బీజేపీ సభ్యుల సస్పెన్షన్
రెండు రోజుల పాటు వేటు
⇒ మార్షల్స్ సాయంతో బయటకు
⇒ సస్పెండవడానికే వచ్చారు: హరీశ్
⇒ మాట్లాడితే బయటికి పంపుతారా?
⇒ జానారెడ్డి ధ్వజం... వాకౌట్
⇒ బీజేపీకి జానా మద్దతు బాధాకరం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేక ధర్నాలో పాల్గొననివ్వకుండా బీజేపీ కార్యకర్త లను అరెస్టు చేయడంపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టిన ఆ పార్టీ సభ్యు లు రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ అయ్యారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడు తున్న బీజేపీ సభ్యులను శనివారం దాకా సస్పెండ్ చేయాలంటూ సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
శుక్రవారం సభ ప్రారంభ మవగానే నల్లకండువాలతో సభకు వచ్చిన బీజేపీ సభ్యులు జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, రాజా సింగ్ తమ వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు బట్టారు. పోడియం ముందు నిరసనకుదిగారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడంపై మాట్లాడే అవకాశమివ్వాలన్నారు. స్పీకర్ నిరాకరించడంతో ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అక్రమ అరెస్టులు ఆపాలి’’ అంటూ నినదించారు. బీజేపీ సభ్యులు బయట ధర్నా పెట్టుకొని, సస్పెండయ్యే ఉద్దేశంతోనే వచ్చా రని హరీశ్ ఆక్షేపించారు. ఇది పద్ధతి కాదని, కూచోవాలని కోరారు. వారు నినాదాలు చేస్తూనే ఉండటంతో శనివారం దాకా సస్పెండ్ చేయాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు.
బీజేపీకి జానా మద్దతు
తమ ధర్నాను అడ్డుకున్నందుకు బీజేపీ సభ్యులు సభలో ఆందోళన చేస్తున్నారంటూ విపక్ష నేత జానారెడ్డి వారికి మద్దతుగా మాట్లా డారు. వాయిదా తీర్మానాలుంటే ప్రశ్నోత్తరాల తర్వాత మాట్లాడాలని బీఏసీలో నిర్ణయిం చామని హరీశ్ గుర్తు చేశారు. ధర్నా చౌక్‌ను ఇందిరా పార్కులోనే కొనసాగిస్తే చలో అసెంబ్లీ కార్యక్రమమే ఉండేది కాదుగా అని జానా అన్నారు. ధర్నా చౌక్ తరలింపును ఉపసంహ రించుకోవాలని, అరెస్టు చేసిన వారిని విడిచి పెట్టాలని కోరారు. ఈ సమయంలోనూ బీజేపీ సభ్యులు నినాదాలు చేయడంతో స్పీకర్ సస్పె న్షన్ తీర్మానం చదివారు. దాంతో వారు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు.
వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాముల్లోనూ ఇంత దౌర్జన్యం లేదన్నారు. మార్షల్స్ వచ్చి బీజేపీ సభ్యలను బయటకు తీసుకెళ్లారు. మాట్లాడితే అణచేస్తాం, బయటకు పంపుతామంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని జానా అసంతృప్తి వెలిబుచ్చారు. వారి సస్పెన్షన్‌కు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. సస్పెన్షన్ చేయించుకునేందుకే వచ్చిన బీజేపీ సభ్యులకు జానా మద్దతివ్వడం దురదృష్టకరం, బాధాకరం అని హరీశ్ అన్నారు. ‘‘ఏపీ సభలో విపక్ష నేత మైక్ గంటగంటకు కట్ చేస్తున్నారు. ఇక్కడలా చేయడం లేదు. అక్కడ 4 గంటలకోసారి సభ వాయిదా పడుతోంది.
ఇక్కడ ఎన్ని గంటలైనా చర్చ జరుగుతోంది. సంఖ్యాపరంగా తక్కువున్నా విపక్ష సభ్యులకే ఎక్కువ అవకాశమిచ్చాం. టీఆర్‌ఎస్ సభ్యులు 8.45 గంటలు మాట్లాడితే, కాంగ్రెస్ సభ్యులు 11.31 గంటలు, బీజేపీ 5.40 గంటలు, మజ్లిస్ 3.36 గంటలు, సీపీఎం 1.15 గంటలు, టీడీపీ 2.14 గంటలు మాట్లాడారు’’ అని వివరించారు. కాగా, ఇదే అంశంపై మండలిలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు.