jai telangana
-
ఇరవై ఏళ్ల క్రితం జైతెలంగాణ ..ఇప్పుడు మన నినాదం జైభారత్: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘అశాంతి, అసంతృప్తి, ఆత్మహత్యలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణ ప్రజానికం కోసం జై తెలంగాణ నినాదంతో యుద్ధం చేసి విజయం సాధించాం. ప్రత్యేక రాష్ట్రాన్ని దక్కించుకుని స్వయం పాలనతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాం. అభివృద్ధి, తలసరి ఆదాయం వృద్ధి.. అన్నింటా అద్భుత ప్రగతి సాధించి తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఇప్పు డు అదే స్ఫూర్తితో జైభారత్ నినాదాన్ని ఎత్తుకున్నాం. అన్నివర్గాల మద్దతు కూడగట్టుకుని దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప శాంతికాముక అభివృద్ధి దేశంగా తీర్చిదిద్దాలని తలచి మరో యుద్దాన్ని మొదలుపెట్టాం. కులమతాలకు అతీతంగా అన్నివర్గాల మద్దతుతో విజయం సాధిస్తామని ఆశిస్తున్నాను’’అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత క్రిస్మస్ట్రీ లైట్‌ను వెలిగించిన కేసీఆర్.. తర్వాత కేక్ కట్ చేసి క్రైస్తవ పెద్దలకు అందించారు. అనంతరం మాట్లాడారు. క్రీస్తు ప్రేమ మార్గాన్ని అనుసరిద్దాం ఒక మనిషి తనను తాను ఏవిధంగా ప్రేమించుకుంటాడో ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించాలనే సూత్రాన్ని బోధించిన శాంతి మూర్తి జీసస్ అని కేసీఆర్ పేర్కొన్నారు. క్రీస్తు బోధనలను అనుసరిస్తే ప్రపంచంలో మనుషుల మధ్య స్వార్థం, అసూయలకు తావు ఉండదని.. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య ఎక్కడా యుద్ధాలు జరగవని, నేర సమాజం ఉండదని చెప్పారు. ప్రపంచ శాంతి కోసం తపించిన క్రీస్తు బాటను అందరం అనుసరిద్దామన్నారు. దేశంలో శాంతి సామరస్యాల కోసం మరో పోరాటాన్ని సాగించేందుకే జై భారత్ నినాదాన్ని ఎత్తుకున్నామని కేసీఆర్ వివరించారు. ‘‘జై తెలంగాణ నినాదంతో నిలిచి పోరాడితే తెలంగాణ ఏర్పడింది. ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణలో తలసరి ఆదాయం రూ.లక్షగా ఉండేది. ఇప్పుడు అది రూ.2.75 లక్షలకు పెరిగింది. విద్యుత్, మంచినీటి సరఫరా, ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ అభివృద్ధి తెలంగాణకే పరిమితం కాకుండా దేశమంతా వ్యాప్తిచెందేలా మరో యుద్ధాన్ని నడిపిస్తున్నాం. మంచికోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి మద్దతు పెరుగుతోంది. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి వేగాన్ని దేశమంతా అమలు చేస్తే ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా భారత్ దూసుకెళ్తుంది’’అని కేసీఆర్ పేర్కొన్నారు. కులం, జాతి, వర్గం అనే తేడా లేకుండా అన్ని పండుగలను ప్రభుత్వమే నిర్వహిస్తుండటం గొప్ప విషయమన్నారు. క్రైస్తవుల సమస్యలపై ప్రత్యేక సమావేశాలు క్రైస్తవులకు సంబంధించిన పలు సమస్యలను కొందరు తన దృష్టికి తీసుకువచ్చారని.. వాటిపై చర్చించేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనాథ పిల్లలు, పేద క్రైస్తవులకు కేసీఆర్ క్రిస్మస్ బహుమతులను అందజేశారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిషప్ పూల ఆంథోనీ కార్డినల్‌గా ఎంపికకావడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనను ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చదవండి: నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ.. కవిత ట్వీట్‌కు రాజగోపాల్ రెడ్డి రియాక్షన్ -
స్వర్ణబోనంపై ‘జై తెలంగాణ’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుపుకొంటున్న బోనాల పండుగ సందర్భంగా సూది రంధ్రంలో ఇమిడే అతి సూక్ష్మ బోనంను 0.0001 మిల్లీ గ్రాముల స్వర్ణంతో తయారు చేశారు.. సూక్ష్మ కళాకారుడు ముంజంపల్లి విద్యాధర. రాష్ట్రంలో బోనాల పండుగను పురస్కరించుకుని ఆయన స్వర్ణబోనంపై ‘జై తెలంగాణ’ అని చెక్కారు. -
కాసుల పేరు
టెక్నాలజీతో పరుగులు పెడుతున్న జనాన్ని అందుకోవడానికి బడాచోటా వ్యాపార సంస్థలు కూడా ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నాయి. ఆన్లైన్లో దూసుకుపోతూ బిజినెస్ పెంచుకుంటున్నాయి. చెప్పుల నుంచి కేశతైలం వరకు అన్ని వస్తువులు సింగిల్ క్లిక్‌తో కస్టమర్లకు చేరుస్తున్నాయి. ప్రత్యేకంగా పోర్టల్స్ క్రియేట్ చేసుకుని మరీ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాయి. వెబ్‌లోకంలో వ్యాపారం చేయాలంటే పోర్టల్‌కు క్యాచీ నేమ్ ఉండాలి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కొందరు ముందుగానే డొమైన్ నేమ్స్‌ను బ్లాక్ చేసి అట్టే పెట్టుకుంటున్నారు. పలు వ్యాపార సంస్థలు, సెలబ్రిటీలు, ట్రెండీ పేర్లతో డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసుకుని బిజినెస్ చేసుకుంటున్నారు. సదరు డొమైన్‌నేమ్స్ అవసరం అయిన వారికి లక్షలు చెల్లిస్తే గానీ రైట్స్ ఇవ్వడం లేదు. సిటీలో ఈ తరహా నవతరం బిజినెస్ ఇపుడు ఊపందుకుంది. హైదరాబాద్ పేరుతో ఓ వెబ్ పోర్టల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా..? దానికి డొమైన్‌నేమ్ ‘హైదరాబాద్.కామ్’అని పెట్టాలని మీరు ఫిక్సయితే మాత్రం కష్టమేనండోయ్. ఇదే డొమైన్ నేమ్‌తో మీరు వెబ్‌పేజ్ క్రియేట్ చేయాలంటే మాత్రం అక్షరాలా ఐదు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేంటి డొమైన్‌నేమ్ రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు రూ.500 మించి ఉండదంటారా..! ఆ పేరుకున్న క్రేజ్ అలాంటిది మరి. ఎప్పుడో పదేళ్ల కిందట రిజిస్టర్ అయిన ఈ డొమైన్‌నేమ్ మీకు రూ.500కు దొరుకుతుందనుకుంటే పొరపాటే మరి. ఇదొక్కటే కాదు డొమైన్‌నేమ్స్ పేరిట కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తోంది. ఇటీవల నగరంలో ‘డొమైన్‌నేమ్ ఓనర్స్ అసోసియేషన్’ రెండు సార్లు సమావేశమైంది కూడా. ముందుచూపు ఉన్న వాడే మనిషోయ్! అని ఎవరన్నారో కానీ, ఫ్యూచర్ సెన్స్‌తో కోట్లు ఆర్జిస్తున్న వారు ఎందరో ఉన్నారు. సినిమా పేర్లు, రాజకీయ పార్టీల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే.. కొందరు కాస్త వెరైటీ పేర్లను డొమైన్నేమ్స్గా రిజిస్టర్ చేసుకుని పెట్టుకుంటున్నారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న పేరు ఎవరికైనా అవసరం వచ్చిందనుకోండి.. వారి పంట పండినట్టే. వెబ్సైట్ నిర్మాణం మొదలైనప్పుడే ఈ డొమైన్‌నేమ్స్ వ్యాపారం పురుడు పోసుకుంది. మన దేశంలో ఓ పదేళ్ల నుంచి డొమైన్‌నేమ్ బిజినెస్ ఊపందుకుంది. నగరాలు, ప్రముఖ వ్యక్తుల పేర్లతో కొందరు బోలెడన్ని డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసేశారు. ‘చిరంజీవి.కామ్’ ఇలా రిజిస్టర్ అయ్యిందే. ఆ పేరుని చిరంజీవికి ఇవ్వడానికి సదరు డొమైన్‌నేమ్ రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్టు చెబుతారు. సిటీలో డొమైన్‌నేమ్ బిజినెస్ చేసే వాళ్లు నగరాలు, ప్రముఖుల పేర్లే కాదు పత్రికల పేర్లు, పాపులర్ పదాలనూ వదలడం లేదు. ఇంతైతే ఓకే.. డొమైన్‌నేమ్స్ క్యాష్ చేసుకుంటున్న వ్యక్తులు సిటీలో ఓ వంద మందికిపైగానే ఉన్నారు. వీరొక్కక్కరూ వందల్లో డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. విదేశాలకు వెళ్లిన టెకీలు బుర్రకు పదనుపెట్టి మరీ డొమైన్‌నేమ్స్ బుక్ చేసుకుంటున్నారు. మన దేశంలో ఉన్న వ్యాపారాలు, వ్యవహారాలను అప్డేట్ చేసుకుంటూ డొమైన్‌నేమ్స్ తయారు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ పేర్లు కావాల్సిన వారికి చుక్కలు చూపెడుతున్నారు. ఎదుటివారి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో పాఠశాలలకు సంబంధించి ఓ వెబ్సైట్ పెట్టి బిజినెస్ చేయాలనుకున్న ఓ వ్యక్తి ‘స్కూల్ల్యాబ్. కామ్’ అనే వెబ్‌సైట్‌ని రిజిస్టర్ చేసుకుందామని ప్రయత్నించగా.. అది రెండేళ్ల కిందటే బుక్ అయిపోయినట్టు తెలుసుకున్నాడు. ఆరా తీస్తే అమెరికాలోని ఓ తెలుగాయన ఆ పేరు రిజిస్టర్ చేసుకున్నట్టు తెలుసుకున్నాడు. ఏం చేస్తాడు.. ఆ అమెరికా బుల్లోడికి రూ.35 వేలు సమర్పించుకుని ఆ డొమైన్‌నేమ్ సొంతం చేసుకున్నాడు. జై తెలంగాణ.. తెలంగాణ వచ్చాక ఆ పేరుకు ఎంత డిమాండ్ ఉంటుందో ముందో ఊహించిన కొందరు నాలుగైదేళ్ల కిందటే రకరకాల పేర్లతో డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసుకుని పెట్టుకున్నారు. తెలంగాణస్టేట్.కామ్, తెలంగాణఫుడీస్.కామ్, తెలంగాణ.జువెలరీస్.కామ్.. ఇలా ఓ పాతిక, యాభై పేర్లను బుక్ చేసేశారు. ఏ బడాబాబుకైనా వాటి అవసరం పడితే ఆ డొమైన్‌నేమ్ ఓనర్ పంట పండినట్టే. నేమ్ అండ్ డొమైన్‌నేమ్.. ఈ ట్రెండ్ గురించి డొమైన్‌నేమ్ అండ్ వెబ్సైట్ బిజినెస్ చేస్తున్న బ్రియోఫ్యాక్టర్స్ ఎండీ రాజశేఖర్ ఏమంటారంటే.. ‘గత ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు మన నగరంలో డొమైన్నేమ్ల యజమానుల సంఖ్య బాగా వేగంగా పెరుగుతోంది. ఎంతలా అంటే.. బిడ్డకు పేరు పెట్టిన వెంటనే ఆ పేరుతో డొమైన్నేమ్లు క్రియేట్ చేసుకుంటున్నారు కొందరు. అదేంటంటే.. ఏమో ఏం చెప్పగలం వీడు పెద్దయ్యాక సెలెబ్రిటీ అయితే వాడి పేరుతో వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలంటే ఎలా? అంటున్నారు కొందరు తల్లిదండ్రులు. నిజానికి ఇది మంచి పరిణామమే. మన సెలిబ్రెటీలలో చాలామందికి వారి పేరుతో వారివద్ద డొమైన్‌నేమ్స్ లేవు. అలాగే ప్రస్తుతం ప్రతి వ్యాపారానికి వెబ్సైట్ కంపల్సరీ. అందుకే కొందరు ముందుగానే ఊహించి కొన్ని రకాల డొమైన్‌నేమ్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారు’ అని చెప్పారు. ఇంకెందుకాలస్యం.. మీరు కూడా డొమైన్‌నేమ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లోకి వెళ్లి మీకు తోచిన నాలుగు క్రియేటివ్ పదాలతో డొమైన్నేమ్లు రిజిస్టర్ చేసుకుని పెట్టుకోండి. డొమైన్‌నేమ్స్ రూపంలో మీ అదృష్టం మీ తలుపు తట్టొచ్చు.. ధనలక్ష్మి మీ నట్టింట్లో తిష్టవేయొచ్చు. - భువనేశ్వరి -
ఆ కానిస్టేబుళ్లకు ప్రమోషన్
సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవో సంఘం నిర్వహించిన ‘సమైక్యాంధ్ర’ సభలో జై తెలంగాణ అంటూ నినదించిన పోలీసు కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలంలపై సస్పెన్షన్లు ఎత్తివేసి, ప్రమోషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఈ కానిస్టేబుళ్లు ముఖ్యమంత్రిని కలిశారు. సమైక్యాంధ్ర సభలో జై తెలంగాణ అని నినాదాలు చేసినందుకు తమను సస్పెండ్ చేశారని సీఎంకు వివరించారు. దీనికి స్పందించిన కేసీఆర్ ఆ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవడంతో పాటు ప్రమోషన్ ఇవ్వాలని అక్కడే ఉన్న డీజీపీ అనురాగ్‌శర్మను ఆదేశించారు. సస్పెన్షన్‌లో ఉండగా ప్రమోషన్ ఇవ్వడానికి నిబంధనలు అనుమతించవని డీజీపీ చెప్పారు. దీంతో నెలరోజుల్లో ప్రమోషన్ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించగా వాటిని అమలు చేయాలని మెదక్ ఎస్పీకి అధికారులు సూచించారు. -
తెలంఘన సంబురం
అర్ధరాత్రి ఆవిష్కృతమైన రాష్ట్రం ఉద్విగ్నభరితంగా ఆవిర్భావ వేడుకలు సబ్బండవర్ణాల జనజాతరల హోరు వరంగల్, న్యూస్‌లైన్ : కళ్లెదుట ఆవిష్కృతమైన తెలంగాణ.. గుండెల్లో అమరుల జ్ఞాపకాలు.. ఆకాశమే హద్దుగా సాగిన జై తెలంగాణ నినాదాలహోరు మధ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆదివారం అర్ధరాత్రి పురుడుపోసుకున్నది. 60 యేళ్ల తం డ్లాట, 120మంది అమరవీరుల త్యాగాలఫలం సాక్షిగా ఓరుగల్లు జనం రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో ఓలలాడారు. జనజాతరలు పల్లే పట్నం తేడాలేకుండా జిల్లా అంతటా జనజాతరలై సాగాయి. ఓరుగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆకట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లాకు ఎదురుగా ఏర్పాటు చేసిన కీర్తి స్థూపం ఉద్యమ చరిత్రలో నిలిచిపోయింది. కలెక్టర్ కిషన్ ఆధ్వర్యంలో కీర్తి స్థూపం ఆవిష్కరించారు. కళాకారుల ధూంధాం, కార్నివాల్ తో జాతరను తలపించింది. ఉద్యోగ, రాజకీయ ప్రతినిధులతోపాటు జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పట్నంలో కలిసికట్టుగా.. ఎన్నికల జాతర ముగిసిన తర్వాత అన్ని వర్గాలు మరోసారి సమూహమై సాగారు. ఆర్తి, ఆవేదన, ఆకాంక్షను చాటిచెప్పేందుకు కడలి తరంగాల్లా కదిలివచ్చారు. ముందుగానే సన్నద్ధమై న విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, యువజను లు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, కార్మికులు, జర్నలిస్టులు సబ్బండవర్ణాల సకలజనులు పోరు వారసులై సాగివచ్చారు. జిల్లా కేంద్రమైన హన్మకొండలో చౌరస్తా, అశోకసెంటర్, అంబేద్కర్ సెంటర్, కాళోజీ సెంటర్, అమరవీరుల సెంటర్, కలెక్టరేట్ పరిసరాలు, నిట్ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. కాకతీయ యూని వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు పోరుజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వరంగల్ ఎంజీ ఎం సెంటర్, పోచమ్మమైదాన్, చౌరస్తా, ఖిలావరంగల్, రంగశాయిపేట సెంటర్లలో ప్రజ లు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. కోట జనసంద్రాన్ని తలపించింది. ఎంజీఎం సెంటర్ నుంచి కోట వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కాగడాల ర్యాలీ నిర్వహిం చారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమా ల్లో టీజేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ సంఘాలు కొవ్వత్తులతో ర్యాలీలు నిర్వహించి అమరుల కు నివాళులర్పించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీజేపీ, టీడీపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ తదితర రాజకీయ పార్టీలన్నీ ఉత్సవాల్లో భాగస్వామ్యమయ్యాయి. కొత్త రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పనిలో పనిగా నూతన ఎమ్మెల్యేలు, ఎంపీల స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పల్లెల్లో జట్లుగా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, ములు గు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, తొర్రూరు, వర్ధన్నపేట, హసన్‌పర్తి, ఆత్మకూరు తదితర సెంటర్లతోపాటు పల్లెపల్లెనా, ఇంటింటా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కనులపండువగా జరిగా యి. అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అమరవీరుల కుటుం బాలను గుండెలకు హత్తుకున్నారు. పరకాల అమరధామం వద్ద నివాళులు అర్పించారు. దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. కులం, మతం అనే తేడా లేకుండా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. కళాకారుల ధూంధాంలతో జిల్లాలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కన్పించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నవోత్సాహం
సాక్షి, సిటీబ్యూరో : దశాబ్దాల కల సాకారమైంది. అనేక పోరాటాలు, వందల మంది త్యాగాలు ఫలించాయి. ఆదివారం అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు నగరమంతా ‘జై తెలంగాణ’ నినాదాలు, బాణసంచా మోతలతో మార్మోగింది. తారాజువ్వలు చీకట్లను చీల్చుకుని ఆకాశంలో కనువిందు చేశాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు నగరంలో అంబరాన్నంటాయి. ట్యాంక్‌బండ్, నెక్లస్రోడ్, గన్‌పార్క్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, క్లాక్‌టవర్లు జనంతో కిక్కిరిసి పోయాయి. ట్యాంక్‌బండ్ సహా మొత్తం 120 కేంద్రాల్లో కళాకారులు తమ ఆటాపాటలతో ధూం..ధాం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ కార్యాలయాల్లో నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మల్కాజిగిరి, ఉప్పల్, అంబర్పేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, పంజగుట్ట, బేగంపేట్ తదితర కూడళ్లన్నీ తెలంగాణ వాదులతో కిక్కిరిసి పోయాయి. బస్తీలు, కాలనీల్లో యువకులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అంబరమంటిన సంబురాలు ట్యాంక్‌బండ్‌పై రసమయి బాలకిషన్, నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో గాయకుడు సాయిచంద్, గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ప్రొఫెసర్ కోదండరామ్, గాయకుడు గద్దర్, విమలక్క, అంద్శైఅమరులకు నివాళులర్పించి, ఆ తర్వాత తమ ఆటా పాటలతో ధూం..ధాం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో తెలంగాణ సంబురాలు నిర్వహించారు. అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి దానం, వీహెచ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్ నుంచి గన్‌పార్క్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. టీఆర్ఎస్ కార్యాలయంలో నాయిని నర్సింహారెడ్డి సహా పలువురు నేతలు వేడుకలు నిర్వహించారు. పెద్దెత్తున బాణసంచా కాల్చారు. ‘జై తెలంగాణ, జై కేసీఆర్’.. నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. తెలంగాణ ఉద్యమకారులు గన్‌పార్కు వద్ద ఆటాపాట నిర్వహించారు. కళాకారులు ధూంధాం నిర్వహించి సంబరాలు జరిపారు. గన్‌పార్కు వద్ద హాజరైన వారిలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విఠల్, స్వామిగౌడ్, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, టీఆర్ఎల్డీ నాయకులు చెరుకూరి శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రావు, రాపోలు జ్ఞానేశ్వర్, హెచ్ఎం టీవీ సీఈఓ రాంచంద్రమూర్తి, ఎమ్మార్పీఎస్ (దండోరా) రాష్ట్ర అధ్యక్షులు వై. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టపాకాయలు, బాణసంచాలు పేల్చి కార్యకర్తలు సంబరాలు జరిపారు. డీసీపీ కమలాసన్ రెడ్డి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిన్నపెద్దా తేడా లేకుండా కుటుంబ సమేతంగా వేలాదిమంది తెలంగాణ వాదులు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, ట్యాంక్‌బండ్, జీహెచ్ఎంసీ ఆఫీసు, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు, లోయర్ ట్యాంక్‌బండ్, ఇందిరాపార్కు పరిసరాలు తెలంగాణ వాదులతో కిక్కిరిపోయాయి. సరిగ్గా 12 గంటల తర్వాత ఈలలు, చప్పట్లు, కేరింతలు, జై తెలంగాణ నినాదాలు, భారీ బాణసంచాతో నవ తెలంగాణకు స్వాగతం పలికారు. కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. రాంనగర్ చౌరస్తాలో ముషీరాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో ధూంధాం జరిగింది. ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, టీఆర్ఎస్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి, ముఠాగోపాల్, గ్రేటర్ జేఏసీ చైర్మన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, విద్యార్థులంతా ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. కాలేజీపై తెలంగాణ జెండా ఎగరేశారు. బాణసంచా కాల్చారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇటు ఎన్సీసీ నుంచి అటు తార్నాక, మాణికేశ్వరి నగర్, ఇఫ్లూ వర్సిటీ తదితర ప్రాంతాల మీదుగా బైక్‌ర్యాలీలు నిర్వహించారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐజేయూ నాయకులు శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, సోమసుందర్, నరేందర్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాణసంచా కాల్చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. -
బీజేపీపై నోరుపారేసుకోవద్దు
కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి హెచ్చరిక తెలంగాణ సాధనలో మా పార్టీ పాత్ర మరవద్దు జైరామ్ రమేశ్ నోట్లో ఉన్నది నాలుకనేనా..? జై తెలంగాణ అనే హక్కు కాంగ్రెస్‌కు లేదు సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్... మీ పార్టీ ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు. సాధారణ పార్టీ. ఇంతకాలం ఉద్యమపార్టీగా మీరేమన్నా చెల్లిందేమో. ఇప్పుడు కుదరదు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించిన బీజేపీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. ఇక మాటకు మాట సమాధానం చెప్తాం’ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ-టీడీపీది అపవిత్ర పొత్తు అంటున్న కేసీఆర్ గతంలో తెలంగాణ వ్యతిరేకి సీపీఎంతో రెండుమార్లు పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ సంగతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అలాగే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న విషయం మరిచిపోతే ఎలా అని పేర్కొన్నారు. టీడీపీని విమర్శిస్తే తమకు సంబంధం లేదని, కానీ బీజేపీపై నోరుపారేసుకుంటే ఊరుకోమన్నారు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించిన బీజేపీపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణను బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని జైరాం వ్యాఖ్యానిస్తే అయన నోట్లో ఉన్నది నాలుకోకాదో అర్థంకావడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారినట్టు కనిపిస్తుండడంతో ఆ పార్టీ నేతలు ఇలా మాట్లాడుతున్నారనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో సోనియా సభ విఫలమైన తీరు చూస్తే కాంగ్రెస్ పరిస్థితి అర్థమవుతోందన్నారు. *తెలంగాణకు జై అన్న పాపానికి రేణుక అనే బాలిక పై కాల్పులు జరిపించిన కాంగ్రెస్ పార్టీకి జై తెలంగాణ అనే హక్కులేదన్నారు. *తెలంగాణ యువకుల మృతికి కారణమైన కాంగ్రెస్‌కు ఆ పాపం తగిలి తగిన శాస్తే జరుగుతుందని, ఇది తన శాపమని కిషన్‌రెడ్డి అన్నారు. *మోడీ వస్తే మతకలహాలు జరుగుతాయంటున్న కాంగ్రెస్ నేతలు, మర్రి చెన్నారెడ్డిని గద్దె దింపేందుకు పాతబస్తీలో మతకలహాలు సృష్టించింది కాంగ్రెస్ కాదని చెప్పగలరా అని ప్రశ్నించారు. అవి కాంగ్రెస్ నేతలు చేయించినవేనని అప్పట్లో చెన్నారెడ్డి చెప్పారని గుర్తు చేశారు. *బీజేపీ అధికారంలో ఉంటేనే ప్రశాంత వాతావరణం నెలకొంటుందని చెప్పారు. *ప్రాణహిత - చేవెళ్ల పథకానికి అనుమతులు లేనందున జాతీయహోదా రాలేదని పొన్నాల చెప్పడం హాస్యాస్పదమన్నారు. *అనుమతులు లేనప్పుడు రూ.నాలుగైదువేల కోట్లు ఎలా ఖర్చు చేశారో పొన్నాల ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. *ఖర్చు చేసిన నిధుల్లో 60 శాతం కాంగ్రెస్ నేతల జేబుల్లోకి చేరాయని ఆరోపించారు. *నిత్యం విమర్శలు సంధించుకుంటున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు భాష విషయంలో సంయమనం పాటించాలన్నారు. *జాతి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. అయినప్పటికీ తెలంగాణ విషయంలో తాము ఆ పార్టీని వెనకేసుకురావడం లేదన్నారు. -
ఆ భావజాలాన్ని బతికిద్దాం: ఎ. గోపాలకృష్ణ
ఫ్లాష్‌బ్యాక్: విపక్ష పాత్రలో ఉద్యమ శక్తులు 69 నాటి ఆనవాళ్ళూ కన్పిస్తున్నాయి అది 1969 నాటి సంఘటన.... జామే ఉస్మానియా వద్ద తెలంగాణ విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారు. వారి వాగ్మూలం తీసుకునేందుకు న్యాయమూర్తి వచ్చారు. అప్పుడు ఆయన ప్రశ్నలకు వాళ్లిచ్చిన సమాధానాలు... ఈ ఉద్యమాన్ని నడిపించిదేవరు? ‘జై తెలంగాణ’ మీ వెనుక ఉన్నదెవరు? ‘జై తెలం...గా...ణ’ స్వరం పెగలకపోయినా... శక్తిని కూడదీసుకుని అంటూనే ఆ విద్యార్థి తుదిశ్వాస విడిచాడు. మొన్నటికి మొన్న... శ్రీకాంతాచారి మంటల్లో నిలువునా దహించుకుపోయాడు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేర్చారు. కళ్లు మూతలు పడుతున్నా, ఒళ్లంతా బ్యాండేజీతో కదలలేకున్నా... ‘అమ్మా’ అనలేదు. ‘సార్, తెలంగాణ వస్తుందా...? వ...స్తుం...’ మాట పూర్తికాకుండా ఆ స్వరం శాశ్వతంగా ఆగిపోయింది. తూటాలకు తూట్లయిన ఆ తరం... అగ్ని కీలలకు ఆహుతైన ఈ తరం... చివరి శ్వాస తెలంగాణ ఆకాంక్ష. త్యాగం వారిదే! రాజకీయం వేరు. ఉద్యమం వేరు. అప్పుడూ, ఇప్పుడూ ఏ రాజకీయ పార్టీ తెలంగాణ కోసమే పుట్టలేదు. ఉద్యమాలే పార్టీలకు ప్రాణమయ్యాయి. 1969లో ఏడుగురు సభ్యులతో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడింది. వైద్య విద్యార్థిగా ఇది నా ఆలోచన. 1968 చివరలో ఓ సమ్మేళనం ఏర్పాటు చేసి వంద పోస్టర్లు రాశాం. వాటిని అక్కడక్కడా అతికించాం. అంతే, ఆ సభకు వేలమంది హాజరయ్యారు. ఆ స్ఫూర్తితోనే బంద్‌కు పిలుపునిచ్చాం. లాఠీలు విరుచుకుపడ్డా, తుపాకులు గర్జించినా పోరుబాటలో ఒక్క అడుగు వెనక్కు పడలేదు. పైగా ప్రజాపోరాటాల్లో కదలిక తెచ్చింది. ఉస్మానియా క్యాంపస్‌ను నిప్పు కణిక చేసింది. ఊరూ వాడా ‘జై తెలంగాణ’తో హోరెత్తింది. అప్పుడు చెన్నారెడ్డి అందుకున్నారు. టీపీఎఫ్ పుట్టుకొచ్చింది. నేటి పార్టీలకు ఊపిరి ఎవరు? ఫ్రీజోన్ అంశం కాదా ఫైర్జోన్గా మార్చింది? ఉద్యోగుల ఆవేశం కాదా ఉద్యమ రూపం దాల్చింది? ఆ సెగలోనే కొన్ని పార్టీలు చలికాచుకున్నాయి.? ఆ భావజాలంతో ముందుకొచ్చిన వ్యక్తు లే బలైంది. ఇప్పుడా శక్తులు తాత్కాలికంగా నిశ్శబ్దంలో ఉండొచ్చు. వాళ్లకు కొన్ని ఆశలున్నాయి. ఉపాధి కోసం ఊరొదిలి వెళ్లే దుస్థితి ఉండదని భావిస్తున్నారు. భూములు పడావు పడవనుకుంటున్నారు. వీటి కోసమే ఇంతకాలం పోరాడారు. అలుపెరగని పోరాటానికి... 69లో పెట్టిన తెలంగాణ కో-ఆర్డినేషన్ కమిటీకి మళ్లీ ఊపిరిపోస్తున్నాం. పాలకవర్గానికి ప్రతిపక్షంగా ఉండటమే మా ధ్యేయం. సమస్యలపై పోరాడటం మా ఎజెండా. ఇప్పుడు స్వీయ పాలనలోనూ నోరెత్తని దుస్థితే ఉంటే అమరవీరుల త్యాగాలకు అర్థం ఉండదు. అందుకే తెలంగాణ నిర్మాణం కోసం అలుపెరగని పోరాటం అనివార్యమే. - ప్రొఫెసర్ ఎ. గోపాలకృష్ణ తెలంగాణ కో-ఆర్డినేషన్ కమిటీ, ఛైర్మన్ -
అమ్మ మాట: పాణం పెడితెనే పనైతదన్నడు
బిడ్డ సావుతోని మూడు దినాలు పోరాడిండు. పగలైతే అడ్డువడతమని..అర్ధరాత్రి లేచి ఇంటిపెకైక్కి పెయ్యిమీద కిరోసిన్ వోసుకొని ఇంగళమేసుకున్నడు. నిప్పుల కాలుకుంటనే ‘జై తెలంగాణ..జై తెలంగాణ..’ అని అరుస్తుంటే గింత రాత్రిల ఎవరరుస్తున్నరని అందరు బయటికొచ్చిచూస్తే నా బిడ్డనే. ‘ఎంతపనిజేసినవ్రా....బిడ్డా’ అని అంబులెన్స్‌ని విలిసి గాంధాస్పత్రికి తోలకవోయ్నం. మూడో దినంనాడు రాత్రి పదిగంటలకు నాగరాజుకి సీరియస్గుందని చెప్పిండ్రు. దగ్గరికివోయి చూస్తే బిడ్డనోటెంట మాటొస్తలే. జరసేపటికే డాక్టర్లొచ్చి బిడ్డ పాణమిడిసిండని చెప్పిండ్రు. గంతకు ముందురోజు బిడ్డడు మాతో ఒక మాట చెప్పిండు. ‘ఎందుకురా గింతపని జేసినవ్. నువ్వు సస్తేనే తెలంగాణ రాష్ర్టమొస్తదా!’ అని వాళ్లనాయన అడిగితే..‘ఒకరిద్దరు సచ్చిపోతే రాష్ట్రమేడస్తదే! నాలెక్క సచ్చిపోనీకి మస్తుమంది విద్యార్థులున్నరు. పాణం పెడితెనే పనైతదే!’ అన్నడు. ఆసంది నుంచి ఏ మాట మాట్లాడుకున్నా వాడిసావే గుర్తుకొస్తున్నది. తెలంగాణ రాష్ట్రమొచ్చిందని తెల్వంగనే నాకు సంతోషమేసింది. నా బిడ్డ చావు ఊకెవోలే అనుకున్న. ‘తెలంగాణ రాష్ర్టమొస్తే కొలువులొస్తయ్...కష్టాలన్నీ వోతయే’ అని చెప్పిన మాటలు నిజమైతయా కాదో నాకు తెల్వదు. అవి నిజం కాకుంటే నా బిడ్డచావు ఊకెవోయినట్టే. వాడెనక ఇంకో కొడుకున్నడు. ఆడికి కొలువొచ్చినాడన్న మనకు సొంతంగా రాష్ర్టమొచ్చిందని నమ్ముత. సేకరణ : భువనేశ్వరి, ఫొటో : విఠల్ జన తెలంగాణ విద్యకు పెద్దపీట... భవిష్యత్ తెలంగాణ సమున్నతంగా ఉండాలంటే కొత్త ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠశాల స్థాయినుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రక్షాళన చేయాలి. డిగ్రీ వరకు నిర్బంధ విద్యను అమలు చేయాలి. శిక్షణ పొందిన బోధన సిబ్బందినే నియమించాలి. విద్యారంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలి. సైన్స్, మాథ్స్ల బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విద్యార్థి తనకు అభిరుచి గల రంగాన్ని ఎంచుకోగలిగే విద్యావ్యవస్థ ఉండాలి. మానవ వనరుల అభివృద్ధి ద్వారానే సమాజ పురోభివృద్ధి సాధ్యమవుతుంది. - జి.సంధ్య, ఆదర్శపాఠశాల, చిన్నకోడూరు, మెదక్ జిల్లా స్వేచ్ఛాయుత తెలంగాణ... ప్రజా ఉద్యమానికి తలవంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, ఇరుప్రాంతాల మధ్య సామరస్యం, పరస్పర సహకారం మీద దృష్టి సారించాలి. ప్రాథమిక విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టి మౌలిక వసతులు కల్పించాలి. వ్యవసాయ రంగంలో నూతన విధానాలు ప్రవేశపెట్టి అభివృద్ధి సాధించాలి. ఆంక్షలు లేని, నిర్బంధంలేని, స్వేచ్ఛాయుత తెలంగాణ కోసం అందరూ సహకరించాలి. - డి. సుధాకరరావు, చెన్నూరు, ఖమ్మం జిల్లా దురాచారాలను నిర్మూలించాలి.. నవ తెలంగాణలో వేళ్లూనుకున్న వరకట్నాన్ని నిర్మూలించాలి. మూఢనమ్మకాలు, లంచగొండితనం, ర్యాగింగు లాంటి సామాజిక దురాచారాలను పూర్తిగా తొలగించాలి. ఇందుకు యువతీయువకులు కృషి చేయాలి. నాణ్యమైన విద్యను అందించాలి. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. మాతృభాషను పరిరక్షించాలి. పేదలందరికీ ఉచిత వైద్యాన్ని అందించాలి. ప్రతి వ్యక్తి విలువలతో జీవించాలి. - వేముల వాణిశ్రీ రేకుర్తి, కరీంనగర్ జిల్లా -
‘దేశం’ ఖాళీ!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వంద మేనిఫెస్టోలకు ఒకటే సమాధానం.. ‘జై తెలంగాణ’.. నేతలు ఇచ్చే వరాల కంటే.. ‘సెంటిమెంటు’కే జనం జైకొడతారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా తప్పు మీద తప్పు చేసిన తెలుగుదేశం పార్టీ మెతుకుసీమలో భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. జిల్లాలో దాదాపు పార్టీ దుకాణం మూసేసుకునే పరిస్థితికి వచ్చింది. పదేళ్ల పాటు అధికారం లేకున్నా కార్యకర్తలు, నాయకులు కష్టనష్టాలకు ఓర్చి పార్టీని కాపాడుకున్నారు. ఎవరి సహాయం లేకున్నా ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అనే అభిమానంతో పోలీసు కేసులు, దాడులను భరించి నిలబడ్డారు. తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతున్న వేళ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా రెండు కళ్ల సిద్దాంతం, కొబ్బరి చిప్పల సమన్యాయం అనటంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవించిన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లోకి వలసలు వెళ్లారు. కార్యకర్తలు వెళ్లిపోవడంతో నాయకులు కూడా వారి వెంట వెళ్లారు. అందోల్ నియోజకవర్గంలో టీడీపీకి కొంత పట్టుంది. కాని చంద్రబాబునాయుడు నిర్ణయంతో కార్యకర్తలు, రెండో శ్రేణి, దిగువ శ్రేణి నాయకులు మూకుమ్మడిగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్లిపోయారు. నాయకుల కంటే ముందే పార్టీని వదిలి తెలంగాణవాద పార్టీల్లోకి కార్యకర్తలు వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోయాక ఇక తనకేం పని అనుకున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాబూమోహన్ కూడా టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. అంతకు ముందే మాజీ ఎంపీ డాకూరు మాణిక్యరెడ్డి, ఆయన సోదరుడు జైపాల్‌రెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్లారు.ఇదిలా ఉంటే.. పార్టీ కార్యకర్తలు, నాయకులు వద్దని నె త్తీనోరు బాదుకున్నా వినకుండా కేంద్రంలో చక్రం తిప్పుతానంటూ చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తుపెట్టుకోవడంతో టీడీపీకి తీవ్ర విఘాతం ఏర్పడింది. అసలే అంపశయ్యపై ఉన్న పార్టీ పూర్తిగా జీవం కోల్పోయినట్టయింది. ఇంతకాలం జిల్లాలో పార్టీని నడిపించిన మెదక్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు పొత్తుల నేపథ్యంలో చంద్రబాబుపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో టీడీపీకి కీలక నేతగా ఉన్న చింతా ప్రభాకర్ గతంలోనే పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఆయనే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం విదితమే. చింతా ప్రభాకర్ వెళ్లిన తర్వాత పట్నం మాణిక్యం పార్టీని బతికించుకుంటూ వచ్చారు. ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించిన రోజున సంగారెడ్డి సీటు ఎవరికి ఇచ్చేది లేదని, టీడీపీయే పోటీ చేస్తుందని స్వయంగా చంద్రబాబునాయుడే హామీ ఇచ్చారు. తీరా ఎన్నికల వేళ చంద్రబాబు మాట మార్చి బీజేపీకి ఇవ్వడంతో మాణిక్యం ఆత్మరక్షణలో పడ్డారు. నేడో రేపో కార్యకర్తల సమావేశం పెట్టి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలో జన బలం ఉన్న గజ్వేల్ నియోజకవర్గ నాయకుడు బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి. పార్టీనే నమ్ముకున్న ఆయన భవిష్యత్తును చంద్రబాబునాయుడు ఏం చేస్తారోనని కార్యకర్తలు భయపడుతున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై తట్టుకొని నిలబడాలంటే ఆర్థిక బలం, అంగబలం అవసరం. ఏమైనా చంద్రబాబును నమ్ముకొని రాజకీయాలు చేయడం అంటే.. కుక్క తోకపట్టుకొని గోదావరి ఈదడమేనని ఓ కార్యకర్త నిర్మొహమాటంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తొలి జాబితా... ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంటు స్థానానికి అభ్యర్థులను ఖరారు చేశారు. పాతవారికే చంద్రబాబు నాయుడు మళ్లీ టికెట్టు ఇచ్చారు. నారాయణఖేడ్ నుంచి విజయ్‌పాల్‌రెడ్డి, గజ్వేల్ నుంచి ప్రతాప్‌రెడ్డి, జహీరాబాద్ నుంచి నరోత్తం, జహీరాబాద్ పార్లమెంటు మదన్మోహన్రావు పేర్లను ప్రకటించారు. పటాన్చెరులో ఐదేళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న సపాన్‌దేవ్ పేరు తొలి జాబితాలో లేకపోవడంతో కార్యకర్తలు ఆందోళనతో ఉన్నారు. సపాన్‌దేవ్‌కు కాకుండా ఓ పారిశ్రామికవేత్తకు ఆవకాశం ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అందోల్ నియోజకవర్గం నుంచి ఎవరి పేరును ఇంకా ప్రతిపాదించలేదు. దుబ్బాకకు చెందిన బక్కి వెంకటయ్యను ఇక్కడ నుంచి బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. కాని తొలి జాబితాలో ఆయన పేరు లేదు. -
సీమాంధ్రలో జై తెలంగాణ అని అనగలవా?
చంద్రబాబుకు కిరణ్ సూటి ప్రశ్న సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలంగాణ సభల్లో జై తెలంగాణ అన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సీమాంధ్రలో కూడా జై తెలంగాణ అనే దమ్ము, ధైర్యం ఉందా అని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో సమైక్యాంధ్ర గురించి తాను ఐదున్నర గంటలు మాట్లాడితే చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. టీడీపీకి ఓటేస్తే రాష్ట్ర విభజనకు ఓటు వేసినట్లే అన్నారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లాలో పలు చోట్ల ఎన్నికల సభల్లో మాట్లాడుతూ విభజన కు అనుకూలంగా తొలి లేఖ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబే అన్నారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో కిరణ్‌ను టంగుటూరి ప్రకాశం పంతులు మనుమడు గోపాలకృష్ణ కలిశారు. -
పోరుగడ్డకు... సలాం!
తెలంగాణ సాధనలో పాలమూరు గడ్డ నేను సైతం అంటూ ఉద్యమానికి ఊపిరులూదింది. ఐదు దశాబ్దాలకు పైబడిన ప్రస్థానంలో భుజం కలిపి కదం తొక్కింది. నిర్బంధాన్ని, అణచివేతలను ఎదుర్కొంటూ స్వరాష్ట్ర కాంక్షను ఎలుగెత్తి చాటింది. ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా’ అంటూ జన సామాన్యం కడగండ్లు కవులు, కళాకారుల గొంతులో కన్నీటి పాటలై ప్రవహించాయి. బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి ముగ్గులు ఉద్యమ రూపాలయ్యాయి. రైలు మార్గాలు, రోడ్లు ఉద్యమ వేదికలయ్యాయి. సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె పేరిట సబ్బండ వర్ణాలు ‘జై తెలంగాణ’ అని నినదించాయి. మిలియన్ మార్చ్‌లు, చలో హైదరాబాద్, అసెంబ్లీ ముట్టడి.. పిలుపేదైనా ఊర్లు ఉమ్మడిగా స్పందించాయి. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి వచ్చిన నేతలకు ఉప ఎన్నికల ఫలితాలతో చుక్కానిలా నిలిచింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు క్రమంలో అసెంబ్లీ, పార్లమెంటు వేదికగా జరిగిన రాజకీయ క్రీడను ఉత్కంఠతో వీక్షించింది. స్వరాష్ట్ర స్వప్నం నెరవేరిన వేళ ఆనందోత్సాహాల్లో మునిగి తేలింది. సమగ్రాభివృద్ధితో కూడిన బంగారు భవిష్యత్తును స్వప్నిస్తూ సాకారం చేసుకునేందుకు కోటి ఆశలతో ఎదురు చూస్తోంది. - కల్వల మల్లికార్జున్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేక పాత్రను పోషిస్తూ వచ్చింది. 1969 నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మాజీ ఎంపీ మల్లికార్జున్ ఫైర్‌బ్రాండ్ నేతగా పేరొందారు. 2001 నుంచి మలి విడత ఉద్యమం మొదలైంది. నలభై రెండు మంది తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో కూడిన ప్రతినిధి బృందానికి వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి 2000లో నేతృత్వం వహించి కేంద్ర ప్రభుత్వానికి ‘తెలంగాణ’ ఆకాంక్ష వినిపించారు. ఆ తర్వాత 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల రాజకీయాలను అస్త్రంగా ఉద్యమించిన టీఆర్ఎస్ తొలి అంకంలో పాక్షిక ఫలితాన్ని సాధించింది. కేసీఆర్ పిలుపు మేరకు 2007లో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన పదవికి రాజీనామా చేసినా తిరిగి అసెంబ్లీ గుమ్మం ఎక్కలేక పోయారు. రెండో అంకం ఇక్కడ నుంచే! 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబ్‌నగర్ స్థానం నుంచి పార్లమెంటులో అడుగు పెట్టారు. దివంగత సీఎం వైఎస్ మరణానంతర రాజకీయ పరిస్థితులను ఆయన సోపానాలుగా మలుచుకున్నారు. కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సంపూర్ణ ఉద్యమ పథంలోకి అందర్నీ నడిపింది. ఇదే క్రమంలో 2009 డిసెంబర్ చివరి వారంలో ఆవిర్భవించిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) రూపంలో ఉద్యమం మరింత పుంజుకుంది. జిల్లాకు చెందిన ఉద్యోగులు, టీచర్లు, లాయర్ల సహా సబ్బండ వర్ణాలు భాగస్వాములయ్యాయి. విద్యా సంస్థలు వేదిక లు కాగా, విద్యార్థులు బావుటాలయ్యారు. జిల్లాకు చెందిన కొందరు విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానంతో ఆకాంక్షను చాటారు. ఈ నేపథ్యంలోనే 2010లో రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి జనం మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. సహాయ నిరాకరణ అస్త్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు పడకపోవడంతో జేఏసీ పిలుపు మేరకు 2011 ఫిబ్రవరి నుంచి 16 రోజుల పాటు జిల్లాలో సంపూర్ణ సహాయ నిరాకరణ పాటించారు. ఇదే సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలను తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు బహిష్కరించారు. 2011 జూలైలో 81 మంది ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామా సమర్పించగా, జిల్లా నేతలూ అనుసరించారు. 2011 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ‘సకల జనుల సమ్మె’ ఉద్యమ ప్రస్థానంలో మైలు రాయే. 42 రోజుల పాటు జరిగిన ఈ సమ్మెలో రైలు రోకోలు, రహదారుల దిగ్బంధనం, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక వర్గాలతో పాటు న్యాయవాదులు, వైద్యులు, వ్యాపార, వాణిజ్య వర్గాలు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. ఉద్యమ తీవ్రతతో జన జీవనం స్తంభించింది. గళమెత్తిన కవులు, కళాకారులు ఉద్యమంలో జిల్లాకు చెందిన కవులు, కళాకారులు కీలక భూమిక పోషించారు. గోరేటి వెంకన్న, సాయిచంద్, జంగిరెడ్డి పాలమూరు జీవన స్థితిగతులను కళ్లకు కట్టారు. కృష్ణవర్మ, పాపకంటి శేఖర్ ఉద్యమ ప్రస్థానంలో ప్రాణాలు కోల్పోయారు. కొత్త కలాలు, గళాలు పురుడు పోసుకున్నాయి. ‘అధికారానికి’ గుడ్‌బై తెలంగాణ అంశంపై అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2011 అక్టోబర్ 29న టీఆర్ఎస్లో చేరారు. మంత్రి పదవిని వదిలిన జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ఎమ్మెల్యే పదవిని త్యజించారు. తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్‌గా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కూడా పార్టీని వీడి ఎమ్మెల్యే పదవిని త్యజించారు. ఈ నేపథ్యంలో 2012 మార్చిలో జిల్లాలోని నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ పక్షాన ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి విజ యం సాధించారు. ఉద్యమ నేతలకు ప్రజలు పట్టంకట్టారు. ఇదే ఏడాది సెప్టెంబర్ 29న జేఏసీ పిలుపు మేరకు ‘తెలంగాణ మార్చ్’కు హైదరాబాద్‌కు బయలుదేరిన వేలాది మందిని పోలీసులు ముందస్తు అరెస్టు పేరిట నిర్బంధించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నాగర్‌కర్నూలు ఎంపీ మంద జగన్నాథం అధికార పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. అణచివేత నడుమ దిగ్బంధనం మహబూబ్‌నగర్ జిల్లా మీదుగా వెళ్లే ఏడో నంబరు జాతీయ రహదారిని 2013 మార్చి 21 టీజేఏసీ దిగ్బంధించింది. రోడ్లపైకి వచ్చిన వేలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే క్రమంలో 2013 జూన్ 30న జరిగిన ‘అసెంబ్లీ ముట్టడి’లోనూ వందలాది మందిని జిల్లాలో కట్టడి చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ అనుకూల సంకేతం పంపడంలో భాగంగా ఆ నేతలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘సంఘీభావ సభ’కు జిల్లా నుంచి మంత్రి డీకే అరుణతో పాటు వేలాది మంది కార్యకర్తలు తరలివెళ్లారు. జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయడంతో కొత్త అంకం మొదలైంది. ఉత్కంఠ నడుమ నెరవేరిన కల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ 2013 అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ ఓకే చేయడంతో జిల్లాలో సంబురాలు ప్రారంభమయ్యాయి. 2013 డిసెంబర్, 2014 జనవరిలో రాష్ట్ర అసెంబ్లీ వేదికగా బిల్లుపై జరిగిన చర్చలో జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించారు. పార్లమెంటుకు బిల్లు చేరడంతో ఢిల్లీలో మకాం వేసిన జిల్లా నేతలు, జేఏసీ నాయకులు ఆమోదం పొందడంలో తమ వంతు పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించిన వేళ జిల్లా వాసులు సంబురాల్లో మునిగి తేలారు. -
స్వప్న ‘సంబురం’
ఇది అరవై ఏళ్ల ఆశ. సుదీర్ఘ పోరాటం. త్యాగాల సింధూరం. ఉద్యమ బాటన ఊరూ..వాడా నడిచాక ఇన్నేళ్లకు ఫలించిన స్వప్నం. పార్లమెంటు సాక్షిగా లోక్‌సభ ఆమోద ముద్రతో తెలంగాణ ఆవిర్భావం. ఈ వార్త తెల్సిన వెంటనే పాలమూరు జిల్లా ఆనంద డోలికల్లో ఊగిపోయింది. వయోబేధం లేకుండా అంతా ఎగిరి గెంతులేశారు. రంగులు చల్లుకున్నారు. ఆప్యాయంగా అలయ్ బలయ్ ఆడారు. నవలోకం మనకోసమే వెలిసిందని మురిసిపోయారు. తెలంగాణ తల్లిని ముద్దాడారు. జెండాలెత్తి జై కొట్టారు. విభేదాలు మరచి ఒక్కటై సంబురాలు జరుపుకున్నారు. బాజాలు మోగాయి. బాణసంచా పేలింది. వాహ్...అంతటా జోష్..జోష్. పాలమూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభలో రాష్ట్ర పునర్విభజ న బిల్లుకు ఆమోదం లభించడంతో తెలంగాణవాదుల సంబురాలతో ఊరూవాడా హోరెత్తింది. హోళీ, దీపావళి పండుగ ఒకేసారి కలిసి వచ్చిన రీతిలో తెలంగాణవాదులు ఆనందోత్సాహంలో తేలియాడారు. మిఠాయిలు పంచుతూ అలయ్‌బలయ్‌తో ఆనందం పంచుకున్నారు. రాజకీయ పక్షాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, వివిధ జేఏసీల ఆధ్వర్యంలో ఎవరికి వారుగా ర్యాలీలతో ముఖ్య కూడళ్లకు తరలివచ్చారు. బాణసంచా పేల్చుతూ ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. డప్పు చప్పుళ్లతో ముఖ్య కూడళ్లు మార్మోగాయి. డీజేలు ఏర్పాటు చేసి ఉద్యమ గీతాలకు అనుగుణంగా ఆట పాటల్లో మునిగి తేలారు. అమరుల స్థూపాలకు నివాళి అర్పిస్తూ, తెలంగాణ తల్లి, అంబేద్కర్, గాంధీ తదితరుల విగ్రహాలను పూలమాలలతో ముంచెత్తారు. వివిధ పార్టీల ముఖ్య నేతలు ఢిల్లీలో మకాం వేయడంతో కింది స్థాయి నేతలు పార్టీ పతాకాలతో హడావుడి చేశారు. ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయిన జన సామాన్యం ‘బిల్లు ఆమోదం’ వార్తతో రోడ్లపైకి రావడంతో జనసంద్రం ఆవిష్కృతమైంది. సుదీర్ఘ నిరీక్షణ, ఉత్కంఠ నడుమ రాష్ట్ర పునర్విభజన బిల్లుకు ఆమోదం లభించడంతో పాలమూరు అణువణువునా పులకరించింది. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ జిల్లా ఛైర్మన్ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఐఎంఎల్, కుల సం ఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యం లో జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిం చారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులతో జెతైలంగాణ నినాదాలు చేస్తూ పట్టణ వీధుల్లో ర్యాలీ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల పరిధుల్లో ప్రజలు ఆనందంతో ఊగిపోయారు. షాద్‌నగర్‌లో టీఆర్ఎస్, బీజేపీ, టీజేఏసీ నేతలు ముఖ్య కూడలికి చేరుకుని బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. డీజే ఏర్పాటు చేసి నృత్యాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించాయి. నాగర్‌కర్నూలులో టీఆర్ఎస్ ప్రచార రథంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్సీ కాంప్లెక్స్ ముందు టెంట్ ఏర్పాటు చేసి అందరికీ తెలంగాణ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు ఎమ్మెల్యే నాగం ఇంటి ముందు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్దనున్న వనం ఝాన్సీ చిత్రపటానికి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. టీడీపీ నాయకులు ప్రధాన రహదారిపై రంగులు చల్లుకుంటూ సంబరాలు నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో స్వీట్లు పంచిపెట్టారు. మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ వాదులు మిఠాయి పంచి బాణసంచా కాల్చారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ,సీపీఐ,నాయకులు విజయోత్సవర్యాలీలు నిర్వహించారు. కొల్లాపూర్, వీపనగండ్ల మండలాల్లో విజయోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే జూపల్లి కష్ణారావు తనయులు అరుణ్,వరుణ్‌లు పాల్గొన్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కల్వకుర్తిలో ప్రధాన వీధుల గుండా ర్యాలీలు నిర్వహించారు. పట్టణంలోని జేఏసీ శిబిరం, బస్టాండ్, ఆర్టీసీ డిపో, హైదరాబాద్ చౌరస్తాల్లో బాణసంచాలు కాల్చుతూ, నత్యాలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సంబరాలు చేసుకున్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు సమీపంలో బాణాసంచా కాల్చారు. వనపర్తి లో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, జేఏసీ, విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ సంబరాలు జరుపుకున్నారు. వీధుల్లో బాణా సంచాకాల్చి తమ ఆనందాన్ని ప్రదర్శించారు. నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లోనూ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. కొడంగల్‌లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీల ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలో సాయంత్రం సంబరాలు నిర్వహించారు. అచ్చంపేట పట్టణంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు విద్యార్థి, ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు రోడ్లపై ర్యాలీలు చేపట్టారు. టీబిల్లుపై లోక్ సభ ఆమోదాన్ని హ ర్షిస్తూ దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో ఆనందం తొణికిసలాడింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీలు చేపట్టడంతోపాటు మిఠాయిలు పంచిపెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు. గద్వాలలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, జేఏసీ, విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం సాయంత్రం వేరువేరుగా రహదారులపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఎర్రవల్లి చౌరస్తాలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం ప్రజలతో కలిసి తెలంగాణ సంబరాలను పంచుకున్నారు. జడ్చర్లతోపాటు నియోజకవర్గ పరిధిలోని మిడ్జిల్, బాలనగర్, నవాబుపేట మండలాల్లో ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. నారాయణపేటలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలకు చెందిన నాయకులు, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ర్యాలీలు, వేడుకలు జరిగాయి. -
నిమిషంన్నతో సరి
అసెంబ్లీ మళ్లీ వాయిదా.. మండలిలోనూ అదే సీను సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టిన వైఎస్సార్సీపీ తెలంగాణ బిల్లుపై చర్చకు టీ సభ్యుల పట్టు సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర.. జై తెలంగాణ నినాదాల మధ్య శాసనమండలి, అసెంబ్లీ రెండూ ఐదో రోజు బుధవారం కూడా ఎలాంటి ఎజెండా కార్యక్రమాలనూ చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో ఉభయ సభలూ హోరెత్తాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే వివిధ పక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ, తెలంగాణ బిల్లుపై వెంటనే చర్చించి సభ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపాలంటూ సీపీఐ పక్ష నేత జి.మల్లేశ్, సమైక్యాంధ్ర-తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితిపై చర్చించాలని టీడీపీ ఇచ్చిన తీర్మానాలను తిరస్కరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యులు పోడియం వద్ద నినాదాలకు దిగటంతో సభను స్పీకర్ గంట పాటు వాయిదా వేశారు. 10.15 తిరిగి ప్రారంభమైనా 15 సెకండ్లకే మళ్లీ వాయిదా పడింది. మధ్యాహ్నం 1.20కి మూడోసారి సమావేశం కాగానే మళ్లీ నినాదాలు హోరెత్తాయి. దాంతో మళ్లీ 15 సెకండ్లలోనే సభను గురువారానికి వాయిదావేశారు. బుధవారం ఒకటిన్నర నిమిషాల పాటే సభ సాగింది. మండలిలోనూ: ఉదయం 10 గంటలకు మండలి సమావేశం కాగానే వైఎస్సార్సీపీ, సీమాంధ్ర టీడీపీ సభ్యులు పోడియంలోకి వెళ్లి జై సమైక్యాంధ్ర, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర తీర్మానం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేశారు. తెలంగాణ సభ్యులు కూడా జై తెలంగాణ నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో కౌన్సిల్ హోరెత్తింది. ‘‘రాష్ట్రపతి పంపిన రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చిద్దాం. అందరి అభిప్రాయాలూ రికార్డు చేసి పంపుతాం. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చు’’ అని మండలి చైర్మన్ సూచించారు. కానీ సమైక్యాంధ్ర తీర్మానం చేశాకే బిల్లుపై చర్చకు అనుమతివ్వాలంటూ వైఎస్సార్సీపీ, సీమాంధ్ర టీడీపీ సభ్యులు మళ్లీ చైర్మన్ పోడియంలోకి వచ్చి నినాదాలు చేశారు. దాంతో 10.30కు సభ వాయిదా పడింది. 11.45కు సమావేశమైనా అదే గందరగోళం నెలకొనడంతో రెండు నిమిషాలకే డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు సభను గురువారానికి వాయిదా వేశారు. అందరి అభిప్రాయాలూ రికార్డు చేసి పంపుతాం: చక్రపాణి ‘‘రాష్ట్రపతి నుంచి వచ్చిన ఏ అంశానికైనా సభలో ప్రాధాన్యముంటుంది. చర్చకు సహకరించండి. అందరూ మాట్లాడవచ్చు. కావాల్సినంత సమయమిస్తా. అనుకూలంగా, వ్యతిరేకంగా, తటస్థంగా వచ్చే అన్ని అభిప్రాయాలనూ రికార్డు చేసి రాష్ట్రపతికి పంపుతాం. అఫిడవిట్లిచ్చినా స్వీకరిస్తాం. మనం పంపే ప్రతి అంశాన్నీ ఆయన పరిశీలిస్తారు’’ అని సభ్యులకు చక్రపాణి వివరించారు. అనంతరం తన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. సభ్యులెవరైనా బిల్లుపై ఓటింగ్ కోరితే అనుమతిస్తారా అని ప్రశ్నించగా, ‘‘రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును తిరస్కరించడం, అంగీకరించడం ఉండవు. వాటన్నింటిపైనా పార్లమెంటుదే తుది నిర్ణయం’’ అని బదులిచ్చారు. -
నినాదాలతో మార్మోగిన శాసనమండలి
-
నినాదాలతో మార్మోగిన శాసనమండలి
సమైక్యాంధ్ర, జైతెలంగాణ నినాదాలతో శాసనమండలి మార్మోగింది. సమైక్య తీర్మానం చేయాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడియం చుట్టుముట్టారు. సభ్యులు వారి వారి స్థానాల్లో కూర్చొవాలని చైర్మన్ పదేపదే విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి సందేశం టాప్ ప్రయారిటీని చైర్మన్ స్పష్టం చేశారు. సభ్యుల నినాదాల మధ్య దాదాపు అరగంట పాటు సభ నడిచింది. ఆ తర్వాత సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మంత్రి గీతారెడ్డి బుధవారం మండలికి వచ్చారు. తిరిగి పదకొండు 45 నిమిషాల ప్రాంతంలో సమావేశమైన మండలి... మూడు నిమిషాల్లోనే రేపటికి వాయిదా పడింది. సభ్యులు ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. నినాదాల మధ్య సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు మండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్ ప్రకటించారు. -
తెలంగాణ కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
పెద్దమందడి, న్యూస్‌లైన్: తెలంగాణ కోసం ఒంటిపై పె ట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని పెద్దమందడి మండలకేంద్రానికి చెందిన విరళాసాగర్(25)అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ విషాదకర సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన వెంకటమ్మ, బాలస్వామిల కొడుకు విరళాసాగర్. తల్లిదండ్రులు చనిపోవడంతో అతడు బెంగళూరులో డీసీఎం వాహనంపై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దసరా పండుగ కోసం రెండురోజుల క్రితం పెద్దమందడికి వచ్చాడు. మంగళవారం రాత్రి గ్రామంలోనే ‘జై తెలంగా ణ’ అంటూ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు చికిత్సకోసం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. న్యాయమూ ర్తి బాధితుడి వాంగ్మూలం తీసుకున్నారు. తెలంగాణ కో సమే తాను నిప్పంటించుకున్నట్లు చెప్పాడు. కేసునమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌస్ తెలిపారు. -
తెలంగాణ ఇస్తే సంబరం.. లేకుంటే సమరమే.. : సుష్మాస్వరాజ్
తెలంగాణ ప్రజాగర్జన సభలో సుష్మాస్వరాజ్ తెలంగాణపై మడమ తిప్పం, మాట తప్పం ప్రకటించి రెండు నెలలైనా అడుగు ముందుకు పడలేదేం? కాంగ్రెస్ తీరు అనుమానాస్పదంగా ఉంది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలి తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్ర సమస్యలపై దృష్టి తెలుగులో ప్రారంభం, హిందీలో కొనసాగిన ప్రసంగం (మహబూబ్‌నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): తెలంగాణ ఇస్తే సంబరం, ఇవ్వకుంటే సమరమేనని బీజేపీ స్పష్టం చేసింది. రాజకీయ పొత్తులున్నా లేకున్నా తెలంగాణపై మాట తప్పం, మడమ తిప్పమని తెగేసి చెప్పింది. తెలంగాణ ప్రజా గర్జన పేరిట మహబూబ్‌నగర్‌లో బీజేపీ శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ప్రధాన వక్తగా హాజరయ్యారు. అనుకున్న సమయానికి గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన సభలో ఆమె తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి హిందీలో కొనసాగించారు. తెలంగాణ కోసం అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటించారు. అందర్నీ ఏకం చేసి ఐక్యపోరాటాన్ని నడిపిస్తున్న కోదండరాంకు అభినందనలు తెలిపారు. జై తెలంగాణ, జై సీమాంధ్ర అని సభికులతో నినాదాలు చేయించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. రతంగ్ పాండురెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ... సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత పార్లమెంటులో చర్చల సందర్భంగా తమ పార్టీ నేతలు చేసిన ప్రసంగాలపై వచ్చిన ఊహాగానాలను తోసిపుచ్చారు. తెలంగాణ ఏర్పాటయ్యేంత వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. ‘‘ఒకవైపు సంతోషం, మరోవైపు విజయం సిద్ధిస్తుందన్న నమ్మకం ఉన్నా... మనసులో ఏదో మూల సందేహం కూడా ఉంది. 2009 డిసెంబర్ 9న కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్రకటన చేసి కొన్ని రోజుల తర్వాత వెనక్కు తీసుకున్నారు. జూలై 30న సీడబ్ల్యుసీ తెలంగాణపై ప్రకటన చేసింది. ఇప్పటికి రెండు నెలలు కావస్తున్నా ఎటువంటి ముందడుగు పడకపోవడమే ఈ సందేహానికి కారణం. రెండుమూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి మధ్య పొంతన ఉండడం లేదు. శిక్ష పడిన వారిని చట్టసభలకు దూరంగా ఉంచాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ వ్యవహారంలోనూ ప్రధాని ఓ విధంగా, రాహుల్ గాంధీ ఓ విధంగా స్పందించారు. అందుకే నా అనుమానం. ఈసారి కాంగ్రెస్ మోసం చేస్తే తెలంగాణ ప్రజలు సహించరు. వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతారు. నవంబర్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత అంటే డిసెంబర్లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రెండు రెండు నెలల సమయం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని సీడబ్ల్యుసీ ప్రకటించినట్టుగా హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణను శీతాకాల సమావేశాల్లో పెట్టాలి. అలా పెడితే బీజేపీ భేషరతుగా మద్దతు ఇస్తుంది. మేము గతంలో మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు అందర్నీ సంప్రదించి ఇచ్చాం. కానీ ఈరోజు విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది... ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తారు... ఎంపీలు పార్లమెంటును స్తంభింపజేస్తారు... గాంధీ విగ్రహం ముందు ప్రదర్శనలు నిర్వహిస్తారు... ఎందుకిలా జరుగుతుంది?’’ అని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టి తెలంగాణ కల సాకారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ స్వప్నం నెరవేరిన తర్వాత సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. అదే సమయంలో విజయం సాధించిన వారు సంయమనం పాటించాలని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్లను తరిమేస్తామని, ఉండనివ్వబోమని చెప్పడం వల్ల నష్టం జరుగుతుందని సూచించారు. తాము కోరుకుంటున్నది ప్రాంతాల విభజనే తప్ప ప్రజల మధ్య కాదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో తమ పార్టీ, కోదండరాంతో కలిసి సంఘటితంగా కృషి చేస్తుందని ఆమె చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో తమ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్‌ను కలిసిన దానికి రాజకీయ ప్రాధాన్యత లేదని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల కూటమి, భవిష్యత్ పొత్తుల ప్రస్తావన ఈ భేటీలో రానే రాలేదని తెలిపారు. పొత్తులున్నా, లేకున్నా తెలంగాణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను కల్పిస్తుందన్నారు. కృష్ణ, గోదావరి నదుల్ని అనుసంధానం చేస్తుందని హామీ ఇచ్చారు. పాలమూరు గత వైభవానికి చిహ్నంగా తిరిగి ఈ ప్రాంతం పాలు, మీగడలతో తూలతూగేలా చేస్తామన్నారు. ‘‘అభివృద్ధి కోసమే తెలంగాణకు మద్దతిస్తున్నాం. రెండు నెలల సమయంలో తెలంగాణ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ శీతాకాల సమావేశాల్లో పెట్టి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి. అదే జరిగితే విజయోత్సాహాల్లో పాల్గొనేందుకు వస్తా. లేకుంటే తిరిగి ఉద్యమం రెండో అధ్యాయాన్ని ప్రారంభించేందుకు వస్తా. కోదండరాం సిద్ధంగా ఉండాలి’’ అని సుష్మా స్వరాజ్ తన ప్రసంగాన్ని ముగించారు. సీమాంధ్రలో నాయకత్వ పోరు : కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం నాయకత్వ పోరులో భాగమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, బొత్స సత్యనారాయణ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సీమాంధ్రలో నాయకత్వానికి పోటీపడుతూ ఉద్యమాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎంగా కొనసాగే హక్కు లేదని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతేనని చెప్పారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణకు అడ్డం పడుతున్న ముఖ్యమంత్రి మీద, బిల్లు పెట్టడంలో జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద గర్జించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇస్తే వచ్చేవి మూడు సమస్యలేనని, ఇవ్వకపోతే 30 వస్తాయని చెప్పారు. ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, సాధించిన విజయాలను చూసి గర్వించాలని సూచించారు. ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని తరిమికొట్టే రోజు వచ్చిందని సీహెచ్ విద్యాసాగరరావు చెప్పారు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి, మరికొందరు సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని మాజీమంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి తప్పుబటా ్టరు. వచ్చే సెప్టెంబర్ 17న తెలంగాణ సచివాలయం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
జై తెలంగాణ అంటేనే కొడుతుండ్రు.. అట్లయితేసీఎంను ఎన్నిసార్లు కొట్టాలె?
కిరణ్ జై సమైక్యాంధ్ర అంటున్నాడుగా.. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలి ‘చలో నకిరేకల్’ సభలో కోదండరాం నల్లగొండ/నకిరేకల్, న్యూస్‌లైన్: ‘జై తెలంగాణ అన్నందుకే తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దూదిమెట్ల బాలరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్‌లను సీమాంధ్ర ఉద్యోగులు కొడుతుండ్రు.. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ జై సమైక్యాంధ్ర.. అంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని మనం ఎన్నిసార్లు కొట్టాలె?’ అని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. ఏపీఎన్జీఓల సభ సందర్భంగా దూదిమెట్ల బాలరాజుపై సీమాంధ్ర గూండాలు, ఉద్యోగులు దాడి చేయడాన్ని ఖండిస్తూ టీవీఎన్‌ఎస్, టీఎస్‌జేఏసీ, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో నకిరేకల్‌లో శుక్రవారం ‘చలో నకిరేకల్’ నిరసన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం ప్రసంగిస్తూ.. తెలంగాణ పేరెత్తితేనే దాడులకు దిగుతున్న సీమాంధ్రులు.. సమైక్యంగా ఉండాలని కోరుకోవడం సిగ్గుచేటన్నారు. బాలరాజుపై దాడి యావత్ తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మాభిమానంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ‘ తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రులు చేస్తున్న కుట్రలు.. కుతంత్రాలను భగ్నం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపైనే ఉంది’ అన్నారు. కాగా, అంతకుముందు కోదండరాం నకిరేకల్‌లో విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌పై సీమాంధ్రులకు ఎలాంటి హక్కు లేదని, యూటీ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలంతా మళ్లీ ఉవ్వెత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు. బలవంతంగా కలిసి ఉండాలని ఉద్యమించడం నాగరికతకు విరుద్ధమన్నారు. ఈనెల 29న సకల జనభేరి సభను జయప్రదం చేయాలన్నారు. ‘భేరి’కి అనుమతి వస్తుందన్న ధీమా ఉంది ‘సకల జనభేరి’ సభకు పోలీసుల నుంచి అనుమతి వస్తుందన్న విశ్వాసం ఉందని టీ-జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నల్లగొండలో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం పెన్షనర్స్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సకల జనభేరి నిర్వహణకు అనుమతి ఇస్తామని పోలీసులు గతంలోనూ చెప్పారు. తప్పనిసరిగా దీన్ని విశ్వసిస్తున్నాం. ఎటువంటి అవరోధాలు సృష్టించబోరని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యం ప్రజల మధ్య విద్వేషాలు ఉద్భవించి గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. ఇవన్నీ అంతం కావాలంటే శాంతియుత విభజన జరగాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ జిల్లాను ఆదర్శంగా తీసుకుని ఈనెల 22నుంచి అన్ని జిల్లాల్లో జేఏసీ ఆధ్వర్యంలో రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు నిరుద్యోగులకు తక్షణమే లక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని కోదండరాం తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో నిరుద్యోగ విద్యార్థుల ఆధ్వర్యంలో ‘భవిష్యత్ తెలంగాణలో విద్యార్థి, నిరుద్యోగుల పరిస్థితి’ అనే అంశంపై సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని కొందరు అసమర్ధ నేతల వల్లే మనకు దక్కాల్సిన ఉద్యోగాల్ని సీమాంధ్రులు కొల్లగొట్టారని అన్నారు. -
జై తెలంగాణ అంటే టైజమా..
సిద్దిపేట టౌన్,న్యూస్‌లైన్:జై తెలంగాణ నినాదాలు చేస్తే పాశవికంగా దాడిచేస్తారా..? ఈ హక్కు వారికి ఎవరిచ్చారు..? తెలంగాణ పదమంటే టైజమా..? దేశద్రోహమా..? నేరమా..? గుండె రగులుతోందని రాష్ట్ర సీనియర్ మంత్రి జె. గీతారెడ్డి మండిపడ్డారు. సిద్దిపేటలో ఆదివారం సాయంత్రం విలేకరులతో ఆమె మాట్లాడుతూ సేవ్ ఏపీ సభ సందర్భంగా పోలీసులు హద్దులు మీరి ప్రవర్తించారన్నారు. తెలంగాణ పోలీసులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలం, విద్యార్థి నేత బాల్‌రాజు, నిజాం కళాశాల విద్యార్థులపై జరిగిన దాడులకు సంబందించి విచారణ జరగాలని భాద్యులైన వారిని శిక్షించాలన్నారు. ఈ సంఘటనలపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణలో తెలంగాణ నినాదం చేసే హక్కును కోల్పోమన్నారు. తెలంగాణ సహనం, మంచితనం వల్లనే సేవ్ ఏపీ సభ సాఫీగా జరిగిందన్నారు. రెచ్చగొట్టే చర్యలు మంచి ఫలితాలు ఇవ్వవన్నారు. సఖ్యత లేనప్పుడు పోలీసులు సున్నితంగా, ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించాలన్నారు. -
హోరెత్తిన నిరసనలు
సాక్షి నెట్వర్క్: జై సమైక్యాంధ్ర.. జై తెలంగాణ..నినాదాలతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పోటాపోటీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం రాజధానిలోని విద్యుత్‌సౌధ, ఇతర ప్రధాన ప్రభుత్వ విభాగాలు నిరసన కార్యక్రమాలతో హోరెత్తాయి. వివరాలు..సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు, ప్రత్యేక తెలంగాణను వెంటనే ప్రకటించాల తెలంగాణ ఉద్యోగుల ధర్నాలు, నినాదాలతో విద్యుత్‌సౌధ దద్దరిల్లింది. సీమాంధ్ర ఉద్యోగులు- ‘కుర్చీని కాపాడుకోవడం ఎలా?’ అనే నాటికను ప్రదర్శించారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తుతుందని సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీవిద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. శాంతిభద్రతల్ని సాకుగా చూపుతూ సీఎం మాట్లాడడం సరికాదని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు రఘు పేర్కొన్నారు. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా కోఠి డీఎంహెచ్ఎస్లో ఏపీఎన్జీవోలు విధులు బహిష్కరించి డీఎంహెచ్ఎస్ క్యాంపస్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైద్య విధాన పరిషత్, ఏపీసాక్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం, డీఎంఈ, డీహెచ్ తదితర కార్యాలయాల ఉద్యోగులు ర్యాలీలో సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమాభవన్‌లో, బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ కార్యాలయంలోనూ ఏపీఎన్జీవోల ప్రదర్శనలు కొనసాగాయి.