Warangal political leaders
-
త్వరలో డీసీసీల ప్రకటన
సాక్షి, వరంగల్ రూరల్: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అన్ని జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీలను ప్రకటించాలని ఏఐసీసీ నిర్ణయించింది. 2016, అక్టోబర్ 11న రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మినహా అన్ని పార్టీలు కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కమిటీలను ప్రకటించాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు అనుగుణంగా ఇప్పటికే వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించగా, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు ప్రధాన కార్యదర్శులను నియమించాయి. ఇటీవల టీపీïసీసీ సైతం కొత్త జిల్లాల వారీగా డీసీసీలను ఏర్పాటు చేయాలని ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లట్ అదేశాలు జారీ చేశారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు కొత్తగా డీసీసీ అధ్యక్షులను నియమించనున్నారు. నూతన జిల్లాలు ఏర్పాటైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా కమిటీలతోనే రాజకీయాలు నిర్వహించింది. రాష్ట్రంలో 31 జిల్లాలకు విడివిడిగా కమిటీలను నియమిస్తే పార్టీ నేతలు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరిగి పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకవెళ్లే అవకాశం కలుగుతుందని అధిష్టానం భావించినట్లు తెలిసింది. గత ఏడాదే జిల్లాల వారీగా నూతన కమిటీలు ప్రకటించాలని ఏఐసీసీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదనలు పంపారు. కానీ అప్పుడు పాత జిల్లాల వారిగానే నూతన కమిటీలను ప్రకటించారు. పదవుల కోసం ప్రదక్షిణలు డీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పీసీసీ నేతల చుట్టూ, జిల్లాకు చెందిన సీనియర్ నాయకుల చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ అనుచరులకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇప్పించుకోవాలని పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటన తర్వాత డీసీసీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యం.. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలపైనే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేసి ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా నాయకుల సంఖ్యను పెంచుతున్నారు. రాష్ట్రానికి ఇప్పటికే ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇటీవల వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులతో సమావేశాలు కూడా నిర్వహించారు. టికెట్లు ఆశిస్తున్న వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ మాజీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఏఐసీసీ మహిళ ప్రధాన కార్యదర్శి సీతక్క, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కీలకంగా ఉన్నారు. వీరంతా తమ వర్గానికి చెందిన వారికి డీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో డీసీసీకి ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పీసీసీ సభ్యుడిగా పనిచేస్తున్న సల్లూరి సమ్మయ్య, గండ్ర జ్యోతి, కాటారం నుంచి మంత్రి మల్లయ్య, గణపురం నుంచి పొలుసాని లక్ష్మీనరసింగారావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మహబూబాబాద్.. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత 2016, అక్టోబర్ 20న మహబూబాబాద్ జిల్లాలో రైతు గర్జన కార్యక్రమానికి ముందు మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డిని టీపీసీసీ ప్రకటించినప్పటికీ ఏఐసీసీ నుంచి అనుమతి రాలేదు. డీసీసీ అధ్యక్షుడిగా భరత్‌చందర్‌రెడ్డిని ప్రకటిస్తేనే రైతుగర్జన సభ విజయవంతం చేస్తామని ఆయన అనుచరులు ఆందోళన చేశారని తెలిసింది. ఆయన ప్రస్తుతం పీసీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రెండుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యరు. భరత్చందర్ రెడ్డి తండ్రి జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి ఐదుసార్లు మానుకోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా భరత్ చందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. త్వరలో ప్రకటించే డీసీసీ అధ్యక్ష పదవి భరత్చందర్ రెడ్డికే దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. జనగామ.. జనగామ జిల్లా నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. జనగామ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఐదుగురు పోటీ పడుతున్నట్లు తెలిసింది. జనగామ నియోజకవర్గ ఇన్చార్జి చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్లు వేమళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, స్టేషన్ ఘన్పూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బేతి జయపాల్ రెడ్డి, పీసీసీ సభ్యుడు కోతి ఉప్పలయ్య బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే పదవి దక్కనున్నట్లు సమాచారం. వరంగల్ రూరల్.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్ రూరల్ జిల్లాకు చెందినవారే. ఏఐసీసీ సభ్యుడిగా సైతం మాధవరెడ్డి కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ఏఐసీసీ ఓబీసీ సెల్ కార్యదర్శి కత్తి వెంకటస్వామి, బక్క జడ్సన్ సీనియర్లుగా కొనసాగుతున్నారు. డీసీసీ అధ్యక్షుడి రేసులో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి ఉన్నట్లు ప్రధానంగా వినిపిస్తోంది. మాధవరెడ్డి ఎవరి పేరును సూచిస్తే వారి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వరంగల్ అర్బన్.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాయిని రాజేందర్‌రెడ్డి వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో తిరిగి అర్బన్ అధ్యక్షుడిగా తననే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వరదరాజేశ్వర్‌రావు దంపతులతోపాటు పార్టీలో కొత్తగా చేరిన వేం నరేందర్ రెడ్డి కూడా ఈ పదవిపై కన్నేసినట్లు సమాచారం. -
ఏమి సేతుర లింగా..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆపరేషన్ ఆకర్ష మాయలో పడి ‘గులాబీ’ కండువా కప్పుకున్న కాంగ్రెస్, టీడీపీ నేతలు అతర్మథనంలో పడ్డారు. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలా.. లేక.. సొంత గూటికి వెళ్లాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను బలహీన పరచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన చాణక్య పాచికలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు చిక్కారు. అధికార పార్టీలో ఉంటే వచ్చే ఎన్నికల నాటికి ఆర్థికంగా కొంత బలపడి అనుచర వర్గాన్ని, కార్యకర్తలను కాపాడుకోవచ్చని కొందరు.. నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్త సెగ్మెంట్లు వస్తే బెర్తు ఖరారు చేసుకోవచ్చని ఇంకొందరు.. కనీసం నామినేటెడ్ పోస్టులు దక్కించుకోవచ్చని మరికొందరు నాయకులు ‘కారు’ ఎక్కేశారు. తీరా పార్టీలోకి వెళ్లాక అన్నీ తలకిందులయ్యాయి. కుడితిలో పడ్డ ఎలుకలా.. నియోజకవర్గాల పునర్విభజన ఎలాగు సాధ్యం కాదని తేలిపోయింది. అడపాదడపా నామినేటెడ్‌తోపాటు ఇతర పోస్టుల భర్తీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే వచ్చా రు. మరో వైపు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ పోటీదారుల పట్ల మొదటి నుంచీ జాగ్రత్త పడుతూనే వస్తున్నారు. ముఖ్యంగా తమకు భవిష్యత్‌లో పోటీగా వస్తారనుకునే నాయకులను గుర్తించి వారి ఆర్థిక మూలాల మీద కన్నేసి పెట్టారు. వారికి ప్రభుత్వపరమైన ఎలాంటి కాంట్రాక్టు పనులు, ఇతర వర్క్స్ రాకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన నేతలకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. కనీసం కార్యకర్తలు, ముఖ్య అనుచరులను కూడా కాపాడుకోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరో వైపు అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి మళ్లీ టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించడంతో చేరిక నాయకుల పని కుడితిలో పడ్డ ఎలుక తీరుగా మారింది. వరంగల్ తూర్పు : ఈ నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకుడు బస్వరాజు సారయ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థిని కొండా సురేఖ గెలుపొందారు. ఆ తర్వాత క్రమంలో సారయ్య కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొండా సురేఖ ఉండడం, వాళ్లే ఇప్పుడున్న సీటుతో పాటు మరో సీటును అదనంగా అడుగుతున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ సైతం ‘తూర్పు’ మీద పట్టుబడుతున్నారు. మరో వైపు టీడీపీ నుంచి రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు టీఆర్ఎస్లో చేరి ‘తూర్పు’ మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పోటి నేపథ్యం లో బస్వరాజు సారయ్య, సుధారాణి, ప్రదీప్‌రావు పరిస్థితి ఏమిటనేది కాలం నిర్ణయించాల్సిందే. స్టేషన్‌ఘన్‌పూర్ : ఈ నియోజకవర్గలో కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాజారపు ప్రతాప్ అనంతర కాలంలో టీఆర్ఎస్లో చేరారు. మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్‌గా అవకాశం వచ్చినా స్వీకరించలేదు. వచ్చే సాధారణ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి చెందిన తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే రాజయ్య, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ గ్యాప్ ఉండడంతో ప్రతాప్ ఆశలు పెంచుకున్నారు. కానీ.. ఈలోగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య దూసుకొచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె సంకేతాలు పంపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కడియం శ్రీహరికి మధ్య బలమైన రాజకీయ అనుబంధం ఉండడంతో ఏ నిమిషానికి రాజకీయం ఎలా మారుతుందోనని ఆసక్తి నెలకొని ఉంది. భూపాలపల్లి : ఈ నియోజకవర్గం నుంచి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు ఈ ప్రాంతంలో టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిగా పేరున్న గండ్ర సత్యనారాయణరావు టీఆర్ఎస్లో చేరారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటూ పోతున్నారు. కానీ.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మధుసూదనాచారిని కాదని సత్యనారాయణకు టికెట్ ఇస్తారా.. అనేది సందేహాస్సదమే. మరో వైపు కొండా దంపతుల కుమార్తె సుష్మిత పటేల్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు కూడా ఈ నియోజకవర్గం నుంచి గట్టి ప్రయత్నంలోనే ఉన్నారు. జనగామ : ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు.కాంగ్రెస్ నుంచి నాగపురి రాజలింగం, టీడీపీ నుంచి బోడకుంటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరినప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలుగానే కొనసాగుతున్నారు. వెంకటేశ్వర్లుకు మరోసారి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అవకాశం కల్పించి శాసనమండలి ప్రభుత్వ విప్‌గా నియమించారు. టీడీపీ నుంచి సీనియర్ నాయకుడు కొండం మధుసూదన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రత్యక్ష ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. అవకాశమిస్తే సద్వినియోగం చేసుకుంటానన్నట్లు మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం ఆలోచన చేస్తున్నట్లు వినిపిస్తోంది. కానీ.. సిట్టింగ్‌ను పక్కనపెట్టి ఎంత వరకు అవకాశం కల్పిస్తారో తెలియక రాజలింగం ఆందోళనతో ఉన్నారు. పరకాల : ఈ నియోజకర్గంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన న్యాయవాది సహోదర్‌రెడ్డి.. చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్టానం అవకాశం కల్పిస్తే పోటీ చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇదే పార్టీకి చెందిన ముద్దసాని సహోదర్‌రెడ్డి, మంద ఐలయ్య సైతం ఈ నియోజకవర్గంపై ఆసక్తిగా ఉన్నారు. మహబూబాబాద్ : ఈ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత టీఆర్ఎస్లో చేరారు. ఈమె డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ కూతురు. ప్రస్తుతం మహబూబాబాద్ సెగ్మెంట్ నుంచి శంకర్‌నాయక్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మాలోతు కవిత తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. డోర్నకల్ : ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీఎస్.రెడ్యానాయక్ టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీఎస్.రెడ్యానాయక్ గెలిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుతో రెడ్యా నాయక్ అధికార పార్టీలో చేరారు. ఇటీవల సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సీనియర్ అయిన రెడ్యానాయక్‌కు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని.. తనకు డోర్నకల్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ వర్తిస్తుందో వేచిచూడాల్సిందే. -
లోకల్ చంటికే.. సీటు
అప్పుడే లోకల్.. నాన్ లోకల్ గొడవ వరంగల్: సాధారణ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో నేతల్లో అప్పుడే హడావుడి మొదలైంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తా యా, వేర్వేరుగా జరుగుతాయా అనే అంశంతో సం బంధం లేకుండా నాయకులు ఊళ్ల బాటపడుతున్నా రు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశం కీలకంగా ఉంటుందని ముఖ్య నేతలు భావిస్తున్నారు. తెలంగాణ తెచ్చిన ఘనత తమదేనంటూ అన్ని పార్టీల నేతలూ ప్రచారం మొదలు పెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ‘స్థానిక’ అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది. పునర్విభజన తర్వాత తొలిసారిగా జరి గిన గత ఎన్నికల సమయంలో రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర నియోజకవర్గాలకు వలస వెళ్లిన నాయకులకు ఇప్పుడు ‘స్థానిక’ అంశం సవాలుగా మారుతోంది. రాజకీయ ప్రత్యర్థుల నుంచే కాకుండా సొంత పార్టీ శ్రేణుల నుంచి.. స్థానికులకే సీట్లు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ... ఇలా అన్ని పార్టీల్లోనూ ఇది మొదలైంది. ఈ స్థానికత సమస్య సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాస్త తక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయి.. మళ్లీ పోటీ చేయూలనుకునే వారికి, ప్రస్తు తం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న వారికి మాత్రం ఇది పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లు తెలంగాణ అంశం ఎన్నికల్లో ఇబ్బందిగా ఉండేది. ఎన్నికల లోపే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని చెబుతున్న కాంగ్రెస్‌లో అభ్యర్థిత్వాల కోసం పోటీ పడే నాయకులు పెరుగుతున్నారు. ఇలా ఎక్కువ మంది పోటీపడే పరిస్థితి ఉండడంతో ‘స్థానిక’ అంశం తెరపైకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు స్థానికత అంశం ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జి.విజయరామారావు, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు స్థానికత అంశంగా అధికార పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మాలోత్ కవిత సొంత ఊర్లు వీరి నియోజకవర్గాల పరిధిలో లేవు. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడం, సొంత పార్టీల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకులు పోటీగా లేకపోవడంతో వీరికి ఇబ్బంది లేనట్టుగా కనబడుతోంది. తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్య నాయకులు చాలా మంది వెళ్లిపోయారు. నాయకుల కొరత కారణంగా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీలుగా ఎక్కువ మంది స్థానికేతరులే ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకతకు తోడు ఇప్పుడు స్థానికేతర అంశం.. జిల్లాలో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో మరింత సమస్యగా మారే పరిస్థితి కనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో సొంత నియోజకవర్గం వర్థన్నపేట ఎస్సీ రిజర్వురుగా మారడంతో టీడీపీ ప్రస్తుత తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం కన్వీనరు ఎర్రబెల్లి దయాకర్‌రావు 2009లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రత్యర్థి పార్టీలు ఇప్పు డు ఎర్రబెల్లి స్థానికుడు కాదనే అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. వైఎస్సాఆర్సీపీ జిల్లా కన్వీనరు ముత్తినేని సోమేశ్వరరావు వారం క్రితం స్థానికేతర నాయకులపై చేసిన ప్రకటన ఇప్పుడు ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనగామ, పరకాల నియోజకవర్గ ఇంచార్జీలకు స్థానికేతర అంశం అడ్డంకిగా మారుతోంది. జనగామ టీడీపీ ఇంచార్జీ ఎడబోయిన బస్వారెడ్డి సొంత ఊరు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హన్మకొండ మండలం సోమిడి. పరకాల టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ చల్లా ధర్మారెడ్డి సొంత ఊరు భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలంలో ఉంది. వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి నియోజకవర్గాలు జనరల్ కేటగిరీలోనే ఉన్నా వీరిద్దరూ పొరుగున ఉన్న సెగ్మెంట్లకు ఇంచార్జీలు ఉండడంతో ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థులు వీరి స్థానికేతర అం శాన్ని లేవనెత్తే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక వాదంతో పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఎన్నికల సీట్ల కేటాయింపులోనూ స్థానిక నేతలు ఇదే అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు. జనగామ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇన్చార్జ్గా స్థానికేతరుడిని నియమించడంపై అక్కడి గులాబీ శ్రేణులు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నా యి. అక్కడ ఇంచార్జీగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు. ఈయన సొంత ఊరు వర్థన్నపేట మండ లం పున్నేలు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 2004లో తెలంగాణ జనతా పార్టీ తరఫున వర్థన్నపేట నియోజకవర్గంలో, 2009లో టీఆర్ఎస్ తరఫున రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌లో పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా దీటుగా ఉండే నాయకులను కాదని ముత్తిరెడ్డిని ఇన్చార్జ్గా నియమించడంపై జనగామ టీఆర్ఎస్లో అసంతృప్తి పెరుగుతోంది. వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జీ ఆరూరి రమేశ్ సొంత ఊరు జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు. ఇది స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. స్టేషన్‌ఘన్‌పూర్ సెగ్మెంట్ కూడా ఎస్సీ రిజర్వుడ్ కేటగిరీలోనే ఉంది. వర్థన్నపేట నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ నాయకులు లేనట్లుగా రమేశ్‌ను ఇన్చార్జ్గా పెట్టడంపై ఇక్కడి పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వర్థన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లోనూ స్థానికుడు కాని జి.విజయరామారావుకు టికెట్ ఇవ్వడం వల్లే మూడు దశాబ్దాల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ గెలవగలిందని టీఆర్ఎస్ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. వీరికి ‘స్థానిక’ గండం పాలకుర్తి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన దుగ్యాల శ్రీనివాసరావుకు ఇప్పుడు స్థానికత అంశం ఇబ్బందిగా మారింది. దుగ్యాల శ్రీనివాసరావు సొంత ఊరు వర్థన్నపేట మండలం నల్లబెల్లి. 2004లో టీఆర్ఎస్ తరఫున చెన్నూరు (ఇప్పుడు పాలకుర్తి) నుంచి పోటీ చేసి గెలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దుగ్యాల స్థానికేతరుడు అనే వాదనను అక్కడి కాంగ్రెస్ నాయకులే తీసుకువస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ తనకే ఇవ్వాలని డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ డిమాండ్ చేస్తున్నారు. మరో ఇద్దరు మాజీ జెడ్పీటీసీ సభ్యు లు సైతం ఇదే అంశంతోదుగ్యాలకు పాలకుర్తిలో చెక్ పెట్టేందు కు ప్రయత్నిస్తున్నారు.