సంహితను అభినందిస్తున్న సీబీఐటీ అధ్యాపక బృందం
మణికొండ: అతిచిన్న వయసులో ఇంజినీరింగ్ పట్టా అందుకున్న కాశిభట్ట సంహితను చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) కళాశాల అధ్యాపక బృందం అభినందించింది. గండిపేటలోని కళాశాలలో బుధవారం కళాశాల ఇన్‌చార్జి అధ్యక్షురాలు డి.సంద్యశ్రీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సంహిత ఐదేళ్ల వయసులోనే సోలార్ సిస్టంపై 16 పేజీల వ్యాసం రాసి అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం ప్రశంసలు అందుకుందని తెలిపారు. 2007లో ఆమె అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ‘ఉత్తమ బాల పురస్కారం’ సైతం పొందిందన్నారు.
10 సంవత్సరాల వయసులోనే ప్రభుత్వ అనుమతితో 2012లో పదో తరగతి పరీక్షలు రాసి 8.8 జీపీఏ సాధించడంతో పాటు గణితం, సైన్స్‌లో 10/10 గ్రేడ్ సాధించిందన్నారు. 2014లో 12 సంవత్సరాల వయసులో ఇంటర్ ఎంపీసీలో 89 శాతం మార్కులు సాధించిందన్నారు. దీంతో ఆమెను ఇంజినీర్‌ను చేయాలనే పట్టుదలతో తల్లిదండ్రులు సీబీఐటీ కళాశాలను ఆశ్రయించారని, తాము సీటును కేటాయించి చేర్చుకున్నామని సంద్యశ్రీ వివరించారు. ప్రస్తుతం సంహిత 16 ఏళ్ల వయసులో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిందని, చివరి సెమిస్టర్‌లో 9.5 జీపీఏ పాటు ఓవరాల్‌గా 8.85 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించి యువ ఇంజినీర్‌గా నిలిచిన సంహితను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సంహితను సన్మానించి బంగారు గొలుసు బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment