సాక్షి, కరీంగనర్ : ఆంధ్రప్రదేశ్ అవసరాలను సీఎం చంద్రబాబు నాయుడు జీరో చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మండిపడ్డారు. బీజేపీ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంస్థాగతంగా సిద్ధమైందని బీజేపీ నేత స్పష్టం చేశారు. కర్నాటక ఫలితాలతో కాంగ్రెస్ ఓటమి వైపు దూసుకెళ్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు బలమైన స్థానం లేదన్నారు. కర్నాటక ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుంది. ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు మాట్లాడే మాటలను కాంగ్రెస్ మాట్లాడుతుందని విమర్శలు గుప్పించారు. దేశ భద్రత, సమగ్రతకు బీజేపీ పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
‘2019 ఎన్నికల్లో వేర్పాటువాదంను సమర్థించే విషయాన్ని చర్చనీయాంశంగా మార్చుతాం. టీఆర్ఎస్ కాంగ్రెస్‌కు జేబు సంస్థ, టీఆర్ఎస్‌ను సమర్థిస్తే కాంగ్రెస్‌ను సమర్థించినట్లే అవుతుంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారు. ఆ పార్టీలో ఉంటూ ఎన్టీఆర్‌ను అవమానించేలా చంద్రబాబు రాహుల్ గాంధీని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలను జీరో చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలపడం ఆంధ్రప్రజలకు అవమానం. నిరుద్యోగానికి మారుపేరు టీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై బీజేపి త్వరలో చార్జిషీట్ వేస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను గ్రామగ్రామానికి తీసుకెళ్తాం. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని’ బీజేపీ నేత మురళీధర్ రావు ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment