బీజేపీపై నోరుపారేసుకోవద్దు
- కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి హెచ్చరిక
- తెలంగాణ సాధనలో మా పార్టీ పాత్ర మరవద్దు
- జైరామ్ రమేశ్ నోట్లో ఉన్నది నాలుకనేనా..?
- జై తెలంగాణ అనే హక్కు కాంగ్రెస్‌కు లేదు
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్... మీ పార్టీ ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు. సాధారణ పార్టీ. ఇంతకాలం ఉద్యమపార్టీగా మీరేమన్నా చెల్లిందేమో. ఇప్పుడు కుదరదు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించిన బీజేపీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. ఇక మాటకు మాట సమాధానం చెప్తాం’ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
శనివారం సాయంత్రం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ-టీడీపీది అపవిత్ర పొత్తు అంటున్న కేసీఆర్ గతంలో తెలంగాణ వ్యతిరేకి సీపీఎంతో రెండుమార్లు పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ సంగతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అలాగే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న విషయం మరిచిపోతే ఎలా అని పేర్కొన్నారు. టీడీపీని విమర్శిస్తే తమకు సంబంధం లేదని, కానీ బీజేపీపై నోరుపారేసుకుంటే ఊరుకోమన్నారు.
తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించిన బీజేపీపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణను బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని జైరాం వ్యాఖ్యానిస్తే అయన నోట్లో ఉన్నది నాలుకోకాదో అర్థంకావడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారినట్టు కనిపిస్తుండడంతో ఆ పార్టీ నేతలు ఇలా మాట్లాడుతున్నారనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో సోనియా సభ విఫలమైన తీరు చూస్తే కాంగ్రెస్ పరిస్థితి అర్థమవుతోందన్నారు.
*తెలంగాణకు జై అన్న పాపానికి రేణుక అనే బాలిక పై కాల్పులు జరిపించిన కాంగ్రెస్ పార్టీకి జై తెలంగాణ అనే హక్కులేదన్నారు.
*తెలంగాణ యువకుల మృతికి కారణమైన కాంగ్రెస్‌కు ఆ పాపం తగిలి తగిన శాస్తే జరుగుతుందని, ఇది తన శాపమని కిషన్‌రెడ్డి అన్నారు.
*మోడీ వస్తే మతకలహాలు జరుగుతాయంటున్న కాంగ్రెస్ నేతలు, మర్రి చెన్నారెడ్డిని గద్దె దింపేందుకు పాతబస్తీలో మతకలహాలు సృష్టించింది కాంగ్రెస్ కాదని చెప్పగలరా అని ప్రశ్నించారు. అవి కాంగ్రెస్ నేతలు చేయించినవేనని అప్పట్లో చెన్నారెడ్డి చెప్పారని గుర్తు చేశారు.
*బీజేపీ అధికారంలో ఉంటేనే ప్రశాంత వాతావరణం నెలకొంటుందని చెప్పారు.
*ప్రాణహిత - చేవెళ్ల పథకానికి అనుమతులు లేనందున జాతీయహోదా రాలేదని పొన్నాల చెప్పడం హాస్యాస్పదమన్నారు.
*అనుమతులు లేనప్పుడు రూ.నాలుగైదువేల కోట్లు ఎలా ఖర్చు చేశారో పొన్నాల ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
*ఖర్చు చేసిన నిధుల్లో 60 శాతం కాంగ్రెస్ నేతల జేబుల్లోకి చేరాయని ఆరోపించారు.
*నిత్యం విమర్శలు సంధించుకుంటున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు భాష విషయంలో సంయమనం పాటించాలన్నారు.
*జాతి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. అయినప్పటికీ తెలంగాణ విషయంలో తాము ఆ పార్టీని వెనకేసుకురావడం లేదన్నారు.