సాక్షి, మంచిర్యాల : జిల్లాలో రసవత్తర రాజకీయం నెలకొంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీల సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లాలో ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. ఒకరిని మించి మరొకరు నాయకులు తమ పార్టీలో చేరాలంటూ చేస్తున్న విస్త్రృత ప్రచారం చర్చనీయాంశంగా మారింది. అది సరిపోదంటూ ఆఫర్లతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
గతంలో ప్రజలే స్వచ్ఛందంగా పార్టీలో చేరేవారు. దీనికి భిన్నంగా ఈసారి నాయకులు పార్టీ సభ్యత్వాలు తీసుకోవాలంటూ ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీలో చేరే వారి కోసం ఏకంగా నజరానాలే ప్రకటిస్తున్నారు. రూ. వందతో పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి రెండేళ్ల వరకు రూ.2 లక్షల ప్రమాద బీమాతో పాటు రూ.50 వేలతో కూడిన ఆరోగ్య బీమా కల్పిస్తామని ఇటీవల టీడీపీ కరపత్రాలు, టీవీల్లో విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఇటు కాంగ్రెస్ కూడా పార్టీలో చేరే ప్రతి కార్యకర్తకూ బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. మరోపక్క.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా పార్టీ సభ్యత్వ నమోదు అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. 2019లో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలో రావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న బీజేపీ పార్టీలో క్రియాశీలక సభ్యులకు నజరానాలు ప్రకటించింది. రూ.500లతో సభ్యత్వం తీసుకుంటే.. రూ.300లతో మూడేళ్ల వరకు బీజేపీ పత్రిక జనసందేశ్‌ను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.30 వేల ఆరోగ్య బీమా కల్పిస్తామని విస్తృత ప్రచారం చేస్తోంది. అంతేకాదు.. గతంలో పార్టీ సభ్యత్వం తీసుకుంటే రెండేళ్ల వరకు ఉండే కాలపరిమితిని ఈ సారి ఐదేళ్లకు పొడిగించింది.
‘బీమా’ ధీమా నింపేనా..?
పార్టీ సభ్యత్వ నిర్దేశిత లక్ష్యం చేరేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కార్యకర్తలు, క్రియాశీలక సభ్యులకు ‘బీమా’ సౌకర్యం కల్పించాలని నిర్ణయించాయి. పూర్వ వైభవం కోసం టీడీపీ పాకులాడుతుంటే.. కాంగ్రెస్ ఉనికి కాపాడుకునేందుకు పరితపిస్తోంది. దేశ ప్రధాని నరేంద్రమోడీ చరిష్మాతో బీజేపీ జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. జిల్లాలో టీడీపీ అత్యల్పంగా 25 వేలు, కాం గ్రెస్ 1.5 లక్ష నుంచి 2 లక్షలు, బీజేపీ 4 లక్షల సభ్యత్వ నమోదును టార్గెట్‌గా పెట్టుకుంది. పోలింగ్ బూత్‌ల వారీగా సభ్యత్వాలు చేయించాలని పార్టీ జిల్లా నాయకు లు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను ఆదేశించా రు. అయినా ప్రస్తుతం పార్టీలన్నీ సభ్యత్వ నమోదు విషయంలో లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి.
పార్టీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా ఇప్పటికీ ఏ పార్టీ కూడా లక్ష్యంలో 30 శాతానికి చేరుకోలేదు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఇంటింటికి విస్తృతంగా పర్యటిస్తూ మా పార్టీలో చేరాలంటే.. మా పార్టీలో చేరాలని ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయా పార్టీలు సభ్యత్వ నమోదు గడువు గత నెలాఖరు నుంచి ఈ నెలాఖరు వరకు పొడిగించాయి. ఆలస్యమైనా.. నిర్దేశిత లక్ష్యం పూర్తి చేస్తామంటూ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులో లేని నాయకులు
ఓ వైపు పార్టీలు సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటే.. పలు చోట్ల నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ద్వితీయ శ్రేణి నాయకులు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. చాలా చోట్ల నియోజకవర్గ ఇ న్‌చార్జీలు స్థానికంగా అందుబాటులో ఉండడం లేదు. దీంతో పార్టీ శ్రేణులూ సభ్యత్వ కార్యక్రమాలను తేలిగ్గా తీసుకుంటున్నాయి. పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, ప్రజలకు అందుబాటు లో లేని నాయకులు సభ్యత్వంపై ప్రచారం చేస్తున్నా.. ప్రజలు వారిని నమ్మడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీల సభ్యత్వ నమోదు లక్ష్యం ఏ మేరకు పూర్తవుతుందోననే చర్చ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఆఫర్స్.. ఆకర్ష్..
Published Sun, Dec 7 2014 1:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement