అమ్మానాన్నలకు ఆమె ఒక్కగానొక కూతురు.. ఇటీవల గోవాలోని బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది.
అమ్మానాన్నలకు ఆమె ఒక్కగానొక కూతురు.. ఇటీవల గోవాలోని బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. తమ ఇష్టదైవం తిరుపతి వెంకన్నకు మొక్కులు చెల్లించేందుకు తల్లిదండ్రులతో కలిసి సొంతకారులో బయలుదేరింది. తండ్రి డ్రైవింగ్ చేస్తుండగా కారు మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దైవదర్శనం చేసుకోకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు దుర్మరణం పాలయ్యారు.
మహబూబ్‌నగర్ క్రైం: తిరుపతి దైవ దర్శనార్థం వెళ్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు.. వెంకన్నకు మొక్కులు చెల్లించేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర సంఘటన సోమవారం 44వ జాతీయ రహదారిపై దివిటిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడి కథనం మేరకు.. హైదారాబాద్‌లోని హబిబ్సిగూడలో నివాసం ఉంటున్న ఇంజనీర్ సుబ్రమణ్యం, పద్మశ్రీ(44)ల కూతురు నాగవీణ(20) గోవాలోని బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తిచే సి సెలవులపై నాలుగురోజుల క్రితం తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.
తమ ఇష్టదైవంగా భావించే తిరుపతి వెంకటేశ్వర సామి దర్శనార్థం తమ ఇన్నోవాకారులో ఆదివారం మధ్యాహ్నం ఇంటినుంచి బయలుదేరి వెళ్లారు. నాగవీణ స్వయంగా తానే కారు నడుపుతోంది. ఇదిలాఉండగా, మార్గమధ్యంలో 44వ జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్ మండలం దివిటిపల్లి సమీపంలోకి రాగానే.. అతివేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నాగవీణ అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. భర్త సుబ్రమణ్యంతో పాటు పద్మశ్రీ తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌ను ఫోన్‌చేశారు. అరగంటైనా అంబులెన్స్ రాకపోవడంతో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పద్మశ్రీ ప్రాణాలు విడిచింది. గాయపడిన సుబ్రమణ్యంను చికిత్సకోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని మహబూబ్‌నగర్ రూరల్ ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్ పరిశీలించారు.
సకాలంలో స్పందించని 108 అంబులెన్స్
హైదారాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన సుబ్రమణ్యం దంపతులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దివిటిపల్లి శివారులో జాతీయ రహదారిపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం కూతురు అక్కడిక్కడే మృతిచెందగా, భార్య పద్మశ్రీ తీవ్ర గాయలతో ప్రాణాలతో కొట్టుమిట్టడుతుండగా స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు ఫోన్‌చేశారు. అరగంట తరువాత కూడా అంబులెన్స్ రాకపోవడంతో క్షతగ్రాతులను తరలించడంలో ఆలస్యమైంది. దీంతో అప్పటికే పద్మశ్రీ ప్రాణాలు విడిచింది. అంబులెన్స్ సమయానికి రాకపోవడంతోనే పద్మశ్రీ ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.