‘దేశం’ ఖాళీ!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వంద మేనిఫెస్టోలకు ఒకటే సమాధానం.. ‘జై తెలంగాణ’.. నేతలు ఇచ్చే వరాల కంటే.. ‘సెంటిమెంటు’కే జనం జైకొడతారు.
ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా తప్పు మీద తప్పు చేసిన తెలుగుదేశం పార్టీ మెతుకుసీమలో భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. జిల్లాలో దాదాపు పార్టీ దుకాణం మూసేసుకునే పరిస్థితికి వచ్చింది. పదేళ్ల పాటు అధికారం లేకున్నా కార్యకర్తలు, నాయకులు కష్టనష్టాలకు ఓర్చి పార్టీని కాపాడుకున్నారు.
ఎవరి సహాయం లేకున్నా ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అనే అభిమానంతో పోలీసు కేసులు, దాడులను భరించి నిలబడ్డారు. తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతున్న వేళ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా రెండు కళ్ల సిద్దాంతం, కొబ్బరి చిప్పల సమన్యాయం అనటంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవించిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లోకి వలసలు వెళ్లారు. కార్యకర్తలు వెళ్లిపోవడంతో నాయకులు కూడా వారి వెంట వెళ్లారు.
అందోల్ నియోజకవర్గంలో టీడీపీకి కొంత పట్టుంది. కాని చంద్రబాబునాయుడు నిర్ణయంతో కార్యకర్తలు, రెండో శ్రేణి, దిగువ శ్రేణి నాయకులు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్లిపోయారు. నాయకుల కంటే ముందే పార్టీని వదిలి తెలంగాణవాద పార్టీల్లోకి కార్యకర్తలు వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోయాక ఇక తనకేం పని అనుకున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాబూమోహన్ కూడా టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు.
అంతకు ముందే మాజీ ఎంపీ డాకూరు మాణిక్యరెడ్డి, ఆయన సోదరుడు జైపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు.ఇదిలా ఉంటే.. పార్టీ కార్యకర్తలు, నాయకులు వద్దని నె త్తీనోరు బాదుకున్నా వినకుండా కేంద్రంలో చక్రం తిప్పుతానంటూ చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తుపెట్టుకోవడంతో టీడీపీకి తీవ్ర విఘాతం ఏర్పడింది. అసలే అంపశయ్యపై ఉన్న పార్టీ పూర్తిగా జీవం కోల్పోయినట్టయింది. ఇంతకాలం జిల్లాలో పార్టీని నడిపించిన మెదక్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు పొత్తుల నేపథ్యంలో చంద్రబాబుపై తిరుగుబాటు జెండా ఎగరేశారు.
టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో టీడీపీకి కీలక నేతగా ఉన్న చింతా ప్రభాకర్ గతంలోనే పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఆయనే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం విదితమే. చింతా ప్రభాకర్ వెళ్లిన తర్వాత పట్నం మాణిక్యం పార్టీని బతికించుకుంటూ వచ్చారు. ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించిన రోజున సంగారెడ్డి సీటు ఎవరికి ఇచ్చేది లేదని, టీడీపీయే పోటీ చేస్తుందని స్వయంగా చంద్రబాబునాయుడే హామీ ఇచ్చారు.
తీరా ఎన్నికల వేళ చంద్రబాబు మాట మార్చి బీజేపీకి ఇవ్వడంతో మాణిక్యం ఆత్మరక్షణలో పడ్డారు. నేడో రేపో కార్యకర్తల సమావేశం పెట్టి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలో జన బలం ఉన్న గజ్వేల్ నియోజకవర్గ నాయకుడు బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి. పార్టీనే నమ్ముకున్న ఆయన భవిష్యత్తును చంద్రబాబునాయుడు ఏం చేస్తారోనని కార్యకర్తలు భయపడుతున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై తట్టుకొని నిలబడాలంటే ఆర్థిక బలం, అంగబలం అవసరం. ఏమైనా చంద్రబాబును నమ్ముకొని రాజకీయాలు చేయడం అంటే.. కుక్క తోకపట్టుకొని గోదావరి ఈదడమేనని ఓ కార్యకర్త నిర్మొహమాటంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ తొలి జాబితా...
ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంటు స్థానానికి అభ్యర్థులను ఖరారు చేశారు. పాతవారికే చంద్రబాబు నాయుడు మళ్లీ టికెట్టు ఇచ్చారు. నారాయణఖేడ్ నుంచి విజయ్‌పాల్‌రెడ్డి, గజ్వేల్ నుంచి ప్రతాప్‌రెడ్డి, జహీరాబాద్ నుంచి నరోత్తం, జహీరాబాద్ పార్లమెంటు మదన్‌మోహన్‌రావు పేర్లను ప్రకటించారు.
పటాన్‌చెరులో ఐదేళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న సపాన్‌దేవ్ పేరు తొలి జాబితాలో లేకపోవడంతో కార్యకర్తలు ఆందోళనతో ఉన్నారు. సపాన్‌దేవ్‌కు కాకుండా ఓ పారిశ్రామికవేత్తకు ఆవకాశం ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అందోల్ నియోజకవర్గం నుంచి ఎవరి పేరును ఇంకా ప్రతిపాదించలేదు. దుబ్బాకకు చెందిన బక్కి వెంకటయ్యను ఇక్కడ నుంచి బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. కాని తొలి జాబితాలో ఆయన పేరు లేదు.