సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆపరేషన్ ఆకర్ష మాయలో పడి ‘గులాబీ’ కండువా కప్పుకున్న కాంగ్రెస్, టీడీపీ నేతలు అతర్మథనంలో పడ్డారు. టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగాలా.. లేక.. సొంత గూటికి వెళ్లాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను బలహీన పరచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన చాణక్య పాచికలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు చిక్కారు. అధికార పార్టీలో ఉంటే వచ్చే ఎన్నికల నాటికి ఆర్థికంగా కొంత బలపడి అనుచర వర్గాన్ని, కార్యకర్తలను కాపాడుకోవచ్చని కొందరు.. నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్త సెగ్మెంట్లు వస్తే బెర్తు ఖరారు చేసుకోవచ్చని ఇంకొందరు.. కనీసం నామినేటెడ్ పోస్టులు దక్కించుకోవచ్చని మరికొందరు నాయకులు ‘కారు’ ఎక్కేశారు. తీరా పార్టీలోకి వెళ్లాక అన్నీ తలకిందులయ్యాయి.
కుడితిలో పడ్డ ఎలుకలా..
నియోజకవర్గాల పునర్విభజన ఎలాగు సాధ్యం కాదని తేలిపోయింది. అడపాదడపా నామినేటెడ్‌తోపాటు ఇతర పోస్టుల భర్తీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే వచ్చా రు. మరో వైపు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ పోటీదారుల పట్ల మొదటి నుంచీ జాగ్రత్త పడుతూనే వస్తున్నారు. ముఖ్యంగా తమకు భవిష్యత్‌లో పోటీగా వస్తారనుకునే నాయకులను గుర్తించి వారి ఆర్థిక మూలాల మీద కన్నేసి పెట్టారు.
వారికి ప్రభుత్వపరమైన ఎలాంటి కాంట్రాక్టు పనులు, ఇతర వర్క్స్ రాకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. కనీసం కార్యకర్తలు, ముఖ్య అనుచరులను కూడా కాపాడుకోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరో వైపు అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి మళ్లీ టికెట్లు ఇస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించడంతో చేరిక నాయకుల పని కుడితిలో పడ్డ ఎలుక తీరుగా మారింది.
వరంగల్ తూర్పు : ఈ నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకుడు బస్వరాజు సారయ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో ఆయనపై టీఆర్‌ఎస్ అభ్యర్థిని కొండా సురేఖ గెలుపొందారు. ఆ తర్వాత క్రమంలో సారయ్య కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొండా సురేఖ ఉండడం, వాళ్లే ఇప్పుడున్న సీటుతో పాటు మరో సీటును అదనంగా అడుగుతున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ సైతం ‘తూర్పు’ మీద పట్టుబడుతున్నారు. మరో వైపు టీడీపీ నుంచి రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరి ‘తూర్పు’ మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పోటి నేపథ్యం లో బస్వరాజు సారయ్య, సుధారాణి, ప్రదీప్‌రావు పరిస్థితి ఏమిటనేది కాలం నిర్ణయించాల్సిందే.
స్టేషన్‌ఘన్‌పూర్ : ఈ నియోజకవర్గలో కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాజారపు ప్రతాప్ అనంతర కాలంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్‌గా అవకాశం వచ్చినా స్వీకరించలేదు. వచ్చే సాధారణ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే రాజయ్య, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ గ్యాప్ ఉండడంతో ప్రతాప్ ఆశలు పెంచుకున్నారు. కానీ.. ఈలోగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య దూసుకొచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె సంకేతాలు పంపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కడియం శ్రీహరికి మధ్య బలమైన రాజకీయ అనుబంధం ఉండడంతో ఏ నిమిషానికి రాజకీయం ఎలా మారుతుందోనని ఆసక్తి నెలకొని ఉంది.
భూపాలపల్లి : ఈ నియోజకవర్గం నుంచి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు ఈ ప్రాంతంలో టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిగా పేరున్న గండ్ర సత్యనారాయణరావు టీఆర్‌ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటూ పోతున్నారు. కానీ.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మధుసూదనాచారిని కాదని సత్యనారాయణకు టికెట్ ఇస్తారా.. అనేది సందేహాస్సదమే. మరో వైపు కొండా దంపతుల కుమార్తె సుష్మిత పటేల్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు కూడా ఈ నియోజకవర్గం నుంచి గట్టి ప్రయత్నంలోనే ఉన్నారు.
జనగామ : ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు.కాంగ్రెస్ నుంచి నాగపురి రాజలింగం, టీడీపీ నుంచి బోడకుంటి వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరినప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలుగానే కొనసాగుతున్నారు. వెంకటేశ్వర్లుకు మరోసారి టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ అవకాశం కల్పించి శాసనమండలి ప్రభుత్వ విప్‌గా నియమించారు. టీడీపీ నుంచి సీనియర్ నాయకుడు కొండం మధుసూదన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రత్యక్ష ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. అవకాశమిస్తే సద్వినియోగం చేసుకుంటానన్నట్లు మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం ఆలోచన చేస్తున్నట్లు వినిపిస్తోంది. కానీ.. సిట్టింగ్‌ను పక్కనపెట్టి ఎంత వరకు అవకాశం కల్పిస్తారో తెలియక రాజలింగం ఆందోళనతో ఉన్నారు.
పరకాల : ఈ నియోజకర్గంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన న్యాయవాది సహోదర్‌రెడ్డి.. చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధిష్టానం అవకాశం కల్పిస్తే పోటీ చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇదే పార్టీకి చెందిన ముద్దసాని సహోదర్‌రెడ్డి, మంద ఐలయ్య సైతం ఈ నియోజకవర్గంపై ఆసక్తిగా ఉన్నారు.
మహబూబాబాద్ : ఈ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈమె డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ కూతురు. ప్రస్తుతం మహబూబాబాద్ సెగ్మెంట్ నుంచి శంకర్‌నాయక్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మాలోతు కవిత తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
డోర్నకల్ : ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీఎస్.రెడ్యానాయక్ టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీఎస్.రెడ్యానాయక్ గెలిచారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటుతో రెడ్యా నాయక్ అధికార పార్టీలో చేరారు. ఇటీవల సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సీనియర్ అయిన రెడ్యానాయక్‌కు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని.. తనకు డోర్నకల్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ వర్తిస్తుందో వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment