ఇంజినీర్‌ టు డిజైనర్‌    | fashion designer aasif merchent special interview | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్‌ ప్రయోగం

Published Fri, Jan 5 2018 8:55 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

fashion designer aasif merchent special interview  - Sakshi

సంప్రదాయానికి ప్రాధాన్యమిచ్చే హైదరాబాద్‌ ఫ్యాషన్‌ హబ్‌గా మారింది. ప్రఖ్యాత ఫ్యాషన్‌ డిజైనర్లు సైతం ఇక్కడ స్టోర్స్‌ తెరిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆసిఫ్‌ మర్చంట్‌ కూడా ఇటీవల ‘హై ఫ్యాషన్‌ ఇంటర్నేషనల్‌ కౌచర్‌ స్టోర్‌’ను సిటీలో  ప్రారంభించారు. ఎంతోమంది మోడల్స్‌ను తీర్చిదిద్దిన ఆయన ఫ్యాషన్‌ రంగంలో వస్తున్న మార్పులపై ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...   

హైదరాబాద్‌లో బ్రాండెడ్‌ కార్లు, ఇంటర్నేషనల్‌ స్టోర్స్‌ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది ఈ సిటీకి అంతర్జాతీయ అభిరుచి ఉందని. ఇక్కడి వారు దుస్తుల విషయంలో ప్రయోగాలు చేస్తుంటారు. గతంలో ఇక్కడ అనేక సార్లు ఫ్యాషన్‌ షోలు చేశాను. అందుకే ముంబై, దుబాయ్‌ తర్వాత సౌత్‌లో నా ఫ్యాషన్‌ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాను.

ఇండియా దూసుకెళ్తోంది..  
నేను కెరీర్‌ మొదలెట్టినప్పుడు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగం ఇంతగా లేదు. ఫ్యాషన్‌కి సంబంధించిన చదువుల్లేవు. ఈ రంగంలో వస్తున్న విజయాలు, ఆదాయంతో ఇండియన్‌ ఫ్యాషన్‌ రంగం దూసుకెళ్తోంది. ఫ్యాషన్‌ కాలేజీలు, స్టూడియోలు వస్తున్నాయి. పిల్లలు ఫ్యాషన్‌ డిజైనర్‌ అవుతానని ధైర్యంగా చెబుతున్నారు. నేను వచ్చినప్పుడు ఇవన్నీ లేవు. ఫ్యాషన్‌ రంగంలో ఉన్న చాలా మందితో కలిసి పనిచేసి, వారి అనుభవం నుంచి ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను.  
 
ఓపికే విజయం..  
అయితే ఈ రంగంలోకి వస్తున్న నేటి తరానికి ఓపిక ఉండడం లేదు. అన్నింటికీ ఇంటర్నెట్‌ ఉంది. అప్పుడు మాకు కంప్యూటర్‌ కూడా లేదు. ఇంత దూరం రావడానికి 20 ఏళ్లు పట్టింది. ఈ రోజుల్లో 20 నెలల్లో సాధించాలనుకుంటున్నారు. ఎదగడంలో తొందరొద్దు. మన పని మాట్లాడాలి. ఎంత త్వరగా పేరు వస్తే అంత త్వరగా పోతుందని గుర్తెరిగి 
నడుచుకోవాలి.  
 
అవే స్ఫూర్తి..  
నా డిజైన్లకు స్ఫూర్తి ప్రకృతి. నా చుట్టూ ఉండే మనుషులు. రోడ్డు మీద బెగ్గర్‌ కూడా కొన్ని సార్లు మనకు స్ఫూర్తి కలిగించొచ్చు. సంప్రదాయ దుస్తులను ట్విస్ట్‌ చేసి మరింత ఫ్యాషనబుల్‌గా యువతకు అందించే ప్రయత్నం చేస్తున్నాను.  

ఇంజినీర్‌ టు డిజైనర్‌   
నా స్వస్థలం ముంబై. సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివాను. ఇంజినీర్‌కి, ఫ్యాషన్‌ డిజైనర్‌కి ఇమాజినేషన్, క్రియేషన్‌ ఉంటాయి. నాకు ఐదుగురు సిస్టర్స్‌. ఓ సోదరి తన దుస్తులు ఆమే కుట్టుకునేది. అలా చిన్నప్పటి నుంచి డిజైన్‌ చేయడం, కటింగ్, స్టిచ్చింగ్‌ చేయడం గమనించేవాణ్ని. అది రానురాను మరింత పెరిగింది. ఇంజినీరింగ్‌ పూర్తయ్యే సమయానికి 300 దుస్తులు తయారు చేయమని ఓ ఆర్డర్‌ వచ్చింది. లండన్‌ ప్రదర్శనలో అవి బాగా అమ్ముడయ్యాయి. దాంతో నమ్మకం పెరిగింది. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement