పోరుగడ్డకు... సలాం! | Grand celebration of Telanagana state | Sakshi
Sakshi News home page

పోరుగడ్డకు... సలాం!

Published Sat, Feb 22 2014 4:13 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Grand celebration of Telanagana state

 తెలంగాణ సాధనలో పాలమూరు గడ్డ నేను సైతం అంటూ ఉద్యమానికి ఊపిరులూదింది. ఐదు దశాబ్దాలకు పైబడిన ప్రస్థానంలో భుజం కలిపి కదం తొక్కింది. నిర్బంధాన్ని, అణచివేతలను ఎదుర్కొంటూ స్వరాష్ట్ర కాంక్షను ఎలుగెత్తి చాటింది. ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా’ అంటూ జన సామాన్యం కడగండ్లు కవులు, కళాకారుల గొంతులో కన్నీటి పాటలై ప్రవహించాయి. బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి ముగ్గులు ఉద్యమ రూపాలయ్యాయి. రైలు మార్గాలు, రోడ్లు ఉద్యమ వేదికలయ్యాయి. సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె పేరిట సబ్బండ వర్ణాలు ‘జై తెలంగాణ’ అని నినదించాయి.
 
 మిలియన్ మార్చ్‌లు, చలో హైదరాబాద్, అసెంబ్లీ ముట్టడి.. పిలుపేదైనా ఊర్లు ఉమ్మడిగా స్పందించాయి. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి వచ్చిన నేతలకు ఉప ఎన్నికల ఫలితాలతో చుక్కానిలా నిలిచింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు క్రమంలో అసెంబ్లీ, పార్లమెంటు వేదికగా జరిగిన  రాజకీయ క్రీడను ఉత్కంఠతో వీక్షించింది. స్వరాష్ట్ర స్వప్నం నెరవేరిన వేళ  ఆనందోత్సాహాల్లో మునిగి తేలింది. సమగ్రాభివృద్ధితో కూడిన బంగారు భవిష్యత్తును స్వప్నిస్తూ సాకారం చేసుకునేందుకు కోటి ఆశలతో ఎదురు చూస్తోంది.        
 - కల్వల మల్లికార్జున్‌రెడ్డి,  సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
 
 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేక పాత్రను పోషిస్తూ వచ్చింది. 1969 నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మాజీ ఎంపీ మల్లికార్జున్ ఫైర్‌బ్రాండ్ నేతగా  పేరొందారు. 2001 నుంచి మలి విడత ఉద్యమం మొదలైంది. నలభై రెండు మంది తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో కూడిన ప్రతినిధి బృందానికి వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి  2000లో నేతృత్వం వహించి కేంద్ర ప్రభుత్వానికి ‘తెలంగాణ’ ఆకాంక్ష వినిపించారు. ఆ తర్వాత 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో  కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల రాజకీయాలను అస్త్రంగా  ఉద్యమించిన టీఆర్‌ఎస్ తొలి అంకంలో పాక్షిక ఫలితాన్ని సాధించింది. కేసీఆర్ పిలుపు మేరకు 2007లో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన పదవికి రాజీనామా చేసినా తిరిగి అసెంబ్లీ గుమ్మం ఎక్కలేక పోయారు.
 
 రెండో అంకం ఇక్కడ నుంచే!
 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మహబూబ్‌నగర్ స్థానం నుంచి పార్లమెంటులో అడుగు పెట్టారు. దివంగత సీఎం వైఎస్ మరణానంతర రాజకీయ పరిస్థితులను ఆయన సోపానాలుగా మలుచుకున్నారు.  కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష  సంపూర్ణ ఉద్యమ పథంలోకి అందర్నీ నడిపింది. ఇదే క్రమంలో 2009 డిసెంబర్ చివరి వారంలో ఆవిర్భవించిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) రూపంలో ఉద్యమం మరింత పుంజుకుంది. జిల్లాకు చెందిన ఉద్యోగులు, టీచర్లు, లాయర్ల సహా సబ్బండ వర్ణాలు  భాగస్వాములయ్యాయి. విద్యా సంస్థలు వేదిక లు కాగా, విద్యార్థులు  బావుటాలయ్యారు. జిల్లాకు చెందిన కొందరు విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానంతో ఆకాంక్షను చాటారు. ఈ నేపథ్యంలోనే 2010లో రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి జనం మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది.
 
 సహాయ నిరాకరణ అస్త్రం
 ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు పడకపోవడంతో జేఏసీ పిలుపు మేరకు 2011 ఫిబ్రవరి నుంచి 16 రోజుల పాటు జిల్లాలో సంపూర్ణ సహాయ నిరాకరణ పాటించారు. ఇదే సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలను తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు బహిష్కరించారు.
 
 2011 జూలైలో  81 మంది ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామా సమర్పించగా, జిల్లా నేతలూ అనుసరించారు. 2011 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ‘సకల జనుల సమ్మె’ ఉద్యమ ప్రస్థానంలో మైలు రాయే.  42 రోజుల పాటు జరిగిన ఈ సమ్మెలో రైలు రోకోలు, రహదారుల దిగ్బంధనం, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక వర్గాలతో పాటు న్యాయవాదులు, వైద్యులు, వ్యాపార, వాణిజ్య వర్గాలు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. ఉద్యమ తీవ్రతతో జన జీవనం స్తంభించింది.
 
 గళమెత్తిన కవులు, కళాకారులు
  ఉద్యమంలో జిల్లాకు చెందిన కవులు, కళాకారులు కీలక భూమిక పోషించారు. గోరేటి వెంకన్న, సాయిచంద్, జంగిరెడ్డి పాలమూరు జీవన స్థితిగతులను కళ్లకు కట్టారు. కృష్ణవర్మ, పాపకంటి శేఖర్ ఉద్యమ ప్రస్థానంలో ప్రాణాలు కోల్పోయారు. కొత్త కలాలు, గళాలు పురుడు పోసుకున్నాయి.
 
 ‘అధికారానికి’ గుడ్‌బై
 తెలంగాణ అంశంపై అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2011 అక్టోబర్ 29న టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి పదవిని వదిలిన జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ఎమ్మెల్యే పదవిని త్యజించారు. తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్‌గా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కూడా పార్టీని వీడి ఎమ్మెల్యే పదవిని త్యజించారు. ఈ నేపథ్యంలో 2012 మార్చిలో జిల్లాలోని నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ పక్షాన ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి విజ యం సాధించారు. ఉద్యమ నేతలకు ప్రజలు పట్టంకట్టారు. ఇదే ఏడాది సెప్టెంబర్ 29న జేఏసీ పిలుపు మేరకు ‘తెలంగాణ మార్చ్’కు హైదరాబాద్‌కు బయలుదేరిన వేలాది మందిని పోలీసులు ముందస్తు అరెస్టు పేరిట నిర్బంధించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నాగర్‌కర్నూలు ఎంపీ మంద జగన్నాథం అధికార పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు.
 
 అణచివేత నడుమ దిగ్బంధనం
 మహబూబ్‌నగర్ జిల్లా మీదుగా వెళ్లే ఏడో నంబరు జాతీయ రహదారిని 2013 మార్చి 21 టీజేఏసీ దిగ్బంధించింది. రోడ్లపైకి వచ్చిన వేలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే క్రమంలో 2013 జూన్ 30న జరిగిన ‘అసెంబ్లీ ముట్టడి’లోనూ వందలాది మందిని జిల్లాలో  కట్టడి చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ అనుకూల సంకేతం పంపడంలో భాగంగా ఆ నేతలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘సంఘీభావ సభ’కు జిల్లా నుంచి మంత్రి డీకే అరుణతో పాటు వేలాది మంది కార్యకర్తలు తరలివెళ్లారు. జూలై 30న  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయడంతో కొత్త అంకం మొదలైంది.
 
 ఉత్కంఠ నడుమ నెరవేరిన కల
 ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ 2013 అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ ఓకే చేయడంతో జిల్లాలో సంబురాలు ప్రారంభమయ్యాయి. 2013 డిసెంబర్, 2014 జనవరిలో రాష్ట్ర అసెంబ్లీ వేదికగా బిల్లుపై జరిగిన చర్చలో జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించారు. పార్లమెంటుకు బిల్లు చేరడంతో ఢిల్లీలో మకాం వేసిన జిల్లా నేతలు, జేఏసీ నాయకులు ఆమోదం పొందడంలో తమ వంతు పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించిన వేళ జిల్లా వాసులు సంబురాల్లో మునిగి తేలారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement