడ్డీరాయితీ ఇవ్వాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. రూపాయి పరిహారం ఇవ్వలేదు నా కోళ్ల ఫారం తుఫాన్ దెబ్బకు నేలమట్టమైంది. 13వేల కోళ్లు చనిపోయాయి. షెడ్లు పూర్తిగా ధ్వంసమైంది. రూ.15లక్షలు పెట్టుబడి పెట్టాను. ఇందులో రూ.10 లక్షలు బ్యాంకు నుంచి అప్పు తెచ్చాను. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి నా ఫారాన్ని చూసిన పాపాన పోలేదు. దెబ్బతిన్న రైతుల జాబితాలో నా పేరు లేదు. ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. అప్పు ఏ విధంగా తీర్చా లో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఫారం మూసి వేశాను. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. - జాన్, పౌల్ట్రీ రైతు పెదపీనార్ల, నక్కపల్లి మండలం -
ఆఫర్స్.. ఆకర్ష్..
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో రసవత్తర రాజకీయం నెలకొంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీల సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లాలో ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. ఒకరిని మించి మరొకరు నాయకులు తమ పార్టీలో చేరాలంటూ చేస్తున్న విస్త్రృత ప్రచారం చర్చనీయాంశంగా మారింది. అది సరిపోదంటూ ఆఫర్లతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ప్రజలే స్వచ్ఛందంగా పార్టీలో చేరేవారు. దీనికి భిన్నంగా ఈసారి నాయకులు పార్టీ సభ్యత్వాలు తీసుకోవాలంటూ ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీలో చేరే వారి కోసం ఏకంగా నజరానాలే ప్రకటిస్తున్నారు. రూ. వందతో పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి రెండేళ్ల వరకు రూ.2 లక్షల ప్రమాద బీమాతో పాటు రూ.50 వేలతో కూడిన ఆరోగ్య బీమా కల్పిస్తామని ఇటీవల టీడీపీ కరపత్రాలు, టీవీల్లో విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇటు కాంగ్రెస్ కూడా పార్టీలో చేరే ప్రతి కార్యకర్తకూ బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. మరోపక్క.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా పార్టీ సభ్యత్వ నమోదు అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. 2019లో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలో రావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న బీజేపీ పార్టీలో క్రియాశీలక సభ్యులకు నజరానాలు ప్రకటించింది. రూ.500లతో సభ్యత్వం తీసుకుంటే.. రూ.300లతో మూడేళ్ల వరకు బీజేపీ పత్రిక జనసందేశ్ను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.30 వేల ఆరోగ్య బీమా కల్పిస్తామని విస్తృత ప్రచారం చేస్తోంది. అంతేకాదు.. గతంలో పార్టీ సభ్యత్వం తీసుకుంటే రెండేళ్ల వరకు ఉండే కాలపరిమితిని ఈ సారి ఐదేళ్లకు పొడిగించింది. ‘బీమా’ ధీమా నింపేనా..? పార్టీ సభ్యత్వ నిర్దేశిత లక్ష్యం చేరేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కార్యకర్తలు, క్రియాశీలక సభ్యులకు ‘బీమా’ సౌకర్యం కల్పించాలని నిర్ణయించాయి. పూర్వ వైభవం కోసం టీడీపీ పాకులాడుతుంటే.. కాంగ్రెస్ ఉనికి కాపాడుకునేందుకు పరితపిస్తోంది. దేశ ప్రధాని నరేంద్రమోడీ చరిష్మాతో బీజేపీ జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. జిల్లాలో టీడీపీ అత్యల్పంగా 25 వేలు, కాం గ్రెస్ 1.5 లక్ష నుంచి 2 లక్షలు, బీజేపీ 4 లక్షల సభ్యత్వ నమోదును టార్గెట్‌గా పెట్టుకుంది. పోలింగ్ బూత్‌ల వారీగా సభ్యత్వాలు చేయించాలని పార్టీ జిల్లా నాయకు లు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను ఆదేశించా రు. అయినా ప్రస్తుతం పార్టీలన్నీ సభ్యత్వ నమోదు విషయంలో లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. పార్టీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా ఇప్పటికీ ఏ పార్టీ కూడా లక్ష్యంలో 30 శాతానికి చేరుకోలేదు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఇంటింటికి విస్తృతంగా పర్యటిస్తూ మా పార్టీలో చేరాలంటే.. మా పార్టీలో చేరాలని ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయా పార్టీలు సభ్యత్వ నమోదు గడువు గత నెలాఖరు నుంచి ఈ నెలాఖరు వరకు పొడిగించాయి. ఆలస్యమైనా.. నిర్దేశిత లక్ష్యం పూర్తి చేస్తామంటూ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో లేని నాయకులు ఓ వైపు పార్టీలు సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటే.. పలు చోట్ల నియోజకవర్గ ఇన్చార్జీలు, ద్వితీయ శ్రేణి నాయకులు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. చాలా చోట్ల నియోజకవర్గ ఇ న్చార్జీలు స్థానికంగా అందుబాటులో ఉండడం లేదు. దీంతో పార్టీ శ్రేణులూ సభ్యత్వ కార్యక్రమాలను తేలిగ్గా తీసుకుంటున్నాయి. పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, ప్రజలకు అందుబాటు లో లేని నాయకులు సభ్యత్వంపై ప్రచారం చేస్తున్నా.. ప్రజలు వారిని నమ్మడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీల సభ్యత్వ నమోదు లక్ష్యం ఏ మేరకు పూర్తవుతుందోననే చర్చ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. -
కాంగ్రెస్ కార్యకర్తలకూ ఇన్సూరెన్స్
బడ్జెట్ ఖర్చులపై సీఎం కేసీఆర్ చర్చకు రావాలి : పొన్నాల జోగిపేట : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. సోమవారం ఆందోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పొన్నాల మాట్లాడుతూ ఇన్సూరెన్స్ విషయంలో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేసి ఉంటే ఇన్ని ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావని అన్నారు. ఈ విషయంలో విడుదల చేసిన 25 శాతం నిధులు వడ్డీ కిందకే పోతున్నాయన్నారు. బూటకపు మాటలతో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఉద్యమం ముసుగులో ప్రజలను మభ్యపెట్టి అరాచకాలు సృష్టిస్తోందన్నారు. రూ. లక్ష కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి 31న ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో టీవీల ముందు చర్చకు రావాలని ఆయన సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఎన్నికల హామీలో భాగంగా ఎస్సీ కుటుంబాలకు పంపిణీ చేసే వేల ఎకరాల భూమిని ఎక్కడి నుంచి తెచ్చి పంపిణీ చేస్తారన్నారు. ఎకరానికి రూ.5 లక్షలు చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తే మిగతా సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ రామచంద్ర కుంతియా, మాజీ డిప్యూటీ సీఎం సీ.దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మెదక్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీమా ఉంటుందా?
కందుకూరు: మొక్కజొన్న పంటకు బీమా సౌకర్యం కల్పించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏడాది జూన్ ప్రారంభంలోనే విధివిధానాలు ప్రకటించే ప్రభుత్వం జూలై గడుస్తున్నా ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం వాతావరణాన్ని బట్టి చూస్తే ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా పరిధిలో సాగు చేపట్టిన రైతులు బీమా ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఉంటేనే ధీమా... మొక్కజొన్న పంటకు జిల్లా పరిధిలో బీమా సౌకర్యం ఉండటంతో రైతుల్లో ధీమా పెరిగింది. పంట నష్టపోయినా బీమా రూపంలో కనీసం పెట్టుబడి అయినా తిరిగివస్తుందనే ధీమాతో అధికంగా మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు రైతులు. జిల్లాలో మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 35729 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు నమోదు కావడంతో కేవలం ఆరు వేల హెక్టార్లలో మాత్రమే ఇప్పటివరకు సాగు చేపట్టారు. కందుకూరు, షాబాద్, ధారూరు, వికారాబాద్, మహేశ్వరం, చేవెళ్ల, షామీర్పేట తదితర మండలాల్లో అధికంగా మొక్కజొన్న పైరును సాగు చేస్తున్నారు. ఎకరాకు పెద్ద రైతుల నుంచి రూ.229, చిన్న, సన్నకారు రైతుల నుంచి రూ.206 వరకు ప్రీమియంగా వసూలుచేసేవారు వ్యవసాయాధికారులు. ఈ మొత్తాన్ని జులై 31లోపు కట్టించుకునేవారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం వైపు నుంచి స్పందన లేదు. దీంతో రోజూ రైతులు వ్యవసాయాధికారులను బీమా విషయమై సంప్రదిస్తూనే ఉన్నారు. జూన్ నెలలో సాగు చేసిన రైతులు ఆ నెలలోనే బీమా చెల్లించాలి, ప్రస్తుతం జూలై నెల కూడా మరో వారంలో ముగియనుండటంతో ఈ ఏడాది బీమా అసలు అమలు చేస్తారా లేదా అనే సంశయం రైతుల్ని పట్టిపీడిస్తుంది. ఆలస్యంగానైనా బీమా అమలు చేస్తే ముందుగా సాగు చేసిన పంటల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనే సందేహాలతో సతమతమవుతున్నారు. వ్యవసాయాధికారుల్ని ఈ విషయమై వివరణ కోరగా.. ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలు తమకు అందలేదని చెబుతున్నారు. -
ఎఫ్‌డీల కన్నా మెరుగైన రాబడినిచ్చే ఫండ్స్?
నేను రిటైర్ కావడానికి ఇంకా తొమ్మిదేళ్లు సమయముంది. నాకు సరిపోయినంతగా బీమా, పెన్షన్ ప్లాన్లున్నాయి. నేను వారానికి రూ.10,000 చొప్పున నెలకు రూ.40,000 వరకూ ఇన్వెస్ట్ చేయగలను. నాకు 70 ఏళ్లు వచ్చేసరికి ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగల విధంగా నా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. తగిన సూచనలివ్వండి. - జి. సురేష్, అమలాపురం మీరు తెలివైన ఇన్వెస్టర్లాగా ఉన్నారు. రిటైర్మెంట్కు సమంజసమైన కార్పస్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేస్తే ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగల రాబడులను ఆర్జించవచ్చు. బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీ రిటైర్మెంట్ నాటికి చెప్పుకోదగ్గ సంపదను సృష్టించుకోవచ్చు. మంచి ట్రాక్ రికార్డ్, రేటింగ్ ఉన్న రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్స్‌ల్లో ప్రతీ వారం ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. బ్యాలెన్స్డ్ ఫండ్స్ వల్ల పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఈక్విటీల్లో 65 శాతానికి పైగా పెట్టుబడులు పెడతాయి. ఈక్విటీల్లో ఏడాదికి పైగా ఇన్వెస్ట్ చేస్తే వాటిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ వేతనాలొచ్చే వ్యక్తులకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్-ఎస్ఐపీ) చాలా బావుంటుంది. అయితే ప్రతినెలా ఒకే మొత్తంలో కాకుండా ఎక్కువ, తక్కువగా ఆదాయం లభించే వ్యక్తులు ఏవిధంగా ఇన్వెస్ట్ చేయాలి? నేను ఇప్పుడు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయగలను. సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) విధానాన్ని అనుసరించవచ్చా? - ఇందర్జైన్, హైదరాబాద్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఒకేసారి కాకుండా కొంత కొంత మొత్తాల్లో దఫదఫాలుగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలని తరుచూ సూచిస్తూ ఉంటాం. ఇలా చేస్తే స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులను తట్టుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఇన్వెస్ట్ చేసిన రోజు స్టాక్స్/ ఫండ్స్ అధిక ధర ఉండి. ఆ మరుసటి రోజు తగ్గాయనుకోండి. మీ పెట్టుబడుల విలువ తగ్గుతుంది. ఇలా విలువ తగ్గినప్పటికీ, కొందరు తట్టుకోగలరు. కానీ కొత్త, చిన్న ఇన్వెస్టర్లు మాత్రం డీలాపడి, ఇన్వెస్ట్మెంట్ జోలికే రారు. అందుకే ఎప్పుడైనా సరే, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఈక్విటీల్లో పెద్ద మొత్తంలో ఒకేసారి పెట్టుబడులు పెట్టకుండా, అదే మొత్తాన్ని దఫదఫాలుగా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. మీకు ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్ములు వచ్చినప్పుడు ముందుగా వాటిని ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) విధానంలో మీ పెట్టుబడులను ఈక్విటీలోకి మళ్లించండి. ఫలితంగా మార్కెట్లు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో గరిష్ట, కనిష్ట స్థాయిలకు చేరినప్పుడు తగిన ప్రయోజనాలు ఈ విధానంలో మీకు లభిస్తాయి. నా పెట్టుబడులపై సురక్షితమైన, స్థిరమైన రాబడులను ఆశిస్తున్నాను. ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడినిచ్చే ఇన్వెస్ట్మెంట్ మార్గాలను సూచించండి? - ప్రత్యూష, విజయవాడ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ) సమంజసమైన సురక్షితమైన రాబడులను అందిస్తాయి. అయితే లిక్విడిటీ విషయంలో కొంచెం రాజీపడాల్సి ఉం టుంది. మీరు ఈ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే ఈ ఫండ్ ప్లాన్ మెచ్యూరిటీ వరకూ మీ పెట్టుబడులను ఉపసంహరించుకునే వీలు లేదు. ఇవి ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడులు అందిస్తాయి. 30 శాతం ఆదాయపు పన్ను బ్రాకెట్లో ఉన్నవారికి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద గత ఏడాది కాలంలో పన్ను తర్వాత నికరంగా 6.3 శాతం రాబడులు వచ్చాయి. అదే ఎఫ్ఎంపీలు 9.51 శాతం రాబడిని ఇచ్చాయి. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లలాగా ఎఫ్ఎంపీలను ముందుగా విత్‌డ్రా చేసుకునే వీలు లేదు. సాధారణంగా ఎఫ్‌ఎంపీల మెచ్యూరిటీ 12 నుంచి 36 నెలలుగా ఉంటుంది. ఈ కాలపరిమితి తీరేవరకూ మీ పెట్టుబడులను వెనక్కి తీసుకునే వీలు లేదు. ఎఫ్ఎంపీలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవుతాయి. మెచ్యురిటీకి ముందే మీ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలంటే ఈ ఎఫ్ఎంపీలను వేరే ఇన్వెస్టర్లకు అమ్ముకోవచ్చు. కానీ ఎఫ్‌ఎంపీల క్రయ, విక్రయ లావాదేవీలు చాలా చాలా స్వల్పంగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే వీటిని మీరు విక్రయించలేరు. ఏతావాతా తేలేదేమిటంటే మెచ్యూరిటీ కాలానికి తప్ప మధ్యలో ఎఫ్‌ఎంపీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునే వీలు లేదు. కాకుంటే ఎఫ్‌డీల కన్నా మెరుగైన రాబడులనిస్తాయి. -
విద్యార్థులకు బీమా
సాక్షి, ముంబై: ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున విద్యార్థులకు బీమా సౌకర్యం కల్పించాలని విద్యాశాఖ యోచిస్తోంది. గత సంవత్సరమే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఆ వివరాల్లోకెళ్తే... సహజంగా లేదా ఏదైనా ప్రమాదం కారణంగా మరణిస్తే రూ.50,000 పరిహారాన్ని, గాయపడితే రూ. 30,000 పరిహారాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు లేదా సంరక్షకుడికి అందజేస్తుంది. మరణించిన సందర్భంలో పూర్తి పరిహారాన్ని, గాయపడిన సందర్భంలో గాయాల తీవ్రత ఆధారంగా పరిహారాన్ని అందజేస్తుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆత్మహత్య, హత్య వంటి కారణాలతో విద్యార్థి మరణిస్తే ఎటువంటి పరిహారానికి అర్హులు కారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తే 75 లక్షల మంది విద్యార్థులకు బీమా సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. ఇందుకు బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించాలి. దరఖాస్తు చేసుకున్నవారికే... పశ్చిమ కల్యాణ్‌లోని డాన్‌బాస్కో పాఠశాలలో విద్యనభ్యస్తున్న ఆరేళ్ల బాలుడు కృష్ణయాదవ్‌పై ఇటీవల తరగతి గదిలోని సీలింగ్ ఫ్యాన్ మీద పడింది. దీంతో అతని తలకు తీవ్ర గామైంది. ఆ సమయంలో తరగతి గదిలో 45 మంది విద్యార్థులున్నారని, మిగతావారికి ఎటువంటి గాయాలు కాలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. బీమా పథకం ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్నా బాలుడి తల్లిదండ్రులు ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో బాధిత విద్యార్థి ఎటువంటి పరిహారం పొందలేకపోయాడు. నిజానికి ఇటువంటి పథకం ఒకటుందనే విషయం విద్యార్థుల తల్లిదండ్రులకే కాదు ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు కూడా తెలిదనే విషయం ఈ ఘటనతో బయటపడింది. ఒకవేళ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఈ పథకం గురించి తెలిస్తే బీమా కోసం విద్యార్థి తల్లిదండ్రులతో దరఖాస్తు చేయించేవాడని, బాలుడికి పరిహారం అందేదని, పథకంపట్ల అవగాహన లేకే పరిహారాన్ని పొందలేకపోయాడని విద్యాశాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసినా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాత్రమే పరిహారం పొందే అవకాశముంటుందని చెప్పారు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై అసంతృప్తి రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పదేళ్లలో 793 మంది విద్యార్థులు మృత్యువాత పడడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఏటా దాదాపు 80 మంది మరణించడమంటే నిర్వహణ సరిగా లేదనే విషయం తేటతెల్లమవుతోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాసిక్‌కు చెందిన సామాజిక కార్యకర్త రవీంద్ర తాల్పే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన పీవీ హరిప్రసాద్, పీఎన్ దేశ్‌ముఖ్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్రప్రభుత్వాన్ని మందలించింది. రాష్ట్రంలో 1,100 ఆశ్రమ పాఠశాలలుండగా 4,50,000 మంది విద్యార్థులు అందులో విద్యనభ్యసిస్తున్నారని, దశాబ్దకాలంలో 793 మంది విద్యార్థులు పాముకాటు, తేలుకాటు, జ్వరం, చిన్నపాటి అనారోగ్యాల కారణంగానే మరణించారని తాల్పే తన పిటిషన్లో ఆరోపించారు. మరణించిన విద్యార్థుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరిహారం కూడా చెల్లించలేదని ఆరోపించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తర ఫున అరుణ పాయి సమాధానమిస్తూ... మరణించిన 793 మందిలో 453 విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందజేశామని, 340 మంది విద్యార్థుల కుటుంబాలకు ఇంకా అందజేయాల్సి ఉందని చెప్పారు. అయితే తగినన్ని నిధులు లేకే పరిహారం అందజేయడంలో జాప్యం జరుగుతోందన్నారు. ఇక పాఠశాలల్లో సంభవిస్తున్న మరణాల సంఖ్యను తగ్గించేందుకు క్రమం తప్పకుండా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రథమ చికిత్స డబ్బాను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ధర్మాసనానికి చెప్పారు. ఈ వివరణపై కోర్టు స్పందిస్తూ... ఎంతో శ్రమకోర్చి గిరిజన బాలలు ఆశ్రమ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని, పాముకాటు, తేలు కాటుకు ప్రథ మ చికిత్స ఏమేరకు విద్యార్థులను కాపాడుతుందని ప్రశ్నించారు. దీనికి అరుణ సమాధానమిస్తూ... అత్యవసర సమయాల్లో విద్యార్థులను మెరుగైన వసతి కోసం ఇతర ప్రాంతాలకుతరలించేందుకు 35 జీపులను కొనుగోలు చేసిం దని, 185 మంది సిబ్బందిని కూడా నిజమించిందన్నారు. దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది ఉదయ్ మాట్లాడుతూ కనీసం ప్రతి ఆశ్రమ పాఠశాలకు ఓ వైద్యాధికారిని నియమించాలన్నారు. దీనికి కోర్టు స్పందిస్తూ... పిటిషనర్ చెప్పినదానిలో వాస్తవముందని, ప్రతి ఆశ్రమ పాఠశాలకు ఓ వైద్యాధికారిని నియమించాల్సిన అవసరముందన్నారు. కేసు తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు చెప్పిన ధర్మాసనం పిటిషనర్ లేవనెత్తిన సమస్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.