ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో చిన్నారులకు బహుమతులను పంపిణీ చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో పోచారం
సాక్షి, హైదరాబాద్: ‘అశాంతి, అసంతృప్తి, ఆత్మహత్యలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణ ప్రజానికం కోసం జై తెలంగాణ నినాదంతో యుద్ధం చేసి విజయం సాధించాం. ప్రత్యేక రాష్ట్రాన్ని దక్కించుకుని స్వయం పాలనతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాం. అభివృద్ధి, తలసరి ఆదాయం వృద్ధి.. అన్నింటా అద్భుత ప్రగతి సాధించి తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఇప్పు డు అదే స్ఫూర్తితో జైభారత్ నినాదాన్ని ఎత్తుకున్నాం. అన్నివర్గాల మద్దతు కూడగట్టుకుని దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప శాంతికాముక అభివృద్ధి దేశంగా తీర్చిదిద్దాలని తలచి మరో యుద్దాన్ని మొదలుపెట్టాం.
కులమతాలకు అతీతంగా అన్నివర్గాల మద్దతుతో విజయం సాధిస్తామని ఆశిస్తున్నాను’’అని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత క్రిస్మస్‌ట్రీ లైట్‌ను వెలిగించిన కేసీఆర్.. తర్వాత కేక్ కట్ చేసి క్రైస్తవ పెద్దలకు అందించారు. అనంతరం మాట్లాడారు.
క్రీస్తు ప్రేమ మార్గాన్ని అనుసరిద్దాం
ఒక మనిషి తనను తాను ఏవిధంగా ప్రేమించుకుంటాడో ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించాలనే సూత్రాన్ని బోధించిన శాంతి మూర్తి జీసస్ అని కేసీఆర్ పేర్కొన్నారు. క్రీస్తు బోధనలను అనుసరిస్తే ప్రపంచంలో మనుషుల మధ్య స్వార్థం, అసూయలకు తావు ఉండదని.. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య ఎక్కడా యుద్ధాలు జరగవని, నేర సమాజం ఉండదని చెప్పారు. ప్రపంచ శాంతి కోసం తపించిన క్రీస్తు బాటను అందరం అనుసరిద్దామన్నారు. దేశంలో శాంతి సామరస్యాల కోసం మరో పోరాటాన్ని సాగించేందుకే జై భారత్ నినాదాన్ని ఎత్తుకున్నామని కేసీఆర్ వివరించారు.
‘‘జై తెలంగాణ నినాదంతో నిలిచి పోరాడితే తెలంగాణ ఏర్పడింది. ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణలో తలసరి ఆదాయం రూ.లక్షగా ఉండేది. ఇప్పుడు అది రూ.2.75 లక్షలకు పెరిగింది. విద్యుత్, మంచినీటి సరఫరా, ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ అభివృద్ధి తెలంగాణకే పరిమితం కాకుండా దేశమంతా వ్యాప్తిచెందేలా మరో యుద్ధాన్ని నడిపిస్తున్నాం.
మంచికోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి మద్దతు పెరుగుతోంది. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి వేగాన్ని దేశమంతా అమలు చేస్తే ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా భారత్ దూసుకెళ్తుంది’’అని కేసీఆర్ పేర్కొన్నారు. కులం, జాతి, వర్గం అనే తేడా లేకుండా అన్ని పండుగలను ప్రభుత్వమే నిర్వహిస్తుండటం గొప్ప విషయమన్నారు.
క్రైస్తవుల సమస్యలపై ప్రత్యేక సమావేశాలు
క్రైస్తవులకు సంబంధించిన పలు సమస్యలను కొందరు తన దృష్టికి తీసుకువచ్చారని.. వాటిపై చర్చించేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనాథ పిల్లలు, పేద క్రైస్తవులకు కేసీఆర్ క్రిస్మస్ బహుమతులను అందజేశారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిషప్ పూల ఆంథోనీ కార్డినల్‌గా ఎంపికకావడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఆయనను ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ.. కవిత ట్వీట్‌కు రాజగోపాల్ రెడ్డి రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment